సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి భాద్రపద బహుళ షష్ఠి – 23 సెప్టెంబర్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


రాజ్యాంగం చేత్తో పట్టుకుని గంభీరంగా ఉపన్యాసాలు దంచడం రాజ్యాంగ రక్షణ కాలేదు. అదేదో చేతల్లో చూపించాలి, నిరూపించుకోవాలి. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఇంటా బయటా చేస్తున్నది అది కాదు. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శామ్‌ పిత్రోడా సమక్షంలో ఇండియా టుడే జర్నలిస్ట్‌ రోహిత్‌ శర్మ మీద అమెరికాలో జరిగిన దాడిని ఏమనాలి? సిక్కులకు భారతదేశంలో గురుద్వారాలకు వెళ్లే స్వేచ్ఛ, తలపాగా ధరించి తిరిగే స్వేచ్ఛ, కడ (కడియం) ధరించే హక్కు ఏవీ?అంటూ కాంగ్రెస్‌ నాయకుడు, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఆ ప్రశ్నలు ఎంత అసంబద్ధమో మొత్తం ప్రపంచం వెంటనే గుర్తించింది. అది వేరే సంగతి. భారత్‌లో సిక్కుల స్వేచ్ఛ గురించి ప్రస్తావించడానికి రాహుల్‌కు స్వేచ్ఛ ఉంటే, బాంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితి గురించి విపక్షనేత ఏం చెబుతారు అని అడిగే స్వేచ్ఛ ఒక జర్నలిస్టుకు ఎందుకు ఉండదు? సిక్కులు భారతదేశంలో మైనారిటీలు. బాంగ్లాదేశ్‌లో హిందువులు మైనారిటీలు. ద్వితీయ శ్రేణి పౌరులకంటే అధ్వాన జీవితం గడుపుతున్న వారు బాంగ్లాదేశ్‌ హిందువులే. ఇక్కడ సిక్కులు గౌరవప్రదంగా జీవిస్తున్నారు.

హిందువులంటే కాంగ్రెస్‌కు మొదటి నుంచి ద్వేషమే. చిన్నచూపే. రాహుల్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ఈ విధానానికి ఇంకాస్త సొబగులు అద్దుకుంది. అయితే, సిక్కుల మీద రాహుల్‌కీ, కాంగ్రెస్‌కీ ఎందుకీ అకాల ప్రేమ? ఇటీవలి పర్యటన వేళ అమెరికాలో తెరిచిన ప్రేమ దుకాణం ద్వారా రాహుల్‌ గాంధీ ఉచితంగా అందించిన సిక్కు ప్రేమ వెనుక ఉన్నది అధికార లాలస. భారత ప్రధాని పీఠానికి గాంధీ`నెహ్రూ వారసులు తప్ప అన్యులు అనర్హులు అన్న అహంభావం.

రాహుల్‌ లోక్‌సభలో విపక్షనేత అయిన తరువాత మొదటిసారి జరిపిన తాజా అమెరికా యాత్ర గత యాత్రల కంటే ఎక్కువ వివాదమే రేపింది. విపక్షనేత దేశ వ్యతిరేకి అన్న విమర్శను కట్టబెట్టింది. ఇందుకు కారణం ఇండియా టుడే జర్నలిస్టు మీద జరిగిన దాడి మాత్రమే కాదు. సిక్కులు కూడా మైనారిటీలే అన్న విషయం హఠాత్తుగా ఆయనకు గుర్తుకు రావడం కూడా. భారత్‌లో మైనారిటీలకు హక్కులు ఉండవు అంటూ అమెరికా సహా, ఇతర విదేశీ పర్యటనలలో ఇంతకాలం ప్రచారం చేసిన రాహుల్‌ ఇప్పుడు తన వాచాలతని సిక్కుల కోసం కేటాయించారు. ఆ మాటలేవీ సాధారణ సిక్కుల జీవితం గురించి చెప్పినవి కావు. వేర్పాటువాదాన్ని అంటకాగుతున్న ఖలిస్తాన్‌ ప్రేమికులకు అనుకూలించేవి. అందుకే రాహుల్‌ పర్యటన ఇంత వివాదాస్పదంగా మారింది. ఆయన నిప్పుతో చెలగాటమాడుతున్న సంగతి స్పష్టమైంది. వాషింగ్టన్‌ డీసీలో రాహుల్‌ అన్న మాటలు భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఇప్పుడు పోరాటమంతా సిక్కులకు తలపాగా ధరించే హక్కు గురించి, కడియం ధరించే హక్కు గురించి అంటూ ఆయన వదరడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యం. ఇది తన ఒక్కడి పోరాటం మాత్రమే కాదట, అన్ని మతాలదీనట. రిజర్వేషన్లు ఎత్తివేస్తామని మొదట నోరు జారి, ఆపై అసలు 50 శాతం పరిమితి ఎత్తివేయాలన్నదే తన అంతరంగమని నాలుక మడత వేసిన రాహుల్‌, సిక్కుల స్వేచ్ఛ గురించి అవాకులూ చెవాకులూ పేలి దేశ వ్యతిరేక శక్తులకు బలం చేకూర్చారు. రైతు ఉద్యమాల పేరుతో మళ్లీ దేశంలో చొరబడిన ఖలిస్తానీ శక్తులకు కాంగ్రెస్‌ ప్రేమ దుకాణంలో ఉచితంగా లభించిన ఊతమే ఈ వాగుడు.  భారత్‌లో సిక్కుల ఉనికికే ప్రమాదం ఏర్పడిరదన్న రీతిలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికా`కెనడాలలో ఉండి పన్నాగాల మీద పన్నాగాలు పన్నే గురు పత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ వంటి వాళ్లకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. సిక్కుల రాజ్యంగా పంజాబ్‌కు స్వాతంత్య్రం కావాలన్న సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (పన్నున్‌ నాయకత్వంలోని సంస్థ) డిమాండ్‌కు రాహుల్‌ మద్దతు ఇచ్చారంటూ పన్నున్‌ ప్రకటించడం ఇందుకు నిదర్శనం. ఇతడికి నచ్చే వాదనలు, ఈ వేర్పాటువాదికి అనుకూలించే సూత్రీకరణలు విపక్షనేత చేయడం ఎంత దౌర్భాగ్యం!

తన మూర్ఖత్వంతోనే కావచ్చు. లేదా తైనాతీలు కల్పిస్తున్న భ్రమలతో కావచ్చు. లేదా గాంధీ`నెహ్రూ కుటుంబంలోని సహజ పదవీదాహంతో కావచ్చు. రాహుల్‌, ఆయన తైనాతీలు చరిత్ర పునరావృతం కావడానికి శతథా దోహదపడుతున్నారు. ఏ కోణం నుంచి చూసినా ఖలిస్తానీవాదుల చేతిలో అక్టోబర్‌ 31, 1984న జరిగిన ఇందిర హత్య నేపథ్యాన్ని పదే పదే గుర్తుకు తెస్తున్నారు. నాటి పర్యవసానాల స్మరణకు అవకాశం కల్పిస్తున్నారు.1978లో పంజాబ్‌లో ఏర్పడిన అకాలీదళ్‌`జనతా సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి అకాలీలను ఇరకాటంలో పెట్టే ఒక ఉన్మత్త మత బోధకుడు అవసరమని కాంగ్రెస్‌ భావించిన సమయంలోనే భింద్రెన్‌వాలే పుట్టుకొచ్చాడు. ఈ పథకం ఎలా పురుడుపోసుకున్నదో ఇప్పటికే పలు గ్రంథాలలో నమోదై ఉంది కూడా. మిగతాదంతా చరిత్ర. కానీ ఇందిరకు అధికారం కట్టబెట్టినది ఈ కుట్ర కానే కాదు. జనతా పార్టీలో లుకలుకలు ఆ పని చేశాయి. కానీ భింద్రెన్‌వాలే పావుగా కాంగ్రెస్‌ పన్నిన పథకం ఆమె ప్రాణంమాత్రం తీసుకుంది.

స్వర్ణ దేవాలయం మీదకు సైన్యాన్ని పంపక తప్పని పరిస్థితిని కల్పించినదీ, పంపినదీ కాంగ్రెస్‌ పార్టీయే. ఇందిర హత్య తరువాత లక్షల కొద్దీ సిక్కులు పంచ కకారాలను పక్కన పెట్టవలసి వచ్చిందీ అప్పుడే. కాంగ్రెస్‌ పార్టీ రక్తదాహానికి దాదాపు మూడు వేల మంది  సాధారణ సిక్కులు బలైనదీ అప్పుడే. ఇవి దాచేస్తే దాగని సత్యాలు. వీటిని చారిత్రక సత్యాలుగా, గుణపాఠాలుగా మొదట గ్రహించవలసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే, వారు రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీయే. అయితే వాస్తవాలు గుర్తించాలన్న దృష్టి కాంగ్రెస్‌కు లేదు. దానికి రాదు. ఉంటే… స్వర్ణాలయం మీద దాడికీ, అమాయక సిక్కుల ఊచకోతకీ ఈపాటికే సరైన రీతిలో క్షమాపణ చెప్పి ఉండేదే!

About Author

By editor

Twitter
YOUTUBE