సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి
స్వాయంభువ మన్వంతరంలో దేవశిల్పిగా సంభావించే విశ్వకర్మ తన హస్త నైపుణ్యం, బుద్ధి కుశలతతో వివిధ రకాల వస్తువులు తయారు చేసేవాడు. సమస్త కళలకు, వస్తువులకు మూల పురుషుడు. అరవై నాలుగు కళలలో ఒకటైన వాస్తు (నిర్మాణ)శాస్త్ర స్థాపకుడు (గాడ్ ఆఫ్ ఆర్కిటెక్), వాస్తు పురుషుడు. నేటి చేతివృత్తుల రంగానికి ఆదిపురుషుడు. అష్టావసువులలో ఒకరైన ప్రభావసు యోగసిద్ధి దంపతుల కుమారుడు.
పురుషసూక్తంలో విరాట్ పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. సద్యోజత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము అనే పంచముఖీంద్రుడైన విశ్వకర్మను చతుర్వేదాలు సృష్టి కర్తగా, ఆహార ప్రదాతగా, శ్రీమత్ మహాభారతం వేయికళల అధినేతగా పేర్కొన్నాయి. పురాణగాథల్లో అనేక చోట్ల విశ్వకర్మ విశిష్టత విదితమవుతుంది. సర్వదిక్కులను పరికించగల శక్తిమంతుడు కనుకనే రుగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించిందని చెబుతారు. ‘విశ్వకర్మా సహంస్రాంశౌ’ అని ప్రమాణం. తొలినాళ్లలో విశ్వకర్మను ‘ఆదిబ్రహ్మ’ అనీ వ్యహరించేవారు.
‘న భూమి న జలంచైవ/న తేజో నచవాయువ:/నచబ్రహ్మ,నచ విష్ణు:/నచరుద్రశ్చ తారక:/సర్వశూన్య నిరాలంభో/స్వయం భూ విశ్వకర్మణ:’ (భూమి, నీరు, అగ్ని, వాయువు, త్రిమూర్తులు,సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండా సర్వ శూన్య సమయంలో విశ్వకర్మ తనను తాను సృష్టించుకున్నాడు)అని పరమేశ్వరుడి వాక్కు. ‘సర్వదేవతలు, సర్వలోకాలు సర్వజ్ఞులైన త్రిమూర్తులను ఆరాధిస్తుండగా ఆ మూర్తిత్రయంలో ఒకరైన మీరు ఎవరి గురించి ధ్యానిస్తున్నారు?’ అని ఏకాగ్రచిత్తుడైన పరమేశ్వరుడిని తనయుడు కుమారస్వామి ప్రశ్నించగా తండ్రి ఇచ్చిన వివరణ ఇది.
మానవ జన్మకు పూర్వం…కారణాంతరాలవల్ల అప్సరస ఘృతాచి, విశ్వకర్మ పరస్పరం శపించు కోవడంతో మరుజన్మలో ప్రయాగలో జన్మించారు. ఇద్దరూ ఒకసారి తటస్థ పడినప్పుడు పూర్వ జన్మవృత్తాతం తెలుసుకొని ఒక్కటయ్యారు. అలా వారికి కలిగినవారే విశ్వబ్రాహ్మణులని ఐతిహ్యం.
దుష్టశిక్షణ కోసం దేవతలకు శక్తిమంతమైన ఆయుధాలతో పాటు, వారికీ, భూపాలురకు రాజప్రసాదాలు నిర్మించి ఇచ్చాడు. శివునికి త్రిశూలాన్నీ,ఆదిశక్తికి గండ్రగొడ్డలిని,త్రిపురాసుర సంహారంలో శివుడికి రథాన్ని తయారుచేశాడు. పుష్పక విమానాన్ని రూపొందించాడు. యమ వరుణులకు సభామందిరాలను, దేవతల కోసం స్వర్గం, త్రేతాయుగంలో స్వర్ణ లంకను, ద్వాపరంలో ద్వారక, హస్తినాపురం, ఇందప్రస్థం తీర్చిదిద్దాడు. అసురులకు స్వర్ణ, రజత, కాంస్యాలతో మూడు నగరాలను (త్రిపురాలు) నిర్మించి ఇచ్చాడు .
‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ:’ (మానవ గుణములు, వారు అవలంబించే వృత్తులను బట్టి బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులనే నాలుగు వర్ణాలుగా విభజించినట్లు) అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తరహాలోనే విశ్వకర్మ సంతతి మను, మయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞాది అనే పంచ గోత్రీకులుగా కమ్మరి, వడ్రంగి, కంచరి, స్థపతి, స్వర్ణశిల్పులుగా ఆవిర్భవించి సేవలు అందిస్తున్నారు. మానవ జీవన వికాసానికి విశ్వకర్మీయుల కులవృత్తులు ప్రధానంగా దోహదపడేవి, పడుతున్నాయి. వాస్తుశిల్పులు వంశపారంపర్యంగా కఠోరశిక్షణ, తపశ్శక్తితో సాంకేతిక పరిజ్ఞానం పొంది ఎన్నో ఆలయాలు, అద్భుత కట్టడాలను ఆవిష్కరించారు. నిర్మాణ రంగంలో భరతఖండాన్ని ప్రపంచ దేశాలలో సగర్వంగా నిలిపిన శాస్త్రజ్ఞులుగా మన్ననలు అందుకుంటున్నారు. త్రేతాయుగంలో సుగ్రీవుని కొలువులోని నలుడు ఈయన కుమారుడే. రామరావణ యుద్ధ సమయంలో ఆయన పర్యవేక్షణలోనే సేతువు నిర్మితమైందని రామాయణం చెబుతోంది. ఇతడు వాస్తుశిల్పే కాకవీరుడు కూడా. పూరీక్షేత్రంలోని జగన్నాథ, సుభద్ర, బలభద్ర విగ్రహాల సృష్టికర్త విశ్వకర్మ వారసులేనని చెబుతారు.
సర్వలోక పాలన కోసం విశ్వకర్మ తన అంశంతో పంచబ్రహ్మలు మను, మయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞాదిలను, వారి సతులుగా ఆది, పరా, ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులను సృష్టించారని ఐతిహ్యం.వారి అంశలుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, సూర్యులను, వారి సతులుగా వాణీ, లక్ష్మి, ఉమ, శచీ, సంజ్ఞా దేవతా మూర్తులును సృష్టించి లోకపాలన బాధ్యతలు అప్పగించారని కథనం. పంచబ్రహ్మల ద్వారానే శాస్త్రం, వృత్తులు నిర్దేశితమయ్యాయి. ‘ప్రపంచ దేశాలలో భారత్‌ను మొదటి నాగరికత దేశంగా ఆనాడే పేర్కొన్నారంటే విశ్వకర్మీయ పరంపర ప్రసాదమేనని చెప్పక తప్పదు. నాటి సమాజంలో కులవృత్తులన్నీ సమానమేనని, హెచ్చుతగ్గులకు తావులేదని చాటిచెప్పారు. అందుకు ఓ గాథ ప్రచారంలో ఉంది. దివ్యాయుధాలు, భవ్య మందిరాలకు రూపకల్పన చేసిన విశ్వకర్మ ఒకసారి విధాతకు కేశఖండన విధి నిర్వర్తించాడు.
విశ్వకర్మ వంశీయులు వాస్తుశాస్త్ర ప్రవర్తకులు. మనిషికి ప్రధాన అవసరాలైన కూడు,గూడు, గుడ్డ సమకూరడంలో వీరి భూమిక కీలకమైనది. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు రాకపూర్వం బండ్లు, నాగళ్లు, కొడవళ్లు లాంటి పనిముట్ల రూపొందించేవారు. అందులోనూ మన దేశం వ్యవసాయ ప్రధాన వృత్తి కావడంతో వారి అవసరం ఎంతో ఉండేది. ఏరువాక సమయంలో వారితోనే నాగళ్లకు పూజలు చేయించి సత్కరిస్తుండడాన్ని బట్టి వారికి గల గౌరవం తెలుస్తుంది. విశ్వకర్మ జయంతి ఏ ఒక్క సామాజిక వర్గానికో పరిమితమైన పండుగ కాదు.వృత్తిలో నైపుణ్యం కోరేవారంతా దీనిని జరుపుకుంటారు. తమతమ వృత్తులకు సంబం ధించిన పరికరాలు సరిగా పనిచేయాలని కోరుకుంటూ వాటికి పూజాదికాలు నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా నిర్వహించే ఆయుధ పూజకు, విశ్వకర్మ జయంతి పూజకు కొంత పోలిక కనిపిస్తుంది.
-డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్