వానలు సృష్టించిన బీభత్సం నడుమ సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన ఆరుగురు క్షేత్ర స్థాయి సిబ్బంది నిశిత పరిశీలన, శీఘ్ర ఆలోచన కారణంగా సెప్టెంబరు ప్రారంభంలో ఘోర ప్రమాదం తప్పి వేలాది జీవితాలు బయటపడ్డాయి.దాదాపు 15 ప్రాంతాలలో రైలు పట్టాలు కొట్టుకుపోయిన విషయాన్ని గమనించి, అత్యవసర చర్యలు చేపట్టేందుకు వారు తోడ్పడ్డారు. నిలిచిపోయిన ప్రయాణీకులను సురక్షితంగా రవాణా చేసి, 60 గంటలలో మరమ్మతులను పూర్తి చేశారు. అనేక కారణాల వల్ల ఇటీవల ప్రమాదాలను ఎదుర్కొంటున్న భారతీయ రైల్వేలలో ఇటువంటి స్పందన ప్రశంసనీయమైనది.
సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన భారీ వర్షంతో చిమ్మ చీకటి కమ్ముకున్న వేళ ట్రాక్‌మాన్ జి. మోహన్ చేతిలోని త్రివర్ణ టార్చి లైట్ వెలుగులో సికిందరాబాద్`విజయవాడ మధ్యలోని కె సముద్రం` ఇంతెకన్న సెక్షన్ల మధ్యలో నీరు తప్ప మరేమీ కనిపించలేదు. ఇది హైదరాబాద్ నుంచి సుమారు 180 కిమీల దూరంలో ఉంది. దాదాపు దశాబ్దకాలపు తన అనుభవంలో ఇటువంటి ఘటనలను చూసి ఉన్నా, ఇది చాలా వేలాది ప్రాణాలను బలికొనగలిగే భారీ విధ్వంసానికి దారి తీసే అవకాశం ఉన్నది. నిత్యం దాదాపు 110 రైళ్లు ఈ సెక్షన్ ద్వారా వెడుతుంటాయి. ఈ క్రమంలో మునిగిపోయిన పట్టాలు ప్రమాద ఘంటికలను మోగించాయి. కానీ, మోహన్, అతడి సహచరులు సకాలంలో తీసుకున్న తక్షణ చర్యల కారణంగా ప్రమాదం తప్పింది.
సుళ్లు తిరుగుతున్న నీటి మధ్య మోహన్‌కు పట్టాలు కనిపించలేదు. కొద్ది కిలోమీటర్ల దూరంలో మహబూబాబాద్-పూసపల్లె సెక్షన్‌లో ఉన్న మరొక సహచరుడు బి.జగదీష్ కూడా ఇదే సమస్యను కనుగొన్నాడు. బెంగళూరు-దానాపూర్ సంఘమిత్ర ఎక్‌ప్రెస్ వేగంగా ఈ ప్రమాదకరమైన ప్రాంతంవైపే వస్తుండడంతో వారు అత్యంత అప్రమత్తమయ్యారు.
వాతావరణ శాఖ ఇప్పటికే భారీ వర్షాల గురించి హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే కూడా అత్యంత అప్రమత్తంగా ఉంది. కానీ, మోహన్‌కు ఇది మరొక బులెటిన్ కాదు, ఇది పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు. నీళ్లలో మునిగిన పట్టాలను పరీక్షిస్తున్న అతడి చెవులకు వేగంగా దగ్గరకు వస్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ శబ్దం వినిపించింది. దీనితో మోహన్ ఆ వానలో, నీళ్లలోనే ఆ రైలువైపు తన లాంతరుతో పరుగులు తీశాడు. పట్టాలపై లోకో పైలెట్‌ను అప్రమత్తం చేసేందుకు వీలుగా అతడు తక్షణమే ప్రమాదరహితమైన డెటొనేటర్లను ఉంచాడు. ఈ శబ్దాలకు లోకోపైలెట్ బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది.
ఇదిలా ఉండగా, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జగదీష్ కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. వెంటనే అతడు సెక్షన్ ఇంజినీర్‌కు, స్టేషన్ మాస్టర్‌కు తెలియచేయడంతో వారు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వారి శీఘ్ర ఆలోచన, గస్తీ సిబ్బంది ` ట్రాక్‌మాన్ కె. కృష్ణ, బ్రిడ్జిమాన్ బి. జైల్ సింగ్, జూనియర్ ఇంజినీర్ వి. సైదా నాయక్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. రాజమౌళి ఈ ప్రమాదాన్ని తప్పించి, వేలాదిమంది జీవితాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించారు.
పట్టాలపై రుతుపవనాల ప్రభావం
భారీ వానలు ప్రభావాన్ని తీవ్రంగా చూపాయి. ఇంతెకన్నె` కెసముద్రం మధ్య ఏడు చోట్ల గండి పడగా, తాడ్ల పూసపల్లి ` మహబూబాబాద్ మధ్య ఎనిమిది చోట్ల పడిరది. ఈ విధ్వంసం ఫలితంగా 624 రైళ్లు రద్దు కాగా, 256 రైళ్లను దారి మళ్లించగా, 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. దీనితో దేశం నలమూలలకు ప్రయాణం ప్రభావితమైంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కొంతమేరకు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. ఈ రాష్ట్రాల మధ్య 15,235 చిన్న వంతెనలు, 1,353 భారీ వంతెనలు, 43 కీలక వంతెనలు ఉన్నాయి. 1,328 రోడ్ అండర్ వంతెనలు, 390 రోడ్డు పైన బ్రిడ్జీలు, 327 పరిమితి ఎత్తుగల సబ్ వేలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో పట్టాలకు వరద ముప్పు కలిగించే 1,900 చెరువులు ఉన్నాయి. వీటిని నీటిపారుదల అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుంటారు. ఈ జలాశయాల ద్వారా ప్రయాణించే రైళ్లపై నిశిత దృష్టి వేసి ఉంచుతారు.
ఇది భారీ పనే కానీ పట్టాలను అంగుళం అంగుళం తనిఖీ చేస్తామని సీనియర్ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా, రుతుపవాలకు ఒక నెల ముందు నుంచే తనిఖీ ప్రారంభం అవుతుంది. పట్టాలకు సంబంధించిన సిబ్బంది తమకు అప్ప గించిన ప్రాంతాలలో గస్తీ తిరుగుతుంటారు. ఇది షిఫ్టులవారీగా దాదాపు 24 గంటలూ జరుగుతుంది. వారికి సెల్‌ఫోన్లు, ఎర్రజెండాలు, విజిళ్లు, రేడియంతో గీతలున్న జాకెట్లు, ఫ్లాష్ ఫ్యూజ్‌ల వంటి అత్యవసర సరఫరాలు ఇస్తారు. కొన్ని వందల మీటర్ల దూరంలోనే అత్యవసరమైన నట్లు, బోల్టులు ఉంచి, మరమ్మతులలో జాప్యాన్ని తగ్గించి, కార్యకలాపాలు కొనసాగేందుకు తోడ్పడతారు.
పెద్దసంఖ్యలో ప్యాసెంజర్ రైళ్లు, గూడ్సు రైళ్లు రోజూ తిరిగే ఈ మార్గంలో వరదలలో దెబ్బతిన్న పట్టాల గస్తీ కోసం అదనపు సిబ్బందిని మోహరించారు. అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉన్న కార్మికులు సురక్షితమైన కార్యకలాపాలు సాగేలా చూడడంలో కీలక పాత్ర పోషిస్తారు.
ప్రశంసనీయమైన అంకితభావం
ఈ ఘటనలో తమ విధిని నిర్వర్తించిన ఆరుగురు రైల్వే కార్మికుల అంకితభావం ప్రశంసనీయమైంది. మానవ తప్పిదాలు, సిగ్నల్ పనిచేయకపోవడం, సిబ్బందే ఫిష్ ప్లేట్లను తొలిగించడం వంటి వాటి కారణంగా పెరుగుతున్న ప్రమాదాలతో భారతీయ రైల్వేలు యుద్ధం చేస్తున్న సమయంలో వీరి సాహసం అసాధారణమైందనే చెప్పాలి. వరద నీరు తగ్గిన తర్వాత రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి, రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడం వారి నిబద్ధతకు సంకేతం. దీనితో పాటుగా, నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణీకులకు ఆహారం నీరు సరఫరా చేసి, వారిని సురక్షితంగా గమ్యాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టడంతో పాటు, పడిన గండ్లను గుర్తించి మరమ్మతులు చేప్పట్టడం పెద్ద సవాలైనప్పటికీ, తాము ఆ పని చేయగలిగామని ద.మ.రై. జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఒక పత్రికకు చెప్పారు.
ప్రయాణికులకు బాసట
ఇరువైపులకూ వివిధ రైళ్లలో దాదాపు పదివేలమంది నిలిచిపోయారు. రెండు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైళ్లను కె సముద్రం వద్ద నిలిపివేశారు. ఈ రైళ్లలోని దాదాపు 4,500మంది ప్రయాణీకులను 74 బస్సుల ద్వారా కాజీపేట రైల్వే స్టేషన్‌కు తెచ్చారు.అనంతరం మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు ` ఒకటి పాట్నాకు, రెండు బెంగళూరుకు.
సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం మూడు ప్రధాన రైళ్లు రాయనపాడు, కొండపల్లి స్టేషన్ల వద్ద నిలిచిపోయాయి`గోదావరి ఎక్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్‌ప్రెస్. దాదాపు 5,500మంది ప్రయాణీకులను 84 బస్సుల్లో విజయవాడకు తెచ్చి, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి పంపారు. వరద నీరు తగ్గిన తర్వాత ప్రయాణీకులను సురక్షితంగా కాపాడడానికి తాము ఎర్త్‌మూవర్లను, ట్రాక్టర్లను ఉపయోగించాల్సి వచ్చిందని మరొక అధికారి తెలిపారు.
వివిధ ప్రదేశాలలో ఎమర్జెన్సీ కాంటాక్ట్ గదులను ఏర్పాటు చేసి, సీనియర్ అధికారులతో కూడిన బహుళ శాస్త్ర సంబంధిత బృందం దానిని పర్య వేక్షించగా, నిలిచిపోయిన ప్రయాణీకులకు, వారి కుటుంబాలకు సమాచారాన్ని అందించేందుకు 13 ప్రధాన స్టేషన్లలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ గందరగోళంలోనే, ద.మ.రై. కేంద్ర కార్యాలయమైన రైలు నిలియంలో గల విపత్తు నిర్వహణ నియంత్రణ గదిలో ఉన్న ఉన్నత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ధ్వంస మైన పట్టాలను పునరుద్ధరించేందుకు ఎటువంటి మరమ్మత్తులను, ఎంత వేగంగా చేయాలి అనే విషయాలపై సూచనలు, సలహాలు తీసుకున్నారు. ప్రత్యేక రైళ్లు అవసరమైన సామాగ్రిని రవానా చేశాయి.
రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తి
ప్రతికూల వాతావరణంలోనే రెండు సెక్షన్లలోనూ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టారు. దాదాపు 800మంది నైపుణ్యం కలిగిన పనివారు, 40మంది అధికారులు, సిబ్బంది ఒక క్షణం కూడా విరామం లేకుండా ఈ పనులను చేపట్టి, రికార్డు సమయంలో అంటే సెప్టెంబర్ 4 నాటికి పూర్తి చేశారు.
మొత్తం 30వేల క్యూబిట్ మీటర్ల మట్టి, ఐదువేల క్యూబిక్ మీటర్ల కంకర్ల, ఆరువేల క్యూబిక్ మీటర్ల ప్రత్యేక స్థిరీకరణ మట్టిని ఇందుకోసం ఉపయో గించారు. ఇంతెకన్నె, కె సముద్రం మధ్య పనులను పలు ప్రదేశాలలో చేపట్టారు. సికిందరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, చీఫ్ ఇంజినీర్ బి.కృష్ణారెడ్డి, ఇతర అధికారుల పర్య వేక్షణలో నాలుగువందల మంది నైపుణ్యం కలిగిన, అంతే సంఖ్యలో నైపుణ్యం లేని కార్మికులు, 15 హిటాచీలు, నాలుగు ఎర్త్ మూవర్లు, ఎనిమిది ట్రాక్టర్లు, పది టిప్పర్లు, యుటిలిటీ ట్రక్కు సహా పలువాహనాల సాయంతో సెప్టెంబర్ 4 ఉదయం తొమ్మిదికల్లా పనులు పూర్తి చేశారు. పట్టాలు సురక్షితంగా ఉన్నాయా? లేవా? అని పరీక్షించేందుకు ఖాళీ రైలును ఒకదాన్ని దానిపై పంపారు.
ఎనిమిది ప్రదేశాలలో ఈ విధ్వంసం జరిగిన తాడ్ల `పూసపల్లి` మహబూబాబాద్ సెక్షన్‌ను కొద్ది గంటల మధ్య మరమ్మత్తులు చేసి పునరుద్ధరించారు. దాదాపు 350 నైపుణ్యం కలిగిన కార్మికులు ప్రత్యేక రైలు సరఫరా చేసిన సామాగ్రి, హిటాచీలు సహా పలు వాహనాల సాయంతో చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్‌కె శర్మ, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ పర్యవేక్షణలో పని చేశారు.
విపత్తును తప్పించిన ఈ ఆరుగురు సిబ్బందికి వారం తరువాత, జైన్ ‘ఎంప్లాయీ ఆఫ్ ది మంత్’ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఆ సిబ్బంది సత్వర చర్యలు భారీ ప్రమాదాన్ని తప్పించడమే కాదు, ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి, యావత్ దేశానికీ కూడా రైల్వేను సురక్షితంగా ఉంచుతామన్న సందేశాన్ని ఇచ్చారు.
(`ది హిందూ’ సౌజన్యంతో)