–  ఆరవల్లి జగన్నాథ స్వామి

వినాయకుడు ఆధ్యాత్మిక, సామాజిక, విజ్ఞానాత్మక, ఆరోగ్యాది అంశాల సమాహారం. ఆయన ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి సంపదతో ఆయనను అర్చిస్తే, సకల కార్యాలు నెరవేరుతాయని ఆస్తికుల/భక్తుల విశ్వాసం. ‘స్వామి కార్యం… స్వకార్యం’ అనే నానుడికి వినాయక చతుర్థి పండుగను ప్రథమోదాహరణగా చెప్పవచ్చు. ఆయనకు ఇష్టమైన పుష్పపత్రాలతో అర్చిస్తూ, ఆయన మెచ్చిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తున్నామన్న భావనతో పాటు వాటి వెనుక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయన్నది విస్మరించరానిది. ఆయనకు జరిగే అర్చన నుంచి నైవేద్యం వరకు అన్నీ ప్రకృతి సంబంధిత వస్తువులు, పదార్థాలే. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య రహస్యాలు దీనికి నేపథ్యంగా భావించవచ్చు.

వినాయకుడు అంటే ప్రకృతి. భూమిని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుంటే అవి, మనలను కాపాడతాయన్నది ఈ పర్వదినం అందించే సందేశం. పతంజలి యోగశాస్త్రపరంగా, పృథ్వీ తత్త్వం గల మూలాధార చక్రానికి గణనాథుడే అధిష్ఠాన దైవం. మట్టి వినాయకుడిని పూజించా లనడంలోని రహస్యమిదేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. మట్టితో చేసిన ప్రతిమను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని గణేశ పురాణం చెబుతోంది. ‘మృత్తిక (మట్టి) సృష్టి, స్థితి, లయాలకు ప్రతీక. వినాయకుని ప్రతిమ తయారీకి అదే శ్రేష్ఠం. వినాయకోత్పత్తి కథనం ప్రకారం, ఆయన పుట్టుకకు ప్రకృతి సిద్ధ పదార్ధమే మూలం. జగన్మాత పార్వతి మంగళ స్నానం ఆచరిస్తూ, నలుగుపిండితో తయారు చేసిన బొమ్మకు ప్రాణం పోసింది.

ఏక విశంతి అర్చన విశిష్టత

గణనాథుడు విష్ణు రూపాంతరమని, శివపార్వ తుల తనయుడిగా జన్మించడం వల్ల శివ, విష్ణు తత్త్వాల సంగమమని చెబుతారు. విశ్వనిర్వహణ సజావుగా సాగేందుకు త్రిమూర్త్యాది దేవతలు ఆయనను అర్చిస్తారని శివపురాణం, అష్ట దిక్కులకు వ్యాపించిన శిష్ట జన రక్షకుడని ముద్గల పురాణం పేర్కొంటున్నాయి. వినాయకచవితిని పంచాయతన విధానంలో (విష్ణువు, శివుడు, శక్తి, సూర్యుడు, వినాయకుడు… పూజా సంప్రదాయాలను పంచయ తన విధానమంటారు) జరుపుకుంటారు. శ్రీమహా విష్ణువు ధరించిన ప్రధాన అవతారాలు పదికాగా, మహేశ్వరుడి రూపాలు పదకొండు. మరో వివరణ ప్రకారం, పంచేద్రియాలు, జ్ఞానేంద్రియాలు పది, ప్రవృత్తి, నివృత్తి కలిపితే 21 అవుతాయి. వెరసి ఇరవై ఒక్క పత్రాలతో (ఏక వింశతి) హరిహర అభేదంతో వినాయకుడిని కొలుస్తారు.

