సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి శ్రావణ అమావాస్య – 26 సెప్టెంబర్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
‘ప్రభుత్వాలు వస్తాయి. ప్రభుత్వాలు పోతాయి. కానీ మహిళకు రక్షణ ఉండాలి. మహిళల మీద అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడాలి. అందుకు సంబంధించిన చట్టాలను మా ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది’ ఆగస్ట్ 25న ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట ఇది. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో జరిగిన లక్‌పతి దీదీ పథకం లబ్ధిదారులతో ముఖాముఖీ సంభాషించిన సందర్భంలో ఈ మాటలు చెప్పారాయన. ఆగస్ట్ 15న ఎర్రకోట మీద నుంచి ఇచ్చిన ఉపన్యాసంలో కూడా ప్రధాని ఈ అంశాలను లేవనెత్తడం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అవసరమే. ఈ ప్రకటనలకు ఉన్న నేపథ్యం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ వైద్యురాలిపై జరిగిన ఘాతుకం, మహారాష్ట్రలోనే బాద్లాపూర్‌లో చిన్నారులపై జరిగిన అత్యాచారం. మహిళలపై జరిగే అత్యాచారాల విషయంలో సత్వర స్పందన, విచారణ అత్యవసరమని ప్రధాని హెచ్చరించారు. మలయాళ సినిమా రంగంలో మీటూ ఆరోపణల మీద నివేదిక ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ భారతజాతి సిగ్గుతో తలదించుకోవలసిన అంశాలే.
తాను తీవ్ర క్షోభను అనుభవిస్తూ ఈ విషయాలను ప్రస్తావిస్తున్నానని ప్రధాని ఎర్రకోట మీద చెప్పడం ఆలోచించదగినది. దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి జాతి యావత్తు లోతుగా ఆలోచించాలని ఆయన కోరారు. లైంగిక అత్యాచారం ఒక స్త్రీ జీవితం మీద ఆ దుశ్చర్య ఎంతటి ఘోరాతి ఘోరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తాను ఊహించగలనని ఆయన అన్నారు. కొన్ని అంశాలు ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు. అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద చర్యలకు ఉపక్రమించడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదన్నారాయన. కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారంలో జరిగింది సరిగ్గా ఇదే. బాద్లాపూర్ బాలికలపై అత్యాచారం ఉదంతంలో కూడా పోలీసులు తీవ్రమైన జాప్యం చూపారని ప్రధాని నేరుగా ఆరోపించారు. పాత చట్టాల కాలంలో జాప్యం జరిగింది. నిజమే. ఇప్పుడు కూడా ఎందుకు జరగాలన్నదే ఆయన ప్రశ్న. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అలాంటి చట్టాలను మార్చింది. అంటే రాష్ట్రాలు, కింది స్థాయి రక్షణ సిబ్బందికి వాటి పట్ల అవగాహన, ఆసక్తి లేవు. ఒకవేళ బాధిత మహిళ లేదా మహిళలకు పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి ఇష్టం లేకపోతే ఈ`ఎఫ్‌ఐఆర్‌ను ఇంటి నుంచే దాఖలు చేసే వెసులుబాటు కల్పించిన సంగతిని కూడా ప్రధాని గుర్తు చేశారు. లైంగిక అత్యాచారాలకు భారత న్యాయ సంహిత ద్వారా మరణ దండన వరకు శిక్ష ఉన్న సంగతిని కూడా ప్రధాని ఈ సందర్భంలో పునరుద్ఘా టించడం అవసరమే. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ను జూనియర్ మహిళా డాక్టర్ అత్యాచారానికి బాధ్యురాలిగా నిలబెట్టినట్టే, మహారాష్ట్రలోని బీజేపీ`శివసేన` ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పు పట్టినట్టే.
మూడిరట ఒకవంతు మహిళలు భౌతిక, లైంగికహింసకు గురౌతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5వ నివేదిక వెల్లడిరచిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. గృహహింస 31.2 శాతం నుంచి 29.3 శాతానికి తగ్గినా 18`49 సంవత్సరాల వయసు కలిగిన మహిళలలో 30 శాతం భౌతిక హింసకు గురి అవుతూనే ఉన్నారని కూడా ఆ నివేదిక చెబుతోంది. మహిళా జనాభాలో 6 శాతం 15వ ఏట నుంచే లైంగిక వేధింపులకు గురి అవుతున్న చేదు వాస్తవాన్ని కూడా ఆ సర్వే వెల్లడిరచింది. నేషనల్ క్రైమ్ బ్యూరో రెండేళ్ల క్రితం వెల్లడిరచిన వివరాలు కూడా కలవర పెట్టేవిగానే ఉన్నాయి. ఆ ఒక్క సంవత్సరమే మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించి దేశంలో 4,45,256 కేసులు నమోదైనాయని బ్యూరో వెల్లడిరచింది. అంటే గంటకు 51 వంతున ఎఫ్‌ఐఆర్‌లు నమోద య్యాయి. పైగా వీటి సంఖ్య అంతకు ముందు రెండేళ్లలో నమోదైన వాటి కంటే ఎక్కువే. ఇవన్నీ ధైర్యంతోనో, తప్పని పరిస్థితులలోనో పోలీసు స్టేషన్‌ల వరకు వచ్చిన కేసులు. ఇంక బయటి ప్రపంచం దృష్టికి రాని కేసులు ఎన్ని ఉంటాయో ఊహించవచ్చు. విదేశీ మహిళలను కూడా పోకిరీలు వదిలి పెట్టడం లేదు.
మహిళల మీద నేరుగా అత్యాచారాలకు పాల్పడేవారి పశుత్వం ఒకటి. ఇలాంటి కేసుల పట్ల కొందరు వ్యక్తులు, కొన్ని వ్యవస్థలు, ఆఖరికి కొన్ని ప్రభుత్వాలు వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు మరొకటి. ఇది తీవ్ర ఆక్షేపణీయమే. ఇందుకు పరాకాష్ట పశ్చిమ బెంగాల్ ఉదంతమే. ఆ అభాగ్యు రాలిపై జరిగిన ఘోర నేరాన్ని కప్పి పుచ్చడానికి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇంత దారుణం జరిగింది. అంతకు ముందు సందేశ్‌ఖాలి ఉదంతంలోను బాధిత మహిళల పట్ల కాకుండా, నేరగాళ్ల వైపే ముఖ్యమంత్రి నిలబడడం జాతిని నిర్ఘాంత పరిచింది. ఇదిలా ఉంటే, కర్ ఆసుపత్రి దుర్ఘటన, వైద్యురాలిపై అత్యాచారం గురించి చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్ హేళనగా నవ్వడం క్షంతవ్యం కాదు. సాక్షాత్తు దేశ అత్యున్నత స్థానమే వేదికగా ఆ ప్రముఖ న్యాయవాది ఇలాంటి నైచ్యానికి పాల్పడ్డాడంటే ఆ వృత్తికే కళంకం. తన రాష్ట్రంలో, రాష్ట్ర రాజధానిలో జరిగిన అత్యాచారంలో సాక్ష్యాలు తుడిచి పెట్టడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్న ముఖ్యమంత్రి మహిళల రక్షణ మరింత పటిష్ట చట్టాలు తేవాలని ప్రధానికి లేఖ రాయడం హద్దులు లేని తెంపరితనం. రాయబరేలీ వెళ్లిన ఈ దేశ విపక్ష నేత కోల్‌కతా అత్యాచారం గురించి మాట్లాడడానికే నిరాకరించడం మహా నేరం. మిగిలిన విపక్షాలు కూడా తక్కువ తినలేదు. కర్ ఆసుపత్రి అత్యాచారం ఘటనతో మమత ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయంటూ ఏ రాజకీయ, సామాజిక విలువలూ లేని అఖిలేశ్ యాదవ్ వంటి నేతలు మాట్లాడడం జుగుప్పాకరం కాదా! బీజేపీ రాష్ట్రాలలో జరిగే అత్యాచారాల పట్ల నోరు పారేసుకోవడానికి అత్యుత్సాహం చూపించే ఈ కిరాయి మూకలు, పశ్చిమ బెంగాల్ వంటి బీజేపీయేతర రాష్ట్రాలలో జరిగే అత్యాచారాల పట్ల మౌనం వహిస్తున్నాయి. ఇది అసలు నేరం కంటే పెద్ద నేరం.