ఆంధ్రప్రదేశ్‌ను విపత్తులు  చుట్టు ముడుతున్నాయి. పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఆగస్టు 29న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కృష్ణానది, దాని ఉపనదులు పొంగి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు నీటమునిగి  అపారనష్టం వాటిల్లింది.వాగులు, నదుల నిర్వహణలో నిర్లక్ష్యం, ఆక్రమణలు, పూడికలు తీయకపోవడం, డ్రెయిన్లు క్రమబద్ధ్దీకరించకపోవడం వంటివి వాగులు ఊళ్లను ముంచేయడానికి కారణం.  ఏడాదికో రెండేళ్లకో ఇలా వరదలు ముంచెత్తడం సాధారణ మైంది. దీనివల్ల భారీగా పంటనష్టం, ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించి ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తున్నాయి.

 ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో రెండు రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణ, బుడమేరు నీరు విజయవాడ నగరాన్ని చుట్టుముట్టాయి. అంతలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం గోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాలకు వరద తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఏలేరు వరదతో కాకినాడ జిల్లాలో 8 మండలాల్లోని 64 గ్రామాలు నీటమునిగాయి. మౌలిక సదుపాయాలకు నష్టం జరిగింది. పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదేలయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టంతోపాటు తినడానికి తిండి, తాగటానికి నీళ్లు లేక ముంపుప్రాంత ప్రజలు తీవ్ర క్షోభ అనుభవించారు. రాష్ట్రంలో వరద నష్టం రూ.6,880 కోట్లుగా ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఏలేరు వరద ముంపు నష్టం ఇంకా అంచనాకు రాలేదు. ఎన్యుమరేషన్‌ పూర్తయితే పూర్తి నష్టం విలువ తెలుస్తుంది. ఒక్క విజయవాడ నగరంలోనే 32 వార్డులు, దాని పక్కనే 2 గ్రామాలతో పాటు 10.63లక్షల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 108 మండలాలు, 337 గ్రామాలపై ప్రభావం పడిరది. 246 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 50వేల మందిని తరలించారు. లక్షన్నర మందికి అత్యవసర వైద్యసేవలు అందించారు. వరదలకు 3 లక్షల మంది రైతులకు చెందిన 2.06 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 19,686 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 4వేల కి.మీ. పరిధిలో రహదారులు ధ్వంసమయ్యాయి. రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. వరద పీడిత ప్రాంతాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందచేసింది. సమగ్ర నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతోందని, అది పూర్తయ్యాక మొత్తం నష్టం విలువ అపారంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

కృష్ణానది, బుడమేరు వల్ల వచ్చిన నష్టం

దెబ్బతిన్న ఇరిగేషన్‌ ఆస్తులు రూ.730 కోట్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో బాధిత రైతులు 49,342, ఉద్యానశాఖకు నష్టం 5,227 హెక్టార్లు, ఆయిల్‌పామ్‌కరూ 21.73 కోట్లు, పశు సంవర్ధకశాఖకు రూ.69.41 లక్షలు నష్టం సంభవించింది. కృష్ణానదికి రికార్డు స్థాయి వరద వల్ల చేపట్టాల్సిన పునరుద్ధరణ పనుల అంచనా రూ.635 కోట్ల ఖర్చు, బుడమేరు గండ్లు రూ.36.98 కోట్లు, మున్నేరు నష్టం రూ.53.27 కోట్లు, దెబ్బతిన్న రహదారులు 690 కిలోమీటర్లు రోడ్ల పునరుద్ధరణ అంచనా రూ.189 కోట్లు, తాగునీటి పథకాలకు నష్టం రూ.114 కోట్లు అయింది. ఇప్పటికి జరిగిన సర్వే ప్రకారం వ్యవసాయ రంగానికి రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా. 53,399 ఇళ్లు, 36 వేల 2 వీలర్స్‌, 2 వేల కార్లు ఇతర వాహనాలు నీళ్లల్లో ఉన్నాయి. 33,508 వాహనాలు రకరకాలుగా దెబ్బతిన్నాయి. 26,545 టీవీలు, ఫ్రిజ్‌లు 31 వేలకు పైగా, వాషింగ్‌ మెషిన్లు 20 వేలకు పైగా పాడైపోయాయి.

దుస్తులు, గృహోపకరణాలు వరదపాలు

బుడమేరు వరద ప్రభావం ప్రధానంగా విజయవాడ నగరంపైనే చూపింది. సింగ్‌నగర్‌, కృష్ణాహోటల్‌ సెంటర్‌, వాంబేకాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, పాయకాపురం, ప్రశాంతినగర్‌, సుందరయ్యనగర్‌, కండ్రిక,రాజీవ్‌నగర్‌, జక్కంపూడి కాలనీ, అంబాపురం తదితర ప్రాంతవాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారి ఇళ్లు, డాబాలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతినడంతో పాటు కట్టుబట్టులతో నిరాశ్రయిలయ్యారు. ఆహారం, మంచినీరు లేక అలమటించిపోయారు. ఇంట్లోని సామాగ్రి నాశనమైంది. దుస్తుల నుంచి గృహాప కరణాలు నీట మునిగిపోయాయి. వంట సామాన్లు, గ్యాస్‌ స్టౌలు నీటితో నిండిపోయాయి. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు వరద నీటిపాలయ్యాయి. దీనికితోడు ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. లేదంటే బురదలో కూరుకు పోయాయి. అవి ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన పరిస్థితి. కన్పించకుండా ప్రతి మధ్య తరగతి వర్గాలకు చెందిన ఒక్కో ఇంటికి కనీసం లక్ష రూపాయల నుంచి రూ.2లక్షల వరకు ఆర్థికంగా నష్టం చేకూరే అవకాశముంది.

ఆటో కార్మికులకు కోలుకోలేని దెబ్బ

ఆటో కార్మికులపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. విజయవాడ నగరంలో 6 వేల ఆటోలు నడుస్తున్నాయి. అధిక శాతం సింగ్‌నగర్‌, వాంబేకాలనీ, కండ్రిక పరిసర ప్రాంతాలకు చెందిన డ్రైవర్లున్నారు. వరదలతో ఇళ్లు, రోడ్లు దగ్గర నిలిపిన ఆటోలు రోజుల తరబడి నీట మునిగాయి. వరద ఉధృతితో చాలా ఆటోలు కిలోమీటర్ల కొద్దీ కొట్టుకుపోయాయి. పది రోజుల నుంచి ఆటో కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. అరకొర ఆహారంతోనే వారు జీవిస్తున్నారు. ఆటోలను అద్దెకు తీసుకుని నడుపుతున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారు. చాలా ఆటోలు ఇన్సూరెన్స్‌ సౌకర్యం లేకుండా ఉన్నాయి. వాటి పరిస్థితేమిటనేదీ అర్థం కావడం లేదు. భవననిర్మాణ యజమానులకూ నష్టం వాటిల్లింది. నిర్మాణంలో ఉన్న భవనాలు పది రోజులపాటు వరదనీటిలోనే ఉండటంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరదలతో చిన్నపరిశ్రమలు చికితిపోయాయి. వరదలతో యంత్రాలు నీటమునిగి దెబ్బతిన్నాయి. సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలపై చాలామంది ఆధారపడి జీవిస్తుంటారు. దీనివల్ల యజమానులకు ఆర్థికంగా నష్టంరాగా, కూలీల జీవనోపాధికి గండిపడిరది. సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, ఫ్యాన్సీ షాపులు నడుపుకునే వారికీ నష్టం వాటిల్లింది.

బుడమేరు ఆధునీకరణ చేపట్టాలి

బుడమేరు ఆధునీకరణ జరిగితేనే వరద నీరు విజయవాడ, సమీప గ్రామాలకు రక్షణ ఉంటుంది. ఇందుకు తగిన కార్యాచరణ చేపట్టాలి. 50 వేల క్యూసెక్యుల వరద నీరు వచ్చినా బుడమేరు పరివాహ ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ఉండాలంటే బుడమేరుకు మళ్లింపు కాలువ, పోలవరం కుడికాలువలను 37,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్ధ్యానికి తగ్గట్లుగా విస్తరించాలి. 160 కి.మీ.పొడవైన బుడమేరు ఆధునీకరణకోసం రూపొందించిన విధంగా ‘మొదటి రీచ్‌లో 62 మీటర్ల వెడల్పు 4.063 నుంచి 4,761 మీటర్ల లోతు తోను, రెండో రీచ్లో 110 మీటర్ల వెడల్పు 2.584 నుంచి 4.802 మీటర్ల వరకు లోతు, మూడో రీచ్లో 180 మీటర్ల వెడల్పు 2. 620 మీటర్ల లోతుతో వరద కాలువను కొల్లేరు సరస్సు వరకు విస్తరించాలి. లేదంటే నూతన నమూనాను రూపొందించాలి. ఆక్రమణలు తొలగించాలి. ఇవన్నీ చేపడితే బుడమేరు వరద ముంపు తొలగిపోతుంది.

ఏలేరు ముంపు

ఏలేరు రిజర్వాయర్‌కు ఈ నెల 8న ఒకేసారి 47వేల క్యూసెక్కుల వరదనీరు రావడంతో దిగువకు వదిలేశారు. దాంతో వరద కాలువలు పోటెత్తి ఎక్కడికక్కడ గండ్లు పడి తీవ్ర నష్టంవాటిల్లింది. దీంతో కాకినాడ జిల్లాలో 8 మండలాల్లో 42 గ్రామాలు వరదలో చిక్కుకుని విలవిల్లాడాయి. 75 వేల ఎకరాలకు పైగా పంట పొలాలు నిండా మునిగాయి. పిఠాపురం, గొల్లప్రోలు, ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, ప్రత్తిపాడు, కొత్తపల్లి, సామర్లకోట మండలాల్లో వరద ముంపు భారీగా ఉంది. అనేక ప్రధాన రహదారులపై నీళ్లు పొంగుతూ ప్రవహించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్తిపాడు,కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మండలాల ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండడంతో తాత్కాలికంగా మూసివేశారు. ముంపు గ్రామాలు విద్యుత్‌ లేక అంధకారంలో ఉన్నాయి. ప్రాథమిక నష్టం సుమారు 300 కోట్లుగా అంచనా వేశారు. గత 36 సంవత్సరాల కాలంలో ఏలేరు, సుద్దగడ్డ కాలువలకు 53సార్లు వరదలు సంభవించగా ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే రైతులు రూ.1150 కోట్లు విలువైన పంటలను కోల్పోయారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నిలిపివేసిన ఏలేరు ఆధునీకరణ ఫేజ్‌`1, 2 పనులను పూర్తిచేయాలి.

 రాష్ట్రంలో ఏటా ఇటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్లు, వాయుగుండాల ప్రభావంతో లక్షలాది హెక్టార్లలో పంటనష్టం జరుగుతోంది. లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం అవుతున్నారు. తుఫాన్లు/వాయుగుండాలతో దేశంలో ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రాల్లో ఏపీ నిలిచింది. వరదల విపత్తులతో నీటమునక, పంటనష్టం, ఇతరత్రా అతలాకుతలమైన రాష్ట్రాల్లో ఏపీ ఆరో స్థానంలో ఉంది. దేశంలో విపత్తులపై 1996 నుంచి 2022 వరకు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) చేపట్టిన అధ్యయనం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏపీలో 7.92 లక్షల హెక్టార్లు నీట మునిగింది. రాష్ట్రంలో భూవిస్తీర్ణం 1.6 లక్షల హెక్టార్లు కాగా దాంట్లో 4.92 శాతం వరదల్లో చిక్కుకుంది. రాష్ట్రంలో వరదలకు ఎక్కువగా ప్రభావితమైనది నెల్లూరు జిల్లా కాగా ఆ తరువాత బాపట్ల. నెల్లూరులో 1,44,317 హెక్టార్లు, బాపట్లలో 1,11,637, తిరుపతి 83,151, ప్రకాశం 60,207, గుంటూరు 48,973, శ్రీకాకుళం 39,114, నంద్యాల 33,035, ఏలూరు 29,809, కృష్ణా29,582, పశ్చిమ గోదావరిలో 27,397, తూర్పు గోదావరిలో 21,322, కాకినాడ 18,983, అనకాపల్లి 17,631, అల్లూరిజిల్లా 16,661, పల్నాడు 12,630, ఎన్టీఆర్‌ జిల్లా 11,021 హెక్టార్లు వరదల్లో చిక్కుకున్నాయి. మిగిలిన జిల్లాలో 10 వేల హెక్టార్లకంటే తక్కువగా నీటమునిగింది. దేశంలో ఏటావచ్చే వరదల్లో 30శాతం గోదావరి, కృష్ణా నదుల నుంచే వస్తున్నాయి.

దుర్భర పరిస్థితుల్లో 44 శాతం భూభాగం

రాష్ట్రంలో ప్రధానంగా తుఫాన్ల ప్రభావంతో ఎక్కువగా వరదలు సంభవిస్తు న్నాయి. ఈ ప్రభావంతో 44శాతం భూభాగం దుర్భల పరిస్థితులను ఎదుర్కొం టోంది. తుఫాన్‌వల్ల భారీగా దెబ్బతిన్న ప్రాంతంగా దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంది. 2010లో లైలా, 2012లో నీలం, 2014లో హుద్‌హుద్‌, 2018లో తితిలీ తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అంతకుముందు 1996లో తుఫాన్‌ కోనసీమను తీవ్రంగా దెబ్బతీసింది. తాజాగా ఆగస్టు 29న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో విజయవాడ నగరాన్ని వరద చుట్టుముట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో గోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాకు వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఏటా నదులనుంచి వరదలు లేదా తుఫాన్‌ల ప్రభావంతో ఏపీ అతలాకుతలమవుతోందని ఈ అధ్యయనం వెల్లడిరచింది. ఈ నేపథ్యంలో విపత్తులను ఎదుర్కొనేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించడం, నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠంచేయడం, తీర ప్రాంతాల్లో మడఅడవులు, తాటితోపులు, సరుగుడు వనాలు పెంపు వంటివి చేపట్టాలి.

– తురగా నాగభూషణం, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE