‘‘‌హైజాకర్లు నవ్వినప్పుడల్లా మేం కూడా నవ్వేవాళ్లం. వాళ్లు కంగారు పడితే మేం కూడా కంగారు పడేవాళ్లం’’ చరిత్ర ప్రసిద్ధమైన కాందహార్‌ ‌హైజాకింగ్‌ ఉదంతం గురించి తరువాత ఎప్పుడో  కెప్టెన్‌ ‌దేవీశరణ్‌ ‌జగ్గియా న్యూయార్క్ ‌టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పారు. దురదృష్టం ఏమిటంటే, ఆ ఉదంతం మీద ఓటీటీ సిరీస్‌ ‌తీసినవాళ్లు కూడా ప్రేక్షకులను హైజాక్‌ ‌చేశామనే అనుకుంటున్నారు. తాము ఏది చూపితే అది చూస్తూ, అదే నిజమని, నమ్మాలని వారి ఉద్దేశం. నవ్విస్తే నవ్వాలి. ఏడిపిస్తే ఏడవాలి. కానీ ఇది బయటి ప్రపంచం. ఒక విమానాన్ని హైజాక్‌ ‌చేసినంత సులభంగా ప్రపంచాన్ని హైజాక్‌ ‌చేయలేరు. ఫలితమే ఐసీ 814 కాందహార్‌ ‌హైజాక్‌ ఇతివృత్తంగా నిర్మించిన ఓటీటీ సిరీస్‌ ‌మీద వచ్చిన విమర్శల వెల్లువ.

అభ్యంతరాల మీద సెప్టెంబర్‌ 3‌న స్వయంగా వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా నెట్‌ఫ్లిక్స్ ఇం‌డియా అధిపతి మోనికా షెర్గిల్‌ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

సమీప గతాన్ని కూడా దారుణంగా వక్రీకరించి, ఆ వక్రీకరణకే క్రియేటివ్‌ ‌లిబర్టీస్‌ అని పేరు పెడితే ఎవరికైనా జుగుప్స కలిగిస్తుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ధోరణి సినిమా, ఓటీటీ, టీవీ సీరియల్స్‌లో మరీ బరితెగించి రీతిలో కనిపిస్తున్నది. ఐసీ 814 కాందహార్‌ ‌హైజాక్‌ ‌నెట్‌ఫ్లిక్స్ ‌సిరీస్‌ ‌కూడా ఇంతే. అనుభవ్‌ ‌సిన్హా దీని దర్శకుడు. నిజమే దీని మీద హిందువులు, హిందూ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. ఇది ధర్మాగ్రహం. హిందూ జాతీయవాదులు దుయ్య బడుతున్న మాట నిజం. సిద్ధాంతాల పేరుతో, డబ్బు కోసం, లేదంటే ఇతర ప్రయోజనాల కోసం క్రియేటివ్‌ ‌లిబర్టీస్‌ ‌పేరుతో ఎవరికి తోచినట్టు వాళ్లు వాస్తవాలను వక్రీకరించుకుంటూ పోతే ఎలా? వక్రీకరణ ఆ స్థాయిలోనే ఉంది కాబట్టి ఐసీ 814సిరీస్‌ ‌మీద దాడి తప్పలేదు. చాలామంది ఈ సిరీస్‌ను బహిష్కరించ మని పిలుపునివ్వడానికి కారణం అదే. నిషేధం విధించాలన్న నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. హైజాకర్‌లంతా  ముస్లింలని ఈ చిత్రానువాదంలో ఎక్కడా వెల్లడించలేదు. వాళ్లు హిందువుల పేరుతోనే సిరీస్‌ అం‌తా కనిపిస్తారు. అదే హిందువుల మనోభావాలను గాయపరిచింది.

ఒక దృశ్యంలో దొంగపేర్లతో పిలుచుకుంటారు. అవేమిటి? బోలా, శంకర్‌. ‌దీనిమీద సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరీస్‌ ‌చూసినా, చూడకపోయినా ఒక అభిప్రాయం మాత్రం బలపడింది. ఈ సిరీస్‌ ఐసీ 814 కాందహార్‌ ‌హైజాకర్లు హిందువులేనని చిత్రించాడని, ఆ విధంగా హిందువుల మీద ఉగ్రవాదుల ముద్ర వేశారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక హిందూ సంఘాలు, హిందువులు ఏది ప్రతిపాదించినా తప్పనిసరిగా వ్యతిరేకించే ఉదారవాద ముఠా యథా ప్రకారం కొన్ని పడికట్టు పదాలతో సిరీస్‌ను ఆకాశాని కెత్తుతోంది. అందులో రియలిజం ఇబ్బడిముబ్బడిగా ఉందట. ఒక వాస్తవ గాథను తెరకెక్కించడానికి దృఢ నిశ్చయంతో ప్రయత్నం జరిగిందట. కానీ హిందూ సంఘాలకు, లేదా బీజేపీకి చెందని వారు కూడా ఈ సిరీస్‌ ‌నిండా అబద్ధాలేనని, కాస్త కూడా పరిశోధన లేదని, ఆఖరికి కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఎలా ఉంటాయో కూడా తెలియని అజ్ఞానులు ఈ సిరీస్‌ ‌నిర్మించారని విమర్శిస్తున్నారు.

ఈ సిరీస్‌లో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి- హైజాక్‌ అయిన విమానం లోపల ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్న చిత్రణ. దీనికి దర్శకుడు ఆనాటి పైలట్‌ ‌జ్ఞాపకాల మీద ఎక్కువ ఆధార పడ్డాడు. అయితే ఆనాటి ప్రత్యక్ష సాక్షుల జ్ఞాపకాలన్నీ ఒకే విధంగా లేవు. ఇందులో ఎంతో కొంత నిజాయతీ ఉందని కొందరు అంటున్నా, రెండో కోణం అభూత కల్పనలతో, అవగాహన లేమితో నిర్మించారని చెబుతున్నారు. అసంబద్ధంగా, పిల్లచేష్టలా ఉందని కూడా చెప్పవచ్చు.  పైగా అన్నీ అబద్ధాలు. కచ్చితంగా చెప్పాలంటే ఈ సిరీస్‌ ఐఎస్‌ఐ ‌ప్రచారం కోసం ప్రపంచం మీదకి వదిలిపెట్టిన ఖరీదైన చిత్రీకరణ అన్న తీవ్ర విమర్శ కూడా వచ్చింది.

ఈ సిరీస్‌లో హైజాకర్లు హిందూ పేర్లనే ఉపయోగించుకున్నారు. నిజంగా జరిగింది అదేనని అంగీకరించవచ్చు. కానీ ఈ షో మొత్తం వారి అసలు పేర్లు, అంటే ముస్లిం పేర్లు ఎక్కడా ఎందుకు చెప్పలేదు? ఇంకా చెప్పాలంటే ఎందుకు దాచి పెట్టారు? నాటి హైజాకర్ల పేర్లు ఇప్పటికీ మరుగున ఉండిపోయాయని అనుకోవడం అజ్ఞానమే. ఎందుకంటే నాడే కేంద్ర ప్రభుత్వం ఆ ఐదుగురు హైజాకర్ల పేర్ల• వెల్లడించింది. ఆ పేర్లు- సున్నీ అహ్మద్‌ ‌ఖాజీ, షకీర్‌, ‌మిస్త్రీ జహూర్‌ ఇ‌బ్రహీం, షహీద్‌ అఖ్తర్‌ ‌సయద్‌, ఇ‌బ్రహీం అతార్‌. అం‌తేకాదు, వీళ్లంతా పాకిస్తాన్‌ ‌పౌరులేనన్న వాస్తవాన్ని కూడా ఎక్కడా చెప్పలేదు. హైజాక్‌ ‌జరిగిన రెండో రోజునే భారత నిఘా వర్గాల వారు హైజాకర్లంతా పాకిస్తా నీయులేనని, పాకిస్తాన్‌లో వారు ఏయే ప్రాంతాలకు చెందినదీ కూడా వెల్లడించారు. కానీ హైజాకర్లంతా అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి వచ్చారని చెప్పడానికి చేసిన ప్రయత్నం కూడా అస్పష్టంగానే ఉంది. అలాగే వీళ్లని అల్‌ ‌కాయిదా మనుషులుగా చిత్రించడానికి చేసిన ప్రయత్నం కూడా అసహజంగా ఉంది. పైగా హైజాక్‌ అం‌తా ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌వేసిన భారీ ప్రణాళికలో భాగంగా చిత్రించడం మరొకటి. నిజం చెప్పాలంటే, ఆనాటికి ఐఎస్‌ఐ ‌సాధారణ స్థాయి సంస్థగానే ఉంది. భారతదేశంతో చిరకాలంగా పాకిస్తాన్‌ ‌చేస్తున్న పరోక్షయుద్ధంలో భాగంగానే ఈ హైజాక్‌ను ఐఎస్‌ఐ ‌నిర్వహించిందని చెప్పడం అబద్ధం. అంటే బిన్‌లాడెన్‌కు ఐఎస్‌ఐ ‌సహకరించింది.

ఈ హైజాక్‌ ‌సమీప గతంలోని ఘటన. పాతికేళ్ల క్రితం జరిగింది. కాబట్టి ఈ కాలంలో చాలా వాదనలు, అంచనాలు, కుట్ర సిద్ధాంతాలు వెలువడి నాయి. అందులో, హైజాక్‌ ‌పథకం గురించి భారత నిఘా వర్గాలకు ముందే తెలిసి, విమానం గాల్లోకి లేవకుండా చేయడానికి ప్రయత్నం జరిగిందన్న వాదన ఏనాడూ ఎవరూ చేయలేదు. అది ఇందులో కనిపించింది. ఇంతకు మించిన అబద్ధం లేదు. అలాగే హైజాక్‌ ‌కుట్ర గురించి సమాచారం సేకరించడానికి నేపాలీలను (ఈ విమానం నేపాల్‌ ‌లోని త్రిభువన్‌ ‌విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలు దేరిన సంగతి తెలిసిందే) హింసించినట్టు చిత్రించడం కూడా అభూత కల్పన.

హైజాక్‌ ‌దరిమిలా ఢిల్లీకి కబురు అందిన తరువాత జరిగిన ఘటనల చిత్రీకరణ, వాటి కూర్పు కేవలం 12 ఏళ్ల పిల్లలు ఎవరో రాసి పడేసినట్టే ఉందన్న విమర్శ తీవ్రమైనది. అన్నింటికంటే చిత్రం, ఈ చిత్రానువాదం చేసిన వారికి మంత్రిత్వ శాఖ కార్యాలయం స్వరూపం గురించి కూడా తెలియదు. విదేశ వ్యవహారాల మంత్రి కార్యాలయం రూపకల్పన చేసిన తీరు ఇదే చెబుతుంది. భారత విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అని రాసిన పెద్ద సైన్‌బోర్డు కింద ఆ మంత్రి (జస్వంత్‌ ‌సింగ్‌)  ‌కూర్చుని ఉన్నట్టు చిత్రించడం మరీ ఎబ్బెట్టుగానే ఉంది. ఆయన విదేశాంగ మంత్రిలా లేడు. పాస్‌పోర్టు కార్యాలయాలలో రిసెప్షనిస్టులా ఉన్నాడన్న విమర్శ వచ్చింది. హైజాకర్లతో విదేశాంగ మంత్రే అంతా చర్చించాడని చెప్పడం కూడా అభూత కల్పన. రక్షణ వ్యవహారాలకు సంబంధించి విదేశాంగ మంత్రి పాత్ర పరిమితం. కాబట్టి హైజాకర్లతో లావాదేవీలలో ఆయననే కీలకం చేయడం అవగాహన లోపం. 1999లో వార్తాపత్రికల కార్యాలయాలు ఎలా ఉండేవో, పత్రికలు ఎలా ఉన్నాయో కూడా కనీస పరిశోధనచేయలేదు.

సిరీస్‌ ‌పూర్తయిన తరువాత ఎవరికైనా వచ్చే అభిప్రాయం-లేదా దర్శక నిర్మాతలు ఇచ్చిన సందేశం ఒకటే అనిపిస్తుంది. హైజాక్‌ ‌డ్రామా మొత్తం అల్‌ ‌కాయిదా, అఫ్ఘానిస్తాన్‌లకు చెందినదేనని చెప్పదలి చారా? హైజాక్‌ ‌విజయవంతమై, ముగ్గురు ఉగ్ర వాదులను విడిపించుకున్న తరవాత విజయోత్సవం జరుపుకుంటారు. దానికి బిన్‌ ‌లాడెన్‌ ‌వస్తాడు. అక్కడ ఐఎస్‌ఐ ‌ప్రస్తావన కూడా రాదు.

నిజానికి ఈ హైజాక్‌ ‌కుట్ర వెనుక ఉన్నవాడు మసూద్‌ అజహర్‌ ‌సోదరుడు. భారతదేశంలో ఒక జైలులో ఉన్న తన అన్నను విడిపించడానికి అతడే ఈ పథకం వేశాడు. హైజాక్‌ ‌జరిగిన రెండోరోజున ఈ సమాచారం భారత్‌కూ, ఇక్కడి నిఘా వర్గాలకూ అందింది. ప్రయాణికులను వదిలిపెట్టాలంటే భారత్‌ ‌వదిలిపెట్టవలసిన మిగిలిన ఇద్దరూ కూడా పాకిస్తానీ ఉగ్రవాదులే. అందులో ఒకడు ఒమర్‌షేక్‌. ఇతడు పాకిస్తాన్‌లో పేరు మోసిన డేనియర్‌ ‌పెర్ల్ ‌కిడ్నాప్‌ ‌కేసులో ఉన్నాడు. మరొకడు ముష్తాక్‌ ‌జర్గర్‌. ‌కశ్మీర్‌లో హింసకు ఇతడినే ఐఎస్‌ఐ ‌ప్రయోగించింది. ఈ ముగ్గురు భారత్‌ ‌జైళ్ల నుంచి బయటపడిన తరువాత  పాకిస్తాన్‌ ‌చేరుకోవడానికి సహకరించినవారు తాలిబన్‌. ‌పాకిస్తాన్‌లో వీళ్లందరికీ ఘనస్వాగతం లభించింది. తన గౌరవార్ధం ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభకు మసూద్‌ అజహర్‌ ‌హాజరయ్యాడు కూడా. ఇంత జరిగినా, వాస్తవాలు చెప్పడానికి, హైజాకర్ల అసలు పేర్లు చెప్పడానికి సిరీస్‌ ‌దర్శక నిర్మాతలకు ఎందుకు మొహమాటం? ఐఎస్‌ఐ ‌పేరు పెద్దగా రాకుండా అంతా అఫ్ఘాన్‌, ‌తాలిబన్‌ను అడ్డం పెట్టుకుని ఎందుకు నడిపారు? ఆ క్రమంలో ఇన్ని అబద్ధాలు ఎందుకు చూపించారు?

ఇంకొన్ని కీలక అంశాలు కూడా విమర్శకులు లేవనెత్తుతున్నారు. అందులో ఒకటి ఈ సిరీస్‌కు కథను అందించిన బ్రిటిష్‌ ‌జర్నలిస్ట్ అ‌డ్రియన్‌ ‌లెవీ ఐఎస్‌ఐ ‌సానుభూతిపరుడని భారత నిఘా వర్గాల అభిప్రాయం. ఈ విషయం అతడి రచన స్పైస్టోరీస్‌లో బహిర్గతమైంది. ఇందులో భారత నిఘా వ్యవస్థ రా మీద అతడు విషం కక్కాడు. ఐఎస్‌ఐ ‌మీద సానుభూతి ఒలకబోశాడు. అప్పటి ఆ ఘటనలో ఉన్నవారు, ప్రత్యక్ష సాక్షులు చాలామంది కన్ను మూసినా ఇంకా పలువురు  కీలక వ్యక్తులు మన మధ్య ఉన్నారు. అప్పుడు రా అధిపతిగా పనిచేసిన ఏఎస్‌ ‌దౌలత్‌ ‌వారిలో ఒకరు. ఆ ఉదంతంలో కీలక పాత్ర పోషించిన వారు అజిత్‌ ‌ధోవల్‌. ఇం‌కా ఆనంద్‌ అమీ అనే ఉన్నతోద్యోగి కూడా ఉన్నారు. చిత్రంగా వీరిలో ఎవరినీ దర్శక నిర్మాతలు సంప్రతించలేదు. ఇవన్నీ చూస్తే వాస్తవాలను వదిలిపెట్టి ఐఎస్‌ఐని కాపాడేపనిని నెట్‌ఫ్లిక్స్ ఎం‌దుకు తీసుకున్నది అన్నదే పెద్దప్రశ్న. మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ (‌కంటెంట్‌) ‌షేర్గిల్‌ ‌వచ్చి వివరణ ఇచ్చారు. తరువాత ఆనాటి హైజాకర్ల పేర్లు డిస్‌క్లెయిమర్‌ ‌పేరుతో వెల్లడించారు. అయితే ఇది భారతదేశంలో మాత్రమే వెలువడుతున్నదని, విదేశాలలో కనిపించడం లేదని వినికిడి. కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌కు ఈ డోసు కూడా చాలలేదా?

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE