భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ రాష్ట్రంలో సభ్వత్వాల నమోదు ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. కేంద్రంలో పార్టీ మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాడడంతో పార్టీలో సభ్యత్వాలు తీసుకునేందుకు అభిమానులు ముందుకు వస్తున్నారు. గతంలో రాష్ట్రంలో 36 లక్షల మంది సభ్యత్వాలు తీసుకుంటే ఈసారి లక్ష్యం కోటిగా నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ, పురందేశ్వరి, నాయకులు అంతా సభ్యత్వం పునరుద్ధరించుకొని సభ్యత్వ నమోదును వేగవంతం చేశారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా, మండల స్థాయిలోనూ కార్యశాలలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలకు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. శక్తి కేంద్రంలో ‘సదస్యతా సహయోగి’ అనే సభ్యత్వ సమన్వయకర్తను నియమించనున్నారు. మోర్చాలు, సెల్స్‌ కూడా ఈ సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నాయి. సభ్యత్వ నమోదు రాష్ట్ర ప్రముఖ్‌ సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, సభ్యులు సురేంద్ర మోహన్‌, మట్టా ప్రసాద్‌, వల్లూరు జయప్రకాష్‌, సిహెచ్‌ సావిత్రి, జీసీ నాయుడు తదితరుల ఆధ్వర్యంలో నభ్యత్వ నమోదు జరుగుతోంది. ఇప్పటికే 12 లక్షల మందికి సభ్యత్వాలు ఇచ్చారు. వందమందిని సభ్యులుగా చేర్చినవారికి క్రియాశీల కార్యకర్తగా గుర్తింపు లభిస్తుంది. వీరి పేర్లను ఆయా జిల్లాల కార్యాలయాలలో ప్రదర్శిస్తారు. లక్ష్యం చేరుకోవడంపై ఇటీవల విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద మీనన్‌, ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు కృష్ణదాస్‌ పార్టీ నేతలకు ముఖ్య సూచనలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనూ, ప్రాంతీయ పార్టీల హయాంలోనూ దేశంలో, రాష్ట్రాల్లో జరిగిన అవినీతిపై ప్రజల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సమయంలో ప్రధానిగా నరేంద్రమోదీ పారదర్శక పాలన అందిస్తూ, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. ఆయన పదేళ్ల అభివృద్ధి పాలనను గుర్తించిన ప్రజలు మూడోసారి కూడా బీజేపీకి పట్టం కట్టారు. అవినీతి రహిత పార్టీగా బీజేపీని ప్రజలు గుర్తించారు. ఇటువంటి మచ్చలేని పార్టీలో చేరేలా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల ఆదరణ బాగా ఉందని, అందుకే సుమారు 60 శాతం ఓట్లు కూటమికి అందించారని, పార్టీకి రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే, 3 లోక్‌సభ స్ధానాలు లభించాయని వారు చెప్పారు. సభ్యులు కూడా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలను పునరుద్దరించుకోవాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ పట్ల ప్రజలు ఏహ్యభావంతో ఉన్నారని, ఆ పార్టీ పని ఇక ముగిసిపోయిందని, ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీజేపీకి మంచి అవకాశంగా సూచించారు.

మోదీ సమర్ధవంత పాలన చూసి ప్రజలందరూ స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం, ఇచ్చిన ప్రాజెక్టులు ప్రజలకు వివరించడం ద్వారా పార్టీకి దగ్గర చేయాలన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ.12,500 కోట్లు, రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు, అనంతపురం నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవేకు రూ.29వేల కోట్లు నిధులు అందించారన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, లాభాల బాటలోకి తీసుకురావటానికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఏపీకి రైల్వేజోన్‌ అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుగా భావిస్తున్న అన్ని అంశాలను దశల వారీగా అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించి పార్టీకి దగ్గర చేయాలన్నారు.

సమస్యల పరిష్కారానికి వారధి

ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు బీజేపీ వారధి పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించింది. పురందేశ్వరితో పాటు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సోమవారం నుంచి శనివారం వరకు రెండేసి రోజులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటారు. పురందేశ్వరి ప్రతి నెల మొదటి, మూడో సోమవారం అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నాలుగో సోమవారం, మంగళవారం, మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మొదటి, మూడో మంగళవారం, ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి, రెండో బుధవారం, ఎమ్మెల్యే నడకుదుటి ఈశ్వరరావు ప్రతి నెల మూడో బుధవారం, గురువారం, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మొదటి, రెండో గురువారం అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌ రాజు ప్రతి నెల నాలుగో బుధ, గురువారం, ఎంపీ సీఎం రమేష్‌ మొదటి, రెండో శుక్ర వారం, ఎమ్మెల్యే ఎ.ఆదినారాయణ రెడ్డి మూడో శుక్రవారం, శనివారం, ఎమ్మెల్యే పార్థసారథి నాలుగో శుక్ర, శనివారం, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రతి నెల మొదటి, రెండో శనివారం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, సోము వీర్రాజు రెండో సోమ, మంగళవారం అందుబాటులో ఉంటారు. మార్పులు ఉంటే ముందస్తుగా మీడియాకు తెలుపుతారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 16 నుంచి ప్రారంభించారు. ఇప్పటికి 200 సమస్యలపై అర్జీలు రాగా సుమారు వంద వరకు పరిష్కరించారు. మిగతావి ఆయా శాఖలకు పరిష్కారానికై పంపారు.

ఇవీ సమస్యలు

బుడమేరు వరదల్లో నష్టపోయిన చిన్న, పెద్ద పరిశ్రమలను ఆదుకోవడానికి కృషి చేస్తామని మంత్రి శ్రీనివాసవర్మ బాధితులకు హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలుకు ,కేంద్ర ప్రభుత్వం ద్వారా తగు ఉత్తర్వులు ఇప్పించి ఉపాధ్యాయులకు అన్ని కేడర్ల ప్రమోషన్లను చేపట్టేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు మంత్రి సత్యకుమార్‌ను కోరారు. వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలు, డిప్యుటేషన్లు కోరుతూ పలువురు వైద్యులు, ఉద్యోగులు వినతిపత్రాలు అందజేశారు. సీఎం సహాయనిధికి సంబంధించి 15 వినతులు వచ్చాయి. ఏపీపీఎస్సీ గ్రూప్స్‌లో ఉత్తీర్ణత పొందిన వారిలో 1:100 నిష్పత్తిలో తీసుకుంటే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుందని అభ్యర్థులు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పురందేశ్వరికి విన్నవించగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

 ప్రకాశం జిల్లాలో 2019-24 మధ్య కేంద్రం ఇచ్చిన రూ.3,383 కోట్ల ఉపాధి నిధుల్లో ఉపాధిహామీ పనుల్లో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని, ప్రకాశం, ఒంగోలులో జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున చేపట్టిన పనులలో అవినీతి చోటు చేసుకుందని ఫిర్యాదులొచ్చాయి. కృష్ణాజిల్లా వీరపనేనిగూడెం, టెంపుల్లి, మర్లగూడెం గ్రామాలకు అనుకూలంగా ఉన్న ర్యాంపును నేషనల్‌ హైవే అధికారులు తొలగించారు. దీంతో అదనంగా నాలుగు కిలోమీటర్లు చుట్టుకుని రైల్వే గేటు దాటి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ర్యాంపుతిరిగి ఏర్పాటుచేయించాలి’ అని గ్రామస్తులు కోరారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌ విస్తరణలో తమకు రావల్సిన పరిహారం త్వరితగతిన ఇప్పించాల్సిందిగా కొందరు రైతులు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ రైతుల పట్టా భూముల సమస్యపై వెంటనే తగిన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ను పురందేశ్వరి కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట రూ. లక్షలు ఇచ్చి మోసపోయిన వారికి న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా స్థలాల పేరిట రమాదేవి అనే మహిళ పలువురుని మోసం చేసి రూ. కోట్లు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కడపజిల్లా పోరుమామిళ్ల మండలం కొర్రపాటిపల్లిలో కల్లూరి బాబు అనేవ్యక్తిని వైసీపీ నాయకుడు రాజారెడ్డి హత్య చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్‌్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని బాధితులు ఫిర్యాదు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టు వద్ద గోపవరం గ్రామంలో వైపీపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేశారు. ఆయుష్‌కు చెందిన 72 మంది ఆయుర్వేద వైద్యుల నియామకాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని వైద్యులు కోరారు. ఆరోగ్యశ్రీలో మెకాలిచిప్ప ఆపరేషన్‌ లేకపోవడంతో గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదని కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన షేక్‌మస్తాన్‌ అనే వ్యక్తి దైన్యానికి చలించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్సకు సహకరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. చింతూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమిం చడంతో పాటు మరుగుదొడ్లను నిర్మించాలని స్థానికులు కోరారు. గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని, రోగులను సుదూర ప్రాంతం లోని ఆస్పత్రికి తరలించే లోగానే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ కనబరచినా, తమను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాల ఇచ్చారని కడప జిల్లాకు చెందిన కొందరు ఆరోపించారు. తమకు న్యాయంచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు శ్రేష్ట పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందటం లేదని కొందరు విద్యార్థులు చెప్పారు. విశాఖపట్నంలో సుజనా కాలేజి ఆఫ్‌ ఫార్మసీ అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుని చివరకు మూసివేసిందని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు వచ్చింది. భూముల కబ్జా, గత ప్రభుత్వ దోపిడీ, బిల్లుల పెండిరగ్‌ వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ నాయకులు బి. చిన్నప్ప, బి. మురళీ తన భూమిని ఆక్రమించి.. తనను హత్యచేసేందుకు ప్రయత్నించారంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కొత్తవారిపల్లెకు చెందిన బి. నాగరాజు ఫిర్యాదు చేశారు. ఎస్సై రవి కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా అసభ్య పదజాలంతో దూషించాడని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మండలం గోకుల్‌ నగరంలోని కృష్ణ కోదండ రామాలయం శిథిలావస్థలో ఉందని దేవాదాయ శాఖ నుంచి తమకు అప్పగించాలని కోరుతూ యాదవ్‌ ఉపాధ్యక్షుడు విష్ణు నారాయణ ఫిర్యాదు చేశారు. మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామ పొలం సర్వే నెంబర్‌ 834-3లో గల 1121ఎకరాల ప్రభుత్వ రాళ్లగుట్ట భూమిని ఓ మతానికి చెందిన పెద్దలతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగి (టీచర్‌) ఆక్రమించుకుని చర్చితో పాటు గృహాలు నిర్మిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మచ్చయ్యగారి నాగమల్లేష్‌ ఆరోపించారు. ఈ విషయమై గత జులై 15న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 11న బద్వేల్‌ ఆర్జీఓను కలిసి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. బాధితులు కార్యాలయానికి వచ్చి పలు ఫిర్యాదులు చేస్తున్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE