– అద్దేపల్లి జ్యోతి
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘అనలా, ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావు? మెడిసిన్ అన్నావ్, అది అయ్యేదాకా, మాట్లాడవద్దు అన్నావ్, అది అయిపోయింది ఎమ్మెస్ కూడా అయిపోయింది, మరి ఇప్పుడేంటి నీ అభ్యంతరం? పోనీ నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పు. వాళ్లు ఎవరైనా అమ్మ నాన్నని నేను ఒప్పిస్తాను’’ అంది అమ్మమ్మ భారతి మనవరాలికి నచ్చ చెబుతూ.
‘‘ఊరుకో అమ్మమ్మ, ఏవన్నా ఉంటే నేను చెప్పనా? మా అమ్మానాన్నలను ఒప్పించుకునే ధైర్యం నాకుంది, నీ సిఫార్సులు ఏమి అక్కర్లేదు’’ అంది అమ్మమ్మ బుగ్గలు పుణుకుతూ.
‘‘అందానికి అందం, ఐశ్వర్యం, చదువు, అన్నీ ఉన్నాయి, మరి ఎందుకే ఇంత ఆలస్యం, నీకు నచ్చిన వాడిని అన్నా చెప్పు, లేదా వి• వాళ్లు చెప్పిన సంబంధం అన్నా చేసుకో. ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు. చదువుకున్న దానివి, తెలివైన దానివి. నీకు ఇంతకన్నా విడమర్చి చెప్పక్కర్లేదు అనుకుంటా. ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకో. నీ పెళ్లి చూడాలని నా కోరిక. నీకోసం కాకపోయినా మా కోసమైనా పెళ్లి చేసుకోవే’’ అంది మనవరాలిని ముద్దు చేస్తూ.
‘‘నేనూ, అదే ఆలోచనలో ఉన్నాను, అమ్మమ్మా. అది ఒక రూపం వచ్చాక నీకే ముందు చెప్తాను నిజం’’ అంది నిజాయితీగా.
‘‘ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను’’ అంది అమ్మమ్మ.
‘‘నేను కూడా అదే ఎదురుచూస్తున్నాను అమ్మమ్మా’’ అంది.
‘‘నువ్వు ఎదురు చూడటం ఏంటే..బంగారు తల్లివి. నువ్వు ఊ…అనాలి గాని, పంచకల్యాణి గుర్రం వి•ద వచ్చి తీసుకెళ్లి పోడూ రాకుమారుడు’’ అంది నవ్వుతూ.
‘‘ఏం చేస్తాం? వాడొక బుద్ధూ, వాడికి ఇన్ డైరెక్ట్‌గా ఎన్నిసార్లు చెప్పినా? అర్థం కాలేదు, డాక్టర్స్ డాక్టర్స్‌నే చేసుకుంటే బాగుంటుంది అనేవాడు. నా మనసు అర్థమయ్యే అంటున్నాడో! అర్థం కాక అంటున్నాడో! నాకు అర్థం అయ్యేది కాదు. వాడికీలోపు ఉద్యోగం వచ్చి దూరంగా వెళ్లిపోయాడు. నేను ఎమ్మెస్‌లో పడి పట్టించుకోలేదు. ఈలోపు అతని పెళ్లి కార్డు నన్ను చాలా బాధ పెట్టింది. నాది నిజమైన ప్రేమ. అతనికి నా వి•ద ప్రేమ లేదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అనుకుని నా వృత్తినే దైవంగా భావిస్తూ అందులోనే లీనమై ఉండి పోయాను…అనుకుంది మనసులో.
ఆలోచనలో పడిపోయిన మనవరాలిని గమనిస్తూ బంగారుతల్లికి మంచి అబ్బాయి భర్తగా రావాలి అనుకుని మనసులోనే దేవుని ప్రార్థించింది.
‘‘పక్కింటి సుధ మనవరాలి పుట్టిన రోజని పిలిచింది. నువ్వు వస్తున్నావ్ అని చెప్పాను. నిన్ను కూడా తీసుకురమ్మంది’’ అంది అమ్మమ్మ.
‘‘నీ ఫ్రెండ్ రిషి కూడా వస్తాడని చెప్పమంది’’ అంది.
‘‘అవునా? అంది’’ ఉత్సాహంగా .
వి• ఇద్దరి స్నేహం చూసి నేను వి•ది ప్రేమ అనుకున్నాను, కానీ నేను అపోహ పడ్డాను అనుకున్నాను. వాడి శుభలేఖ చూసి అనుకుంది మనసులో భారతి.
* * *
పుట్టినరోజు కేక్ కటింగ్ హడావిడి అయ్యాక రిషి అనల హాల్లో వెనక్కి వెళ్లి కూర్చున్నారు
‘‘నీ ఎంఎస్ అయిపోయిందని తెలిసింది కంగ్రాట్స్’’ అన్నాడు.
‘‘నీ పెళ్లి అయింది అని తెలిసింది నీకు కూడా కంగ్రాట్స్’’ అంది.
‘‘ఆ అయింది, విడాకులు కూడా అయింది’’ అన్నాడు.
‘‘ఏంటి? అంటున్నావ్, పిచ్చి మాటలు మాట్లాడకు’’ అంది కోపంగా.
‘‘నిజమే! తన ఆలోచనా విధానం వేరు, నా ఆలోచనా విధానం వేరు. పెద్ద వాళ్ల కోసం చేసుకున్నాను కానీ, తనకి నా ఆలోచనల వి•ద గౌరవం లేదు. నీకు తెలుసు కదా! నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టమని. భవిష్యత్తులో హోటల్ పెడతాను అని చెప్పేవాడిని కదా! నేను ఉద్యోగం మానేసి హోటల్ పెడతాను అంటే తను ఒప్పుకోలేదు. నా జీవిత ధ్యేయం అన్నా కూడా తను అర్థం చేసుకోలేదు. తన కోసం నా జీవితాశయాన్ని వదులుకోలేకపోయాను, ఉద్యోగం కన్నా ముందే హోటల్ పెడదామంటే…నాన్న ఒప్పుకోలేదు. ‘నువ్వు సంపాదించుకొని నీ డబ్బుతో హోటల్ పెట్టుకుంటావో.. ఇంకేం పెట్టుకుంటావో’ అన్నారు. అక్కడికీ పెళ్లి ముందు తనతో చెప్పాను ‘ఉద్యోగం చేస్తున్నాను..కొంచెం సంపాదించుకున్నాక హోటల్ పెట్టుకుంటాను’ అని. తనంత సీరియస్‌గా తీసుకో లేదు. నేను ఉద్యోగం మానేసి హోటల్ పెట్టుకుం టాను అన్న రోజు చాలా గొడవ చేసింది. నా ఆలో చనలకు నా మాటలకు విలువ లేని వాళ్లతో ఏంటి? అనుకున్నాను. కానీ సరి పెట్టుకున్నాను కానీ తను ‘హోటల్ అంటూ దానికోసమే తిరుగుతున్నావ్ రాత్రి పగలు’ అని గొడవ చేసి విడాకులు ఇచ్చేదాకా తీసుకొచ్చింది. ఇంక అమ్మ నాన్న కూడా విసిగి పోయారు. ‘నీకు భార్య కావాలో, హోటల్ కావాలో తేల్చుకో’ అన్నారు. పెళ్లికి ముందే చెప్పాను..త•నే నన్ను అర్థం చేసుకోలేదు అందుకే విడాకులు తీసుకున్నాం’’ అన్నాడు.
‘‘ఇంత జరిగితే, నాకు తెలియలేదు’’ అంది.
‘‘నువ్వు చదువులో ఉన్నావని నీకు వి• అమ్మమ్మ చెప్పలేదు అనుకుంటా, అయినా.. ఇదేమైనా శుభవార్తా? అందరికీ చెప్పుకోవడానికి. మా అమ్మ కూడా చెప్పి ఉండదు. అయినా..నువ్వు తెలివైన దానివి. అందుకే పెళ్లి చేసుకోలేదు’’ అన్నాడు. అందుకే నిన్ను డాక్టర్నే చేసుకో అని ముందే సలహా ఇచ్చాను,’’ అన్నాడు నవ్వుతూ.
‘‘గొప్ప సలహా ఇచ్చావులే, ఇంతకీ నీ హోటల్ ఎలా ఉంది?’’ అంది.
‘‘బాగుంది, రెండో బ్రాంచ్ కూడా మొదలు పెట్టాను’’ అన్నాడు నవ్వుతూ.
‘‘నీ ప్రాక్టీస్ ఎలా ఉంది?’’ అన్నాడు.
‘‘నేనేం సొంతంగా ప్రాక్టీస్ పెట్టలేదు, హాస్పిటల్‌లో చేస్తున్నాను, టెన్ టు ఫైవ్ మాత్రమే, తర్వాత హాయిగా నా సంగీతం, పాటలు, నా జీవితం’’ అంది నవ్వుతూ.
‘‘అబ్బా వెరీగుడ్, నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంది, నీకు ఎంత క్లారిటీ’’ అన్నాడు.
‘‘అందుకే నిన్ను బుద్ధూ, అనేది’’ అంది కిలకిలా నవ్వుతూ.
‘‘అలా అంటే నాకు కోపం వస్తుందని తెలుసుగా? ఎందుకలా అంటున్నావ్’’ అని చెయ్యెత్తి కొట్టబోయాడు.
అతనికి అందకుండా పరిగెత్తింది ‘‘బుద్దూ బుద్దూ’’ అంటూ అమ్మమ్మ వెనక్కి వెళ్లి దాక్కుంది.
‘‘ఏమిట్రా ?అల్లరి వి•రు ఇంకా చిన్నపిల్ల లనుకుంటున్నారా?’’ అంది ఇద్దరి మధ్య చేతులు అడ్డుపెట్టి.
‘‘బామ్మా! చూడు..నన్ను బుద్దు, బుద్దు’’ అంటూ ఏడిపిస్తోంది,’’ అన్నాడు చిన్నపిల్లడిలా బుంగమూతి పెట్టి.
‘‘అమ్మమ్మా చూసావా? చిన్న పిల్లాడిలా బుంగమూతి ఎలా పెట్టాడో? మరి బుద్దూ అనక ఏమంటారు?’’అంది పక పకా నవ్వుతూ.
‘‘వి• ఇద్దరికీ, వయసు పెరిగింది కానీ, అల్లరి తగ్గలేదు రా, చిన్నప్పుడు సెలవులకి కలిసినప్పుడు ఇలాగే వాదులాడుకునేవారు, ఇంతలోనే కలిసి పోయే వారు’’ అంది భారతి నవ్వుతూ.
వారిద్దరి నవ్వులు అల్లరి చూసి భారతికి ఆనాటి తన ఊహ నిజమే అనిపిం చింది. రిషి పేరు చెప్పగానే మనవరాలి కళ్లలో మెరుపులు. రిషి కూడా ఆమెతో ఆనందంగా మాట్లాడడం..సుధ చెప్పిన రిషి విడాకుల విషయం. పిచ్చి పిల్లలు వీళ్లకు ఏం కావాలో? వీళ్లకే తెలియదు. కెరీరు, భవిష్యత్తు అనుకుంటూ జీవితంలో ముఖ్యమైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తగిన శ్రద్ధ చూపడం లేదు. అందుకే మనస్పర్ధలు, విడాకులు అధికమై పోయాయి. నేటి నిజాన్ని తెలుసుకోలేక పోతున్నారు. అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని కూతురికి, సుధకి చెప్పి ఈ శ్రావణంలో మూడు ముళ్లు వేయించాలి వీళ్లిద్దరికీ అనుకుంది తృప్తిగా భారతి.
‘‘బంగారు తల్లి రిషి అంటే నీకు ఇష్టమేగా, వి• అమ్మతో చెప్పాను రమ్మని, పెళ్లి విషయం సుధతో మాట్లాడడానికి’’ అంది భారతి మనవరాలి తలనిమురుతూ
‘‘అమ్మమ్మ జీనియస్..చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటుంది. మా బుద్ధూకే అర్థం కాదు. అందుకే అమ్మమ్మా ఐ లవ్ యూ’’ అంది అమ్మమ్మ బుగ్గవి•ద ముద్దు పెడుతూ.
‘‘ఆ,ఆ,… దాచుకో, రిషి కోసం’’.. అంది భారతి నవ్వుతూ.
‘‘అమ్మాయ్. శుభవార్త నీ కూతురు పెళ్లికి ఒప్పుకుంది’’ అంది భారతి ఫోన్లో కూతురుతో మాట్లాడుతూ.
‘‘అవునా అమ్మా. ఎంత మంచి వార్త చెప్పావు. రెండు రోజులు సెలవులు వచ్చాయి అనగానే నీ దగ్గరికి పంపాను. మాకు ఎలాగూ చెప్పటం లేదు, నీకన్నా చెప్తుందని..నా ప్రయత్నం ఫలించింది,’’ అంది ఆనందంగా రవళి అని, ‘‘ఇంతకీ అబ్బాయి ఎవరు? ఎలా ఒప్పించావ్,’’ అంది ఆత్రంగా.
‘‘అన్నీ ఫోన్‌లోనే చెప్పేయమంటావా? నువ్వు అల్లుడు బయలుదేరండి, మన పక్కింటి సుధ కొడుకు రిషి. వాళ్లిద్దరి స్నేహాన్ని చూసి అప్పుడే అనుకున్నాను, అన్నీ మన మంచికే ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు..రండి. వాళ్లతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం’’ అంది సంతోషంగా భారతి.
‘‘అనలా, నిజంగా చెప్పు. ఇప్పటికీ నీకు నావి•ద అంతే ప్రేమ ఉందా? నేను పెళ్లయిన వాడిని విడాకులు తీసుకున్న వాడిని, నీకు మొదటిసారి పెళ్లి అంటూ’’.. ఆగాడు.
‘‘పిచ్చి రిషి. నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే..నువ్వే నా ప్రేమను గుర్తించలేదు, నీకు పెళ్లి అయ్యి విడాకులైనా నాకు అభ్యంతరం లేదు.నువ్వు బుద్దూ అని తెలిసి నా ప్రేమ నీకు డైరెక్ట్‌గా ముందే వివరంగా చెప్పాల్సింది. నా ప్రేమ స్వచ్ఛమైనది అందుకే నువ్వు నాకు దక్కావు’’ అంది అతని చేయి తన బుగ్గకి చేర్చుకుని తన్మయంగా.
‘‘నువ్వు డాక్టర్‌వి, తెలివైన దానివి, అందగత్తెవి, పైగా కోటేశ్వరురాలివి. నువ్వు కో అంటే కొండ వి•ద కోతిని తీసుకొస్తారు వి• నాన్న. మరి ఈ రిషే కావాలని ఎందుకు అనుకున్నావ్?’’ అన్నాడు.
‘‘కొన్నిటికి కారణాలు ఉండవు. ప్రేమకి అసలు ఉండవు. నువ్వు నాకు నచ్చావ్ అంతే. నీకు పెళ్లి అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. నా ప్రేమలో నిజాయతీ లేదా? అని అనుమానపడ్డాను. ఈ జన్మకి ఇంతే…ఈ జీవితాన్ని వైద్యానికే అంకితం అనుకున్నా! దేవుడు నా ప్రేమను గెలిపించాడు. ఇంక నువ్వేమి అడ్డుచెప్పకు. గతం గురించి మర్చిపోదాం. అందమైన భవిష్యత్తును మరింత అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? బుద్దూ’’ అంది చిలిపిగా నవ్వుతూ.
‘‘డాక్టర్ గారు ఇంత వివరంగా చెప్పాక ఇంకేం డౌట్లు వస్తాయండీ, పదండి ముందుకు..రుచికరమైన విందుకు’’ అన్నాడు నాటక ఫక్కీలో
అతను అన్న విధానానికి కిలకిలా నవ్వింది అనల.