జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్
వచ్చే నవంబర్ 5వ తేదీన 60వ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని రాష్ట్రాలతో పాటు కొలంబియా జిల్లా (ఇక్కడ ప్రతి రెండేళ్లకోమారు ఎన్నికలు జరుగుతాయి) ఎలక్టోరల్ కాలేజీకి, ఎలక్టర్స్‌ను ఎన్నుకుంటాయి. వీరు తిరిగి దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. వీటితో పాటు యుఎస్ సెనేట్, హౌజ్, గబర్నటోరియల్ వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఇదే తేదీన ఎన్నికలు ఒకేసారి జరుగనున్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి నాలుగేళ్లకి ఒకసారి జరుగుతుంది. 2020లో మాదిరిగానే జో బైడెన్` ట్రంప్‌ల మధ్య పోటీ జరగాల్సి ఉండగా, జూలైలో జో బైడెన్ తప్పుకొని, వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ పేరును అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడంతో అది ట్రంప్`కమలాహారిస్‌ల మధ్య పోటీగా మారింది.
ఎన్నికల డిబేట్‌లో ట్రంప్ కంటే బైడెన్ చాలా వెనుకబడిపోవడంతో సొంత పార్టీలోనే వ్యక్తమైన వ్యతిరేకతల నేపథ్యంలో ఆయన పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1969లో లిండన్ బి. జాన్సన్ నామినేషన్ వేయడానికి అవసరమైన ప్రతినిధుల మద్దతు పొందినప్పటికీ ఆయన పోటీ చేయలేదు. ఆ విధంగా అర్హత పొంది పోటీ చేయని తొలి అధ్యక్ష అభ్యర్థిగా లిండన్ బి. జాన్సన్ నిలిచి పోగా, బరి నుంచి తప్పుకున్న రెండో అభ్యర్థిగా బైడెన్ నిలిచారు. ప్రైమరీల్లో పాల్గొనకుండా అధ్యక్ష అభ్యర్థిగా రంగంలో నిలిచిన రెండో అభ్యర్థిగా హారిస్ చరిత్ర సృష్టించారు. 1968లో హ్యూబర్ట్ హంఫెరీ సరిగ్గా ఈమె మాదిరిగానే అధ్యక్ష పదవికి పోటీచేశారు.
కమలాహారిస్‌కు పెరుగుతున్న మద్దతు
కమలాహారిస్ రంగంలోకి దిగిన తర్వాత డెమోక్రట్లకు మద్దతు బాగా పెరగడమే కాదు, ట్రంప్‌ను వెనక్కినెట్టేయడం తాజా పరిణామం. ప్రస్తుతం కమలాహారిస్‌కు జాతీయస్థాయిలో 48%, ట్రంప్‌కు 45% మద్దతు నమోదైంది. ఇదే ట్రెండ్ ఎన్నికల తేదీనాటి వరకు కొనసాగితే కమలాహారిస్ విజయం తధ్యం. అయితే ఈ జాతీయ స్థాయి పోలింగ్ సగటు చూపే మద్దతు శాతం పూర్తిస్థాయిలో నిజం కావాలనేంలేదు. చాలా సందర్భాల్లో ఎన్నికల ఫలితం ఈ జాతీయ స్థాయి పోలింగ్ సగటుకు కొంచెం అటుఇటుగా వెల్లడికావడం గతంలో జరిగింది. అబార్షన్, దేశభద్రత, వలసలు, పర్యావరణ మార్పు, ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, విద్య, విదేశాంగ విధానం, హెల్త్‌కేర్, ఎల్.జి.బి.టి. హక్కులు వంటివి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా పెన్సిల్వేనియాలో సెప్టెంబర్ 10వ తేదీన ట్రంప్`కమలా హారిస్‌ల మధ్య జరిగిన డిబేట్‌ను దేశవ్యాప్తంగా 67 మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. ఈ డిబేట్ తర్వాత వివిధ వార్తాసంస్థలు ప్రజాభిప్రాయంపై నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేల్లో అధికశాతం కమలా హారిస్ గెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ, నిజంగా ఎన్నికలు జరిగే సమయానికి ఎంతమేర ఈ సానుకూలత ఓట్లరూపంలోకి మారుతుందనేది ప్రశ్న.
పోటీ అధికంగా ఉండే రాష్ట్రాలు
యుఎస్‌లో ఎలక్టోరల్ కాలేజీ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ పద్ధతిలో యుఎస్‌లోని ప్రతి రాష్ట్రానికి అక్కడి జనాభా ఆధారంగా ఇన్ని ఓట్లని నిర్ధారిస్తారు. ఆవిధంగా దేశం మొత్తంమీద 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. అధ్యక్ష పోటీలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి దేశాధ్యక్షుడవుతాడు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలుండగా, వీటిల్లో చాలా రాష్ట్రాలు సాధారణంగా ఎప్పుడూ ఒకే పార్టీకి మద్దతు పలుకుతుంటాయి. ఈసారి ఏడు రాష్ట్రాలు అభ్యర్థి జయాపజయాలను నిర్ణయించనున్నాయి. ఈ రాష్ట్రాలనే యుద్ధక్షేత్ర రాష్ట్రాలు (బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్)గా వ్యవహరిస్తున్నారు. ఇవి`అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవేడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కోన్సిన్ రాష్ట్రాల్లో రెండు పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. తాజా సమాచారాన్ని బట్టి ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం ఒక్క శాతం లేదా అంతకంటే తక్కువ. అన్ని రాష్ట్రాల్లోకి పెన్సిల్వేనియా రాష్ట్రానికి అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండటంతో అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో ఈ రాష్ట్రం కీలకపాత్ర పోషించనుంది. అంటే ఇక్కడ అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి దేశాధ్యక్షుడయ్యే అవకాశాలు అధికం.
2016కు ముందు పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలు డెమోక్రట్లకు కంచుకోటలు. 2016లో ట్రంప్ ఆగమనంతో ఈ రాష్ట్రాలు రిపబ్లికన్ల వైపు మొగ్గడం మొదలైంది. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు బైడెన్‌కు మద్దతిచ్చాయి. ఈ మద్దతును కమలాహారిస్ ఈసారి నిలబెట్టుకుంటారా లేదా అన్నది వేచిచూడాలి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో, బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాల్లో ట్రంప్`కమలాహారిస్‌ల మధ్య ఓట్ల వ్యత్యాసం రెండుశాతం కంటే తక్కువే ఉండటంతో, ఎవరు గెలుస్తారనేది అంచనాకు అందడం లేదు. 2016, 2020ల్లో పోల్ అంచనాలు ట్రంప్‌కున్న మద్దతును పసిగట్టడంలో విఫలమయ్యాయి.
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనాలు
పెన్సిల్వేనియాలో డోనాల్డ్ ట్రంప్ 41489 ఓట్ల అధిక్యాన్ని సాధిస్తారని, మిచిగాన్‌లో కమలాహారిస్ 23,948 ఓట్లు, విస్కాన్సిన్‌లో 29,024 ఓట్లు అధికంగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. ఉత్తర ప్రాంతానికి చెందిన పై మూడు రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా అధ్యక్షుడి ఎన్నికలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం వల్ల పెరుగుతున్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. గమనిస్తే 2016లో హిల్లరీ క్లింటన్ ఓటమికి ఈ నిరుద్యోగ అసంతృప్తే ప్రధాన కారణంగా ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది. అదేవిధంగా మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కమలా హారిస్ ఆధిక్యాన్ని పొందినా, గత ఎన్నికల్లో జోబైడెన్ స్థాయిలో మద్దతు పొందే పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఈసారి అమెరికా ఎన్నికలు 2024 తర్వాత దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను విధానాల కాలపరిమితి 2025తో ముగిసిపోనుండటంతో, నూతనంగా ఎన్నికయ్యే అధ్యక్షుడు కాంగ్రెస్‌తో కలిసి కొత్త ఆర్థిక విధానాలను రూపొందించాలి. ఈ నేపథ్యంలో ఆర్థిక, పారిశ్రామిక, ప్రభుత్వ ఖర్చులపై మరింత అర్థవంతమైన విధానాల రూపకల్పన చేసే అవకాశం కొత్తగా ఎన్నికలయ్యే శాసనకర్తలకు లభిస్తుంది. అందువల్ల ఈ ఎన్నికలు అమెరికా పరంగా ఎంతో కీలకం.
ట్రంప్ గెలిస్తే…
ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే, ప్రతినిధుల సభలో, సెనేట్‌లలో కూడా రిపబ్లికన్ల మెజారిటీ నిలబెట్టుకునే అవకాశముంది. అప్పుడు రిపబ్లికన్లు పూర్తిస్థాయి ప్రభుత్వ నియంత్రణ సాధించగలరు. అదే జరిగితే ట్రంప్ అధికారాన్ని ఉపయోగించి ఒక పక్క వలసలను పరిమితం చేస్తూ మరోపక్క చైనా, యూరోపియన్ యూనియన్, భారత్‌ల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు గణనీయంగా పెంచవచ్చు. ఈవిధమైన విధానాల్లో మార్పుల వల్ల 2027 బేస్ లైన్ ఆధారంగా జీడీపీ 0.6% పెరుగుతుందని అంచనా. 2017లో అప్పటి ట్రంప్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వ్యక్తిగత, కార్పొరేట్ పన్ను కోత విధానాలే కొనసాగవచ్చు.
కమలాహారిస్ గెలిస్తే…
డెమోక్రట్ అభ్యర్థి కమలాహారిస్, కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు అధికారంలోకి వస్తే, పన్నుల విధానాలు, సామాజిక ప్రయోజన కార్యక్రమా లకు ఊపునివ్వగలవు. డెమోక్రట్లు పేర్కొన్న అజెండా ప్రకారం మధ్య, దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కాగలదని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. రెండోసారి డెమోక్రట్లు అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగినప్పటికీ వీరి విధానాల వల్ల దీర్ఘకాలంలో ఇది వేగంగా పెరిగే అవకాశాలను నిరోధిస్తాయి. డెమోక్రట్లు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించడంవల్ల శిశు సంరక్షణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇది అధికమొత్తంలో మహిళలు ఈ రంగానికి చెందిన శ్రామిక మార్కెట్‌లో భాగస్వాములయ్యే వెసులుబాటు ఏర్పడుతుంది. కార్పొరేట్ టాక్స్‌లు పెంచి సామాజిక ప్రయోజనాలకు ఉపయోగించడం వల్ల, పన్ను భారం అధికంగా ఉన్నప్పటికీ రాబోయే పదేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థకు ఏవిధమైన ప్రమాదం వాటిల్లదని ఆక్స్‌ఫర్డ్ ఎకనా మిక్స్ పేర్కొంది.
చైనాపై టారిఫ్‌ల ప్రభావం
చైనా దిగుమతులపై పెంచిన పన్నులు ఈ ఏడాది ఆగస్ట్ 1నుంచి అమల్లో కి వచ్చాయి. అధ్యక్ష ఎన్నికల తర్వాత ఇటువంటి మరిన్ని పన్నుల పెంపు చర్యలు చేపట్టే అవకాశముంది. ఇప్పటికే విధించిన ఆంక్షల వల్ల అధికారికంగా చైనానుంచి 35% నుంచి 45% వరకు దిగుమతులు తగ్గిపోయాయి. అమెరికా 1పిపిటి (వన్ పార్ట్ పర్ ట్రిలియన్) టారిఫ్ పెంచితే దీర్ఘకాలంలో చైనా నుంచి దిగుమతులు 2.5% తగ్గిపోతాయి. నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (నాఫ్టా), ఆసియాకు చెందిన ఇతర దేశాలు ఇప్పుడు చైనా దిగుమతులు తగ్గిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేశాయి. దీనివల్ల చైనా దిగుమతుల నుంచి మరిన్ని రక్షణ విధానాలను అమెరికా అనుసరించే అవకాశాలే ఎక్కువ. ఇప్పుడు ఆమెరికా టారిఫ్‌లను తప్పించుకోవడానికి చైనా ఇతర మార్గాలను అన్వేషిస్తోంది. అంటే మూడో దేశం ద్వారా తన ఎగుమతులు కొనసాగించే యత్నాలు చేస్తోంది. విచిత్రమేమంటే పెంచిన టారిఫ్‌ల ద్వారా చైనాతో వాణిజ్య లోటును కొంతమేర తగ్గించుకున్నప్పటికీ, మొత్తం వాణిజ్యలోటు యథాతథంగా కొనసాగడం విశేషం. వాణిజ్య సం ఘర్షణలవల్ల యుఎస్ జీడీపీ 0.2% నుంచి 0.4% వరకు తగ్గిపోయే అవకాశముండగా, ధరలు 0.1% నుంచి 0.3% వరకు పెరుగుతాయని అంచనా.
రష్యా, చైనా, ఇరాన్‌లపై ఆరోపణలు
ఈ ఎన్నికల్లో రష్యా, చైనా, ఇరాన్‌లు కలుగజేసు కుంటున్నాయని యుఎస్ అధికారులు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మద్దతును దెబ్బతీయాలని ఈ దేశాలు ఇంటర్నెట్ సహయంతో ప్రయత్నిస్తున్నా యన్నది వారి ఆరోపణ. ముఖ్యంగా తైవాన్‌కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో, సోషల్ మీడియా ద్వారా చైనా, ట్రంప్‌కు మద్దతుగా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ గత ఏప్రిల్ 1న ఒక కథనాన్ని ప్రచురించింది. ‘స్పామోఫ్లాగ్’ (చైనా అనుకూల ప్రచారం) కార్యకలా పంలో భాగంగా చైనా ఈ దుశ్చర్యకు పాల్పడు తున్నదని యుఎస్ అధికారులు ఆరోపిస్తున్నారు. రష్యా కూడా బైడెన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నదనేది వారి ఆరోపణ. ముఖ్యంగా రష్యాతో యుద్ధంలో అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న నేపథ్యంలో రష్యా, ఇక్కడి ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసేందుకు యత్నిస్తుదని వారు చెబుతున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఒక కొలిక్కి రావాలంటే ట్రంప్ అధికారంలోకి రావడం అత్యవ సరమని రష్యా భావిస్తున్నదనేది వారి వాదన. ఇక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన కొన్ని కంపెనీలు ట్రంప్, బైడెన్, హారిస్‌ల ప్రచారాన్ని హ్యాక్ చేయడానికి యత్నిస్తున్నారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇరాన్ ప్రధానంగా తప్పుడు ప్రచారం చేస్తున్నది ట్రంప్‌కు వ్యతిరేకంగా! అయితే బైడెన్, హారిస్‌లపై ఆ స్థాయి వ్యతిరేక ప్రచారం లేదని అమెరికా అధికార్లు చెబుతున్నారు.
ఎన్నికల హింసపై ఆందోళన
ఈ ఏడాది ఎన్నికల హింసపై పలువురు మేధా వులు, నిఘాసంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంలోని దిగువ నుంచి పై స్థాయి వరకు ఎన్నికల సిబ్బందిపై దాడులు చేస్తామంటూ కొందరు భయభ్రాంతులను చేస్తుండడమే కారణం. అంతేకాదు తన రాజకీయ ప్రత్యర్థులను శిక్షిస్తా నంటూ ట్రంప్ పేర్కొంటుండటం రాజకీయ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. జులై 13, 2024న పెన్సిల్వేనియా లోని బట్లర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ట్రంప్‌పై థామస్ మ్యాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు ఏకంగా కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ట్రంప్ చెవికి గాయ మైంది. భద్రతాదళాలు ఈ యువకుడిని కాల్చి చంపి నప్పటికీ, ట్రంప్‌పై కాల్పులు జరపడానికి ప్రధాన కారణమేంటనేది తేలలేదు. ఒకపక్క తుపాకుల సంస్కృతిని యథేచ్ఛÛగా కొనసాగిస్తూ, హింసకు వ్యతిరేకంగా సుద్దులు చెప్పడంవల్ల ఏవిధమైన ప్రయోజనం ఉండబోదన్న సత్యం అమెరికా పెద్దలకు ఎప్పటికి అర్థమవుతుందో?