పశ్చిమాసియాలో ఎంతో కాలంగా రాజుకుంటున్న అగ్ని ఇప్పుడు భగ్గుమ నడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఏర్పడుతున్న దుష్పరిణామాలకు తోడుగా, కొత్త దిశలో మరొక ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారుతుందేమోనన్న భయంతో వణుకుతోంది. సెప్టెంబర్‌ 27‌వ తేదీన భూమిలో 14 అంతస్తుల కింద దాక్కున్న హిజ్బుల్లా అధిపతి హస్సన్‌ ‌నస్రల్లాను బంకర్‌ ‌బస్టర్‌ ‌బాంబులను ఉపయోగించి, ఇజ్రాయెల్‌ ‌హతం చేయడంతో ప్రపంచం నిర్ఘాంతపోయింది.దశాబ్దాల అనంతరం ఇంత తీవ్రమైన అనుభ వాన్ని పశ్చిమాసియా ఎదుర్కొంటోంది. హమాస్‌ ఇ‌జ్రాయెల్‌పై దాడి చేసి ఏడాది పూర్తి కావ స్తున్న తరుణంలో హమాస్‌పై, దానికి మద్దతుగా ఉన్న హిజ్బుల్లాపై దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణ ఇజ్రాయెల్‌, ఇరాన్‌ ‌మధ్య అధికారికంగా పోరుగా మారుతున్న తరుణంలో వారి మధ్య సంధి చేసేందుకు ఎవరున్నారని ప్రపంచం వెతుకుతోంది. అన్ని దేశాలతోనూ స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ, నిక్కచ్చిగా ఉంటున్న భారతదేశం ఆ పాత్రను పోషించగలదని ఆశిస్తోంది. కానీ, భారత్‌కు అటు ఇరాన్‌, ఇటు ఇజ్రాయెల్‌ ఇద్దరూ వ్యూహాత్మకంగా మంచి మిత్రులు. అంతకుమించి, తలపెట్టిన అంతర్జాతీయ వాణిజ్య కారిడార్‌ల అభివృద్ధిలో ఎవరినీ దూరం చేసుకోవడానికి లేని పరిస్థితి. అందుకే, నస్రల్లా మరణంపై వ్యాఖ్యానించేందుకు భారత్‌ ‌తిరస్కరించింది.

చైనా బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ‌చొరవకు ప్రత్యామ్నా యంగా పశ్చిమాసియా మీదుగా యూరోప్‌ ‌వరకూ తలపెట్టిన వాణిజ్య కారిడార్‌లు (ఐఎన్‌ఎస్‌టిసి, ఐఎంఇసి) పశ్చిమాసియా ప్రాంతం నుంచే పయని స్తాయి. ఈ ప్రాంతం మొత్తానికే మేలు చేయగల ఈ కారిడార్‌ల నిర్మాణంలో భారత్‌ ‌కూడా కీలకపాత్ర పోషిస్తోంది. అందుకే ఈ సందర్భంలో భారత్‌ ‌దౌత్య పరంగా తప్పించుకొని తిరగకపోయినా, ‘తానొవ్వక, ఇతరుల నొప్పింపక’ అన్న చందంగా వ్యవహరించా ల్సిన అవసరం ఉంటుంది. ఏ మాత్రం తప్పటడుగు వేసినా అది దౌత్యపరమైన విస్ఫోటనానికి దారి తీయడమే కాదు, ఆర్ధిక స్థిరత్వం దెబ్బతినడంతో పాటుగా అంతర్జాతీయ స్నేహాలు డోలాయమానంగా మారతాయి. ఇటీవలే ఐక్యరాజ్య సమితి సమా వేశంలో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రెండు మ్యాపులను చూపి, ఒకటి వరం, మరొకటి శాపం అంటూ వ్యాఖ్యానించారు. వరం అని చూపిన మ్యాపులో వాణిజ్య కారిడార్లతో, భారత్‌, ‌సౌదీ అరేబియా వంటి దేశాలు ఉండగా, శాపంగా చూపిన మ్యాపులో ఇస్లామిస్టు తీవ్రవాదులు అధికంగా ఉన్న ఇరాన్‌, ఇరాక్‌, ‌సిరియా, యెమన్‌లతో కూడిన ప్రాంతాన్ని చూపారు. అలా చూపడం ద్వారా, ఆయన ప్రపంచా నికి భవిష్యత్తును చూపారు. ఇక్కడ పెద్దగా వెలుగు లోకి రాని ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మ్యాపులో గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌లో భాగంగా చూపడం.

కాల్పుల విరమణ సాధ్యమేనా?

దాడులు శ్రుతిమించుతున్న తరుణంలో పూర్తి కాల్పుల విరమణ జరగాలని భారత్‌ ‌కోరింది. కానీ, ఈ భారీ దాడులు, ప్రతిదాడుల కారణంగా పశ్చిమా సియాలో ప్రస్తుతానికి కాల్పుల విరమణను సాధించడం దాదాపుగా అసాధ్యంలా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ఇజ్రాయెల్‌ ‌సెప్టెంబర్‌ 27‌న లెబనాన్‌లో దాక్కున్న హిజ్బుల్లా అధిపతి హస్సన్‌ ‌నస్రల్లాను, మరురోజే నూతన అధిపతిగా నియమితుడైన కొద్ది గంటల్లోనే హస్సన్‌ ‌ఖలీల్‌ ‌యాసన్‌ను అంతమొందించింది. అలాగే, ఒకటవ తేదీన నియమితుడైన హసన్‌ ‌సఫియుద్దీన్‌ను రెండురోజుల్లోనే అంతమొందించిన తీరు గమనించిన వారెవరికైనా, ఇజ్రాయెల్‌ ఎవరు ఆపినా ఆగేలా లేదనే విషయం తెలుస్తుంది. నిజానికి వీటికి ఇరాన్‌ ‌తక్షణమే స్పందించకపోవడం పలు దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కానీ ప్రస్తుతం అది ప్రత్యక్షంగా దాడి చేస్తున్న తీరు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా, విస్తృతమైన ప్రాంతీయ సంక్షోభానికి నాంది పలికే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే, పెరుగుతున్న అంతరాలు, విభేదాలతో పశ్చిమాసియా కుంగుతోంది. హింసా వలయానికి ఆజ్యం పోసే అంశంగా గాజా సంఘర్షణ నాటి నుంచి ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. ముఖ్యంగా, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇరాన్‌ ‌సైనిక సామర్ధ్యాలను, అణు లక్ష్యాలను పెంపొందించు కోవడంతో ప్రస్తుత పరిస్థితి గతంలోకన్నా సంక్లిష్టంగా మారనుంది. ఈ క్రమంలో, ఇరు పక్షాలలో ఏ ఒక్కరి చేతైనాకాల్పుల విరమణ చేయించడం అన్నది అంత తేలికైన విషయం కాదు.

తీవ్రవాదులను నిర్మూలించేందుకు పోరాటం

యూదు రాజ్యమైన ఇజ్రాయెల్‌ను ధ్వంసం చేసే వరకూ ఇస్లాంకు విముక్తి లేదన్న మూఢ నమ్మకమున్న నేపథ్యంలో అందుకు కంకణం కట్టుకున్న తీవ్రవాద సంస్థలు హమాస్‌, ‌పాలెస్తీనియన్‌ ఇస్లామిక్‌ ‌జిహాద్‌, ‌పాపులర్‌ ‌ఫ్రంట్‌ ‌ఫర్‌ ‌ది లిబరేషన్‌ ఆఫ్‌ ‌పాలెస్తీన్‌, ‌హెజ్బుల్లా సహా అనేక చిన్నా పొన్నా గ్రూపులతో ఇజ్రాయెల్‌ ‌చేస్తున్న పోరాటంలో భాగంగా మొస్సాద్‌ ‌చేపడుతున్న కార్యకలాపాలు కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. పేజర్లు, వాకీ టాకీలు సహా అనేక ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల పేలుళ్లకు శ్రీకారం చుట్టకముందే, 2010లో అమెరికా, ఇజ్రాయెల్‌ ‌కలిసి సృష్టించాయని భావిస్తున్న స్టక్స్‌నెట్‌ ‌కంప్యూటర్‌ ‌వైరెస్‌ ఇరాన్‌ అణు సెంట్రిఫ్యూజ్‌ (‌పరాజ్ముఖి)లను ఆటంక పరిచి, విధ్వంసం చేసింది.

అంతేకాదు, హిజ్బుల్లా, ఇరాన్‌ ‌నిఘావర్గాల్లోకి తమ వేగులను ప్రవేశపెట్టి, వారి రహస్యాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుంది. కనుకనే, ప్రస్తుతం లెబనాన్‌ ‌వ్యాప్తంగా ఉన్న హిజ్బుల్లా నాయకులను, ఆయుధాగారాలను ఈగలను ఏరివేసినట్టు ఏరేస్తోంది. తమ దేశంపైకి ఇరాన్‌ ‌క్షిపణులను పంపుతున్నా, ఏకోన్ముఖంగా పని చేస్తున్న ఇజ్రాయెలీ రక్షణ దళాలు లెబనాన్‌లో హిజ్బుల్లాను లక్ష్యం చేసుకున్నాయి. ఏ మాత్రం విరామం లేకుండా తాను పెంచి పోషించిన తీవ్రవాదులను ఇజ్రాయెల్‌ ఏరివేస్తుండడంతో ఇరాన్‌ ‌ప్రతిస్పందించక తప్పడం లేదు. ఈ దాడుల దెబ్బతో ఒకరి తర్వాత ఒకరుగా హిజ్బుల్లా నాయకులు ఒరిగిపోతుండడంతో, ప్రస్తుతం దానికి నాయకత్వం వహించేందుకు ముందుకు రావడం లేదని వార్తలు వస్తున్నాయి.

 వాణిజ్య కారిడార్ల పై యుద్ధ ప్రభావం

ఈ సంక్షోభం భారతదేశ కీలక వాణిజ్య మార్గా లకు ముప్పు కానుంది. భారతీయ ఎగుమతులకు, ముఖ్యంగా యూరోప్‌ ‌దేశాలకు చేసే ఎగుమతులకు ఒక కీలకమైన ట్రాన్సిట్‌ (‌రవాణా) కేంద్రం పశ్చి మాసియా ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణంగా, కీలకమైన స్ట్రెయిట్‌ ఆఫ్‌ ‌హర్మూజ్‌ (‌హర్మూజ్‌ ‌జల సంధి) వంటి సముద్ర మార్గాలలో అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ జలమార్గం ప్రపంచానికి సంబంధించి 20 శాతం పెట్రోలియం రవాణాను నిర్వహిస్తోంది. ప్రత్యామ్నా యంగా ఇంధనాన్ని రష్యా నుంచి కొనుగోలు చేద్దామనుకున్నా, ముడి చమురు దిగుమతుల కోసం ఈ ప్రాంతంపై భారీగా ఆధారపడిన భారత్‌కు ఇది కీలక సమస్య కానుంది. ఈ సంఘర్షణ కారణంగా ఏదైనా అడ్డంకి ఏర్పడితే, అది సరఫరాల లోటును పెంచుతుంది. కనుక, ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలిక ఘర్షణలు అన్నవి వాణిజ్యానికి ఆటంకాలను కల్పించడమే కాదు, భారతీయ ఎగుమతిదారులు జాప్యాలను, పెరిగిన వ్యయాలను ఎదుర్కోవలసి వస్తుంది. పెరిగే షిప్పింగ్‌ ‌వ్యయాలు, సరఫరా లంకెలలో అవాంతరాలు భారతీయ వాణిజ్య సమతుల్యతను ప్రభావితం చేసి, అసలే సున్నితంగా ఉన్న ప్రపంచ ఆర్ధిక వాతావరణాన్ని మరింతగా అస్థిరం చేస్తుందని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే సరుకు రవాణాకంటైనర్‌ ‌ధరలు పెరగడంతో అసలే అస్థిరంగా ఉన్న అంతర్జాతీయ మార్గెట్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వ్యాపారాలపై భారం పెడుతోంది.

పశ్చిమాసియాలో భారత్‌ ‌ప్రభావంపై నీడలు?

ఈ పరిస్థితుల్లో మధ్య ఆసియా ప్రాంతంలో ప్రభావం పెంచుకోవాలని ఆశిస్తున్న భారత్‌ ఆశయా లను ఈ పరిస్థితి భగ్నం చేసే అవకాశం ఉంది.ఈ సుసంపన్నమైన వనరులు కలిగిన ప్రాంతంలో తన వాణిజ్య, ఆర్ధిక ప్రభావాన్ని పెంచుకోవాలన్న కృషికి ఈ అస్థిరత అడ్డంకిగా మారనుంది. ఆర్ధిక అస్థిరత, మందగించిన ప్రపంచ ఆర్ధికరంగం కారణంగా అంతర్జాతీయ డిమాండ్‌ ‌తగ్గి ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటున్న చిన్న, మధ్య తరహా వ్యాపారసంస్థలు నడిపే భారతీయ ఎగుమతిదారులు మరిన్ని చిక్కులను ఎదుర్కోనున్నారు.

 అటు ఇరాన్‌తోనూ, ఇటు ఇజ్రాయెల్‌తోనూ, వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకున్న నేపథ్యంలో భారత్‌ ‌దౌత్యపరంగా ఒక సున్నితమైన స్థితిలో ఉంది.ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కొనసాగాలన్న వైఖరితో భారత్‌ ఎం‌తో ఆచితూచి అడుగులు వేస్తూ రెండు దేశాలతోనూ సంబంధాలను నెరపాలి. భారత విదేశాంగ విధానం ముందు చూపుతో, భారతీయ ఆర్ధిక వ్యవస్థను పరిరక్షించేలా ఉండటం కీలకం. ఒక్క 2023లోనే ఇజ్రాయెల్‌తో నిర్వహిస్తున్న వాణిజ్యం ఇరు దేశాల మధ్య లోతైన ఆర్ధిక సంబంధాలను పట్టి చూపింది. ఇక పశ్చిమాసి యాలో అస్థిరత కారణంగా ఏర్పడే విస్తృతమైన పరిణామాలు ఇంధనం, వాణిజ్యం ఆవల ఉంటాయి. ప్రాంతీయ సంక్షోభాలు అంతర్జాతీయ శాంతికి ముప్పుగా పరిణమిస్తాయి. భారత్‌ ‌విషయానికి వస్తే, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కొనసాగించడం అన్నది ఆర్ధిక ప్రయోజనాల కోసమే కాదు, జాతీయ భద్రత కోసం కూడా అత్యవసరం.

యుద్ధ కారణంగా భారత ఆర్ధిక స్థిరత్వం దెబ్బతింటుందా?

భారతదేశ ఆర్ధిక స్థిరత్వం పశ్చిమాసియాపై అధికంగా ఆధారపడి ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌, ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఈ ప్రాంతంలో సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే, భారత్‌ ‌తన అవసరాల కోసం ముడి చమురులో అధిక శాతం ఈ ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటోంది. కనుక, ఆ చమురు దిగుమతులకు ఏ మాత్రం ఆటంకం ఏర్పడినా భారతీయ ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం పడుతుంది. దిగుమతులలో ఏ మాత్రం అవరోధాలు ఏర్పడినా పెరిగే చమురు ధరలు ప్రభుత్వ వనరులపై భారం వేయడమే కాదు ద్రవ్యోల్బణానికి దారి తీసి, కోట్లాది మంది జీవన వ్యయాలను పెంచడంతో పాటుగా ఆర్ధిక వృద్ధిని మందగింప చేస్తుంది.

భౌగోళిక రాజకీయ సవాళ్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేప థ్యంలో కీలకమైన ఇంధన భద్రత, రక్షణ భాగస్వా మ్యాలు, ప్రాంతీయ స్థిరత్వానికి అది ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. భారత్‌ ‌ప్రస్తుతం ఇజ్రాయెల్‌, ఇరాన్‌తో గల చారిత్రిక సంబంధాల కారణంగా సున్నితమైన స్థితిలో ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్‌ అత్యాధునిక సైనిక సాంకేతికత, సైబర్‌భద్రతా నైపుణ్యాన్ని సరఫరా చేయడమే కాక, నిఘా సహకారం అందిస్తూ కీలకమైన రక్షణ భాగస్వామిగా అవతరిస్తోంది. మరోవైపు, భారత ఇంధన అవసరాలను తీర్చడంలో ఇరాన్‌ అనివార్య మైనది కావడమే కాదు, మధ్య ఆసియాలో వాణిజ్యానికి, వ్యూహాత్మక ప్రభావానికి ప్రధాన ద్వారంగా నిలవనున్న అక్కడి చాబహార్‌ ‌రేవును భారత్‌ అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాలలో ఎవరినీ దూరం చేసుకోకుండా సంబంధా లను కొనసాగించాల్సి ఉంటుంది.

భారత్‌పై ఇతర ప్రభావాలు

మధ్య ప్రాచ్యంలో ఈ సంఘర్షణ కారణంగా ఏర్పడిన విస్తృతమైన అస్థిరత భారత విదేశాంగ విధానాన్ని మరింత సంక్లిష్టం చేయనుంది. ఈ అశాంతి దీర్ఘ కాలం కొనసాగితే అది భారత్‌, ‌దాని పొరుగు దేశాలపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా, చెప్పుకోదగిన సంఖ్యలో ముస్లిం జనాభా కలిగిన భారత్‌లో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడమే కాదు, పొరుగు ప్రాంతాలు కూడా అస్థిరం అవుతాయి. అదనంగా, పశ్చిమాసియా ప్రాంతంలో, ముఖ్యంగా గల్ఫ్ ‌రాజ్యాలలో పనిచేస్తూ జీవిస్తున్న భారతీయ సంతతి రక్షణ అన్నది ఆందోళనగా మారు తుంది. ఎందుకంటే, వారిని అక్కడి నుంచి వెనక్కి తీసుకువచ్చేందుకు ఆకస్మిక, అత్యవసర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని కల్పిస్తాయి.

వీటితో పాటుగా, ప్రపంచ శక్తుల బహిర్గత ఒత్తిడిని భారత్‌ ఎదుర్కోవలసి వస్తుంది. యునైటెడ్‌ ‌స్టేట్స్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా, ఇజ్రాయెల్‌కు మిత్ర దేశంగా ఉన్న భారత్‌ ‌పాశ్చాత్య ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని వారు ఆశించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఈ ప్రాంతంలో వాటాలు కలిగిన రష్యా, చైనాలు మాత్రం భారత్‌ ‌మరింత తటస్త లేదా ప్రత్యామ్నాయ వైఖరి అవలంబించాలని కోరే అవకాశం ఉంది.

పశ్చిమాసియాలో దేశాలు ఎలా స్పందిస్తున్నాయి?

ఇజ్రాయెల్‌ను ఎలా అయినా క్టడి చేయాలన్న పట్టుదలతో ఆ దేశం చుట్టూ అనేక తీవ్రవాద గ్రూపులను ఇరాన్‌ ‌ప్రోత్సహిస్తూ వచ్చింది. నలువైపుల నుంచీ ‘యాక్సిస్‌ ఆఫ్‌ ‌రెసిస్టెన్స్’ (‌నిరోధక అక్షం) పేరిట ఏర్పడిన ఈ గ్రూపులను ఇరాన్‌ ‌దశాబ్దాల తరబడి ఓపికగా నిర్మిస్తూ వచ్చింది. వీరి ప్రకారం, హిజ్బుల్లాపై కానీ, హౌతీలపై కానీ, ఇరాకీ తీవ్రవా దులు, హమాస్‌, ‌సిరియా లేదా స్వయంగా ఇరాన్‌- ఇలా వీరిలో ఎవరి పైనా దాడి జరిగినా, మిగిలిన వారంతా అది తమపై జరిగినట్టుగా భావించి, స్పందించాలి.

పశ్చిమ ఆసియాలో ఉన్న దేశాలలో మెజారిటీ ముస్లిం దేశాలే. ఈ నేపథ్యంలో ఏ దేశం ఎవరిని సమర్ధిస్తోందనే సందేహం రావడం సహజమే. గత ఏడాది అక్టోబర్‌ 7‌న హమాస్‌- ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య ప్రారంభమైన పోరు క్రమంలో ముందెన్నడూ లేని విధంగా ఇరాన్‌ ‌ప్రత్యక్షంగా ఇజ్రాయెల్‌ ‌పై దాడులు చేసి తన శక్తిని ప్రదర్శించింది. ఇక తుర్కీ, పాలస్తీనియన్లను సమర్ధిస్తూ ఇజ్రాయెల్‌పై విమర్శల వర్షం కురిపించింది. ఇరాన్‌ ‌దాడులకు యెమన్‌లోని హౌతీ, లెబనాన్‌లోని హిజ్బుల్లా, సిరియాలో సైన్యం నుంచి కొంత మద్దతు లభించగా, ఇజ్రాయెల్‌కు దాని పాశ్చాత్య మిత్రదేశాలు (అమెరికా, యుకె, ఫ్రాన్స్)‌తో పాటుగా పొరుగు అరబ్‌ ‌దేశాలైన జోర్డాన్‌, ‌సౌదీ అరేబియా, యుఎఇ మద్దతు లభిస్తోంది. ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఇస్లామిక్‌ ‌దేశానిదీ ఒక్కొక్క కథ. ప్రాథమికంగా ఇస్లామిక్‌ ‌దేశాలు, ఇస్లాం సమర్ధకులూ అయినప్పటికీ, మారుతున్న ప్రపంచ సమీకరణాలలో తమ వైఖరిని మార్చుకుంటున్నట్టు కనిపించేందుకు తిప్పలు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా యువరాజు సల్మాన్‌ ‌తాము ఎవరి పక్షమూ కాదని, తాము తమ పక్షమేనంటూ ప్రకటించాల్సి వచ్చింది. ఇస్లాం పుట్టిన దేశమైన సౌదీ అరేబియాకు ఇంతటి తటస్తమైన దౌత్య విధానాన్ని పాటించడం చాలా కఠినమైన విషయమే. ఇటీవలి కాలంలో అతివాద ఇస్లాంను అదుపు చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న ఆ దేశ యువరాజు సల్మాన్‌ ఇ‌జ్రాయెల్‌ ఏక పక్ష దాడులను ఖండించి, తక్షణమే కాల్పుల విరమణ చేయాలని పిలుపునివ్వడం బహుశ తన దేశ ప్రజలను సంతృప్తిపరచడానికి కావచ్చు.

ఇక, చిన్నదేశమే అయినప్పటికీ, ఇజ్రాయెల్‌- ‌హమాస్‌ ‌మధ్య మధ్యవర్తిత్వం చేయడంలో కతార్‌ ‌చురుకైన పాత్ర పోషించింది. గత ఏడాది నవంబర్‌లో హమాస్‌ ‌బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయెలీలను విడిపించడంతో చిన్న విజయాన్ని సాధించింది. అయితే, అదే కతార్‌ ‌హమాస్‌ ‌నాయకుడు ఇస్మాయిల్‌ ‌హనియేకు ఆశ్రయాన్ని ఇవ్వడమే కాక ఇజ్రాయెల్‌కు ఏ మాత్రం రుచించని ఇరాన్‌తో సౌహార్ద్ర సంబంధాలు సాగిస్తోంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో అతిపెద్ద అమెరికా సైనిక శిబిరాన్ని అది కలిగి ఉంది.

జోర్డాన్‌ ‌విషయానికి వస్తే, ఒకవైపు గాజాకు సహాయాన్ని పంపుతూనే, మరోవైపు ఇజ్రాయెల్‌తో దౌత్యపరమైన సంబంధాలు నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్‌తో అది 1994లో శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. ఆ క్రమంలోనే గత ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పైకి ఇరాన్‌ ‌ప్రయోగించిన క్షిపణులను మధ్యలో అడ్డుకో వడంలో జోర్డాన్‌ ‌కీలక పాత్ర పోషించింది. అమెరికా స్థావరాన్ని కలిగి ఉన్నందున అది ఇరాన్‌ ‌నుంచి దాడులను ఎదుర్కోవలసి వచ్చింది. అటు అమెరికాతోనూ, ఇటు ఇరాన్‌తోనూ సంబంధాలు ఉండడంతో ఇది కూడా సౌదీ అరేబియాలాగా రాజకీయంగా ఆచితూచి అడుగులు వేసి మాట్లాడవలసి వస్తోంది.

కాగా, 1979లో చారిత్రిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత ఇరుగుపొరుగు దేశాలైన ఈజిప్ట్, ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య సంబంధాలు ఇంతగా దెబ్బతినలేదేమో. ఈ ఘర్షణలో ఈజిప్ట్ ‌బహిరం గంగా ఏ పక్షాన్నీ సమర్ధించక పోయినా, ఈ ఏడాది మే6 వ తేదీన గాజా- ఈజిప్టుల మధ్య గల కీలక రఫా సరిహద్దు క్రాసింగ్‌పై ఇజ్రాయెలీ దళాలు పూర్తి నియంత్రణను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచీ వారి మధ్య సంబంధాలు చెడ్డాయి. అలాగే, ఇజ్రాయెల్‌తో సరిహద్దు కాల్పులలో ఒక ఈజిప్టు సైనికుడు మరణించడంతో వ్యవహారం మరింత చిక్కుపడింది. అప్పటి నుంచీ ఆర్ధిక సంబంధాలు దెబ్బతింటున్నా లెక్కచేయక ఈజిప్టు తనవైపు సరిహద్దును మూసివేసింది.

ఒకనాటి ప్రాంతీయ శక్తులైన సిరియా, ఇరాక్‌ – ‌రెండు దేశాలూ ఇరాన్‌ ‌పరోక్షంగా మద్దతునిచ్చే తీవ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తున్నాయి. ఈ గ్రూపులే అనేక అమెరికా సైనిక లక్ష్యాలు, శిబిరాలపై అనేకానేక దాడులు చేశాయి. ఒకవేళ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ‌చేసిన దాడులకు స్పందించి అమెరికా తిరిగి దాడులు చేసినా లేదా తెహ్రాన్‌కు వ్యతిరేకంగా ఇరాకీ ఆకాశ మార్గాన్ని ఇజ్రాయెల్‌ ఉపయోగించుకున్నా ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తా మంటూ పలు సాయుధ ఇరాకీ తీవ్రవాద గ్రూపులు హెచ్చరించాయి.

ఒకానొక సమయంలో ఇజ్రాయెల్‌తో సానుకూల సంబంధాలు కలిగిన తుర్కీ, రెసెప్‌ ‌తయ్యిప్‌ ఎర్దోగాన్‌ అధ్యక్షుడైనప్పటి నుంచీ దానిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. గాజాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచీ హమాస్‌ ‌పట్ల సానుభూతితో ఉంటూ, గాయపడిన అనేకమంది పాలస్తీనియన్లను విమనాలలో చికిత్స చేయించేందుకు తీసుకువెళ్లింది. ఈ ఏడాది తాము ఇజ్రాయెలీ గూఢచారి సంస్థ మొస్సాద్‌కు సంబంధించిన 30మంది సభ్యులను అరెస్టు చేశామని ప్రకటిం చినప్పటి నుంచీ, తుర్కీ- ఇజ్రాయెల్‌ ‌మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

అస్తిత్వ రక్షణ కోసం దేశాల తిప్పలు

అత్యంత సంక్షోభాలను చవి చూసిన పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పుడు దేశాలు, గ్రూపులూ తమ అస్తిత్వాలను నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నాయే తప్ప నిజమైన యుద్ధం దిశగా ఇష్టపడడం లేదనే విషయం పరోక్షంగా స్పష్టమ వుతోంది. చైనా నిర్మిస్తున్న రహదారులకు ప్రత్యామ్నా యంగా నిర్మిస్తున్న వాణిజ్య కారిడార్లు పూర్తి అయితే, ఈ ప్రాంతాలు సుసంపన్నంగా మారుతా యన్న విషయం వారికీ తెలుసు. అందుకే ఇజ్రాయెల్‌ ‌పై మండిపడుతున్నట్టు నటిస్తూనే తీవ్రవాదుల నిర్మూలనకు ఆస్కారం ఇస్తున్నారనిపించే విధంగా వ్యవహరిస్తున్నారు.

ఇరాన్‌కు మద్దతుగా రష్యా, ఫ్రాన్స్?

‌చిత్రమేమిటంటే, ఈ అంతర్జాతీయ సమీకరణాల సమస్య కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. అటు ఇరాన్‌ ‌కూడా అంతే సమస్యలో ఉంది. అమెరికా ప్రోత్సాహంతో ఉక్రెయిన్‌ ‌యుద్ధం జరుగుతున్నట్టే, ఇప్పుడు ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించి ఇరాన్‌పై దాడి జరపడం పట్ల రష్యా అసంతృప్తితో ఉంది. ఇక్కడ రష్యా ప్రస్తావన తీసుకురావడానికి కారణం,ఉక్రెయిన్‌ ‌యుద్ధంలో వినియోగించ డానికి డ్రోన్లను ఇరాన్‌ ‌పంపిన డ్రోన్లను ఆ దేశం వినియోగించడమే. అమెరికా సాయంతో వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు దీటుగా సమాధానం చెప్పేందుకు ఇరాన్‌ ‌వద్ద ఉన్న విమానాలు సరిపోవు, అందుకే ఎస్‌యు-35 ఇవ్వాలని రష్యా యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ రష్యా మంత్రి ఇక్కడకు రావడం వాణిజ్యం కోసమని అంటున్నా, దీనికి సంబంధించిన ఒప్పందాలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు.

హఠాత్తుగా, ఫ్రెంచి అధ్యక్షుడు ఇందులో జోక్యం చేసుకొని ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలను పరిమితం చేయాలంటూ ప్రకటన చేయడంపై ఇజ్రాయెల్‌ ‌మండిపడుతోంది. ఈ సమయంలో తీవ్రవాదులను అంతమొందించక పోతే, ఈ సమస్యకు పరిష్కారం లభించదని ఇజ్రాయెల్‌ ‌నాయకత్వం భావిస్తోంది. ఇరాన్‌ ఆ ‌ప్రాంతంలోని తీవ్రవాదులకు తోడ్పడుతున్నట్టే తమ మిత్రదేశాలు కూడా తమకు తోడ్పడాలని ఇజ్రాయెల్‌ ‌ఫ్రాన్స్‌కు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఫ్రాన్స్ ఆయుధాలు పంపినా, పంపకున్నా తమ దాడులు ఆగేది లేదంటూ ఇజ్రాయెల్‌ ‌నాయకత్వం ప్రకటించి, తన దాడులు కొనసాగిస్తోంది.

 ఈ సంఘర్షణలు, సంక్లిష్ట పరిస్థితుల నడుమ ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఇరువురితో సకారాత్మక సంబంధాలను భారత్‌ ‌నిర్వహించాలంటే, వ్యూహాత్మక మైన ముందు చూపు, చతురత కలిగిన దౌత్యాన్ని నియోగించి, నానాటికీ అస్థిరత పెరుగుతున్న ఈ ప్రాంతంలో పోటీ పొత్తులను సమతులం, సమ న్వయం చేసుకుంటూ తమ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం అవసరం.

-డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE