పాములకు పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో పాకిస్తానీ మౌలానా తారీక్ మసూద్‌కు ప్రస్తుతం ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఇస్లాంకి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, దానిని దైవదూషణగా ఎంచి, ‘సర్ తన్ సే జుదా’ (శరీరం నుంచి తలను వేరు చేయడం) అన్న నినాదానికి ఒకప్పుడు మద్దతు ఇచ్చిన అతడు ఇప్పుడు, తాను తయారు చేసిన అవే మూకలు తన వెంటపడుతుంటే, ప్రాణాలు కాపాడు కోవడానికి పరుగులు తీస్తున్నాడు. అంతేనా, సోషల్ మీడియాపై దైవ దూషణకు క్షమాపణలు కోరుతూ, తనను వదిలేయమని అర్ధిస్తున్నాడు. బీజేపీ మాజీ ప్రతినిధి నూపుర్ శర్మ, రామ్‌గిరి మహారాజ్ వంటి వారికి వ్యతిరేకంగా సర్ తన్ సె జుదా నినాదాలు ఇస్తూ అల్లరిమూకలు చేసిన దారుణాలను ఖండిరచని మౌలానాకు ఇప్పుడు దాని రుచి తెలుస్తోంది.
ఎందుకంటే, తాను ప్రోత్సహించి, పెంచిన ‘సర్ తన్ సే జుదా’ అల్లరి మూకలే ఇప్పుడు అతడి వెంట పడుతున్నాయి! తాను చేసిన తప్పుకు ఇప్పుడు తారీక్ శిక్ష అనుభవిస్తున్నాడు. ‘ఖురాన్’లో ఉన్న వ్యాకరణ దోషాల గురించి మౌలానా తారీక్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాపై వైరల్ అయింది. ‘నబీ (మహమ్మద్ ప్రవక్త)కి చదవడం, రాయడం రానప్పుడు ఆయనను ఎందుకు అనుసరిస్తున్నారు? ఖురాన్ (ఇస్లామ్‌కు పవిత్ర గ్రంథం)ను అందించిన అతడు అందులో ఒక్క మాట కూడా రాయలేదు. తన పక్షాన రాయవలసిందిగా ఇతరులను కోరడంతో అది బోలెడు వ్యాకరణ దోషాలకు దారి తీసింది’ అంటూ అతడు పేర్కొ న్నాడు. అక్కడితో ఆగకుండా, వాటిని సరిచేయలేదు, ఎందుకంటే అవి వ్యాకరణ దోషాలని మహమ్మద్ ప్రవక్తకు కూడా తెలియవు. అవి నేటికి కూడా కొనసాగుతున్నాయి, అంటూ ఖురాన్‌లో వ్యాకరణ దోషాలను పట్టి చూపుతూ మౌలానా వ్యాఖ్యా నించాడు.
సర్ తన్ సె జుదాకు ముల్లాల ప్రోత్సాహం
మహమ్మద్ ప్రవక్తను కానీ పవిత్ర ఖురాన్‌ను కానీ గౌరవించని వారెవరైనా వారిపై కోర్టులో కేసు దాఖలు చేయకుండా, వారిని ‘తక్షణమే’ చంప వలసిందిగా తన శిష్యులైన ముస్లింలను మౌలానా ప్రోత్సహిస్తుండేవాడు. ఇప్పుడు అదే వ్యక్తి, ఎవరైనా తప్పులు చేయవచ్చని, కానీ దానికి మూడు విధాలుగా క్షమాపణ కోర వచ్చని, తాను ఆ పని చేసాడు కనుక తనను క్షమించాలని తన వీడియోలలో ప్రాధేయ పడుతున్నాడు. ‘తన మాటలను సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలని’ కోరుతూ దాదాపు 48 గంటలలో నాలుగు క్షమాపణ వీడియోలను అతడు సోషల్ మీడియాలో పెట్టాడు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు ఇదే వ్యక్తి, ‘ఎవరైనా ఇటువంటి సందర్భంలో క్షమాపణ కోరినప్పటికీ, అది హృదయపూర్వకంగా వచ్చిందా లేదా నాలుక చివరి నుంచి వచ్చిందా అని చెప్పలేం, కనుక వారిని దైవ దూషణ చట్టం కింద శిక్షించాలని’ ఉద్బోధించేవాడు.
తారీక్ తప్పులను ఎత్తి చూపుతున్న హిందువులు
కాగా, సందర్భాన్ని బట్టి మాటలను అర్థం చేసుకోవాలన్న మాటలను పలువురు హిందువులు దుయ్యబడుతున్నారు. ఎందుకంటే, రామ్‌గిరి మహారాజ్, బీజేపీకి చెందిన నూపుర్ శర్మ అన్న మాటల కారణంగా దైవదూషణ పేరిట చెలరేగిన హింసను మౌలానా తారీక్ ఎందుకు విస్మరించాడని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఈసారి ‘కర్మ’ ఫలాన్ని అతడు అనుభవించాల్సి రావడం విచిత్రమేం కాదు. మౌలానా తారీక్ మసూద్ తన చర్యలకు పరిణా మాలను అనుభవిస్తున్నాడు. అతడు నాటిన విత్తనం మొలకెత్తి ఎంత చేదు ఫలాలను ఇస్తోందో ఆగ్రహంతో కూడిన ఇస్లామిక్ మతోన్మాద మూకలు అతడి వెంటపడుతుంటే అతడికి అర్థమవుతోంది.
కెనడాలో వ్యాఖ్యలు.. పాక్‌లో ప్రతిస్పందన
ముఖ్యంగా, ఈ ఘటన దైవదూషణకు చట్టబద్ధంగా మరణ శిక్షవేసే పాకిస్తాన్‌కు చెందినది కావడం కొసమెరుపు. ఇటువంటి ఘటనలు టపాకాయల కర్మాగారంలో అగ్గిపుల్ల వేసినట్టుగానే ఇట్టే పేలిపోతుంటాయి. ఇంతకీ ఈ మాటలను మౌలానా తారీక్ పాక్‌లో అనలేదు. కెనెడాలోని సర్రే జామియా మసీద్‌లో ఉపన్యాసం ఇస్తూ ఈ వివాదాస్పద ప్రకటన చేశాడు. అంతే, మతోన్మా దులు రెచ్చిపోతున్నారు. ఖురాన్‌లో పద్యాలను ట్రాన్స్‌క్రైబింగ్ (ఎత్తి రాయడం) చేసినప్పుడు ప్రవక్త మిత్రులు కొన్ని వ్యాకరణ దోషాలు చేశారు. మహమ్మద్ ప్రవక్త వాటిని సరిచేయకపోవడంతో అవి అలాగే కొనసాగిపోయా యని పేర్కొన్నా డని, సోషల్ మీడియా ‘ఎక్స్’పై అతడి మాటలను యధాతథంగా పోస్ట్ చేసి మరీ రెచ్చగొడు తున్నారు. ఖురాన్ పవిత్రతను పరిరక్షించేందుకు అతడిని ఇరికించారనే వాదన కూడా వినిపిస్తోంది.
ఈ వ్యాఖ్యలు ఖురాన్‌పై చర్చకు దారి తీస్తాయా?
ఇదిలా ఉండగా, అనేకమంది మాత్రం అతడి ఉపన్యాసంలో ఈ భాగాన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఖురాన్‌లో మహమ్మద్ ప్రవక్త కూడా తెలియని భాగాలు ఉన్నాయనే వాస్తవాన్ని బహిరంగం చేసేందుకు ఇది మార్గాన్ని సుగమం చేస్తోంది. అంతేకాదు, ఖురాన్ రాసింది మనుషులే తప్ప ఆ భగవంతుడు చెప్పింది కాదని కూడా అర్థం వస్తుంది. కానీ ఇంత సూక్ష్మమైన అవగాహన జమాత్‌కు లేదు. బదులుగా, ప్రపంచం ఈ విషయంపై లోతుగా తవ్విచూసే ముందే ఖురాన్‌ను, మహమ్మద్ ప్రవక్తను మౌలానా అవమానిస్తున్నాడంటూ దైవ దూషణ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో తాము ‘శాంతి దూత’లమని చెప్పుకునే మతోన్మాదులు విమర్శలను తట్టుకోలేరనే విషయం రుజువైంది.
ఉన్మాదులను పెంచి పోషించిన మౌలానా
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, అనేకమంది అతివాద బోధకులులా మౌలానా తారీక్ మసూద్ కూడా తన శిష్యులలో ఉన్మాదాన్ని పెంచి పోషించాడు. వీరెవరూ కూడా ఇస్లాం, ఖురాన్ లేదా మహమ్మద్ ప్రవక్తపై అతి స్వల్పమైన విమర్శను కూడా భరించలేరు. దశాబ్దాలపాటు, భారతీయ ఉప మహాద్వీప వ్యాప్తంగా ఇస్లామిక్ మతాధికారులు మతోన్మాదులను సృష్టించారు. వారి మొదటి ప్రతిస్పందనే, సర్ తన్ సె జుదా’ నినాదం. దైవదూషణకు తలతీసేయాలని కోరేందుకు అతివాద మూకలను పోగు చేసేందుకు బృందాలను సృష్టించేందుకు సోషల్ మీడియా వేదికలను వారు ఉపయోగించుకున్నారు. అనేకసార్లు స్వయంగా మౌలానా తారీక్ మసూదే దైవదూషణకు సర్ తన్ సె జుదా అవసరమంటూ బోధించాడు.
మతిలేని వాగుడుతో పెంచిన రొచ్చు
ఇప్పుడు మౌలానా తారీక్ మసూద్ తాను సృష్టించిన రాక్షసులను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ కల్లోలం కేవలం మౌలానా తారీక్ మసూద్ వ్యక్తిగత వైఫల్యం కాదు. ఇది భారీ సమస్యకు సంబంధించిన ఒక లక్షణం మాత్రమే. మౌలానా తారీక్ మసూద్ వంటి బోధకులు ముస్లింల మనసులలో విషాన్ని నింపుతూ ఏళ్ల పాటు బోధించారు. పైగా, భారతీయ ఉపమహాద్వీపంలో ముస్లింలందరినీ ఖురాన్‌ను యధాతథ వ్యాఖ్యానాన్ని అనుసరించాలంటూ ఉద్బోధించారు. అలా చేయకపోవడం ఏకంగా ఇస్లామ్ వ్యతిరేకతేనని భయపెట్టారు. నేడు అదే ఆగ్రహాన్ని వారి పట్ల శిష్యులు వ్యక్తం చేస్తున్నారు. దైవ దూషణకు మరణ శిక్ష వేసే పాకిస్తాన్‌లో అల్లరి మూకలు కోర్టుల తీర్పుల కోసం వేచి ఉండరు. వీధులే న్యాయమూర్తి, పంచాయతీదార్లు, తలారులు అవుతాయి.
తప్పు చేసిన తర్వాత క్షమాపణ కోరడం తేలిక కనుక, దానికి ఆస్కారమివ్వకుండా మరణశిక్షను విధించే అవకాశమున్న దైవదూషణ చట్టాలే దైవనిందను ఆపగలవని ప్రతిపాదిస్తున్న తారీక్ మసూద్ వీడియో ఒకటి హఠాత్తుగా ఇప్పుడు వైరల్ కావడం ప్రారంభమైంది.
చట్టపరమైన ఆధారాలు, మతపరమైన సున్నితత్వం
మౌలానా తారీక్ తాజా ప్రకటన మతాతీతం, మేధకు సంబంధించింది. ఇతర మానవుల కోసం మానవులు ఖురాన్ ఎలా రాశారో చూపడానికి దీనిని ముస్లిమేతరులు వ్యంగ్యంగా ఉపయోగించవచ్చు. అయితే, చట్టపరమైన ఆయుధమే కాక, సాంస్కృతిక పరమైనది కూడా అయిన దైవదూషణ చట్టం పాకిస్తాన్ వంటి దేశాలలో ప్రమాదకరమైన పరికరం. పాకిస్తాన్ పీనల్ కోడ్‌లోని 295సి, 295బి సెక్షన్లు చాలు ఇస్లామిక్ బోధలపై చిన్న విమర్శ చేసినా మరణశిక్ష లేదా యావజ్జీవ ఖైదు విధించడానికి. అందుకే, వ్యాకరణ దోషాలు’ అంటూ తారీక్ అనడం చాలు అతివాదులను ఉన్మాదంలోకి పంపడానికి.
సందర్భాన్ని, ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోని చట్టాలు
పాకిస్తానీ చట్టాలు సందర్భాన్ని లేదా ఉద్దేశాన్ని, విషయాన్ని, మాటలను పరిగణనలోకి తీసుకోవు. ఇప్పుడు తారీక్ మసూద్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలు చాలు విషయాలు ఎంత త్వరగా అనియంత్రితం అవుతాయో చెప్పడానికి.విభేదిం చడం, విమర్శించడం లేదా పాండిత్య చర్చను కూడా దేవుడికి వ్యతిరేక కుట్రగా పరిగణించే సంస్కృతిని ఇటువంటి అతివాద బోధకులు, మౌలానాలే పెంచి పోషించారు.
ఇటీవలే, దైవనింద ఆరోపణను ఎదుర్కొంటూ పోలీసు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ఒక పోలీసు అధికారి చంపాడు. మరొక కేసులో దైవదూషణ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఒక డాక్టర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపారు. అతడు తప్పించుకునే ప్రయత్నిస్తున్నందున చంపామంటూ సమర్ధించుకున్నారు. ఈ ఘటనలలో జోక్యం ఉన్న పోలీసు అధికారులను పాకిస్తాన్‌లో సత్కరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే దైవదూషణ ఆరోపణలను ఎదుర్కొంటున్న తారీక్ మసూద్ భవిష్యత్తును ఊహించడం కష్టమేనేమో.
మసీదు వద్ద అల్లర్లు
తారీక్ మసూద్ బోధించే మసీదు వద్ద ఈ వ్యాఖ్యల అనంతరం అల్లర్లు చెలరేగినట్టు సోషల్ మీడియాపై పోస్ట్ చేసిన వీడియోలు చెప్తున్నాయి. ఆగ్రహంతో ఉన్న మూకలు మసీదు బయట రాళ్లు విసురుతున్న వీడియోలు అవి. గిల్గిత్ బల్టిస్తాన్‌లోని షియా కార్యకర్తలు కూడా ప్రవక్తను నిరక్షరాస్యుడని, ఖురాన్‌లో వ్యాకరణ దోషాలు ఉన్నాయన్నందుకు అతడిపై దైవదూషణ కేసు పెట్టవలసిందేనని డిమాండ్ చేస్తూ పిలుపిచ్చారు. గతంలో ఎంత ఆవేశంతో ఊగిపోతూ మసూద్‌్ ఎదుటి వారిపై దైవదూషణ నిందలు వేశాడో, ఇప్పుడు ఆయన అన్న మాటలపై మతోన్మాద శిష్యులు కూడా అంతకు మించి ఊగిపోతూ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు తన ప్రకటనలో అంతరార్ధం అది కాదని, కేవలం ఖురాన్ రాసేవారు చేసిన తప్పులను గురించి మాట్లాడానంటూ ఎంతగా అర్ధించినా, నిన్నటి వరకూ తాను విషంతో నింపినవారి చెవికి అవి వినిపించడం లేదు.
పాక్‌లో బరేల్వీ వర్సెస్ దేవబందీగా మారుతున్న వివాదం
ఖురాన్‌ను ప్రామాణికతను, విశ్వసనీయతను ప్రశ్నించిన దేవబందీ బోధకుడు ముఫ్తీ తారీక్ మసూద్‌పై దైవ దూషణ కేసును నమోదు చేయాలని కరాచీలోని బరేల్వీ మతబోధకులు డిమాండ్ చేస్తున్నారు. తెహ్రెకీ లబ్బాయిక్ పాకిస్తాన్ (టిఎల్‌పి) బరేల్వీ మతగురువు హసన్ రజా నక్షబందీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం దేవబందీ బోధకుడు తారీక్‌పై 295 సి (తప్పనిసరి మరణశిక్ష), 295 బి సెక్షన్ల కింద కేసును మోపాలని డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. కాగా, తాను ఖురాన్ ప్రామాణికతను ప్రశ్నించలేదని, బరేల్వీ బోధకలు తన మాటలను తప్పుగా అన్వయిస్తూ తనను ఇరికిస్తున్నారంటూ దేవబందీ బోధకుడు తారీక్ స్పష్టం చేస్తున్నాడు.
తారీక్ చేయిదాటిన పరిస్థితి
మౌలానా ఎన్ని క్షమాపణలు చెప్పి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించినా, అతడి పరిస్థితి మాత్రం ప్రమాదకరంగానే ఉంది. పాకిస్తాన్ వీధులలో ఆగ్రహంతో కూడిన మూకలు, ఒకప్పుడు అతడి ప్రోత్సహించిన దైవదూషణ చట్టాల కింద అతడిని జవాబుదారీ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కలుగులోకి వెళ్లిన ఎలుకలా ఉన్నప్పటికీ, అతడు తన క్షమాపణలతో కూడిన వీడియోలు చేసి, విడుదల చేయడం మానలేదు.
గతంలో కూడా తారీక్ వివాహంపై చేసిన వివాదాస్పద ప్రకటనలతో వార్తలలోకెక్కాడు. ఇప్పుడు ఏకంగా ప్రవక్త, ఖురాన్ పై వ్యాఖ్యలు చేసి, క్షమాపణ కోరడమే కాదు, తన మాటలను సందర్భానుసారం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న తారీక్‌ను గురువును మించిన శిష్యులు క్షమించగలరా?
– డి. అరుణ