సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి ఆశ్వీయుజ శద్ధ పంచమి – 07 అక్టోబర్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
‘కుమారా! ఇక నీవు రాజ్యభారం స్వీకరించి, మాకు విశ్రాంతినివ్వాలి! నువ్వు కాదనకూడదు!’ అని వృద్ధ పాలకుడు కోరడం, అందుకు యువరాజావారు ‘మీ ఆజ్ఞ తండ్రి!’ అంటూ ఎక్కడ లేని వినయంతో ఆ భారాన్ని మోయడానికి ఉరకడం, ఆపై పట్టాభిషేకం ఇవన్నీ కథలలో చదువుతాం. దీని పేరు రాచరికం. కానీ 2024లో కూడా ఆ సన్నివేశాలే పునరావృతమవుతున్నాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌కు పదోన్నతి కల్పించడం అలాంటి పాత కొత్త కథే. ఉప ముఖ్యమంత్రి అంటే, నాకు సహాయకుడు అని కాదు, ప్రజాసేవ కోసం చిరకాలంగా అతడు ప్రదర్శిస్తున్న సమరోత్సాహానికి గుర్తింపు అన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. సెప్టెంబర్ 28న డీఎంకే వజ్రోత్సవాలలో పట్టాభిషేక వార్త ప్రకటించి, పార్టీ శ్రేణులను ఆనంద సాగరంలో తేలియాడిరచారు. రెండురోజుల క్రితమే రిమాండ్ నుంచి వచ్చిన సెంథిల్‌బాలాజీ సహా నలుగురుకి మంత్రిపదవి ద్వారా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు.
నిరుడు ఇదే సెప్టెంబర్‌లో సనాతన ధర్మం గురించి అవాకులు చెవాకులు పేలినందుకు ఉదయనిధి రాజకీయ భవిష్యత్తుకు తెర పడిరదని అంతా భ్రమపడ్డారు. సుప్రీంకోర్టు మంత్రిగా ఉంటూ ఒక మతం మీద అలాంటి వ్యాఖ్యలు చేయకుండా నోరు అదుపులో పెట్టుకోవాలని తెలియదా? అని నిగ్గతీసింది. కానీ సనాతన ధర్మాన్ని అతడు డెంగ్యూతో, మలేరియాతో పోల్చడం, కరోనా వంటిదని వ్యాఖ్యానించడం దీర్ఘకాలిక యోజనతోనేనని ఇప్పుడు తేలింది. ధర్మాన్ని తూలనాడి హఠాత్తుగా డీఎంకే కీలక నేత అయిపోయాడు ఉదయుడు. మంత్రిమండలిలో నెంబర్ 2గా ఎదిగాడు. ఇప్పుడు ఇంకో అడుగు వేసి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. సనాతన ధర్మాన్ని దూషించినందుకు డీఎంకే అతడికిచ్చిన కానుక ఇది.
అప్పుడు కరుణానిధి అనారోగ్యం వల్ల సహాయకుడిగా తన కుమారుడు స్టాలిన్‌ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు ఐదు దశాబ్దాలుగా పార్టీలో పనిచేసిన వారందరినీ పక్కన పెట్టి తన కుమారుడినే స్టాలిన్ ఎందుకు ఉప ముఖ్యమంత్రిని చేశారో చెప్పాలని కోయంబత్తూరు ఎమ్మెల్యే, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ సూచించారు. బీజేపీ నేత అడిగారు కాబట్టి ఈ ప్రశ్న నిరర్థకమని అనలేం. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, సమన్యాయం గురించి మాట్లాడే ఈ రాజకీయ పక్షానికి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని తెలుసా? డీఎంకే అనే ఏమిటి? నిన్న యూపీఏ ఇప్పుడు ఇండీ కూటమి పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలకు యథాశక్తి ప్రోత్సాహం కల్పించినవే, కల్పిస్తున్నవే. సోనియా రాహుల్‌గాంధీకి పట్టం కట్టింది. నిజానికి నెహ్రూ నుంచి ఈ ‘కట్టడం’ గాంధీ కుటుంబంలో పటిష్టంగా సాగుతోంది. శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేకు పగ్గాలు అప్పగించారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్‌కు పట్టాభిషేకం చేసి ప్రశాంతంగా కన్నుమూశారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వికి పార్టీని అప్పగించి నిశ్చింతగా జైలుకి వెళ్లారు. కశ్మీర్‌లో ఎన్‌సీ, పీడీపీ; జార్ఖండ్‌లో జేఎంఎం; తెలంగాణలో బీఆర్‌ఎస్ వారసులను జాతికి అంకితం చేశాయి.
ఉదయనిధి 2021లో చపాక్ -తిరువళికేణి స్థానం నుంచి అసెంబ్లీకి వెళ్లారు. అన్నట్టు ఇక్కడ నుంచే వారి పితామహులు కరుణానిధి మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆ వెంటనే యువరాజుని మంత్రివర్గంలోకి తీసుకుని రాష్ట్రాన్ని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రగతిపథంలో పరిగెత్తించే అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు పట్టుపడుతూ సలిపేశాయట. తప్పేదేముంది? ప్రజాభీష్టమాయె! డిసెంబర్ 2022లో యువజన సంక్షేమం, క్రీడల శాఖ ఇచ్చారు. కుమారుడి ప్రతిభా పాటవాలకి మెచ్చి తరువాత ప్రత్యేక కార్యక్రమాల అమలు, దారిద్య్ర నిర్మూలన కార్యక్రమం, గ్రామీణ రుణభారం వంటి విభాగాలు కూడా కట్టబెట్టారు. స్టాలిన్‌లా కాకుండా ఉదయనిధి అటు పార్టీలోను, ఇటు మంత్రిమండలిలోను శరవేగంతో ఎదిగాడు. పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఇదే మరి! స్టాలిన్ 1973 నుంచి పార్టీ పదవులలో ఉన్నప్పటికీ 2006లో జనరల్ కౌన్సిల్‌కు ఎన్నికై తరువాత తండ్రి మంత్రిమండలిలో నింపాదిగా చోటు దక్కించుకున్నారు. ఇంత జాప్యం తన కుమారరత్నానికి అవసరమా? అంత నిరీక్షణలో ఉంచడం భావ్యమా? గుర్తించిన వెంటనే ప్రతిభకు పట్టం కట్టొద్దా! ఇవేమీ కాకున్నా 2026లో జరిగే శాసనసభ ఎన్నికలకీ, తరువాత డీఎంకే ప్రభుత్వానికి (ఒకవేళ వస్తే) నాయకత్వం వహించడానికీి ఈ మాత్రం ముందుచూపు అవశ్యం. స్టాలిన్ చర్యలో కాస్త త్యాగం ఉంది. తండ్రి మాదిరిగా సుదీర్ఘకాలం పాలించిన సీఎం అన్న బిరుదు కోసం వెంపర్లాడకుండా ఒక్క దఫాతోనే సంతృప్తి పడి, పగ్గాలు కొడుక్కి ఇచ్చేస్తున్నారు. ఈ దఫా పదవీకాలం పూర్తి కాకుండానే ఎన్నికలకి కాస్త ముందు ఉదయుడిని ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యం లేదు.
పార్టీలో అనుభవజ్ఞులకు గుర్తింపు లేదు సరే. కుటుంబంలో ఉన్న అనుభవాన్ని కూడా ఖాతరు చేయలేదు స్టాలిన్. అన్న అళగిరి, సోదరి కనిమొళి, బావలూ, వారి సంతానమూ ఉన్నారు. కానీ ప్రతిభ ఉదయుడి సొత్తని స్టాలిన్ నమ్మారు. ఉదయుడి పట్టాభిషేకం పట్ల ప్రజలు ఎదురు చూసేటట్టు చేసే బాధ్యత డీఎంకే మీడియా విజయవంతంగా నిర్వహించింది. సమన్యాయం, సాంఘిక న్యాయం కోసం పోరాటమంటూ వచ్చిన ద్రవిడ ఉద్యమాన్ని చీల్చుకు వచ్చిన డీఎంకేలో అది మచ్చుకైనా ఉందా? ఆ పార్టీ మహిళలకు, దళితులకు ఇస్తున్న స్థానం ఏపాటిది? ఈ పోకడలు ఇంత యథేచ్ఛగా సాగడానికి పార్టీలనే కాదు, వాటి శ్రేణులనీ, ఆఖరికి ప్రజలనీ కూడా తప్పు పట్టవలసిందే.