‘శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని పెద్దల మాట. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ధర్మసాధన సాధ్యమవుతుంది. ఈ దృష్టితోనే అందుకు ప్రత్యేక చర్యలు అవసరంలేకుండానే మన ఆచార సంప్ర దాయాలలో వాటిని ఇమిడ్చి నిర్ధారించారు. మన ప్రతి పండుగ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వినాయక చవితి నాడు నిర్వహించే వ్రతంలో ఏకవింశతి పత్రపూజ, సమర్పిస్తున్న నైవేద్యాలలో ఆరోగ్య రహస్యాలు ఉన్నట్లు ఆధ్యాత్మిక, వైద్య గ్రంథాలు సూచిస్తున్నాయి. సూర్యరశ్మి, పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉండే సమయంలో ఈ పండుగ (భాద్రపద శుద్ధ చవితి) వస్తుంది. ఆ కాలంలో సూక్ష్మక్రిములు స్వైర విహారంతో మనిషి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. ఈ పండుగ పేరుతో రకరకాల ఆకులు సేకరించి గణనాథుని అర్చించేటప్పుడు ఆయా పత్రాల స్పర్శ, వాటి నుంచి వెలువడే సువాసన కొంత మేలు చేస్తుంది. కనుక, వినాయక పూజకు పత్ర సేకరణ మొక్కుబడిలా కాకుండా నిబద్ధతతో కూడి ఉండాలి.

 వినాయకుడి ‘సర్వాణ్యంగాని పూజయామి’ అంటూ ఇరవై ఒక్క (ఏక విశంతి) రకాల ఆకులతో ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ అర్చిస్తారు. మాచీ పత్రం (దవనం), బృహతీపత్రం (నేలమునగ), బిల్వ (మారేడు), దూర్వారయుగ్మం (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరీ పత్రం(రేగు), అపామార్గ పత్రం (ఉత్తరేణి), కశ్యపాయ పత్రం (తులసీ), చూతపత్రం (మామిడి), కరవీర పత్రం(ఎర్ర గన్నేరు), విష్ణుక్రాంత పత్రం(అవిసె), దాడిమీ పత్రం (దానిమ్మ), దేవదారు పత్రం, మరువక పత్రం, సిందూర (వావిలాకు), జాజి పత్రం, గండకీ/గానకి పత్రం (సీతాఫలం, కామంచి), శమీ పత్రం (జమ్మి), అశ్వత్థ పత్రం (రావి), అర్జున పత్రం(తెల్ల మద్ది), అర్క పత్రం (జిల్లేడు)…. అన్నీ ఓషధీ గుణాలు కలిగినవే. వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ప్రకృతి వైద్యం చెబుతోంది. మనం పూజ చేసే ఆకుల పరిమ ళాలతో (సువాసన) శ్వాసకోశ వ్యాధులు నయమవు తాయని, ఈ పత్రాలు ఎన్నో రకాల రుగ్మతలను నివారిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ పత్రా లతో స్వామిని తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం పూజి స్తారు. చవితిముందు రోజు నిర్వహించే గౌరిదేవి (తదియ గౌరి)వ్రతంలో ఉయోగించే పదహారు రకాల ఆకులలో ‘అపామార్గ’ (ఉత్తరేణి) ముఖ్యమైనది. ఇలా పూజల పేరుతో ఏడాదికి ఒకసారైనా వివిధ ఆకులు తాకే అవకాశం కలుగుతుందనే కాబోలు పూర్వికులు ఇలాంటి సంప్రదాయాలను ప్రవేశపెట్టి ఉంటారు.

 చిడుము, సర్పి వంటి వ్యాధులకు గరికతోనే మంత్రం వేస్తారు. పత్రిని ఆధ్యాత్మికంగా గణనాథుని పూజకు వినియోగించినా, అవి మానవులకు ఆరోగ్య దాయకం కూడా. ఉదాహరణకు, అరటి భోజనం జీర్ణ ప్రక్రియలో ఒక భాగమని వైద్య నిపుణులు చెబుతారు. అలాగే మృష్టాన్న భోజనం తరువాత తాంబూలం పేరుతో తమలపాకు సేవనం జీర్ణప్రక్రి యకు ఉపకరిస్తుంది. ఉబ్బసం, దగ్గులాంటి వాటి నివారణకు తమలపాకు, సంతనాపేక్షపరులు అశ్వత్థ (రావి) చెట్టుకు ప్రదక్షిణ, సౌందర్య పోషణకు కలబంద, మునగ వాపుల నివారణకు వావిలాకు. పల్లెల్లో పొంగు, ఆటలమ్మలకు వేపాకుతో వైద్యం చేయడం నేటికీ ఉంది. ఇలా ప్రతి పత్రంలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

 ఆరోగ్యప్రద నైవేద్యాలు

దేవుడికి నైవేద్యం పేరిట చేసే పదార్థాలన్నీ మనిషి భుజించేందుకే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు శాస్త్రం, ఇటు ఆరోగ్యం అన్నట్లు గణపతి నవరాత్రుల సందర్భంగా రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేశారు. రుతువులను బట్టి ఆహారపు అలవాట్లు ఉండా లంటారు. మానవ గణానికి గణపతి ఇచ్చిన సందేశం ఇదే. ఈ వర్షరుతువులో ఆకలితో పాటు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కనుక ఆహారంలో ఉప్పు, కారం, తీపి తగ్గించి తీసుకోవాలి. నూనె పదార్ధాల కంటే ఆవిరిపై ఉడికించిన ఉండ్రాళ్లు వంటి పదార్థాలు అందుకు ఉదాహరణ. మోదకాలు (ఉండ్రాళ్లు) ఆయనకు ఇష్టమని చెప్పడం వెనుక మనుషుల ఆరోగ్య పరిరక్షణ దృష్టి కూడా ఉంది. ఆవిరిపై ఉడికిన ఉండ్రాళ్లు పోషక విలువలు కలిగి, సులభంగా జీర్ణమై.. బలం, వీర్యపుష్టిని సమకూరు స్తాయి. మేహపిత్తాది దోషాలను నివారిస్తాయని చెబుతారు. గణపతి పాశం, అంకుశంతో పాటు మోదకాన్ని ధరించి ఉంటాడు. పాశంతో భక్తులను ఆకర్షించి తన దైవప్రేమతో బంధిస్తాడని, అంకు శంతో భక్తులలోని అజ్ఞానం, దుశ్చింతలు, దుర్గుణా లను పోగొడతాడని,కోరినవన్నీ అనుగ్రహి స్తాననడం మోదకానికి గుర్తు అని, ఇక నాలుగవ చేతిలోని అభయ ముద్ర సర్వభయాలను పారదోలతా ననే భరోసాగా ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు విశ్లేషి స్తారు.

 అలాగే, మరో నైవేద్యం బెల్లం, నువ్వులతో తయారు చేసిన చిమ్మిలి. బెల్లం జీర్ణశక్తిని కలిగించి వాత పిత్త రోగాలను నివారించే గుణాలు ఉండగా, నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగించి, నేత్ర వ్యాధులను నివారించి, శరీర దారుఢ్యానికి సహకరి స్తుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

గణనాథుడి నిమజ్జనం

గణనాథుడు జలరూపుడు. అందుకే భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి నవరాత్రోత్సవాలు నిర్వహించి, ప్రతిమలను జల నిమజ్జనం చేస్తారు. ఆ సందర్భంగా వదిలిన ఓషధ గుణాలు గల పత్రి కారణంగా కొత్తగా చేరిన నీటిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయని వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. ఇతర జలవనరులు సంగతి ఎలా ఉన్నా ఆ కాలంలో చెరువులే తాగునీటికి ప్రధాన వనరులుగా ఉండేవి. ఇలాంటి ఓషధి పత్రితో ఆ నీరు శుద్ధి అయ్యే అవకాశం ఉంది. జల నిమజ్జనం సంప్రదాయకంగా వస్తున్నా కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా గ్రామాలలో తోటలు, ఉద్యానవనాలలో మొక్కలు, చెట్ల మొదళ్లలో ప్రతిమలను ఉంచుతారు. అవి వర్షాలకు కరిగి, ఎరువుగా మారి మొక్కల ఎదుగుదలకు ఉపకరిస్తాయి.

చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ పండగంటే అందరికీ ఆనందమే. ‘సరస్వతీ నమస్తుభ్యం….’ అని వాణీదేవికి ప్రణమిల్లి అక్షరాభ్యాసం చేసిన తరువాత గణనాథుడి అనుగ్రహంతో జ్ఞానసముపార్జన చేస్తారు. వినాయక చవితి సామాజిక జీవనానికి ప్రతీకగా నిలుస్తుంది. పత్రి సేకరణ, పూజాద్రవ్యాలు సమ కూర్చడంలో పిల్లల భాగస్వామ్యం ఉండేది. వ్రతం కోసం కొందరు పూవులు తెస్తే, శారీరక దారుఢ్యం గలవారు వెలగ తదితర చెట్లు ఎక్కి కాయలు పండ్లు లాంటివి కోసి తెచ్చేవారు. ఇప్పుడంటే రకరకాల వస్తువుతో రూపొందే గణపతి ప్రతమలు విఫణిలో కనిపిస్తు న్నాయి కానీ, ఒకనాడు అవి గ్రామీణ వృత్తులలో భాగం. మట్టికి కుంభాకారుడు, పాలవెల్లికి వడ్రంగి, ఫలపుష్పాదులకు వ్యవసాయదారుడు… ఇలా గ్రామీణ వృత్తులను ఆచరణ పూర్వకంగా తెలుసుకునే అవకాశం భావి పౌరులకు ఉండేది.


 కాటన్‌ కానుక

గణనాథుడు కేవలం భారతదేశానికి, హిందూమతానికే పరిమితం కాదు. అన్య మతస్థులకు, వారి విశ్వాసాలకూ ఆరాధ్యుడు. అపరభగీరథుడుగా మన్ననలు అందుకుంటున్న కాటన్‌దొర కూడా వినాయకుడి ఆశీస్సులకు పాత్రుడయ్యాడు. గోదావరిపై ఆనకట్ట నిర్మాణంలో ఆదిలోనే అవాంతరం ఎదురుకావడంతో పాటు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. రాజమహేంద్రవరం నాళంవారి వీధిలోని సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి, మొక్కుకుంటే వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు తీరిపోతాయన్న హితులు సలహాతో ఆయన ఆలయాన్ని దర్శించుకున్నాడు. ఆనకట్ట సకాలంలో, సజావుగా పూర్తయితే స్వామి వారికి జేగంట కానుకగా సమర్పిస్తానని సంకల్పం చెప్పుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆనకట్ట నిర్మాణం పూర్తి, కృష్ణానది కాలువ పనులు త్వరితగతిన సాగడంతో, కాటన్‌ దొర లండన్‌ నుంచి గంటను తెప్పించి వినాయక స్వామికి సమర్పించాడు.


గరిక ప్రియుడు

గణనాయకుడికి గరిక అత్యంత ప్రీతిపాత్రం. గరికను ‘దేవి’ అంటారు. ఇది బుద్ధిపై పనిచేస్తుంది కనుక జ్ఞానప్రధానమైనదిగా చెబుతారు. లోక పీడితుడు అనలాసురుడి (అనలం అంటే అగ్ని) బాధలు భరించలేక దేవతలు గణనాథు డికి మొరపెట్టుకున్నారు. దాంతో ఆయన ఆ అసురుడిని మింగేశాడు. అయితే, విపరీత తాపం కలిగింది. ఆ వేడిని చల్లార్చేందుకు దేవతలు సకల ప్రయ త్నాలు చేశారు. ఫలితం కనిపించలేదు. శివుడు గరిక (దూర్వా)ను కుమారుడి శిరస్సుపై ఉంచడంతో తాపం తగ్గింది. అలా గణపతికి, గరికకు బంధం కుదిరింది. దానిపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. లోకంలో ఎవరినైనా తీసేసినట్లు మాట్లాడే సందర్భంలో గడ్డిపోచతో పోలుస్తారు. అయితే, సృష్టిలో అల్పమైనదే ఏదీ లేదని చెప్పడమే ఈ ఇష్టంలోని ఆంతర్యం. ఆయనను దూర్వార యుగ్మంతో అర్చిస్తే, సత్వరం ప్రసన్నుడవుతాడని విశ్వసిస్తారు.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE