– డి. అరుణ

అది 1984, అక్టోబర్‌ 31… ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు ప్రతీకారంగా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు ఆమె నివాసంలో కాల్చి చంపారు. ఈ వార్త బయటకు వచ్చిన మర్నాటి నుంచి నాలుగు రోజులపాటు దేశ రాజధాని సహా దేశవ్యాప్తంగా సిక్కుల హననం ప్రారంభమైంది. డైరెక్ట్‌ యాక్షన్‌ డే తరహాలో జరిగిన ఆ బీభత్సకాండకు నాయకత్వం వహించింది కాంగ్రెస్‌ నాయకులన్నది జగమెరిగిన సత్యం. కొన్ని వేలమంది సిక్కులను అత్యంత క్రూరంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు హతం చేయగా, వేలమంది నిర్వాసితులయ్యారు. కట్‌ చేస్తే, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇందిరాగాంధీ మనుమడు రాహుల్‌ ఈ మచ్చను చెరిపివేసేందుకు విదేశీ గడ్డ మీద సిక్కులపై అపరిమిత ప్రేమ కురిపించాడు. తొలిసారి మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌గా ఒక్క సిక్కుని నియమించిన, ఇద్దరు సిక్కు కేబినెట్‌ మంత్రులను కలిగిన బీజేపీ ప్రభుత్వ పాలనలో సిక్కులకు దేశంలో తలపాగా ధరించి, ధైర్యంగా తమ గురుద్వారాకు వెళ్లే హక్కు కూడా లేకుండా పోతోందంటూ నిర్భయంగా, నిర్భావంగా అసత్యాలను ప్రవచించాడు. దేశ విభజనకు కారణమైన జిన్నా, ‘విభజిత భారతమైనా ఉండాలి లేదా విధ్వంసమైన భారతదేశమైనా ఉండాల’న్న మాటలకు అనుగుణంగా విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ రాహుల్‌ ఈ రీతిలో మాట్లాడడం, ప్రవర్తించడం ప్రమాదకరం, విషాదకరం.


మొన్న మొన్నటివరకూ, ప్రమాదకరం కాని ‘పప్పు’గా అందరూ ముద్దుగా పిలుచుకున్న రాహుల్‌ గాంధీ నూతన జిన్నాగా అవతరించడం దేశ హితం కోరేవారందరికీ ఆందోళన కలిగించే విషయం. పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌పార్టీ విద్రోహం చేసైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుం టోందన్నది ఈ మాటలతో, యత్నాలతో తేటతెల్లం అవుతోంది.

ఇంతకీ ఏమన్నాడు రాహుల్‌ ?

ప్రధాని మోదీ ఈ నెలలో అమెరికాలో జరుగనున్న ఐరాస సమావేశానికి హాజరవుతారని వార్తలు వచ్చిన వెంటనే రాహుల్‌ అమెరికా పర్యటన నిర్ణయమైంది. ప్రధాని కన్నా ముందే ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ వర్జీనియాలోని హెర్న్‌డాన్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్‌, భారత దేశంలో మత స్వేచ్ఛ గురించి, ముఖ్యంగా సిక్కుల స్వేచ్ఛ గురించి మాట్లాడి రాజకీయ వివాదం సృష్టించాడు. సభలో ఉన్న సిక్కు యువకుడిని లేపి, ‘‘ముందు అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఉపరితలంలో రాజకీయాంశంలా అనిపించ వచ్చు. నీ పేరేంటన్నావ్‌? అతడు ఒక సిక్కుగా, భారతదేశంలో తలపాగా ధరించేందుకు అనుమతి స్తారా లేదా, కడా (చేతి కడియం) ధరించేందుకు, లేదా గురుద్వారాకు హాజరయ్యేందుకు అనుమతిస్తారా అన్నదే ఈ పోరాటం. ఇందుకోసమే ఈ పోరాటం, ఇది అతడి ఆవలకు, అన్ని మతాలకు వ్యాపిస్తుంది,’’ అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక్కడ చెప్పుకోవలసిన విషయమేమిటంటే, ఆ యువకుడు మరురోజే తాను ఇటీవలే భారతదేశం నుంచి తిరిగి వచ్చానని, తనకు అటువంటి సమస్య లేమీ ఎదురుకాలేదని, తనను పిలిచి, నిలబెట్టి బలిపశువును చేశారని వ్యాఖ్యానిస్తూ ఒక వీడియో చేసి, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం కొసమెరుపు.

కాగా, తీవ్రవాది, ఖలిస్తానీ వేర్పాటువాద నేతగా చెప్పుకునే గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మాత్రం రాహుల్‌ వ్యాఖ్యలను ఆహ్వానించడమే కాదు, తాము ఇంతకాలం చెప్తున్న విషయం ఇదేనంటూ వ్యాఖ్యానించి, రాహుల్‌ తమవాడేనన్న విషయాన్ని స్పష్టం చేశాడు.

అసలు వాస్తవమేమిటి?

భారతదేశంలో సిక్కుమతం గురించి రాహుల్‌ అవగాహనా లేమిని ఈ వ్యాఖ్యలు బయటపెట్టడమే కాదు అత్యంత ప్రమాదకరమైనవి కూడా. ఎందుకంటే, హిందూ మత గర్భం నుంచి ఎటువంటి వైషమ్యాలూ లేకుండా ఉద్భవించిందే సిక్కుమతం. వాయవ్య ప్రాంతంలోని హిందూ కుటుంబాలు తమ ఒక కుమారుడిని ‘సిక్కు పంథా’లో చేరేందుకు అనుమతించి, తాము మాత్రం హిందువులుగా కొనసాగారు. అలా సిక్కులుగా మారిన వారందరూ ధర్మాన్ని కాపాడేందుకు పోరాడినవారే. హిందూ` సిక్కుల మధ్య సంబంధాలు భాగస్వామ్యంతో కూడినవి, సహపంక్తి భోజనాలు, ఇరువర్గాల మధ్య వివాహాలను ప్రోత్సహించినవే. కనుక, వారు హిందువులను తమలో ఒకరిగా చూస్తారే తప్ప పరాయివారిగా కాదు.

లక్ష్యం దేశ ప్రతిష్ఠను మసకబార్చడమే

చిత్రమేమిటంటే, మైనార్టీలు భూములను కబ్జాలు చేసుకుని, హిందువుల, జైన ఆలయాలను కూలదోసి ఎక్కడబడితే అక్కడ మసీదులు నిర్మించుకునే భారతదేశంలో మత స్వేచ్ఛ గురించి అమెరికాలో ప్రస్తావించడం ద్వారా మోదీ ప్రభుత్వాన్ని, దేశ ప్రతిష్ఠను మసకబార్చాలన్నదే లక్ష్యంగా రాహుల్‌ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. పైగా, ఈ మైనార్టీలను ‘ఆర్ధిక సంస్కర్తలు’గా కీర్తిస్తూ, వర్తమానంలో దేశం ఇంతటి గొప్ప బహుళత్వాన్ని వ్యతిరేకించడమంటే, వైదిక విశ్వాసాల సారమైన తరతరాలుగా వస్తున్న బహుళత్వాన్ని, పరమత సహనాన్ని అవమానించడమే నంటూ ప్రకటించడం దేశ సంస్కృతి గూర్చిన అతడి అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది.

సిక్కులను పరికరంగా చేసుకుని దుష్ప్రచారం

బీజేపీకి వ్యతిరేకంగా తన దుష్ప్రచారానికి సిక్కులను ఒక పరికరంగా చేసుకోవడం అత్యంత విషాదకరం. ఇందిర హత్యానంతరం ప్రధాని అయిన రాజీవ్‌ గాంధీ దృష్టికి జరుగుతున్న ఈ దాడుల అంశాన్ని తీసుకువచ్చినప్పుడు, ‘ఒక పెద్ద వృక్షం కూలినప్పుడు భూమి కంపించడం సహజమే’ అంటూ తన మనసులో విషాన్ని వెళ్లగక్కిన విషయాన్ని ఎవరూ మరువలేదు. అందుకే, తమపై దాడులు పునరావృత మవుతాయేమోనన్న భయంతో ఆ సమయంలో మాత్రమే అనుక్షణం సిక్కులు వణికిపోయారు. అంతగా మొగలులకు కూడా సిక్కులు భయపడలేదని చరిత్ర చెప్తుంది. అంతటి పోరాటయోధులైన సిక్కులపై అమానవీయ దాడులు, హననానికి నాయకత్వం వహించిన జగదీష్‌ టైట్లర్‌ వంటి పలువురు కాంగ్రెస్‌ నాయకులను పార్టీ తర్వాత ఎంపీలను, మంత్రులను కూడా చేసింది. దాదాపు మూడువేలమందికి పైగా సిక్కులు ఈ అమానవీయ దాడులలో మరణించారని ప్రభుత్వ గణాంకాలు. ఈ లెక్కల్లోకి రానివారు ఎంతమందో చెప్పలేం. ఢల్లీిలో ఉన్న ‘విధవా కాలనీ’ ఈ అమానవీయతకు చిహ్నమే. అక్కడ నివసిస్తున్న మహిళలను అడిగితే చెప్తారు ఎవరు ఏమిటనే సత్యాన్ని.

1984లో తలపాగా ధరించడం మానిన సిక్కులు?

ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు, ముఖ్యంగా ఉత్తర భారతంలో ఉన్నవారు అనేకులు అజ్ఞాతంలోకి వెళ్లగా, అనేకమంది పురుషులు సిక్కుమతంలో నిషేధితమైనప్పటికీ గుండు చేయించు కున్నారు. రక్తదాహంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న అల్లరి మూకల నుంచి తమను తాము కాపాడు కునేందుకు, సిక్కులుగా గుర్తింపబడకుండా ఉండేందుకు అనేకమంది సిక్కులు తమ విశ్వాసాన్ని వదిలి, తలపాగాలను తొలిగించి, జుత్తును కత్తిరించు కోవడమో, గుండు చేయించుకోవడమో జరిగింది. ఈ విషయాలేవీ రాహుల్‌ గాంధీ తెలుసుకోలేదా, లేక కావాలనే విస్మరిస్తున్నారా అన్నదే ప్రశ్న.

నేటికీ నిర్లజ్జగా తిరుగుతున్న నిందితులు

సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన సామూహిక హననంలో జోక్యం గల అనేకమంది కాంగ్రెస్‌ నాయకుల్లో సజ్జన్‌ కుమార్‌ కూడా ఒకరు. అతడిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ, బహుమానంగా కాంగ్రెస్‌ పార్టీ 1991 ఎన్నికలలో పోటీ చేసేందుకు టిక్కెట్టు ఇవ్వడం, అతడు గెలవడం జరిగిపోయాయి. అతడు 2004లో ఔటర్‌ ఢల్లీి సీటు నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచాడు. సంజయ్‌ గాంధీ అనుచరుడైన అతడు 2005లో పట్టణాభివృద్ధి కమిటీలో, ఎంపీలాడ్స్‌ పధకంపై కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.

ఢల్లీిలోని సరస్వతీ విహార్‌కు చెందిన తండ్రి, కొడుకులను సజీవ దహనం చేసిన ఘటనలో ఆ మాజీ ఎంపీపై ప్రధాన నిందితుడిగా హత్య కేసు ఉన్నది. సజ్జన్‌ కుమార్‌ రెచ్చగొట్టడంతో అల్లరి మూకలు ఆ కుటుంబంలో పురుషులను హత్య చేయడం, ఇతర సభ్యులను, వారి బంధువులను గాయపరచారు. కోర్టులు కూడా అతడు ఈ అల్లరి మూకలకు నాయకత్వం వహించాడన టానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని అభిప్రాయ పడ్డాయి. ఎట్టకేలకు, 2018లో అతడు అరెస్టు అయ్యాడు. 2023లో ఒక కేసులో కోర్టు అతడిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించినా, మరొక కేసులో నిందితుడు కావడంతో జైలులోనే కొనసాగుతున్నాడు.

ఎన్డీయే నియమించిన నానావతి కమిషన్‌

ఇంత జరిగినప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఒక్క కమిషన్‌ను కూడా నియమించలేక పోయాయి. మే 2000వ సంవత్సరంలో నాటి ఎన్డీయే ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జి.టి.నానావతితో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ అల్లర్లను నిలవరించే పరిస్థితి నాడు ఉందా అని నిర్ధారించేందుకు, అధికారుల అలసత్వం పై విచారణకు, బాధితులకు న్యాయం చేసేందుకు సూచనలను చేయడం దీని విధులు. ఐదేళ్ల తర్వాత కమిషన్‌ ఫిబ్రవరి 2005లో తన నివేదికను సమర్పించింది. 1984 అక్టోబర్‌ 31, నవంబర్‌ 5 మధ్య ఒక్క ఢల్లీిలోనే 2,733 సిక్కులు మరణించారన్నది అధికారిక అంచనా అని, అత్యధిక హత్యలు నవంబర్‌ 1`2వ తేదీలలో జరిగాయని పేర్కొంది. అనేక ప్రాంతాలలో బయటివారు కూడా ఈ అల్లర్లలో పాల్గొన్నారని, ఆ సమయంలో కేంద్ర కేబినెట్‌లో సభ్యుడిగా ఉన్న జగదీష్‌ టైట్లర్‌ సిక్కులపై దాడులు జరిపించారనేది కమిషన్‌ విశ్వసనీయ సాక్ష్యాలను కనుగొంది. తదుపరి చర్యలు తీసుకోవలసిందిగా నాటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కమిషన్‌ కోరింది. ఈ నివేదిక ప్రచురితమైన వెంటనే టైట్లర్‌ రాజీనామా చేయడమే అతడికి కాంగ్రెస్‌ విధించిన శిక్షగా మనం భావించాలి. ఎందుకంటే, అంతకు మించిన పెద్ద శిక్షలు అతడికి పడలేదు.

సిక్కులపై ప్రేమ అబద్ధమే

2009 నాటికి రాహుల్‌ గాంధీ ఎంపీగా సీనియారిటీని సంపాదించాడు. అతడు కనీసం నానావతి కమిషన్‌ నివేదికను చదివి ఉన్నా నేడు అతడు ఈ మాటలను పలికేవాడు కాదు. ఎందుకంటే, నివేదిక వచ్చిన నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ 2009లో జగదీష్‌ టైట్లర్‌కు టిక్కెట్టు ఇచ్చి, పౌర విమానయానశాఖ మంత్రిని తర్వాత కార్మిక విభాగానికి మంత్రిని చేసింది. అప్పుడు సిక్కుల బాధ రాహుల్‌కు ఎందుకు గుర్తురాలేదో అతడికి, అతడి పార్టీకే తెలియాలి. ఆఖరుకు రాహుల్‌ ఘనంగా చేపట్టిన ‘భారత్‌ (తో)జోడో యాత్ర’ ఏర్పాట్ల కోసం ఢల్లీి శాఖ నిర్వహించిన సమావేశంలో కూడా టైట్లర్‌ పాల్గొన్నాడు, ఢల్లీి మునిసిపల్‌ ఎన్నికలకు పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఆ నిందితుడిపై రాహుల్‌ అభిప్రాయం ఏమిటి?

ఏనాడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయని కాంగ్రెస్‌

ఇంత జరిగినా, ఇన్ని ఆధారాలు లభించినా, హంతకులు నిర్భయంగా, నిర్లజ్జగా బయటే తిరుగుతున్నా కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ 1984 దుర్ఘటనల పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదు. సిక్కులపై అమెరికాలో ఇంత ప్రేమ కురిపించి, తీవ్రవాది అయిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ నుంచి శభాషీలు అందుకున్న రాహుల్‌, తన తండ్రి పాలనలో సిక్కులు కాంగ్రెస్‌ నాయకుల దాడులకు భయపడి తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి భయపడిన విషయం గురించి ఒక్క మాట మాట్లాడక పోవడం అతడి అసుర స్వభావానికి అద్దంపడుతోంది.

గురువింద గింజ రాహుల్‌

తన దుష్ప్రచారంలోకి సిక్కులను ఈడ్చే ముందు, రాహుల్‌ గాంధీ సిక్కులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ పాల్పడిన హింసకు సంబంధించిన చరిత్రను తెలుసుకోనుండవలసింది. మోదీ ప్రభుత్వం కింద సిక్కులకే కాదు చట్టానికి కట్టుబడి ఉన్న మైనార్టీలు ఎవరికీ ఏ సమస్యా రావడం లేదు. ఈ విషయాలన్నీ దాచిపెట్టి తన దేశ విద్రోహ కార్యకలాపాలకు సిక్కులను వాడుకుంటే, వారు క్షమిస్తారనుకోవడం భ్రమే. ఎందుకంటే, రాహుల్‌ గాంధీ ప్రకటన వెలువడినప్పటి నుంచీ సిక్కులు అతడికి గతాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు.

చెప్పే మాటలకు, వాస్తవానికీ మధ్య అంతరం

రాహుల్‌ గాంధీ చేస్తున్న ప్రకటనలకూ, అతడు వాస్తవంగా చేస్తున్న పనులకూ మధ్య అంతరం తీవ్రంగా పెరిగిపోతున్నదని, అతడిని పరిశీలించే వారికి ఎవరికైనా అర్థం అయిపోతుంది. అది అతడికి విషయాల పట్ల అవగాహనా లేమి వల్ల జరుగు తున్నదా లేక కావాలనే ‘ఎక్కడికెయ్యది అవసరమో’ అన్నట్టుగా మాట్లాడుతున్న మాటలా? మిడిమిడి జ్ఞానం వల్ల ఏర్పడే అవగాహనారాహిత్యం, దానికి దురహంకారం, దురాశ తోడైనప్పుడే ఇటువంటి ప్రకటనలు వెలువడుతుంటాయి. భారత దేశంలో బహుళ భావనలు ఉనికిలో ఉన్నప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్‌కు భారత్‌ గురించి ఒకటే భావన ఉందంటూ విమర్శించాడు. ఒకవేళ తాను అన్న మాటలపై తనకు నమ్మకం ఉంటే, ఇంత భిన్నమైన అల్లికలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుందనుకోవాలే తప్ప దాన్ని కూకటివేళ్లతో పెకలించాలని అనుకోకూడదు కదా?

అంతేకాదు, ఒకవైపు సంఘం ఇటీవలి సంవత్సరాలలో ముస్లింలు, క్రైస్తవులను చేరుకోవ డానికి తీవ్రంగా ప్రయత్నించిన విషయంపై ముసుగేసి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇతర మతాలను తక్కువగా చూస్తుందంటూ ఆరోపణలు చేశాడు. నిజానికి బీజేపీకి ఓట్లు వేస్తున్నవారిలో అనేకమంది ఇంతగా మైనార్టీలను బుజ్జగించడం, హిందువుల ప్రయోజ నాలకు విఘాతం కలిగిస్తుందని భావించేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

కులాన్ని ఆయుధంగా వాడుకుంటున్న రాహుల్‌

సమాజాన్ని విభజించేందుకు కులాన్ని రాహుల్‌ వినియోగించుకుంటున్నాడన్న విషయం దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తించిన విషయమే. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ దుష్ప్రచారం చేసి 99 స్థానాలను గెలుచుకున్న సంగతీ విదితమే. తర్వాత కూడా కులాన్ని వదలకుండా మిస్‌ ఇండియాల నుంచి సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల వరకూ ప్రతి ఒక్కరినీ కుల కోణంలో చూస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఆ ధ్రువీకరణ కొనసాగేలా కులాల మధ్య అంతరం, రిజర్వేషన్లు అంటూ పునరుద్ఘాటిస్తున్నాడు. నిజానికి, అతడి తాత, నాయనమ్మ, తండ్రిలో ఎవరూ రిజర్వేషన్లను మనస్ఫూర్తిగా సమర్ధించినవారు కాదు. వారు ఆ భావనలను ఏదో ఒక సందర్భంలో వ్యక్తం చేశారు కూడా. ఆ భావనకు అద్దం పట్టేలాగా, భారతదేశం సమసమాజమైనప్పుడు రిజర్వేషన్లను అంతం చేయడాన్ని పరిగణిస్తానంటూ నోరుజారేసి నాలుక కరుచుకున్నాడు. నిన్నటి వరకూ ఇదే రాహుల్‌ తనను తోలుబొమ్మలా ఆడిస్తున్నవారు రాసిన స్క్రిప్టును పట్టుకొని, కులం, రిజర్వేషన్ల గూర్చి మాట్లాడాడు.

జార్జిటౌన్‌ యూనివర్సిటీలో ప్రసంగించిన అతడు రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ నోరుజారి, మళ్లీ యూటర్న్‌ తీసుకుని రిజర్వేషన్ల పరిమితిని 50శాతానికి పైగా పెంచాలంటూ మాట్లాడాడు. అదైనా రాజ్యాంగబద్ధమా, కాదా అన్నది అతడికి తెలిసుండక పోవచ్చు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అతడు చెప్పే గణన జరగాలని పట్టుబట్టకపోవడమే అతడి అసలు రంగుని బయటపెడుతోంది. భారతదేశంలో అణగారిన కులాల వారి సామాజిక, ఆర్ధిక పరిస్థితులను అవగాహన చేసుకునేం దుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుందని నొక్కి చెప్పాడు. దీనితో బీఎస్పీ అధినేత్రి మాయా వతి రంగంలోకి దూకి, దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అణగారిన వర్గాలకు ఏమీ చేయలేదంటూ విమర్శల జల్లు కురిపించారు. అలాగే, ఎన్డీయే కూటమిలో భాగస్వామి, ఎస్సీ అయిన ఎల్జేపీ అధిపతి చిరాగ్‌ పాశ్వాన్‌ కూడా కాంగ్రెస్‌ మానసికతకు రాహుల్‌ ప్రకటనలు అద్దం పడుతున్నాయని, కోటా వ్యవస్థను అంతం చేయాలని ఆలోచించడం కూడా రాజ్యాంగ వ్యతిరేక చర్యంటూ మండిపడ్డారు.

విభజనకు ఏదైనా అర్హమైనదే

భారతదేశంపై బురద చిమ్మటానికి ఏ చిన్న విషయాన్నైనా వాడుకోవాలన్నదే రాహుల్‌ లక్ష్యంలా ఉంది. అందుకే, హిందీకి, ఇతర భాషలకూ మధ్య భారత్‌లో యుద్ధం నడుస్తోందంటూ అమెరికాలో ప్రకటించి, అంతర్గత వైరుధ్యాలే తప్ప పంచుకున్న సారూప్యతలు ఏమీ లేని సమాజంగా భారత్‌ను ప్రదర్శించే యత్నం చేశాడు. ఈ భాషాప్రయుక్త రాష్ట్రాలు తన ముత్తాత సమయంలో ఏర్పడ్డవన్న విషయాన్ని మరుగుపరిచేసి, సెప్టెంబర్‌ 8న టెక్సాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘భారత్‌ ఒక దేశం కాదని, రాష్ట్రాల సమాఖ్య’ అనే తన కథనాన్ని బలోపేతం చేసుకునే యత్నం చేశాడు. నిజానికి కాంగ్రెస్‌ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం, ఇండీ కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే ప్రభుత్వం వంటివే హిందీ పట్ల వ్యతిరేకతను పెంచి పోషించేందుకు యత్నిస్తూ ఆ మంటల్లో కూడా రాజకీయ పేలాలు వేయించుకుంటున్నాయి తప్ప బీజేపీ పాలిత రాష్ట్రాలలో అటువంటి ఘటనలు జరుగుతున్న దాఖలాలు లేవు. ఇంతటి భాషా భేదాలున్నది కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలోనే.

ఆర్‌ఎస్‌ఎస్‌పై బురదజల్లే యత్నం

దేశంలో అనేక మతాలు, భాషలు, తెగల మధ్య ఆర్‌ఎస్‌ఎస్‌ విభేదాలను సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. నిజానికి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేసే పనికి ఇది పూర్తిగా తల్లకిందులైన భావన. అంతేనా? కొన్ని వర్గాల మధ్య అగ్ర, నిమ్న అంటూ తారతమ్యాలు చూపుతున్నదని విషారోపణలు చేశాడు. నిజానికి, అందరినీ కలుపుకు పోతూ పని చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం. భారత దేశంలో పుట్టిన ప్రతివారూ ఈ గడ్డకు చెందినవారనే విషయాన్ని సంఫ్‌ు ఎప్పుడూ గుర్తు చేస్తూ, కులాల ఆధారంగా, మతాల ఆధారంగా విభజించాలను కునేవారి యత్నాలకు అడ్డుపడుతుంది. రాజకీయాలు కాకుండా, మతఘర్షణలకు ఉసి గొల్పుతుందంటూ కూడా ఆరోపణలు చేయడం అతడి రాజకీయ దివాలా కోరుతనానికి ఒక నిదర్శనం మాత్రమే. ఎందుకంటే, దేశంలో అత్యధిక, అతిభారీ మతకల్లో లాలు జరిగింది ఆరు దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనా కాలంలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఎన్నికలు సజావుగా జరుగలేదంటూ ఆరోపణలు

ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ అక్కడ మాట్లాడడం నిస్సిగ్గైన విషయమని వేరే చెప్పనవసరం లేదు. ఎన్నికలు నిజాయితీగా, సజావుగా జరుగలేదు కనుకనే కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రాలేకపో యిందంటూ నిర్భీతిగా అసత్యాలను వల్లించడం ద్వారా తన అహాన్ని సంతృప్తి పరచుకున్నట్టు కనిపిస్తోంది. కేవలం ఆర్ధిక బలం కారణంగానే ప్రధాని మోదీ అధికారాన్ని సాధించారంటూ, తాము చేసే పనిని ఆయనకు ఆపాదించేశాడు. వాస్తవానికి, ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమి డబ్బు వెదజల్లి, కులాల పేరు చెప్పి ప్రచారం చేసింది. పైగా, ఒకానొక దశలో ప్రధాని మోదీ తాను ఓడిపోతానేమోనని కూడా భయపడ్డారంటూ తన ప్రతాపాన్ని ప్రకటించు కున్నాడు. ఎన్నికల సంఘం తమ పట్ల వివక్ష భావనతో ఉందని, అందుకే తాము మెజారిటీ సాధించలేక పోయామని వాపోతూ భారత్‌ గురించి ఒక ప్రతికూల చిత్రాన్ని అమెరికన్లకు ప్రదర్శించే యత్నం చేశాడు.

 మోదీ అంటే భయం లేదు, ద్వేషం లేదు

అప్పటివరకూ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇబ్బంది పడి పంథా మార్చమని సలహా ఇచ్చారేమో అన్నట్టుగా, అతడు తనకు మోదీపై ద్వేషం లేదంటూ ప్లేటు మార్చేశాడు. ‘మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, నాకు ప్రధాని మోదీ పట్ల ద్వేషం లేదు. ఆయన దృక్పథంతో నేను విభేదిస్తానంతే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన దృక్పధాన్ని తాను అంగీకరించనంటూ పేర్కొన్నారు. ఆయనకి భిన్నమైన దృక్పథం ఉంటుంది, నాది భిన్నమైన దృక్పథం. ఆయన చేసే పనుల పట్ల నాకు కరుణ, సహానుభూతి ఉన్నాయంటూ తను ముందు చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకునే యత్నం చేశాడు. కాంగ్రెస్‌ సందేశం ప్రేమను వ్యాప్తి చేయడమే తప్ప ద్వేషాన్ని కాదంటూ కూడా చెప్పుకొచ్చాడు. కానీ, ఈ నాలుగు ముక్కల ద్వారా తాను దేశ ప్రతిష్ఠకు కలిగించిన దెబ్బకు మందు పూయలేననే విషయాన్ని గ్రహించలేదు.

అది ఇండీ కూటమా? ఇండియా కూటమా?

అమెరికా పర్యటనలో భాగంగా జార్జియా యూనివర్సిటీలో విద్యార్ధులతో ముచ్చటించిన రాహుల్‌ గాంధీ తమ కూటమి అర్థం గురించి వివరించేందుకు తికమకపడి ఇబ్బంది పడ్డాడు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన పార్టీలను ఐఎన్‌డిఐ (ఇండీ) కూటమిగా ఒక విద్యార్ధి ప్రస్తావించినప్పుడు, రాహుల్‌ అది ఇండీ కూటమి కాదని, ఇండియా (ఐఎన్‌డిఐఎ) కూటమి అంటూ సవరించే ప్రయత్నం చేశాడు. ఈ కూటమిలో ప్రధాని మోదీని తొలగించడం అన్న విషయం మినహా మరే దానిపైనా ఏకాభిప్రాయం లేదు కదా అని విద్యార్ధి అడిగినప్పుడు, అదంతా అవగాహనా రాహిత్యం అంటూ, నిజానికి ఇండీ కూటమి అనేది బీజేపీ పరిభాష అని వాస్తవానికి అది ఇండియా కూటమి అంటూ వివరించే యత్నం చేశాడు. దానితో ఇండియా కూటమి అంటూ మళ్లీ ఒక ‘ఎ’ని తగిలించడం అంటే వ్యర్ధ పదాన్ని తగిలించడమే కదా అని విద్యార్ధి ప్రశ్నించినప్పుడు రాహుల్‌ ఇరుకున పడడం స్పష్టంగా కనిపించింది. వెంటనే సర్దుకొని, కానే కాదు, ఈ కూటమి మూల భావన ఇండియాపై దాడి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమేనని, అది తాము విజయవంతంగా చేయగలిగామని చెప్పుకొచ్చాడు. విద్యార్ధుల్లో నవ్వులపాలైనా, ముఖానికి గాంభీర్యాన్ని పులుముకొని అక్కడి నుంచి బయటపడడం కొసమెరుపు.

భారత్‌ వ్యతిరేకులతో సమావేశాలు

భారత వ్యతిరేక అజెండాను కలిగి, మన దేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసే ఇల్హాన్‌ ఒమర్‌, రో ఖన్నా, బార్బరాలీ వంటి అమెరికన్‌ రాజకీయ నాయకులు, భారతదేశ ద్వేషులను రాహుల్‌ కలుసుకోవడం వెనుక మర్మం మనకు తెలియనిదేం కాదు. ఒకే జాతిపక్షులు కనుకనే ఒకే కొమ్మపై వాలే యత్నం చేస్తున్నాయి. భారత్‌లో మైనార్టీలపై దాడులు, మానవ హక్కుల సమస్యలు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ముస్లింలపై హిందువులు దాడులు, అత్యాచారాలు చేస్తున్నారనే అసత్య ప్రచారాలు చేయడం వారందరి సామాన్య అజెండా. ఇందులో ఇల్హాన్‌ ఒమర్‌ ప్రముఖురాలు. అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా ఉన్న సమయంలో పాకిస్తాన్‌కు వచ్చి నాటి ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసి, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి వెళ్లిన తీవ్రవాద ముస్లిం మహిళ ఆమె. ఆమె తీవ్రవాద ఇస్లామిక్‌ భావాలు గమనించిన తర్వాత అమెరికా సెనేట్‌ ఆమెను ఆ కమిటీ నుంచి తొలిగించింది.

అటువంటిది, వారితో సమావేశానంతరం తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీపై తమ ఫోటోను పోస్ట్‌ చేసిన రాహుల్‌, వాషింగ్టన్‌లో తాను యుఎస్‌ శాసనసభ్యులను రేబర్న్‌ హౌజ్‌లో కలుసుకుని, భారత్‌`అమెరికా సంబంధాలను బలోపేతం చేసేందుకు, పురోగమ భవిష్యత్తును నిర్మించాలన్న ఉమ్మడి నిబద్ధతను గురించి అర్థవంతమైన చర్చ చేశామంటూ పేర్కొన్నారు. అయితే, చర్చ వివరాలు కానీ తత్సంబంధిత వీడియోను కానీ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో విడుదల చేయకపోవడంతో, వారు ఎటువంటి అంశాలపై చర్చలు నిర్వహించి ఉంటారోననే ఆందోళనలు రేకెత్తుతున్నాయి.

రహస్య సమావేశం ఎందుకు?

బీజేపీ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగకుండా చూడాలని రాహుల్‌ యత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే అనేకమంది రాజకీయ నాయకులను, అధికారులు సహా పలు విదేశీ నిఘా ఏజెన్సీల రహస్య అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైంది దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న ‘డోనాల్డ్‌ లూ’తో జరిగిందని ‘బ్లిట్జ్‌ వీక్లీ’ పత్రిక సంపాదకుడు ఆరోపించారు. వివిధ దేశాలలో అధికార మార్పిడి కార్యకలాపాలను నిర్వహించిన కీలకవ్యక్తి, మన పొరుగుదేశమైన పాక్‌లో ఇమ్రాన్‌ పదవీచ్యుతుడు కావడానికి కారణమైన వ్యక్తి అతడు. అంతేనా? రాహుల్‌ పాల్గొన్న ప్రతి సమావేశంలో జార్జి సోరోస్‌ నిధులతో నడిచే సంస్థల ప్రతినిధులు తప్పని సరిగా ఉండటం గమనించిన వారికి ఎవరికైనా అతడు ఎవరికోసం బాటింగ్‌ చేస్తున్నాడనే విషయం అర్థమైపోతుంది.

భారత్‌-చైనాలను మధ్య అనవసర పోలికలు

రాహుల్‌ చేస్తున్న వ్యాఖ్యలలో ఆందోళన కలిగించే మరో అంశం, చైనా కన్నా భారత్‌ను తక్కువగా చూపేందుకు పదే పదే యత్నించడం. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో సీపీసీతో కాంగ్రెస్‌పార్టీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ స్క్రిప్టు ప్రకారమే అతడు ఎప్పుడూ చైనాను ఆకాశానికి ఎత్తే ఉంచుతాడు. అతడి ప్రకారం భారత్‌ భారీ నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుండగా, చైనాకు అటువంటివేమీ లేవు. కానీ పాశ్చాత్య పత్రికల్లో వస్తున్న వార్తలు మాత్రం చైనా ఆర్ధిక వ్యవస్థ సమస్యల్లో ఉంది, అక్కడ కూడా గుట్టలు గుట్టలుగా నిరుద్యోగులు ఉన్నారని చెప్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం అయితే దాదాపు దివాలా తీసిందనే వార్తలు దండిగా వస్తున్నాయి.

చైనా పట్ల మోదీ ప్రభుత్వ ప్రతిస్పందన తగినట్లుగా లేదని, గతంలో ఇరు పక్షాలు గస్తీ తిరిగిన ప్రాంతాలలో భారత్‌ చాలా భూభాగంపై నియంత్ర ణను కోల్పోయిందన్నది అతడి ఆరోపణ. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా, డ్రాగన్‌ను సుతిమెత్తని వైఖరితో బుజ్జగించలేమని నరేంద్ర మోదీ అంతిమంగా గుర్తించే వరకూ జవాహర్‌లాల్‌ నెహ్రూ కాలం నుంచి మన్మోహన్‌ సింగ్‌ సమయం వరకూ భారత్‌ భూభాగాన్ని కోల్పోతూ వచ్చామనే విషయాన్ని మరుగున పరిచేయడమే సమస్య. 2020లో లద్దాక్‌లో ఘర్షణల అనంతరం చైనా దురాక్రమణల, సలామీ స్లైసింగ్‌ విధానాల పట్ల భారత్‌ తన ప్రతిస్పందనను కటువు చేసింది. చైనాను ప్రధాని మోదీ తక్కువగా అంచనా వేశారనుకుంటుంటే గల్వాన్‌ అనంతరం జరిగిన మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

భ్రమల్లో కాంగ్రెస్‌ పార్టీ

తన రాజకీయ ప్రత్యర్ధులపై దాడి చేయడంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని అనుకరించే ప్రయత్నం చేస్తున్నాడనే భావనను సృష్టించేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే అతడి అధికారిక అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు ఆ రకమైన రంగును ఆపాదించే యత్నం చేస్తోంది. కానీ, అది ఎంత వరకూ సమంజసం? ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్‌ 2014 నుంచే మోదీపై మాటల దాడులు చేస్తూనే ఉన్నాడు. మోదీపై వ్యక్తిగతమైన, విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నాడు. కానీ, విదేశాలకు వెళ్లినప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే భారత్‌కు హానిచేసేవి అయినప్పుడు ఆమోదయోగ్యం కానివే. దళితుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ, భారత్‌ న్యాయమైన దేశం కాదంటూ వ్యాఖ్యానించడం దేశ విద్రోహమే. రాహుల్‌ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ తర్వాత ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులు సర్ది చెప్పుకోవలసి వచ్చింది.

రాహుల్‌ అచ్చు మోదీలానే విమర్శిస్తున్నాడనడం సరికాదు, ఎందుకంటే ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తినప్పుడు దాని విధానాలు ఎలా ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేశాయో సోదాహరణంగా చెప్తారు. ఎందుకంటే, మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన స్థితిలో ఉంది. యూపీఏ కాలంలో జరిగిన అవినీతితో వ్యవస్థ కుదేలైంది. 2014 నాటికి జీడీపీ వృద్ధి నాలుగు శాతంగా, ద్రవ్యోల్బణం పది శాతంగా ఉన్నాయి. ఈ క్రమంలో మోదీ కాంగ్రెస్‌ విధానాలను విమర్శించారు తప్ప రాహుల్‌లా భారత్‌ను లక్ష్యంగా చేసుకోలేదన్నది నిర్వివాదం. ఏరకంగా చూసినా, స్వదేశాన్ని (రాహుల్‌కి ఐదారు దేశాలలో పౌరసత్వం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఏది స్వదేశంగా అతడు భావిస్తున్నాడో చెప్పడం కష్టమే) అవమా నించడం క్షమార్హం కాని విషయం.

ఇటీవలి కాలంలో విదేశాలలో చేసిన ఉపన్యాసాలలో జాతి ఆత్మవిశ్వాసాన్ని నిర్మించేందుకు చేసిందేమీ లేదు. జాతి ప్రయోజనాల కంటే, అతడికి అధికారమే ముఖ్యమనే విషయాన్ని పదే పదే ఉద్ఘాటిస్తున్నట్టుగా అతడి వ్యవహారం ఉంటోంది. కొద్దికాలం కిందట మనం భావించిన హాని చేయని పప్పు కాదు అతడు. వేగంగా నూతన జిన్నాగా అవతరిస్తున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు.


రాహుల్‌ వ్యాఖ్యలపై వైట్‌హౌజ్‌ అధికారి మేరీ మిల్‌బెన్‌ మండిపాటు

విదేశీ గడ్డపైన స్వదేశాన్ని అవమానిస్తూ రాహుల్‌ మాట్లాడిన మాటలు సరైన పని కాదంటూ వైట్‌హౌజ్‌ అధికారి మేరీ మిల్‌బెన్‌ ఖండిరచారు. తాను ఎక్కువగా ఏమీ వ్యాఖ్యానించలేనని, కానీ అతడు మాట్లాడిన మాటలు విన్న ఏ దేశమైనా, ఏ పౌరుడైనా అతడిని ఎన్నుకునేందుకు ఇష్టపడరన్నది నిస్సందేహ మని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడూ తమ దేశం గురించి విదేశాలలో తమ నాయ కులు గొప్పగా మాట్లాడాలని కోరుకుంటాడని, కానీ రాహుల్‌ ఉపన్యాసాలు అన్నీ కూడా స్వదేశం పట్ల విద్వేషపూరితంగా, ప్రతికూలంగా ఉన్నాయంటూ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒక మంచి నాయకుడి గొప్ప లక్షణం ఏమిటంటే, తన దేశ వారసత్వం, తన దేశ ఔన్నత్యాన్ని గుర్తించడమేనని, అందుకే బహుశ ప్రధాని నరేంద్ర మోదీని భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అంతగా ప్రేమిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.


About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE