ఇకపై అరుపులు, కేకలు, వాకౌట్ల నడుమ సభను వాయిదా వేయవలసిన అవసరం రాజ్యసభ స్పీకర్‌కు రాదు. త్రిశంకు స్వర్గం మాదిరిగా ఎగువ సభలో ప్రవేశపెట్టిన బిల్లులు ఎటూ కాకుండా ఊగిసలాడుతూ ఉండిపోవు. ఇకపై రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసుకోవడం క్లిష్టం కాదు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా, రాజ్యసభ అటకెక్కించిన బిల్లులను కిందకు దింపి, దుమ్ము దులిపి ఆమోదించే అవకాశం వచ్చింది. ఇందుకు కారణం, ఒక చరిత్రాత్మక మార్పుకు సంకేతంగా, ఒక భారీ రాజకీయ పరిణామానికి నాందిగా ఇటీవలే రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గణనీయ విజయా లను సాధించి నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీయే) మెజార్టీ మార్కును దాటేయడమే. దీనితో ఎన్డీయే ప్రభుత్వం అటు దిగువ సభలో, ఇటు ఎగువ సభలో ఆత్మవిశ్వాసంతో వివాదా స్పదమైన బిల్లులను కూడా ప్రవేశపెట్టి, తమ అజెండాను ఎటువంటి ఆటంకాలూ లేకుండా అమలు చేసేందుకు అవకాశం లభించనుంది. 

భారతదేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాత 1989 వరకూ రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీనే స్పష్టమైన మెజారిటీని కలిగి ఉంది. అందుకు కారణం, వివిధ రాష్ట్రాలలో బలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉండడమే. ఆ తర్వాత కాలంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సంకీర్ణ రాజకీయలలో ఉండే సంక్లిష్టతల నడుమ అధికారంలో ఉన్న పార్టీ ప్రయాణించవలసి వచ్చేది. రాజ్యసభలో బిల్లులను ఆమోదింప చేసేందుకు చిన్నపొన్న పార్టీల మద్దతుపై కూడా ఆధారపడవలసి వచ్చేది. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు లేదా స్వతంత్ర ఎంపీలు చేసే అనుచిత డిమాండ్లకు బందీ కావలసి వచ్చేది.

 తొలిసారి ఇంతటి ఘన విజయం సాధించిన ఎన్డీయేకు ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టడానికి ఒక వేదిక సిద్ధమైందన్నమాట. మొత్తం 245 స్థానాలు కలిగిన ఎగువ సభలో ప్రస్తుతం 237మంది సభ్యులు ఎన్నికయిన వారు కాగా, ఎనిమిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నాలుగు జమ్ము, కశ్మీర్‌కు చెందినవి కాగా, నాలుగు నామినేటెడ్‌ స్థానాలు. కనుక, ప్రస్తుతం మెజారిటీ మార్కు 119గా చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఎన్నికలలో విజయంతో 112 స్థానాలను చేరుకున్న ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్‌ సభ్యుల, ఒక స్వతంత్ర సభ్యుడి మెజారిటీ ఉండడంతో రాజ్యసభలో స్పష్టమైన మెజారిటీని సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ విజయం పార్లమెంటు మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు దారి తీస్తుంది.

ఇందులో పార్టీల వారీగా సాధించిన స్థానాలను చూసుకున్నప్పుడు, బీజేపీకి 96 స్థానాలు ఉండగా, మిత్ర పక్షాలకు 19 స్థానాలు, నామినేటెడ్‌ సభ్యులవి 6 స్థానాలు. ఈ గణాంకాలు ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో రాజ్యసభలో పై చేయి కలిగి ఉండటాన్ని ప్రతిఫలిస్తున్నాయి. ఎగువ సభలో కీలక బిల్లులను ఆమోదింప చేసేందుకు తరచుగా ఎదుర్కొనే ఆటంకాలను పరిష్కరించేందుకు అధికార కూటమికి ఈ విజయం ప్రోత్సాహాన్నివ్వనుంది.

ఇలా ఉండగా, లోక్‌సభలో 99 స్థానాలు సాధించి, తామే అధికారంలో ఉన్నంత హంగామా చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యసభలో మిగిలిన స్థానాలు 27 మాత్రమే. జాతీయ రాజకీయ యవ నికపై క్షీణిస్తున్న దాని ప్రభావాన్ని ఈ గణాంకాలు పట్టి చూపుతున్నాయి. ఆరున్నర దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించి ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం అధికార కారిడార్లలలో తన అస్తిత్వాన్ని, ఔచిత్యాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేస్తోందన్నది నిర్వివాదం.

వివాదాస్పద బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం

ఎన్డీయే నూతనంగా సాధించిన ఈ మెజారిటీ శాసన ప్రక్రియపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉండే హామీని ఇస్తున్నదని విశ్లేషకుల భావన. రాజ్యసభలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బిల్లులు ఇప్పుడు కాస్త సజావుగా ఆమోదముద్ర పొందే అవకాశం కనిపిస్తోంది. తమకు కావలసిన గణాంకాలు ఉన్నందున, ప్రతిపక్షాలు అడ్డుకుంటా యనే నిరంతర ముప్పు లేకుండా ప్రభుత్వం కీలక సంస్కరణలను, విధాన మార్పులను ఆమోదించ వచ్చు. అదనంగా, రాజ్యసభలో రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్‌ స్థానాలలో నియామకాలతో ఎన్డీయే బలం మరింత పెరగ నుంది. ఈ స్థానాలు తప్పనిసరిగా, ఎన్డీయేకు అనుబంధంగా ఉన్న వ్యక్తులకే వెడతాయి. కీలకమైన శాసనాలను ఆమోదించడంలో కూటమి సామర్ధ్యాన్ని ఇది మరింత పెంచనుంది.

భారత రాజకీయాలలో నూతన శకం

భారత రాజకీయాలలో ఈ మెజారిటీ నూతన శకానికి నాంది పలుకుతోంది.  అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ ఎన్డీయే తన అధికారాన్ని స్థిరీకరించుకోవడానికి సంకేతంగా ఉండనుంది. బీజేపీ, దాని మిత్రపక్షాలకు రాజ్యసభలో ఈ విజయం కేవలం గణాంకాల ఆట మాత్రమే కాదు. ఇది ఏళ్ల తరబడి పన్నిన రాజకీయ వ్యూహ తంత్ర పరాకాష్ట. భారత రాజకీయాలలో ఎన్డీయే ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మార్గాన్ని సుగమం చేసింది.

అధికార కూటమికి భవిష్యత్‌ మార్గం రాచబాట లానే ఉంది. దీర్ఘకాలికంగా వేచి ఉన్న సంస్కరణలను చట్టబద్ధం చేసి, తన దార్శనికతకు అనుగుణంగా భారత్‌ భవిష్యత్తును మలచే సంభావ్యత ఇప్పుడు మరింత మెరుగ్గా కనిపిస్తోంది. కాగా, ఎన్డీయేకు మార్గం సుగమంగా కనిపిస్తున్న కొద్దీ, వేగంగా మారి పోతున్న రాజకీయ సమీకరణాల నడుమ ప్రయా ణించడానికి ప్రతిపక్షాల ఎదుట సవాళ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE