విజయదశమి సందేశం
ప్రపంచీకరణ, ప్రపంచమే గ్రామంగా (గ్లోబల్ విలేజ్) మారిపోయిందని ప్రచారం చేసే వారి సంఖ్య ఆ మధ్య గణనీయంగా కనిపించింది. దాని ఫలశ్రుతి ఒక్కటే. మళ్లీ ప్రచ్ఛన్నయుద్ధ కాలాన్ని ఆవాహన చేయడమేననిపిస్తుంది. అందులో ఒక దేశం మీద చిన్న దేశాలు ఆధారపడక తప్పని ఒక వాతావరణాన్ని వ్యూహాత్మకంగా సృష్టించిన సంగతి తెలుస్తూనే ఉంటుంది. దీనికి తోడు నిత్యం ఉన్మాదంతో ఊగిపోతూ ఉండే ఒక మతానికి ఎర్ర తివాచీ పరచడమే భారత్ వంటి దేశం విధి అన్న ధోరణి కనిపిస్తుంది. దీనిని వ్యతిరేకించిన వారంతా ఇరుకు ఆలోచనల వారేనన్న ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్నే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ రెండో సర్‌సంఘచాలక్ పరమ పూజనీయ మాధవరావ్ సదాశివగోళ్వల్కర్ నాగపూర్ శాఖ 1949లో నిర్వహించిన విజయదశమి ఉత్సవ సమావేశంలో అన్నారు. ‘‘ప్రపంచంలో విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది, అటువంటి సమయంలో ఒక దేశం `ఆదేశ సంస్కృతి` అంటూ వాటినే పట్టుకొని వేళ్లాడడం మనసులో ఉన్న సంకుచితత్వాన్ని వెల్లడిస్తుంది అని కొందరు వాదిస్తున్నారు. మనం దృక్పథాన్ని మార్చుకోవాలనీ మిగతా ప్రపంచాన్ని కూడా నిష్కల్మష హృదయంతో ఆహ్వానించాలనీ కూడా వాళ్లు మనకు సూచిస్తున్నారు. కాని నిష్కల్మష హృదయమంటే మన సంస్కృతిమీద మనకు విశ్వాసంలేని హృదయం కాదే! ఈ రోజుల్లో ప్రపంచ శాంతి అంటే మిగతా దేశాల మీద ఎలాగో ఒక విధంగా ఒక ప్రముఖ దేశం అధికారం చలా యించడం. ఆ మిగతా దేశాలు దానికి అణగిమణగి ఉండడం`అంతే అనిపిస్తోంది. ఇది మరీ ప్రమాదా వస్థ. ఈ సమయంలో ముఖ్యంగా మన పతన కారణాల్ని తెలుసుకొని వాటిని దూరం చేసుకోవాలి. భారతీయ సాంస్కృతిక ప్రాతిపదిక మీద సుసంఘటిత సమాజాన్ని సృష్టించుకోవాలి’’ అన్నారాయన.
‘సంఘం సర్వసమానత్వాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించడానికి ముందు మనతో నిరంతరం అంతస్స్రోతస్సుగా ప్రవహిస్తున్న ఐకమత్యాన్ని ప్రధానంగా తీసుకొని పనిచేస్తున్నది’ అని గోళ్వల్కర్ తన ఉపన్యాస సందర్భంలో పేర్కొన్నారు. దానికిగాను సంఘం భారతీయ సంస్కృతిని ఆధారం చేసుకుందనీ, అదే భారతవర్షంలోని ప్రతి వర్గాన్నీ కలుపుతున్న సూత్రమనీ ఆయన పేర్కొన్నారు.
సంస్కృతి అంటే భావాల్ని బహిర్గతం జేయడానికి అనువయ్యే కళల వంటిది కాదు, కళలవలన కలిగే ఫలితమూ కాదు. అది వివిధ సంస్కారాల సారం! వివిధ సంస్కారాల ప్రాతినిధ్య శక్తి అని గోళ్వల్కర్ సంస్కృతిని నిర్వచిస్తూ బోధన మానవుని ప్రవృత్తిని మార్చి ప్రవర్తనను అదుపులో ఉంచుతుందని పేర్కొన్నారు.
దేశంలో రామరాజ్యం స్థాపన జరగాలి అంటూ ప్రజలు చేస్తున్న నినాదాల్ని గురించి ప్రస్తావిస్తూ గురూజీ ఇలా విశ్లేషించారు. ‘‘రామ చంద్రుని కాలంలో ఉన్న శాంతి సౌభాగ్యాలకు కారణం రామచంద్రుని వ్యక్తి కాదనీ ఆ రోజుల్లో ప్రజలే ఆత్మ త్యాగానికి, ఆత్మశోధనకూ నిలిచే ఉన్నతాదర్శాల్ని అందుకోడానికి ఉత్సాహితు లయ్యారనీ గుర్తించాలి. రామరాజ్యం కావాలన్న నినాదం చేస్తున్నప్పుడు మన బాధ్యతల్ని మనం విస్మరించరాదు. ఊరికే శ్రీరాముడు దివ్యపురుషుడని చెబుతూ మన కర్తవ్యాన్ని మనం నిర్వహించుకోడానికి తప్పించుకోరాదు. రామచంద్రుని ఆదర్శాల్ని, ఆశయాల్ని దైనందిన జీవితంలోకి అనువదించు కోడానికి మనం ప్రయత్నించాలి.’’
గురూజీ సందేశం సరిగ్గా ఈ కాలానికి తగినట్టిది. పుట్టిన నేల మీద గౌరవం లేకుండా చేసే సిద్ధాంతాలు, సూత్రాలు యువతని పెడతోవ పట్టించే విధంగా బలపడుతున్న సమయంలో గురూజీ చెప్పిన ఈ మాటలను ఈ విజయదశమి సందేశంగా స్వీకరించవచ్చు. అలాగే అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భం కాబట్టి ఆ మాటలకు మరింత ప్రాసంగికత ఉంది. మాతృ భూమిని ప్రేమించడం మేధో వెనుకబాటుతనానికి నిదర్శనమన్న విధ్వంసక విమర్శలను ఎదుర్కొనడానికి గురూజీ సందేశం అత్యవసరం.
– 13.10.1949 ‘జాగృతి’ నుంచి