– టి. విజయలక్ష్మీదత్‌

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

గాయత్రికి కొత్త ఇంట్లో సామాను సర్దుడుతో తీరిక లేకుండా పోయింది. కొత్త చోటు కావటంతో పిల్లలు కాంతి, కిరణ్‌లను బయటకు వెళ్లకుండా చూసుకుంటూ వంట పూర్తి చేసింది. వంటింటి బాల్కనీలో నుంచి బయటకు చూసింది ఆమె. వెనుకవైపు పెద్దగా ఖాళీ స్థలం, మొక్కలు దట్టంగా పెరిగి పోయాయి. అక్కడే శిథిóలావస్థలో గుడిసె ఉంది. అటువైపు మూలన వెదురు పొదలున్నాయి గుబురుగా.

ఒక నల్లటి కుక్క వచ్చి వెదురుపొదలలోకి దూరింది.

లోపలినుంచి కుక్క పిల్లల కూతలు వినవస్తున్నాయి.

‘పాపం అక్కడ పిల్లలను పెట్టినట్టుంది.’ అనుకుంది.

కాసేపటికి బయటకు వచ్చింది కుక్క. చిన్నగా ‘చుచు’ అని శబ్దం చేస్తూ పిలిచింది గాయత్రి. కుక్క గాయత్రి వైపు చూసి ఆగింది. దా… దా అని పిలిచి, వంటింట్లోంచి నాలుగు బిస్కెట్లు తెచ్చి ఒక కాగితంలో చుట్టి కిందకు వేసింది. అది తోకఊపుతూ పరుగున వచ్చి బిస్కెట్లు తినేసి కృతజ్ఞతగా చూసి వెళ్లిపోయింది.

మధ్యాహ్నం భోజనాలు అయ్యేక గాయత్రి బయటకు చూసింది. ఆ కుక్క అక్కడ ఉన్న ఒక మట్టి దిబ్బ మీద పడుకుని ఉంది. పిలిచింది గాయత్రి. లేచి వచ్చి బాల్కనీ క్రింద నిలబడి పైకి చూసింది.

ఒక దళసారి కాగితంలో పెరుగు, అన్నం కలిపి చెదిరిపోకుండా మడిచి జాగ్రత్తగా క్రిందకు వదిలింది.

అది అన్నం శుభ్రంగా తినేసి నాలుకతో మూతిని నాకుకుంటూ గాయత్రికి థాంక్స్‌ లాంటి చూపు ఒకటి విసిరి వెళ్లిపోయింది.

‘‘మమ్మీ, కుక్కను టామీ అని పిలుద్దాం.’’ అన్నాడు కిరణ్‌.

అప్పట్నుంచీ ‘టామీ’ ఆ కుటుంబానికి ఒక ఆత్మీయ ప్రాణి అయిపోయింది. ‘టామీ ‘అంటే పరుగున రావటం మొదలుపెట్టింది. కిరణ్‌, కాంతిలు స్కూల్‌ నుంచి వస్తూనే టామీకి బిస్కట్లు ఇవ్వటం అలవాటుగా మారింది. వారి మనసుల్లో టామీ పట్ల ఒక అనుబంధం చోటు చేసుకుంది.

* * * *

ఆదివారం కావటంతో కాస్త విశ్రాంతి ఫీలవుతూ, మంచి టిఫిన్‌ చేస్తుంది గాయత్రి. ఆమెకు ఫ్రిజ్‌లో నుంచి కర్వేపాకు, కోత్తిమీర తెచ్చి ఇస్తూ, క్యారెట్‌ కోసి ఇస్తూ, బఠాణి కాయలు ఒలుస్తూ, సాయం చేస్తున్నాడు సత్యమూర్తి.

అంతలో పెద్ద వర్షం మొదలైంది. గాయత్రి మనసు ఉలిక్కి పడిరది. కంగారుగా బాల్కనీలోకి వెళ్ళింది ఆమె. కుక్కపిల్లలు పెద్దగా బాధగా అరుస్తున్నాయి. టామీ వెదురు పొదలలో నుంచి బయటకు వచ్చి, చుట్టూ చూస్తూ నిస్సహాయంగా శోకాలు పెడుతుంది.

‘‘ఏమైంది గాయత్రీ?’’ అంటూ వచ్చేడు సత్యమూర్తి.

‘‘అయ్యో పాపం కుక్కపిల్లలు తడిసిపోతున్నాయి అండీ’’ అంది.

‘‘ కాని ఇపుడు మనం ఏం చెయ్యగలం. వర్షం పెద్దగా పడుతుంది కదా? ’’అన్నాడు అతడు.

‘‘డాడీ అలా చూడండి!’’ ఆశ్చర్యంగా అరిచాడు కిరణ్‌. టామీ ఒక పిల్లను నోట కరుచుకుని గుడిసెలోకి వెళ్ళింది. అది కీచుమని అరుస్తుంది. మళ్లీ పరుగున వెళ్లి మరొక పిల్లను తెచ్చి పెట్టేసి, అలాగే మొత్తం నాలుగు పిల్లలను గుడిసె నీడకు చేర్చేసింది. పిల్లలు అరవటం మానేసాయి.

‘‘పాపం టామీకి టవల్‌ ఉండదు కదూ తుడవటానికి?’’ బిక్క ముఖంతో అడుగుతున్న కొడుకును దగ్గరకు తీసుకుంది.

గాయత్రీ కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘బాధ ఇది అని చెప్పటానికి నోరు లేకున్నా, చేతులు లేకున్నా పిల్లలను కాపాడుకుంది చూసేవా!దేవుడు వాటి నాలుకలోనే ప్రేమను, టవల్‌ను ఇచ్చాడు.. ఉరుములు మెరుపులు పెరగటంతో, ‘‘రండి మరి.’’ అంటూ లోపలకు తీసుకెళ్లి బాల్కనీ తలుపు మూసింది గాయత్రి.

భోజనాలయ్యేక, నాలుగు బిస్కెట్లు రెండు బ్రెడ్‌ స్లయిస్‌లు ఒక కాగితంలో చుట్టి, బాల్కనీలోకి వెళ్లి ‘‘టామీ…. టామీ’’ అని పిలిచింది. రెండుమూడు సార్లు పిలిచేక నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చి పైకి చూసింది. గాయత్రి ప్యాకెట్‌ను క్రిందకు వేసింది. మూతితో విప్పుకొని తినేసింది. రోజూలాగే ఒకసారి ఆమె ముఖంలోకి చూసి ఒక థాంక్స్‌ చూపును విసిరి వెళ్లిపోయింది టామీ.

* * * *

ఆఫీసుకు టైం అయిపోతుంది అనుకుంటూ బాక్సులు సర్దుతున్న గాయత్రి బాల్కనీ వైపు నుండి వస్తున్న పెద్ద శబ్దాలకు డోర్‌ తెరిచి చూసింది.

ఒక జేసీబీ వెనుక స్థలంలో ఉన్న చిన్న చిన్న చెట్లను, మట్టి కుప్పలను, రాళ్లను ఒక మూలకు నెట్టుకుపోతుంది. గుడిసెను కూడా నెట్టే ప్రయత్నంలో ఉన్నారు. నలుగురు ఐదుగురు నిలబడి ఉన్నారు అక్కడ.

టామీ బాధగా అరుస్తూ పరుగులు పెడుతుంది.

రాళ్లతో కొట్టి తరిమేస్తున్నారు దాన్ని దూరంగా. గాయత్రి గుండె ఆగినంత పనైంది.

శక్తిని అంతా కూడదీసుకుని ‘‘ఆగండి’’ అని అరిచింది కంగారుగా.

వాళ్లు పౖౖెకి చూసారు. ఒకతడు కొంచెం ముందుకు వచ్చి ‘‘ఏమిటమ్మా’’ అని అడిగేడు.

‘‘ముందు ఆ కుక్కని కొట్టటం ఆపండి.’’ అంది.

‘‘మా పనికి అడ్డు వస్తుందమ్మా, దాని క్రింద పడుతుందని తరుముతున్నాం.’’

‘‘ఆ గుడిసెలో ఆ కుక్కపిల్లలు నాలుగు ఉన్నాయ్‌. దయచేసి కొంచెం ఆగండి వస్తున్నాను’’ అంటూ గబా గబా చెప్పులు వేసుకుని, ఒక ప్లాస్టిక్‌ టబ్‌ను పట్టుకు క్రిందకు పరిగెత్తింది. టామీ తల పైకి ఎత్తి ‘‘ ఓ ’’ అంటూ ఏడుస్తుంది.

‘‘టామీ దా’’ అంటూ వెళ్లింది. చుట్టుపక్కల ఇళ్లవాళ్లందరు వింతగా చూస్తున్నారు.

గాయత్రి వీలుగా లేకున్నా, అలాగే తల వంచి గుడిసెలోకి వెళ్లింది. ఆ వెనుకే టామీ కూడా లోపలకు వెళ్లింది అరుస్తూ…

గాయత్రి నాలుగు పిల్లలను చేతులలో పట్టుకుని గుండెకు హత్తుకుని తెచ్చి టబ్‌లో పెట్టి తీసుకు వెళ్తుంటే టామీ చిన్నగా అరుస్తూ టబ్‌ వైపు ఎగురుతూ ఆమె వెనుకే వెళ్లింది. టబ్‌ను కింద పెట్టి గేటు మూసి లోపలకు వెళ్లి ఒక పాత దుప్పటిని తెచ్చి మెట్ల క్రింది ఖాళీలో పరచింది. పిల్లల్ని దానిపై పెట్టింది. ఒక గిన్నెలో పాలు తెచ్చి పెట్టింది. టామీ పాలు తాగేసి పడుకుంది. పిల్లలు తల్లి దగ్గర చేరి పాలు తాగుతున్నాయి.

కనురెప్పలను దాటివచ్చిన నీటి బొట్లను చేతి వెనుక భాగంతో ఒత్తుకుంది.

పిల్లలను స్కూల్లో వదిలి వచ్చిన సత్యమూర్తి, ‘‘లేట్‌ అయింది ఇంకా తయారవ్వలేదా?’’ అంటూ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె కళ్లలోకి చూసాడు. విషయం విన్న అతడు ‘‘పోనిలే మంచిపని చేసావ్‌’’ అన్నాడు.

అతడికి లంచ్‌ బాక్స్‌ అందించింది, ‘‘మీరు వెళ్లండి. ఈ రోజు లీవ్‌ పెడతాను..మనసు బాగోలేదు’’ అంటూ.

భార్య మనసెంత సున్నితమో తెలిసిన సత్యమూర్తి, ‘‘సరే, టేక్‌ కేర్‌.’’ అంటూ వెళ్లిపోయేడు.

* * * *

ఆఫీస్‌ నుంచి వచ్చి బస్సు దిగిన గాయత్రి దృష్టి రైల్వే ట్రాక్‌ పక్కన గుమిగూడిన జనంపై పడిరది.

‘ఏమైందో..అనుకుంటూ వెళిపోతున్న ఆమెకు పసిపాప ఏడుపు వినిపించింది. ఆ శబ్దం ఆగకుండా వినవస్తుంటే, ఆమె అటు నడిచింది.

‘‘ఏమైంది?’’ అడిగింది.

‘‘ఎవరో పసిబిడ్డను తుప్పలలో పడేసి పోయారమ్మా’’ చెప్పాడు ఒకతడు.

వేగంగా జనం మధ్య నుంచి ముందుకు వెళ్లి చూసింది గాయత్రి. ఆ దృశ్యం చూసి కళ్లు తిరిగినంత పనైంది.

ఒంటిపై చిన్న బట్ట అయినా లేని పసిబిడ్డ కటిక రాళ్లు, తుప్పలు మధ్య ఉంది. నెలలోపే ఉండొచ్చు. గుక్కపట్టి ఏడుస్తుంది. గాయత్రి కళ్లు నిండాయి.

వింతను చూస్తున్న అందరి వైపు చూసింది ఆమె. తొందరగా పాపను సమీపించింది.

హ్యాండ్‌ బ్యాగ్‌ లోనుంచి టర్కీ నాప్కిన్‌ తీసి పాప చుట్టూ చుట్టింది. బాటిల్‌ మూతలో నీళ్లు వంచి రెండు చుక్కలు పాప నోట్లో వేసింది.చప్పరించినట్టు చేసింది పాప. మరో రెండు చుక్కలు వేసింది. ఏడుపు స్థాయి తగ్గింది. నెమ్మదిగా చేతులలోకి తీసుకుని గుండెకు ఆనించుకుంది. ఏడుపు ఆగింది.

‘‘అది ఏ పాపపు బిడ్డో?’’

‘‘అది తల్లా కసాయిదా?’’

‘‘తల్లి కసాయిదే. మరి మీరేంటి?’’ అంటూ ముందుకు వెళ్తున్న గాయత్రి ఆగి వెనకకు చూసింది.

‘‘చచ్చేవరకు చూసి వెళ్తారా!అది కసాయి తనం కాదా?మానవత్వం మసి బారిపోయింది. తల్లితనం ప్రకృతి ధర్మం. తల్లి అయిన ప్రతి ఆడది అమ్మ కాదు.’’

‘‘అందరికి ఈవిడంత మానవత్వం ఉండాలని రూల్‌ ఏమైనా ఉందా?’’

‘‘ఆ పిల్లను పెంచుద్దా?’’లాంటి మాటలను వినిపించుకోకుండా ముందుకు సాగిపోయింది గాయత్రి.

* * * *

గేటు తీసుకు లోపలకు వెళ్లింది గాయత్రి. కుక్క, పిల్లలు నిశ్చింతగా నిద్రపోతున్నాయి. కాంతి, కిరణ్‌ పరుగున వచ్చారు. తన ముఖంలోకి చూస్తున్న సత్యమూర్తికి జరిగిన విషయాన్ని వివరించింది.

మంచం పక్కగా నేలపై టవల్‌ పరిచి పాపను పడుకోబెట్టబోయింది గాయత్రి. ఆ టవల్ను తీసి మంచంపై పరిచాడు సత్యమూర్తి.

‘‘ఇక్కడ గాయత్రీ’’ అంటూ.

అతడు ఏమంటాడోనని లోపల భయపడుతున్న గాయత్రి కృతజ్ఞతగా చూసింది అతడి వైపు.

‘‘నన్ను కూడా కొంచెం ప్రేమను పంచనియ్యి గాయత్రీ.’’ అన్నాడు పాప తలపై నిమురుతూ.

‘‘ఒక మెత్తటి బట్ట తడిపి సున్నితంగా పాప ఒళ్లంతా తుడిచింది ఆమె. రాళ్లు, ముళ్లు ఒత్తుకుని వీపు, కాళ్లు కంది ఉన్నాయ్‌. ఒళ్లంతా పౌడర్‌ అద్దింది. ఆ స్పర్శకు చిన్నగా కళ్లు తెరిచి ఏడవటం మొదలు పెట్టింది.

‘‘కొంచెం చూడండి పాలు తెస్తాను.’’ అంటూ వెళ్లింది. ఫ్రిడ్జ్‌లో పాల గిన్నెను తీసి వెచ్చ చేసి, కొంచెం పంచదార కలిపి, ఒక చిన్న కప్‌లో పోసి స్పూన్‌ వేసి తెచ్చింది తొందరగా. స్పూన్‌తో చిన్నగా చుక్కలుగా వేసి తాగించింది. నాలుగు స్పూన్లు తాగి నిద్రలోకి జారుకుంది పాప.

 ‘‘ ఇక పాప మనదేనా?’’ అంటున్న పిల్లల వైపు ఉలికిపాటుగా చూసింది. ఆమెకు అంతవరకు ఆ ఆలోచనే రాలేదు. ఆమె మనసును కుదిపిన ఆ సంఘటన వల్ల కలిగిన దుఃఖం ఒక్కసారిగా పొంగి వచ్చింది. దుఃఖిస్తున్న భార్యను దగ్గరకు తీసుకుని ఓదార్చేడు అతడు మౌనంగా.

 ‘‘ఎలా అండీ ఇలా?….. కడుపున మోసి కన్న పసిగుడ్లను విసిరి పారేస్తున్నారు? వాళ్లేం పాపం చేసారని! ఆ కుక్క టామీ పిల్లలను ఎలా కాపాడు కుంది? చేతులు లేవు, నోరు లేదు బాధను చెప్పుకోవటానికి. అన్నీ ఉన్న మనుషులెందుకు ఇంత కసాయిలు అయిపోతున్నారు?’’ బాధగా అంది ఆమె.

సత్యమూర్తి కళ్లు చెమ్మగిల్లాయి.

ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంది గాయత్రి.

సత్యమూర్తి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాడు ఆమెకు. తాగి సోఫాలో వెనక్కు చేర్ల బడిరది గాయత్రి. నెమ్మదిగా అన్నాడు అతడు, ‘‘మనం ఆ నోరులేని కుక్క పిల్లల్ని చేరదీసినట్టు, ఇక్కడ ఈ పాప విషయంలో కుదరదు.’’

 ‘‘తెలుసు.’’ అంది కొంగుతో ముక్కు తుడుచుకుంటూ.

 ‘‘పోలీస్‌లకు సమాచారం ఇవ్వటం మన బాధ్యత.’’ అంటూ ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు అతడు.

 ఒక్క క్షణం అతడి ముఖంలోకి చూసింది ఆమె.

 ‘‘ఇపుడే వస్తానండి’’ అంటూ హ్యాండ్‌ బ్యాగ్‌ తీసుకుని బయటకు వెళ్లింది వేగంగా. దగ్గరగా బస్టాప్‌ పక్కన ఉన్న రెడీమేడ్‌ షాప్‌కు వెళ్లి నాలుగు చిన్న గౌన్లు, నాప్‌ కిన్లు, అలాగే ఒక పాలసీసా, సబ్బు, పౌడర్‌ తీసుకుని పరుగు లాంటి నడకతో ఇంటికి చేరింది.

పోలీస్‌ జీప్‌ వచ్చి ఆగింది గేటు ముందు. పోలీస్‌ ఇన్స్పెక్టర్‌, ఇద్దరు కానిస్టేబుల్స్‌ దిగారు. జనం చేరారు.

సత్యమూర్తిని అడిగి వివరాలు రాసుకున్నారు.

‘‘కిరాణా షాప్‌ అతడు, లాండ్రి వ్యక్తి మీ గురించి చెప్పేరమ్మా. మానవత్వం చావు బతుకుల్లో ఊగిసాలాడుతున్న తరుణంలో మీవంటివారు ఊపిరిలూది దానిని బ్రతికించటానికి ప్రయత్ని స్తున్నారు. హ్యాట్సఫ్‌ అమ్మా! పాపను స్టేట్‌ హోంకు తరలిస్తాం.’’ అన్నాడు ఇన్స్పెక్టర్‌.

‘‘ఒక్క క్షణం సర్‌’’ అంటూ వెళ్లి పాలసీసా కడిగి పాలు పోసి తెచ్చింది గాయత్రి. ఒక గౌను తీసి తొడిగింది. నాప్కిన్‌ నడుముకు చుట్టూ చుట్టింది.

కదిలికలకు కళ్లు తెరిచి ఏడుస్తున్న పాపను గుండెకు హత్తుకుంది. ఆమె కళ్లు వర్షిస్తున్నాయి. పాప ఏడుపు ఆగింది. చూస్తున్న ఇన్స్పెక్టర్‌ కళ్లు కూడా చెమ్మగిల్లాయి.

‘‘పాప పేరు కరుణ అని రాయండి సర్‌.’’ పాపను అందిస్తూ గద్గద స్వరంతో చెప్పింది. పాలసీసా, గౌన్లు అవి ఉన్న కవర్‌ కూడా ఇచ్చింది.

‘‘ఎపుడైనా వెళ్లి చూడొచ్చా?’’ అడిగింది.

‘‘చూడవచ్చు. కావాలంటే ప్రొసీజర్‌ పూర్తిచేసి తిరిగి తెచ్చుకోవచ్చు కూడా.’’

‘‘అక్కడ బాగా చూస్తారా పాపను?’’

ఆగాడతడు. ‘‘బాగానే చూస్తారమ్మా. బాధపడకండి అనవసరంగా. పాపకు పునర్జన్మను ఇచ్చారు.’’

జీప్‌ వెళ్లిపోయింది.

జనంలో ఒకతడు అన్నాడు, ‘‘ఎంతైనా తల్లిలా చూస్తారా?’’

పైటతో కళ్లు ఒత్తుకుంటూ ‘‘తల్లా!’’ పేలావంగా నవ్వింది ఆమె. ‘‘తల్లిలా చూడక్కరలేదు. విసిరి పారేయ్యకుండా ఉంటే చాలు!’’ అంటూ లోపలకు వెళ్లిపోయింది గాయత్రి. సత్యమూర్తి, పిల్లలు ఆమెను అనుసరించారు.

పాలు, అన్నం ప్లేట్లో కలిపి తెచ్చి టామీకి పెట్టింది. తింటూ గాయత్రి ముఖంలోకి కృతజ్ఞతగా చూసింది టామీ. ‘నువ్వే కాపాడకపోతే నా పిల్లలు నాకు దక్కేవా!’ అనుకుంటూ.

About Author

By editor

Twitter
YOUTUBE