సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి భాద్రపద శుద్ధ షష్ఠి – 09 సెప్టెంబర్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
చరిత్రలో గాంధీజీ నడిపిన కాంగ్రెస్, తాజా గాంధీల కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పాలంటే చాలా ధైర్యసాహసాలు కావాలి. కానీ చరిత్ర పుటలలోని గాంధీజీతో మా వారసత్వం అదేదో సిమెంట్‌లాగా దృఢమైనదని తాజా గాంధీలు దబాయిస్తూ ఉంటారు. కాబట్టి గాంధీజీ కాలం నాటి కొన్ని అవశేషాలను మనం అవసరార్థం తీసుకోవచ్చు. ఉదాహరణకి చరిత్రలోని గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రమైన మూడు కోతుల బొమ్మ. చెడు వినవద్దు, అనవద్దు, చూడవద్దు అన్న సూక్తిని జాతికి బోధిస్తున్నట్టు ప్రతీకాత్మకంగా ఉంటాయి ఆ మూడు బొమ్మ కోతులు. ఇప్పటికీ కాంగ్రెస్‌కి ఆ కోతులే ఆదర్శం అంటే నమ్మాలి. నేటి కాంగ్రెస్ గాంధీలు సొంత పార్టీలో అక్రమాల గురించి వినరు. వాస్తవాలు మాత్రమే మాట్లాడరు. వాస్తవాల వైపు చచ్చినా చూడరు. హిందువుల ఆక్రోశమంటే కాంగ్రెస్‌కు బూతుమాట. అందుకే హిందువుల ఊచకోత గురించి వినదు. హిందువుల మీద అత్యాచారాలు, హిందూ ప్రార్థనామందిరాల మీద దాడులు అన్యాయమని ఏనాడూ అనదు. హిందువుల మీద జరిగే దాడుల వార్తలను కన్నెత్తి చూడదు.
మొదట వినవద్దు అన్నట్టు చెవులు మూసుకునే కోతి బొమ్మని కాంగ్రెస్ ఎలా మన్నిస్తున్నదో, ఆదర్శంగా తీసుకుంటున్నదో చూద్దాం. ‘నేను మహిళను, నేను పోరాడగలను’ వయినాడ్ (కేరళ) ఉప ఎన్నికకు తగుదునమ్మా అంటూ సిద్ధపడుతున్న ప్రియాంక గాంధీ నినాదమిది. అప్పుడెప్పుడో యూపీలో పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేసినప్పుడు ఆశువుగా ఆమె నోటి నుంచి జాలువారిందట. అప్పటి నుంచి మహిళా కాంగ్రెస్ గర్జనగా గౌరవం పొందుతోంది. నిజమే ఈ నినాదాన్నీ, దాని అర్ధాన్నీ తప్పు పట్టేదేమీ లేదు. కానీ నేను సైతం పోరాడతాను అని కేరళ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు సిమీ రోజ్‌బెల్ జాన్ ప్రకటిస్తే మాత్రం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పార్టీ నుంచి గెంటేశారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక తప్పు పట్టిన సీపీఎం ఎమ్మెల్యే, మాలీవుడ్ నటుడు ఎం. ముఖేశ్ రాజీనామా చేయాలని మహిళా కాంగ్రెస్ అక్కడ వీర విహారం చేస్తున్న నేపథ్యంలోనే ఈ గెంటివేత జరిగిపోయింది. మహిళా సాధికారత గురించి బీజేపీకి పిసరంతయినా చిత్తశుద్ధి ఉందా అని ఏడాదికి లక్షసార్లు ప్రశ్నించే మహిళా కాంగ్రెస్ నేతలు, సాటి నేత ఆరోపణలను మాత్రం తుంగలో తొక్కించారు. ‘ఆత్మ గౌరవం, హుందాతనం వంటి లక్షణాలు ఏమైనా ఉంటే అలాంటి ఆడవాళ్లు ఈ పార్టీ, అనగా శతాధిక వత్సరాల కాంగ్రెస్‌లో పని చేయడం అసాధ్యం’ అని విలేకరుల సమావేశం పెట్టి మరీ ఢంకా బజాయించారు సిమీ జాన్. ప్రస్తుతం కేరళ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత వీడీ సతీశన్ సహా పలువురు ప్రముఖ రాష్ట్ర నాయకులు మహిళా నేతల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డవారేనని సిమీ బాంబు పేల్చారు. రాష్ట్ర నేతలను ‘ఆకట్టుకునే పనిలో ఉంటే’నే పార్టీలో కీలక పదవులు దక్కుతాయన్న ఆ దేవ రహస్యం కాస్తా బయట పెట్టేసిందామె. సిమీ ఆరోపణని సతీశన్ తోసిపుచ్చాడంటే అర్ధం ఉంది. చాలామంది మహిళా నేతలు కూడా సిమీ లాంటి నాయకురాలు వద్దు, పార్టీ పాడైపోతున్నదంటూ గెంటేయండని ఘోషించడమే వింత. మిగిలిన మహిళా కాంగ్రెస్ నేతల పట్ల అమర్యాదగా మాట్లాడినందుకే సిమీని గెంటేశారని వివరణ కూడా ఇచ్చారు. పార్టీకి లోక్‌సభలో భారీగా సభ్యులను (18 స్థానాలకు గాను 13) ఇచ్చినందుకు కేరళ రాష్ట్ర నాయకత్వం పట్ల ఢల్లీి కాంగ్రెస్ ఆ మాత్రం కృతజ్ఞత చూపించాలి మరి! నిజం చెప్పాలంటే, కాంగ్రెస్‌లో మహిళలకు ఆట్టే పరువు ప్రతిష్టలు ఉండవని చెప్పడానికి ఇటీవలి సాక్ష్యాలే చాలు. 2024 ఎన్నికల ప్రచారంలో బీజేపీ మండి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి, నటి కంగనా రనౌత్‌ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనెటే ఏమన్నారు? ‘మండీలో ఆమె ధర ఎంత?’ అనే కదా! కాబట్టి బయటివారి లోపాలు చూసినంతగా, లోపలి వారి ఆక్రోశం గురించి కాంగ్రెస్ వినదు.
చెడు అనవద్దు అని ప్రకటించే కోతి కూడా ఆదర్శమే కాంగ్రెస్ పార్టీకి. మమతా బెనర్జీ నోరున్న నాయకురాలు. ఏదో ఒకనాటికి పనికొచ్చే నోరు కదా అని ఉండీ లేనట్టు ఉన్న ఇండీ కూటమి దింపుడుకల్లం ఆశ. ఇది సరే. కోల్‌కతాలో ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలిని అతి దారుణంగా చంపారు. దేశం మొత్తం అట్టుడికినట్టు ఉడికిపోతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం నుంచి మమత దిగిపోవాలని కోరుతూ జనం పోటెత్తుతున్నారు. అయినా ఆ విషయం గురించి రాహుల్ గాంధీ మాట్లాడరు. విలేకరులు గుచ్చి గుచ్చి అడిగితే తన దృష్టి మళ్లించవద్దంటూ సమాధానం దాటేస్తారు. ఈ రకంగా తమకు పనికొచ్చే నాయకుల దారుణాలను మిత్రధర్మాన్ని గౌరవించుకుంటూ బయటకి అనరు. సందేశ్‌ఖాలి గొడవలప్పుడు కూడా ఇదే ధర్మంతో వారు ఏమీ అనలేదన్న సంగతి ఇప్పుడైనా గుర్తించాలి.
గొడ్డు మాంసం తిన్నారన్న కారణంగా హరియాణా, మహారాష్ట్రలో ఇద్దరు మైనారిటీ వర్గం వారిని కొందరు కొట్టి చంపారన్న వార్త మానవత్వం ఉన్నవారిని ఎవరినైనా కదిలిస్తుంది. రాహుల్ గాంధీని కూడా కదిలించింది. అయితే మానవత్వంతోనే అది కదిలిందా? అన్నది లక్ష ఓట్ల ప్రశ్న. ఎందుకంటే బాంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్ హసీనా పీఠం దిగిపోయాక, ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్టు ఏమీ సంబంధం లేకున్నా అక్కడ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. జమాతే ఇస్లామి అనే ఉన్మాద సంస్థకు సంపూర్ణ సేచ్ఛను కట్టబెట్టింది తాత్కాలిక ప్రభుత్వం. అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్నట్టు, అసలే ఐఎస్‌ఐ కుట్ర, దీనికితోడు జమాతే ఇస్లామి తోడైంది. అక్కడ హిందూ దేవాలయాలు కూలుతున్నాయి. హిందువులే కాదు సిక్కులు, క్రైస్తవులను కూడా ఊచకోత కోస్తున్నారు. అయినా అటువైపు చూడరు రాహుల్ గాంధీ. ఆ విధంగా చెడు చూడకు అన్నట్టు ఉండే మూడో కోతి బొమ్మ రాహుల్‌కూ, కాంగ్రెస్‌కూ ఆదర్శంగా నిలుస్తున్నది.