‘‌జిందగీ కే సాత్‌ ‌భీ-జిందగీ కే బాద్‌ ‌భీ’-ఎల్‌ఐసీ మీ వెంటే! అని తిరుగులేని భరోసా ఇచ్చే భారతీయ జీవిత బీమా సంస్థ ఇటీవలే  సెప్టెంబరు 1, 2024న  68వ పుట్టినరోజు జరుపుకుంది. జీవిత బీమా ప్రయోజనం, ముఖ్య ఉద్దేశాలని గ్రామ గ్రామానికి చేర్చాలని తన మూల లక్ష్యాన్ని అందుకోవడంలోనూ, అలాగే  టెక్నాలజీని అందుకుంటూ పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకు వెళ్లడంలోనూ తనదైన ముద్ర వేసుకొని సంతృప్తికరమైన ప్రయాణం సాగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వజ్ర సంకల్పంతో ముందుకు దూసుకెళుతున్న ఈ ప్రీమియర్‌ ‌సంస్థను అభినందిస్తూ వారి మనోగతం పలుమార్లు సభలలోనూ పార్ల మెంటు వేదికగానూ వ్యక్తీకరించడం హర్షణీయం, గమనార్హం!

ఈ సంవత్సరం-బ్రాండ్‌ ‌ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 2024 అనే సంస్థ ఎల్‌ఐసీని  వరల్డ్ ‌నంబర్‌ ‌వన్‌ ‌బ్రాండ్‌గా ప్రకటించింది. గ్లోబల్‌ ‌మార్కెట్‌ ఇం‌టెలిజెన్స్  ‌సంస్థ బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమాకి సంబంధించిన సంస్థలలో ప్రపంచంలో ఎల్‌ఐసీని నాలుగవ అతి పెద్ద సంస్థగా ధ్రువీకరించింది.

ది గ్లోబల్‌ 500 ‌బి 2024 ప్రచురించిన స్ట్రాంగ్‌ 25 ‌బ్రాండ్స్ ఆఫ్‌ 2024‌లో ఇరవై మూడవదిగా నిలిచింది. రియల్‌ 500 ‌బిజినెస్‌ ‌లీడర్స్ ‌లిస్ట్‌లో మూడవ ర్యాంకు సాధించిన ఏకైక భారతీయ బీమా సంస్థ ఎల్‌ఐసీయే! ఫిన్నోవిటీ కాంక్లేవ్‌ అవార్డుని జీవన ఉత్సవ్‌ ‌పథకం కైవసం చేసుకుంది.

ఇన్ని అవార్డులు సాధించిన ఎల్‌ఐసీ గత సంవత్సరం సాధించిన విజయాలు, తను అందిస్తున్న సేవల వివరాల లోకి వెళ్దాం.

ఎల్‌ఐసీ 2023-24 సంవత్సరంలో రెండు కోట్ల నాలుగు లక్షల జీవితాలకు బీమా కల్పించింది. 2,22,522 కోట్లు నూతన వ్యాపారం ద్వారా మొదటి సంవత్సరం ప్రీమియంగా సాధించి రికార్డు నెలకొల్పింది. బీమా వ్యాపారం ప్రైవేటైజేషన్‌ అయ్యి రెండు దశాబ్దాలు దాటినా – పాలసీలు చేయించడంలో అత్యధికంగా 69.91% మార్కెట్‌ ‌షేర్‌ ‌కలిగి ప్రథమస్థానంలో ఉంది. అలాగే మొదటి ప్రీమియం సాధనలో 58.87% రికార్డు నెలకొల్పింది. ఇక పెన్షన్‌ అం‌డ్‌ ‌గ్రూప్‌ ‌స్కీమ్స్ ‌విభాగంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన క్రింద 2,89,15,408 మందికి బీమా కల్పించింది. ఎల్‌ఐసి గ్రూపు పెన్షన్‌ ‌స్కీముల క్రింద 1, 81,216 స్కీములలో 8,48,04,080 జీవితాలకు బీమా వసతి ఏర్పాటు చేసినది. గత సంవత్సరం ఈ విభాగంలో 72.30% మార్కెట్‌ ‌షేర్‌ ‌కలిగి ఉంది. ఎల్‌ఐసీ లైఫ్‌ ‌ఫండ్‌ 44,32,416 ‌కోట్లు కాగా, మొత్తం ఆసెట్స్ ‌వేల్యూ 52,85,503 కోట్లకి చేరుకున్నది.

కాల పరిమితి పూర్తి అయిన పాలసీలలో 93.48% చెల్లించింది. అలాగే డెత్‌ ‌క్లెయిమ్‌ల విభాగంలో 98.35% చెల్లింపులు జరిపింది. మొత్తం రెండు కోట్ల 21 లక్షల పాలసీలకు గాను – 230000272 కోట్లు సొమ్ము చెల్లించింది.

మే 17, 2022 నాడు జీవిత బీమా సంస్థ స్టాక్‌ ఎక్స్చేంజిలో లిస్ట్ అయింది. దీనిని మన దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా అభివర్ణించవచ్చు. అదీ రెండేళ్ల కఠినమైన కొవిడ్‌ ‌కష్టకాలం నుంచి, అలాగే రష్యా ఉక్రెయిన్‌ ‌యుద్ధ వాతావరణం కారణంగా అతలాకుతలమైన ప్రపంచ పరిస్థితుల మధ్య నిలదిక్కుకొని ప్రగతి వైపు పయనించగలగడం ఎల్‌ఐసీ సామర్ధ్యానికి దర్పణం.

ప్రస్తుతం ఎల్‌ఐసీ 8 జోనల్‌ ఆఫీసులు, 113 డివిజన్లు, 20048 బ్రాంచీలు, 78 గ్రూప్‌ ‌స్కీమ్స్ ‌విభాగాలు, 1584 సాటిలైట్‌ ఆఫీసులు 98, 661  మంది ఉద్యోగులు 14.14 లక్షల ఏజెంట్లు కలిగి ప్రపంచపు నంబర్‌ ‌వన్‌ ‌బ్రాండ్‌గా తన జెండా ఎగురవేస్తూ ఉన్నది. ప్రజలలోని అన్ని వర్గాల వారికి అనువైన వ్యక్తిగత, హోల్‌ ‌లైఫ్‌, ‌టర్మ్ ‌పాలసీలు, ఆరోగ్య బీమా పాలసీలు, యూనిట్‌ ‌లింక్డ్ ‌పాలసీలు అందిస్తోంది. గత సంవత్సరం విడుదల చేసిన నూతన పాలసీలలో జీవన ఉత్సవ్‌, అమృత బాల్‌, ఎల్‌ఐసి ఇండెక్స్ ‌ప్లస్‌, ‌జీవనధార 2, ధనవృద్ది మంచి ఆదరణ పొందాయి. అప్రతిహతంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విధానంలో భాగంగా జీవన సమ్రాట్‌ అనే పథకం ద్వారా తమ ఏజెంట్ల శక్తిసామర్థ్యాలని అభివృద్ధి చేసే భవిష్యత్‌ ‌కార్యక్రమం చేపట్టింది. జీవిత బీమా సంస్థ డిజిటల్‌ ‌యుగంలో పాలసీదారులకు ఎల్‌ఐసీ డీజీ అనే ఆప్‌ ‌ద్వారా మరింత చేరువయ్యింది. 9.57 కోట్ల మంది ఎల్‌ఐసీ వెబ్సైట్‌ ‌కేవలం గత సంవత్సర కాలంలో క్లిక్‌ ‌చేసి చూశారు.

ప్రజలకు జీవిత బీమా బాగా చేరువ కావడానికి 18 రకాల పథకాలను ఆన్‌ ‌లైన్‌ ‌లోనూ విక్రయి స్తోంది. పాలసీదారుల సేవా విభాగంలోనూ, ఆన్‌ ‌లైన్‌లో ప్రీమియంలు స్వీకరించడం, అడ్వాన్స్ ‌ప్రీమియమ్‌లు లోను, వడ్డీ లోన్‌ ‌రీపేమెంట్‌, అ‌డ్రస్‌ ‌మార్పు లాంటి వసతులు కల్పిస్తోంది. ఇంత పెద్ద సంస్థ తమ పాలసీదారుల వివరాలన్నిటిని డిజిటలీ కరణను చేయడం ఒక పెద్ద కార్యక్రమం. మొత్తం మీద 100కోట్ల పాలసీల డిజిటలీకరణ ఒక ఘనమైన ప్రాజెక్టుగా అభివర్ణించవచ్చు. 24 గంటలూ పనిచేసే కాల్‌ ‌సెంటర్‌ ‌ముంబయిలో నెలకొల్పి-022 68276827కి కాల్‌ ‌చేయడం ద్వారా ఎనిమిది భారతీయ భాషలలో సేవలు అందించగలగడం గమనార్హం. అత్యంత ప్రాచుర్య మైన వాట్సాప్‌ ‌నంబర్‌ 89 76 8 6 2 0 9 0 ‌ద్వారా సేవలను విస్తృత పరచడం గమనించగలరు. తమ సేవల విస్తృతి కోసం 74 కస్టమర్‌ ‌జోన్‌లను ఏర్పరచి పాలసీ దారు లకు వలసిన అన్ని సేవలను ఒకే చోట ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అందిస్తోంది.

సేవా లోపం కలిగిందని భావించినప్పుడు పాలసీదారులు తమ ఇబ్బందులను కస్టమర్‌ ‌గ్రీవెన్స్ ‌సెల్‌ ‌ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రతి కార్యాలయంలోనూ ఫిర్యాదు నమోదు చేసే అవకాశం కల్పించింది. అలాగే ఈమెయిల్‌ ‌ద్వారా, ఎల్‌ఐసీ ఇండియా డాట్‌ ఇన్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా కూడా తమకు కలిగిన ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా ఎక్కడికక్కడ ఏర్పాటుచేసింది. గత సంవత్సరంలో అలా నమోదు అయిన సమస్యలలో 98.6% కేసులను కేవలం 15 రోజుల వ్యవధిలో పరిష్కరించింది. ఎల్‌ఐసీ ఆన్యూటీలు పింఛను అందుకునే పాలసీదారులు లైఫ్‌ ‌సర్టిఫికేట్‌ ‌ని ఎల్‌ఐసీ డిజియాప్‌ ‌ద్వారా ఇంటి నుంచే సమర్పించే సదవ కాశం కలిగించింది. ఎల్‌ఐసీ డీజీ ఆప్‌ ‌ప్లే స్టోర్‌ ‌నుండి డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చును. స్వదేశంలోనే కాక బహరీన్‌,‌కతార్‌, ‌కువైట్‌, ‌యూఏఈ, నేపాల్‌, ‌శ్రీలంక, బంగ్లాదేశ్‌, ‌సింగపూర్‌లలో కూడా తమ శాఖలు ఏర్పరిచి తన వ్యాపార అభివృద్ధి కొనసాగిస్తోంది.

గోల్డెన్‌ ‌జూబ్లీ ఫౌండేషన్‌ ‌ట్రస్ట్ ఏర్పాటు చేసి తద్వారా స్వచ్ఛభారత్‌ అభియాన్‌, ‌క్లీన్‌ ‌గంగా అభియాన్‌ ‌ద్వారా బడులలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, స్వచ్ఛతను కాపాడడం, చిన్న పిల్లల్లో తలెత్తే క్యాన్సర్‌, ‌గుండె శస్త్ర చికిత్సలు, చెవిలో కాక్లియర్‌ ఇం‌ప్లాంట్‌ ‌సర్జరీలు చేయించడంలో సహకరిస్తూ – సామాజిక బాధ్యత వహిస్తూ తన పాత్ర గణనీయంగా నిర్వహిస్తోంది. అలాగే పిల్లల చదువుల నిమిత్తం ఎల్‌ఐసీ గోల్డెన్‌ ‌జూబ్లీ స్కాలర్‌షిప్‌ ‌ద్వారా ఇంజినీరింగ్‌, ‌వైద్య విద్య, ఒకేషనల్‌ ‌కోర్సులకు సహాయాన్ని అందిస్తోంది.

గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ.. జీవిత బీమారంగంలో ప్రపంచంలో ప్రథమస్థానంలో నిలిచి మన్ననలు అందుకుంటున్న భారతీయ జీవిత బీమా సంస్థ దేశ ప్రగతిలో ఒక మణిహారం అంటే అతిశయోక్తి కాదు.

– బీవీఎస్‌ ‌ప్రసాద్‌

‌విశ్రాంత డివిజనల్‌ ‌మేనేజర్‌

About Author

By editor

Twitter
YOUTUBE