నిన్నటి వరకూ అమ్మయ్య అంతా ప్రశాంతమే, సమస్య సద్దుమణిగింది, సమరసత సాధ్యమైంది అనుకున్న మణిపూర్ నేడు అశాంతితో అట్టుడికిపోతున్నది. వాస్తవానికి, ఈశాన్య భారతంలో ఈ సమస్య కొత్తదేం కాదు. అటు వేర్పాటువాదం, ఇటు నిరసనలు, రాస్తారోకోలు ఏవీ వారికి కొత్తకాదు. అయితే, గత రెండేళ్లలో అనూహ్యమైన రీతిలో ఆగి ఆగి హింస చెలరేగుతున్న తీరు యావత్ దేశాన్నీ కలవరంలో ముంచెత్తుతున్నది. ఒకప్పుడు స్థానిక జాతి సంఘర్షణగా చూపిన మెయితీ, కూకీల మధ్య సంఘర్షణలో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డ్రోన్లు, రాకెట్ లాంచర్లతో తొలి ముఖ్యమంత్రి మొయిరెంబాం ఇంటిపై, మొయిరంగ్‌లో ఐఎన్‌ఎ వార్ మ్యూజియానికి సమీపంలోనూ, మెయితీల ప్రాంతాలపై జరుగుతున్న దాడుల్లో ఏడుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు, వాహనాలు, ఆవాసాలు ధ్వంసమయ్యాయి. మణిపూర్ ఈ ఆయుధాల సరఫరా వెనుక ఉన్నది ఎవరనే విషయం ఇంకా స్పష్టం కానప్పటికీ, అటు చైనా, ఇటు అమెరికా రెండింటిపైనా అనుమానాలు చెలరేగుతున్నాయి.
మళ్లీ మణిపూర్‌ను గుర్తు చేసుకోవడానికి కారణం, ఆ ఘర్షణ మరింత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన పరిస్థితిని చేరుకోవడమే. ఇటీవలే పశ్చిమ ఇంఫాల్‌పై జరిగిన బాంబర్ డ్రోన్ల, రాకెట్ లాంచర్లతో దాడులు అటు సాధారణ పౌరులపైనే కాదు, భద్రతా దళాలపై కూడా దాడి చేశాయి. దీనితో ఈ ఘర్షణలో బహిర్గతశక్తులు ముఖ్యపాత్ర పోషి స్తున్నాయా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి. ఇంతటి అరాచకంలోకి ఎవరు, ఎందుకు రాష్ట్రాన్ని నెడుతున్నారు?
ఉద్రిక్తతలను పెంచుతున్న డ్రోన్ బాంబులు
మణిపూర్‌లో ప్రజలను భయభీతులను చేసే విధంగా జరుగుతున్న డ్రోన్ బాంబు దాడులు పెరిగి పోతున్నాయి. ఈ డ్రోన్ దాడుల వీడియోలను సామాజిక మాధ్యమాలలోనూ, టివిలలోనూ చూసిన యావత్ దేశం నిర్ఘాంతపోయింది. వరుసగా రెండు రోజుల పాటు, పశ్చిమ ఇంఫాల్‌లో మెయితీలు అధికంగా ఉండే ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా గ్రనేడ్లను విసిరి దాడి చేశారు. తొలుత కౌత్రుక్ గ్రామంలో జరిగిన దాడిలో ఒక మహిళ మరణించగా, 16మంది గాయపడ్డారు. తర్వాతి రోజు తీవ్రవాదులు తూర్పు ఇంఫాల్‌లోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్‌బి) బంకర్‌ను లక్ష్యంగా చేసుకొని, వారిపై డ్రోన్లను ఉపయోగించి బాంబులు విసిరారు. తమ జీవితాలను కాపాడుకునేందుకు జవాన్లు ఆ బంకర్‌ను ఖాళీ చేయవలసి వచ్చింది. తొలిసారి మణిపూర్‌లో డ్రోన్లను ఉపయోగించి బాంబులతో దాడి చేసిన సందర్భం ఇదే. తీవ్రవాదులు ఉపయోగించిన వ్యూహాలలో పెరిగిన సైనిక తరహా యుక్తులు పెరగడాన్ని ఈ దాడి ప్రతిఫలిస్తోంది.
బహిర్గత సాంకేతిక మద్దతును కలిగిన అత్యంత శిక్షణ పొందిన నిపుణుకే ఇటువంటి దాడులు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని విశ్లేషకుల భావన. ఇలా తీవ్రవాదులు డ్రోన్లను ఉపయోగించడాన్ని ప్రస్తావిస్తూ, ఇది గణనీయమైన తీవ్ర ఘటనగా స్థానిక పోలీసులు అభివర్ణిస్తున్నారు. అంతేకాదు, వేర్పాటువాదులు, తీవ్రవాదుల చేతుల్లో అటువంటి అత్యాధునిక ఆయుధాలు ఎంతటి ముప్పును కలిగిస్తాయో వారు హెచ్చరిస్తున్నారు.
ఘర్షణల వెనుక అదృశ్య హస్తం ఎవరిది?
ఈ బాంబర్ డ్రోన్ పరిణామాలతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కూకీ తీవ్రవాదులకు అంతటి ఖరీదైన, అత్యాధునిక బాంబర్ డ్రోన్లు ఎక్కడ నుంచి, ఎలా వచ్చాయనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. సంప్రదాయంగా, కూకీ గ్రూపులు ప్రాథమిక యుద్ధ తంత్రాలను మాత్రమే ఉపయోగించే వారు. కానీ, గత రెండేళ్లల్లో కూకీ తీవ్రవాదులు అత్యాధునిక ఆయుధాలను, డబ్బును కూడా సేక రించడమే ఆందోళనలకు తావిస్తోంది. ఈ ప్రశ్నలకు జవాబులు అన్నవి అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణాకు సంబంధించిన చీకటి ప్రపంచంలోనే ఉన్నాయనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని అస్థిరం చేయడంలో విదేశీ శక్తుల జోక్యం ఉందేమోనన్న అనుమానాన్ని కొట్టి పారేయలేం.
గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఊబికి దగ్గరగా ఉండటమే శాపమా?
ఎన్నో దశాబ్దాలుగా మాదకద్రవ్యాల రవాణాకు, సంబంధాలకు కీలకమైన గోల్డెన్ ట్రయాంగిల్‌కు వ్యూహాత్మకంగా సన్నిహితంగా ఉన్న ప్రదేశం మణిపూర్. గత కొద్ది సంవత్సరాలుగా, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నది. దీనితో, ఈ ప్రాంతంలో పేరు మోసిన మాదక ద్రవ్యాల రవాణా ముఠాలు జాతీయవాద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా, మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా కేంద్రంగా మణిపూర్ వ్యవహరించింది.
పర్వత ప్రాంతాలపై నివసించే కీకీ-జో-చిన్ గ్రూపులు ఈ అక్రమ మాదక ద్రవ్య వ్యాపార నెట్‌వర్క్‌లో పీకల దాకా కూరుకుపోయి ఉన్నారు. అందుకే, ఆ ప్రాంతంపై తమ నియంత్రణను తిరిగి సాధించేందుకు, మణిపూర్ మంటల్లో ఆజ్యం పోసేందుకు మయన్మార్ ద్వారా ఈ మాదక ద్రవ్య ముఠా డబ్బు పంపుతోందని అనుమానిస్తున్నారు. మాదకద్రవ్యాల కారణంగా వచ్చిన డబ్బుతో కూకీ తీవ్రవాదులు ఈ అరాచకానికి ఆజ్యం పోసి కొన సాగించేందుకు బాంబర్ డ్రోన్ల నుంచి అత్యాధునిక ఆయుధాల వరకు కొనుగోలు, వాటిని ఉపయోగిం చేందుకు నైపుణ్యాలను పెంచుకునే శిక్షణ పొంది మరీ ఉపయోగించగలుగుతున్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారం, తీవ్రవాదం అన్నవి రెండూ చేతిలో చేయి వేసి ప్రయాణించేవనే విషయం తెలిసిన విషయమే.
సరైన సరిహద్దులేవీ?
ఈశాన్య ప్రాంతంలో అటు బాంగ్లాదేశ్‌తో, ఇటు మయన్మార్‌తో కట్టుదిట్టమైన సరిహద్దులు లేకపోవడంతో చొరబాట్లు సహా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా16 కిమీలు స్వేచ్ఛగా తిరగవచ్చన్న బీజేపీ విధానం, ఈ కఠినమైన భూభాగం తేలికగా చేరుకునేలా చేస్తున్నది. కనుకనే, ఇది మాదక ద్రవ్యాల ఉత్పత్తి, అక్రమ రవాణాకు ఆదర్శవంతమైన ప్రదేశంగా మారింది. అయితే, తత్ఫలితంగా భారీ ఎత్తున ఎగిసిన తీవ్రవాదంతో గంజాయి ఉత్పత్తిని నాశనం చేయడమే పరిష్కారమని బీజేపీ నిర్ణయం తీసుకునేలా చేసింది. దీని తర్వాత జరిగిన దర్యాప్తులలో, కూకీ మిలిటెంట్లకు మాదక ద్రవ్యాల వ్యాపారంతో సంబంధాలున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది.
గత ఏడాది అల్లర్లు ప్రస్తుత అరాచకానికి పూర్వరంగమా?
మణిపూర్‌లో జరిగిన డ్రోన్ బాంబింగ్‌లు వేరు ఘటనగా చూడలేం. భారతదేశాన్ని, ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు దీర్ఘకాలికంగా సాగుతున్న ప్రచారంలో తాజా అధ్యాయంగానే వాటిని చూడాలి. గత ఏడాది మణిపూర్ వరుస అల్లర్లతో అట్టుడికిన సంగతి తెలిసిందే. వీటిని, మెయితీ, కూకీ సమాజాల మధ్య జాతి ఘర్షణలుగా అభివర్ణించి, ప్రచారం చేశారు. అయితే, ప్రస్తుత ఘటనలను సన్నిహితంగా పరిశీలిస్తే, ఆ అల్లర్లు బహిర్గత శక్తులు చేయించినవే అనే అనుమానాలు తలెత్తుతాయి. దీని ప్రధాన లక్ష్యం అరాచకాన్ని సృష్టించి, ప్రభుత్వాన్ని బలహీన పరచడమే. ఈ అల్లర్లు ఆధునికమైన యుక్తులను ఉపయోగించి, ఉన్నత స్థాయిలో సమన్వయ పరిచినవిలా అనిపిస్తాయి. ముఖ్యంగా, మయన్మార్ ఆయుధాలు, కరెన్సీని భద్రతా ఏజెన్సీలు అనేక దాడుల సందర్భంలో స్వాధీనం చేసుకున్నాయి. దీని కారణంగానే ఈ అరాచకంలో బయట వ్యక్తులు లోతుగా జోక్యం చేసుకుంటున్నారనే అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి. చోటుచేసుకున్న హింస ఇంతకు ముందెన్నడూలేని స్థాయిలో, తీవ్రతతో జరిగింది. ఇది, సామాజిక ఐక్యత, వ్యక్తుల మధ్య సంబంధాల పరంగా రాష్ట్రానికి తీవ్ర గాయాన్ని చేసింది. తాజా ఈ డ్రోన్ బాంబింగులను కూడా వారి ప్రచారంలో భాగంగానే చూడవచ్చు. అవే బహిర్గత శక్తులు తమ అజెండాను అమలు చేసేందుకు కూకీ తీవ్రవాదులకు ఆయుధాలు, శిక్షణతో పాటుగా, మరింత ప్రమాదకరమైన పరిక రాలను అందిస్తున్నాయి.
ఆజ్యం పోస్తున్నది మాదకద్రవ్య ముఠాలేనా?
మాదకద్రవ్య ముఠాలతో గాఢంగా అల్లుకున్న సంబంధాలే మణిపూర్ సమస్యలకు కేంద్రంగా ఉందనే పలువురు విశ్లేషకుల భావన. ఈ ప్రాంతంలో తీవ్రవాదానికి జవజీవాలను ఇచ్చేది ఈ మాదక ద్రవ్యాల నెట్‌వర్కే. గోల్డెన్ ట్రయాంగిల్‌కు సమీపంలో ఉండటంతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఇది ఒక కీలక కేంద్రంగా మారింది.
అందుకే మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించే డీప్ స్టేట్‌కు మణిపూర్‌పై పూర్తి నియంత్రణ అత్యవసరం. ఇదే జరిగితే, దాని పరిణామాలు కేవలం మణిపూర్‌కే పరిమితం కావు, భారత్‌కు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. మణిపూర్ ద్వారా మాదకద్రవ్యాల సరఫరా కేవలం తీవ్రవాదానికి ఆజ్యం పోయడమే కాక సంక్లిష్టమైన నేరపూరిత నెట్‌వర్క్‌లను సృష్టించింది.
రాష్ట్ర రాజకీయ, ఆర్థిక జీవనంలో ఈ నెట్‌వర్క్ చాలా లోతుగా పాతుకుపోయి ఉందని, విశ్లేషకులు అంటున్నారు. హింసను కొనసాగించడంలో ఈ నెట్‌వర్క్‌లే కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ ఏజెన్సీలతో పోరాడేందుకు అవసరమైన శిక్షణను, వనరులను తీవ్రవాదులకు వారే అందిస్తారు. తద్వారా మణిపూర్‌లో తీవ్రవాదమన్న ప్రచారాన్ని ప్రోత్సహి స్తారు. ఈ నేరపూరిత, అరాచక శక్తులు ఏ స్థాయిలో రాష్ట్రంలో చొరబడ్డాయో తాజా డ్రోన్ బాంబింగులు గుర్తు చేస్తాయి. తమ గుప్పిట్లో అధికారాన్ని ఉంచు కోవడంకోసం వారెంత దూరానికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఇది పట్టి చూపుతుంది.
మణిపూర్‌పై కథనాలను తలకిందులు చేయడం
మణిపూర్‌లో ఘర్షణల చుట్టూ ఉన్న కథనాన్ని బహిర్గత శక్తులు తమ ప్రయోజనాల కోసం తలకిం దులు చేశాయి. ఈ హింసను మెయితీ, కూకీ సమా జాల మధ్య జాతిపరమైన హింసగా చూపడమన్నది ఒక పల్చటి తెర. వాస్తవాం శాలను దాచాలని ఈ శక్తులు భావిస్తున్నాయనే విషయం దీనితోనే అర్థ మవుతుంది. మణిపూర్‌లో అశాంతి అనేది విదేశీ ప్రభావం, మాదకద్రవ్యాల అక్రమరవాణా, తీవ్రవాద తిరుగుబాటు కలగలిసిన ఒక సంక్లిష్టపరిస్థితి కారణంగా రగులుతున్నది.
అయితే విదేశీ శక్తుల అంతిమ లక్ష్యం మాత్రం ఈ ప్రాంతాన్ని అస్థిరం చేసి, భారతీయ సార్వభౌమ త్వాన్ని తక్కువ చేయడమేనన్నది నిర్వివాదం. వాస్తవానికి, ఈ విదేశీ శక్తుల జోక్యం కొత్తగా వచ్చిందే కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రం వివిధ భౌగోళ రాజకీయ ప్రయోజనాల కారణంగా యుద్ధక్షేత్రంగానే కొనసాగింది. కొన్నిసార్లు చైనీయులు, మరికొన్నిసార్లు యుఎస్‌కు చెందినవారు ఈ తిరుగుబాట్లను, తీవ్ర వాదాన్ని తమ అజెండాలు, ప్రయోజనాల కోసం పరోక్షంగా ప్రోత్సహిస్తూ వచ్చాయి. తాజా డ్రోన్ బాంబింగ్‌లు భారత ప్రయోజ నాలకు విఘాతం కలిగించేవి. కనుకనే, ఆ ప్రాంతాన్ని సంక్షోభంలో ఉంచడం ద్వారా ప్రయోజనాలు పొందాలనుకునే బహిర్గత శక్తులే కూకీ మిలిటెంట్లను ప్రోత్సహిస్తున్నా యన్నది కాదనలేని వాస్తవం.
అప్రమత్తత, చర్యల అవసరం
ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితి పేలబోయే బాంబులా ఉంది. కనుక దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాలి. కూకీ తీవ్రవాదులు బాంబర్ డ్రోన్లను ఉపయోగిం చడమన్నది సంఘర్షణ కొత్త మార్గంలో, మరింత ప్రమాదకరమైన దశలోకి ప్రవేశిస్తోందన డానికి స్పష్టమైన సంకేతం. ఈసారి, ఈ ఘటనలు ఈ ప్రాంతం మొత్తంపై దీర్ఘకాలిక పరిణామాలను చూపవచ్చు. ఈ అశాంతికి మూలకారణాలను గుర్తించి, పరిష్కరించేందుకు కేంద్రం నిర్ణయాత్మక చర్య తీసుకోవడం అత్యంత అవసరం. మరింత ఆలశ్యం అయ్యే లోపలే మాదకద్రవ్యాల వ్యాపారాన్ని, విదేశీ జోక్యాన్ని ఈ ప్రాంతం వదిలించుకోవాలి. ముఖ్యంగా, మణిపూర్‌కు అత్యంత సమీపంలో ఉండే మయన్మార్‌లోనూ, మరోవైపు బాంగ్లాదేశ్‌లోనూ అంతర్యుద్ధంలాటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో డీప్‌స్టేట్ ఈ మూడు ప్రాంతాలనుంచి ప్రదే శాలను వేరచేసి, ఒక క్రైస్తవ రాజ్యాన్ని ఏర్పాటు చేయా లనుకుంటోందనే వదంతలు తీవ్రంగా వినిపిస్తు న్నాయి. మణిపూర్‌లో పరిస్థితిని చక్క బెట్టేందుకు అక్కడి ప్రజలతో చర్చలు నిర్వహించడమే ఉత్తమం.
మణిపూర్ ప్రజలు శాంతి, సుస్థిరతలను కోరుకుంటున్నారు. కానీ, ఘర్షణ అసలు స్వభావాన్ని గుర్తించి, పరిష్కరించినప్పుడు మాత్రమే వాటిని సాధించగలరు. దీనిని జాతిపరమైన ఘర్షణగా ముద్ర వేయడాన్ని మాని, క్షేత్రస్థాయిలో ప్రభావం చూపుతున్న శక్తుల క్రియాకలాపాలను సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. మణిపూర్ గాయాలు మానాలంటే, భారత భూమిలో విదేశీ శక్తుల అసలు స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రజలు కూడా గుర్తించి, వారిని నియంత్రించే చర్యలు తీసుకోవాలి.
– డి. అరుణ