‘‌వసుధైవ కుటుంబకమ్‌’- ‌విశ్వమానవాళి అంతా ఒకే కుటుంబం అన్న ఉదాత్త లక్ష్యం. అదే భారతీయ సంస్కృతికి మూలం. ఈ లక్ష్య సాధన కోసం హిందూ స్వయంసేవక సంఘ్‌ (‌హెచ్‌ఎస్‌ఎస్‌) ‌కృషి చేస్తోంది. ప్రస్తుతం 45 దేశాలలో హెచ్‌ఎస్‌ఎస్‌ ‌శాఖలు నడుస్తున్నాయి. అమెరికా, కెనడా, కిన్యా, బ్రిటన్‌, ‌జర్మనీ, మయన్మార్‌ ఇలా హిందువులు ఉన్న ప్రతి దేశంలోనూ శాఖలు జరుగుతున్నాయి. 1950వ దశకంలోనే కిన్యా రాజధాని నైరోబీలో మొదటి శాఖ ప్రారంభమైంది. క్రమక్రమంగా ఇతర దేశాలలో శాఖలను ప్రారంభించారు.

 హిందువులు ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఆయా దేశాలకు వెళ్లారు. అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ తమ హిందుత్వ మూలాలను కాపాడు కుంటూ తాము పొందిన సంస్కారాలను తోటి హిందువులకు అందజేయడానికి హిందు స్వయం సేవక సంఘ్‌ ‌శాఖలను ప్రారంభించారు. వీరు భారత్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి స్వయం సేవకులుగా శిక్షణ పొందినవారే. ఇక్కడ శాఖలు నడుస్తున్న తీరులోనే ఆయా దేశాలలో శాఖలు నడుస్తున్నాయి. అయితే అవి ప్రతీవారం ఒకసారి… కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనే విధంగా నడుస్తాయి.

గత ఫిబ్రవరి నుంచి సుమారు ఆరుమాసాల పాటు నేను, నా శ్రీమతి సుధామణి మా ఇద్దరు అమ్మాయిల కుటుంబాలతో గడపడానికి కెనడా, అమెరికా వెళ్లాం. అప్పుడే అక్కడి శాఖలను సందర్శించే అవకాశం లభించింది.

కెనడాలోని నోవాస్కోటియా రాష్ట్ర రాజధాని ‘హెలీఫోక్స్’ ‌పట్టణంలో మా పెద్దమ్మాయి కుటుంబం ఉంది. అక్కడికి వెళ్లాక ఆ పట్టణంలో జరిగే హెచ్‌ఎస్‌ఎస్‌ ‌శాఖకు మూడుసార్లు హాజరయ్యాం. ప్రతీ శనివారం ఉదయం గంటన్నరపాటు శాఖ జరుగుతుంది. శాఖలో బాలలు, బాలికలు, యువకులు, యువతులు, గృహిణులు కూడా పాల్గొంటున్నారు. ఒక కమ్యూనిటీ హాలును ఏడాదిపాటు అద్దెకు తీసుకొని శాఖలు నిర్వహిస్తు న్నారు. మన శాఖల మాదిరిగానే అన్ని కార్యక్రమాలు – సూర్యనమస్కారాలు, ఆసనాలు, ఆటలు, శ్లోకాలు, చిన్న చిన్న నీతి కథలు, చర్చలు, గోష్ఠి… అన్ని జరుగు తాయి. చిట్టచివరగా సంస్కృతంలో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఇక్కడ కన్నా భిన్నంగా… విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ ఉండటం గమనార్హం. హెలిఫాక్స్ ‌పట్టణంలో జరిగిన ఉగాది ఉత్సవంలో పాల్గొని డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌జీవిత విశేషాలను మిగిలిన సభ్యులతో కలసి పంచుకునే సదవకాశం కూడా నాకు లభించింది.

అమెరికాలోని ఒహోయో రాష్ట్ర రాజధాని కొలంబస్‌లో మా చిన్నమ్మాయి కుటుంబం ఉంది. ఈ పట్టణంలో రెండు శాఖలు నడుస్తున్నాయి. ఆ శాఖలను సందర్శించినప్పుడు అనిర్వచనమైన ఆనందం పొందగలిగాను.

సంస్కృతి పరిరక్షణ

భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం అక్కడి భారతీయులు కృషిచేస్తున్నారు. కెనడాలోని హెలిఫాక్స్ ‌నగరంలో హిందూ దేవాలయం సందర్శించాం. అక్కడ నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నాం. స్థానిక ‘మాటా’ – మేరిటైమ్‌ ‌తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి, ఉగాది వేడుకల్లో పాల్గొన్నాం. హెలిఫాక్స్ ‌పట్టణాలలో సుమారు ఐదు వందల తెలుగు కుటుంబాలు ఉన్నాయి. అదే విధంగా మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా సంస్కృతి పరిరక్షణలో భాగస్వాములవు తున్నారు. కెనడాలోని టొరంటో, మాంట్రియల్‌, ‌కేలిగెరి తదితర పట్టణాలలో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అక్కడ జరిగే హిందూ ఉత్సవాలు, పండుగలలో భారతీయులు పాల్గొనటం విశేషం.

అమెరికాలో హిందూ దేవాలయాలు

అమెరికాలోని అన్ని పట్టణాలలో హిందూ దేవాల యాలను నిర్మించారు. పిట్స్‌బర్గ్ ‌పట్టణంలో 1976 సంవత్సరంలోనే శ్రీ వెంకటేశ్వర దేవాలయం నిర్మించారు. ప్రతి పట్టణంలో బాలాజీ, సాయిబాబా, హను మాన్‌, ‌శివాలయాలు నిర్మించి అన్ని విధాలుగా సంప్రదాయ బద్ధంగా పూజలు, ఇతర ఉత్సవాలు నిర్వహిస్తు న్నారు. ఇటీవల అనేక పట్టణాలలో స్వామి నారాయణ్‌ ‌పంథకు చెందిన అక్షరధామ్‌ ఆలయాలను కూడా నిర్మించారు. న్యూజెర్సీ రాష్ట్రంలో నిర్మించిన అక్షరధామ్‌ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్దది కావడం గమనార్హం. ఇస్కాన్‌ ఆలయాలు కూడా అన్ని నగరాలలో ఉన్నాయి.

గత అర్థశతాబ్దంపైగా ఆయా దేశాలలో హిందూ సంస్థలు చేసిన కృషి ఫలితంగా స్థానికుల జీవనశైలిపై చక్కటి ప్రభావం చూపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయం ‘వేదపఠనం’ మనం గమనించాం. అన్ని ఉత్సవాలకు స్థానిక నేతలు, ఉన్నతాధికారులు హాజరై భారతీయ సంస్కృతిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.

చికాగో నగరంలో వరల్డ్ ‌కల్చర్‌ ‌సెంటర్‌

అమెరికాలోని చికాగో నగరంలో 1893 సెప్టెంబర్‌ 11‌వ తేదీన జరిగిన సర్వమత మహా సభలో వివేకానంద స్వామి ‘హిందూ సింహగర్జన’ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రపంచ సర్వమత సభ జరిగిన ఆ ప్రదేశంలో నేడు అతి పెద్ద సాంస్కృతిక కేంద్రం వరల్డ్ ‌కల్చర్‌ ‌సెంటర్‌ ఏర్పాటైంది. ఆ కేంద్రంలో సనాతన భారతీయ సంస్కృతితోపాటు ఇతర సంస్కృతులను అన్నిటినీ ప్రతిబింబించే రీతిలో అనేక విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఆ సాంస్కృతిక కేంద్రం పూర్తిగా సందర్శించటానికి కనీసం నాలుగైదు గంటలు పడుతుంది. ఆ కేంద్రం కింది అంతస్తులో స్వామి వివేకానందకు అంకితం చేస్తున్నట్లు ఒక శిలాఫలకం, స్వామీజీ సందేశం ఏర్పాటు చేశారు.

ఈ వరల్డ్ ‌కల్చర్‌ ‌సెంటర్‌ ఉం‌డే రోడ్డుకు ‘స్వామి వివేకానంద మార్గ్’‌గా నామకరణం చేశారు.

సామాజిక జీవనం

ఉపాధి కోసం, చదువుకోసం అమెరికా, కెనడా దేశాలను సందర్శిస్తున్న భారతీయులు, తెలుగువారు అక్కడ చక్కగా రాణిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌తోపాటు ఇంజనీరింగ్‌, ‌వైద్యరంగంలోనూ వాణిజ్యరంగం లోనూ నిలదొక్కుకుని తమ ప్రభావాన్ని చాటుతున్నారు.

ప్రతీ పట్టణంలో ఇండియన్‌ ‌స్టోర్స్, ‌రెస్టారెంట్లు ఉన్నాయి. అందువల్ల గతంలో మాదిరిగా కాకుండా నేడు అక్కడ మన పట్టణాలలో దొరికే అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. అదేవిధంగా ఇండియన్‌ ‌రెస్టారెంట్లు స్థానిక ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయి. అమెరికన్‌ ‌ప్రజలు భారతీయ రుచులు ఆస్వాదిస్తున్నారు. అనేక ఇండియన్‌ ‌రెస్టారెంట్లలో 25శాతం మంది స్థానికులే కనిపించటం విశేషం.

రాజకీయాలపై ప్రభావం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ప్రభావం బాగానే ఉందని చెప్పవచ్చు. త్వరలో జరుగ బోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ ‌పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌ ‌భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అన్నది తెలిసిందే.

రిపబ్లికన్‌ ‌పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన వైస్‌‌ప్రెసిడెంట్‌ అభ్యర్థి జె.డి.వాన్స్ ‌తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్న విషయం విదితమే. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇరువురు అభ్యర్థులూ తమకు ప్రవాస భారతీయుల మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. మన దేశంలో మాదిరిగానే ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా భారతీయులకు అనుకూలంగా వ్యవహరించక తప్పదు.

కొసమెరుపు

అత్యాధునిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం ఉన్న ఉత్తర అమెరికాలో వ్యక్తిగత భద్రత అంశం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఫ్రీ గన్‌ ‌కల్చర్‌ ‌కారణంగా ఎక్కడ ఏ ఉన్మాది కాల్పులు జరుపుతాడో అన్న భయం అక్కడి ప్రజలను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. సమాజం అంతా ఒకే కుటుంబం అన్న భావన లోపించడమే దీనికి కారణం కావచ్చు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE