తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని వచ్చిన ఆరోపణలతో హిందూ సమాజం ఆగ్రహంతో మండిపోతుంది.  శ్రీ వే•ంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావించే భక్తకోటి కన్నీటి పర్యంతం అవుతోంది. లడ్డూ తయారీకి గత ప్రభుత్వ హయాంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు నివేదికలతో పాటు నెయ్యిని అతితక్కువ ధరకు కొనుగోలు చేయడం కూడా లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనే వాదనకు బలం చేకూర్చినట్లైంది. జగన్మోహనరెడ్డి అయిదేళ్ల పాలన కమీషన్ల చుట్టూనే తిరిగినట్లు భావించిన ప్రజలు, ఇప్పుడు లడ్డూ అంశంలో కూడా కమీషన్ల వ్యవహారం చోటు చేసుకుందని ఆరోపణలు రావడంతో దేశం యావత్తూ ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

తిరుమలేశుడి ప్రీతిపాత్ర ప్రసాద లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న విషయం జాతీయ స్ధాయిలో గగ్గోలు రేపుతోంది. ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూను కలుషితం చేయడాన్ని కేందప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్‌ ‌చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వివరాలు పంపిస్తే విచారణకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబుకు తెలిపారు.

హిందూ విశ్వాసాలపట్ల ఇది కుట్ర, ద్రోహం, క్షమించరాని నేరమంటూ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ ‌జోషి, గిరిరాజ్‌ ‌సింగ్‌, ‌బండి సంజయ్‌, ‌పలువురు ఎన్డీయే, బీజేపీ జాతీయ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు, ‘కలియుగ దైవానికి ఇంత అపచారామా?’ అంటూ కోట్లాది మంది భక్తులు, ప్రభుత్వ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు చలించి పోతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఒకవైపు, కేంద్ర దర్యాప్తు సంస్థను రంగంలోకి దింపాలని మరోవైపు ఒత్తిడి పెరిగిపోతోంది. శ్రీవారిని, భక్తులనూ కొల్లగొట్టిన అప్పటి సీఏం జగన్‌ను, అప్పటి కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిని శిక్షించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, డీజీపీకి లేఖలు అందుతున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పిటిషన్‌ ‌దాఖలైంది.

నాటి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిపైనా, కల్తీ నెయ్యిని సరఫరా చేసిన సంస్థలపైనా జాతీయ భద్రతా చట్టం కింద చర్య తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, డీజీపీ ద్వారకా తిరుమలరావుకు మరో న్యాయవాది లేఖలు రాశారు. ఈ అంశంపై అయోధ్య ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేస్తూ, దీనిని సనాతన ధర్మంపై కుట్ర, దాడిగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. కాగా ఈ వ్యవహారంలో విచారణ చేయడానికి ఐజీ స్థాయి, అంతకంటే ఉన్నత స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ‌రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది.

తేడా తెలియనంతగా కల్తీ చేశారు: టీటీడీ ఈవో

శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో పంది, గొడ్డు వంటి జంతువుల కొవ్వు కలిసినట్టు నేషనల్‌ ‌డెయిరీ డెవలప్మెంట్‌ ‌బోర్డ్(ఎన్‌డీడీబీ) నివేదికతో పాటు పలు పరీక్షల్లో నిర్ధారణ అయిందని, తేడా తెలియనంతగా కల్తీకి పాల్పడ్డారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.‘లడ్డూల్లో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్రమంలో ప్రసాదాల నాణ్యతపై పలువురు నిపుణులతో చర్చించగా, నాణ్యమైన నెయ్యి లేకపోవడంతోనే లడ్డూల రుచి తగ్గిందనే విషయం తెలిసింది. అయితే, టెండర్ల ద్వారా వచ్చే నెయ్యిని వందశాతం పరీక్షించే ల్యాబ్‌ ‌తిరుమలలో లేదు. దాంతో, టెండరుదారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నెయ్యి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు డిసెంబరు నాటికి అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదు సంస్థల్లో దుండిగల్‌కు చెందిన ఏఆర్‌ ‌డెయిరీ ఫుడ్స్ ‌నెయ్యిలోనే నాణ్యత లేదు. ఆ సంగతి ఎన్‌డీడీబీ ల్యాబ్‌ ‌పరీక్షలో నిర్ధారణ అయ్యింది. దీంతో ఏఆర్‌ ‌సంస్థను నిషేధిత జాబితాలో ఉంచాం’ అని ఈవో శ్యామలరావు వివరించారు. ఈ కల్తీ విషయంలో తొలిసారి మీడియాతో మాట్లాడినప్పుడు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు స్పష్టత రాలేదు. తర్వాత అధికారులతో మాట్లాడి నిర్ధారించుకున్నాం.

ఇక మీదట ఎలాంటి నెయ్యి కొనుగోలు చేయాలనే అంశంపై ఇప్పటికే ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం.‘నందిని’ నెయ్యిని తిరిగి కొనుగోలు చేస్తున్నాం నాణ్యతను నిర్ధారించే వరకు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారపదార్థాలతో శ్రీవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం. అయితే వీటి నాణ్యత విషయం లోనూ కొన్ని అనుమానాలు ఉండడంతో, దానిని పరిశీలినపై ఓ కమిటీని నియమించాం’ అని ఈవో చెప్పారు. .

కమిషన్ల కోసం కక్కుర్తి

వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లోను కమిషన్ల రూపంలో కాసులు పిండేశారని ఆరోపణ లున్నాయి. టీటీడీలో అధికార దుర్వినియోగం దానికి పరాకాష్ట. కమీషన్‌ల యావతోనే తిరుమలలో స్వామివారి లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీలో వాడే ఆవునెయ్యిని చౌకధరకు కొనుగోలు చేసినట్లు అన్ని పక్షాలు, ప్రజాసంఘాలు, హిందూభక్తులు ఆరోపిస్తున్నారు. గేదెనెయ్యి రూ.600లకు పైగా లభిస్తుండగా, స్వచ్ఛమైన ఆవునెయ్యి రిటైల్‌ ‌ధర రూ.800-రూ.1,200 ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సమాఖ్య నుంచి సేకరిస్తున్న నెయ్యిని ఆపివేసి,• కమిషన్ల కోసమే ప్రైవేటు డెయిరీల నుంచి కిలో రూ.320లకు ఆవునెయ్యిని కొనుగోలుచేశారని ఆరోపణల ఉన్నాయి.

తిరుమలపై కపటం

తిరుమల తిరుపతి దేవస్థ్ధానం విషయంలో క్రైస్తవమతస్థులైన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి,తనయుడు,మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రవర్తన కపటంగానే ఉండేదని భక్తులు విమర్శిస్తున్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో కూడా అన్యమత ప్రచారం, తిరుమలను క్రైస్తవ నిలయంగా మార్చడానికి ప్రయత్నాలు, తిరుమల ఏడుకొండలు కాదు రెండు కొండలే అని పేర్కొంటూ భక్తుల మనోభావాలను చిన్నబుచ్చారు. ప్రజాగ్రహాన్నీ చవి చూశారు. తండ్రీకొడుకులు ముఖ్యమంత్రు లుగా ఉన్నప్పుడు ఎన్నడూ సతీసమేతంగా తిరుమ లకు రాలేదు. జగన్‌ అయితే స్వామివారి ప్రసాదాలనే స్వీకరించలేదు. చివరికి తలపై వేసిన అక్షతలను సైతం అంటరాని వస్తువుగా భావించినట్లు దులిపి వేశారు. తిరుమలను మొదటి నుంచి పవిత్ర ప్రదేశంగా కాక వ్యాపార వ్యవస్థగా భావించినట్లు విమర్శలున్నాయి. టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌లుగా అన్యమతస్థుల నియామక వివాదాలు ఎదుర్కొం టున్న, నాటి ముఖ్యమంత్రి బంధువులు సుబ్బారెడ్డి, కరుణాకర రెడ్డిలను నియమించారు. టీటీడీని రాజకీయ, వ్యాపార వ్యవస్థగా మార్చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి గత ఐదేళ్లుగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ప్రభుత్వం పాలక మండలి సభ్యుల సంఖ్యను 50కి పెంచి రాజకీయ పునరా వాసంగా మార్చేసింది. వారిలోనూ లిక్కర్‌ ‌వ్యాపారులు, క్రిమినల్‌ ‌చరిత్ర గలవారు ఉండడం వివాదాస్పదమైంది.  తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తూ బహిరంగంగా తమ మత విశ్వాసాలు పాటించడం కూడా వివాదమైంది. విపక్షాలు అడ్డుకోవడంతో టీటీడీకి చెందిన ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్లు ప్రభుత్వ ఖజానాకు బదిలీ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తిరుమలలో భక్తులకు అందించే సేవల రుసుములను పెంచేశారు.

మొదటి నుంచి మత వివక్షే

వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి తమ పట్ల వివక్ష,అలసత్వం, నిర్ల్యక్షం, చూపిస్తోందని హిందువులు విమర్శిస్తున్నారు. అంతర్వేదిరథం దగ్ధం, రామతీర్థం రామచంద్రమూర్తి విగ్రహ ధ్వంసం, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం విగ్రహాల అపహరణ, పిఠాపురంలో ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసం వంటి సంఘటనలపై ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం, నిందితులకు ప్రభుత్వ పరంగా సహకారం ఉందనే ఆరోపణలు రావడం వంటివి హిందూ సమాంలో ఆగ్రహం తెప్పించాయి.

ధర్మారెడ్డి కేంద్రంగా….

A.V Dharma Reddy

వైఎస్‌ ‌కుటుంబానికి సన్నిహితుడుగా ముద్ర ఉన్న ఏవీ ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌ ‌నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. జూలై 12,2019న తిరుమల ప్రత్యేకాధికారిగా జేఈవో పోస్టులో నియమితులైన కొద్ది రోజులకే ఆయన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అదనపు ఈవో పోస్టును సృష్టించింది. 2022 నవంబరులో ఈవో జవహర్‌రెడ్డి బదిలీ కావడంతో ఇన్‌చార్జి ఈవోగా కొనసాగారు.

మూడున్నరేళ్ల పాటు తిరుమలలోనూ, ఎన్నికల ఫలితాల వరకూ టీటీడీపైనా పట్టు తెచ్చుకున్నారు. శ్రీవాణి ట్రస్టు సృష్టించి శ్రీవారి దర్శనానికి రేటు కట్టారని, ధనికులకే మంచిదర్శనం కల్పించి పేదల పట్ల వివక్ష, తారతమ్యం చూపారన్న విమర్శలు వచ్చాయి. ఆ మహా దేవుడిపై విశ్వాసంతో, భక్తితో వ్యయప్రయాసలకు ఓర్చి కొండపైకి చేరుకొనే భక్తులకు సౌకర్యాల కల్పనను గాలికొదిలేసి నాటి ముఖ్యమంత్రి జగన్‌కు ఉపయోగపడతారనుకున్న ప్రముఖుల సేవలో తరించేవారు.

భూమన: కుమారుడి కోసం నిధుల మళ్లింపు

జగన్మోహనరెడ్డి హయాంలో భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసింది చాలా స్వ

Karunakara Reddy

ల్ప కాలమే అయినా పుట్టెడు అవినీతి ఆరోపణలు మూటకట్టుకున్నారు. 2023 సెప్టెంబరులో నియమితులైన ఆయన ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే వరకూ తొమ్మిది నెలలు ఆ పదవిలో ఉన్నారు. ఆ స్వల్ప వ్యవధిలోనే సొంత రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వాడుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇంజనీరింగ్‌ ‌పనులకు భారీగా నిధుల కేటాయింపులు జరపడం వివాదాన్ని సృష్టించింది. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి మళ్లించడం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు వంటి నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. తిరుపతి నుంచి అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న కుమారుడి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

Y.V Subha Reddy
Y.V Subha Reddy

జగన్మోహనరెడ్డి మే 30, 2019న ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 21 రోజులకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల తరువాత(2021 ఆగస్టు 8న)పదవీ కాలం పొడిగింపుతో రెండవ దఫా కూడా నియమితులై 2023 ఆగస్టు దాకా కొనసాగారు. ఇంత కాలం కొనసాగినవారెవరూ అప్పటివరకు టీటీడీ చరిత్రలోనే లేరు. ఆయన అధికారానికి అడ్డు లేకుండా పోయింది. అనుకున్నదే తడవుగా ఉత్తర్వులు జారీ అయ్యేవి.

ఈ క్రమంలో పలు అడ్డగోలు నియామకాలు జరిగాయని, బంధువులు, సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని కీలక పదవుల్లో నియమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉదాహరణకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఐటీ విభాగానికి ఏమాత్రం అర్హత, అనుభవం లేని వ్యక్తిని హెడ్‌గా నియమించడం కలకలం సృష్టించింది. ఈయన హయాంలో చేపట్టిన ఎస్వీబీసీ సలహాదారుల నియామకాలు కూడా వివాదాస్పదమయ్యాయి. తిరుమల పవిత్రతపై హిందూ భక్తుల్లో కలవరం రేగుతున్న నేపథ్యంలో వారి వేళ్లు ఆ ముగ్గురి వైపే చూపుతున్నాయి.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE