రంగు పూసుకున్న ఆ ముఖాల వెనుక గుండెను దహిస్తున్న క్షోభ ఉంది. అణచిపెట్టుకున్న ఆగ్రహం ఉంది. జీవన్మరణ సమస్యతో వచ్చిన నిస్సహాయత ఉంది. సాధారణ ప్రేక్షకులు దాదాపు దేవుళ్లతో సమానంగా చూసే వెండితెర వేల్పులు కొందరు నిజజీవితంలో అక్షరాలా రాక్షసులని విషయం బయటపడే దాకా తెలియదు. తెర మీద ప్రాణాలొడ్డి అతివలను కాపాడే పాత్రలో కనిపించిన నటుడు తెర వెనుక వారిని జీవచ్ఛవాలను చేస్తున్న సంగతి కూడా అంతే. కళ అన్న మాట అక్కడ నుంచి ఏనాడో పారిపోయింది. కాసు అనే ఒక్క మాటకే అక్కడ విలువ అంతా. వేషాల కోసం సినీ పరిశ్రమను వెతుక్కుంటూ వచ్చి దారుణంగా భంగపడిన యువతులు కోకొల్లలు. వచ్చిన అవకాశాలను నిలుపుకోవడం కోసం నిరంతరం మనసును చంపుకుంటూ నిలబడిన వారూ ఎక్కువే. ఇప్పుడు ఈ ఆగ్రహం మలయాళ సినీ పరిశ్రమలో (మాలీవుడ్‌) బయటపడిరది. గుప్పెడు మంది నిర్మాతలు, నటులు, దర్శకులు ఒక మాఫియాగా నటీమణులకు నరకం చూపిస్తున్నారు. అదే విషయం జస్టిస్‌ హేమా కమిటీ నివేదిక బహిర్గతం చేసింది. వందలాది మంది నటీమణులకి అలాంటి చేదు అనుభవాలు ఉన్నా, వారిలో కొద్దిమంది మాత్రం ఆ కమిటీ ముందు తమ ఆక్రోశాన్ని వెలిగక్కారు. వారు బయటపెట్టినవన్నీ పెద్ద పెద్ద పేర్లే. సినీ రంగాన్ని శాసిస్తున్న దిగ్గజాల పేర్లే. ఇప్పుడు జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మలయాళ సినీ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నది. చిత్రంగా ఈ నివేదికను కేరళ సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కొన్నేళ్లు తొక్కి పట్టి ఉంచడమే అసలు మలుపు. అది ఎవరిని కాపాడడానికి! అన్నదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఆఖరికి ఈ వివాదంలో సీపీఎం ఎమ్మెల్యే ఒకరు పీకల్లోతు ఆరోపణలతో,  రేప్‌ కేసును కూడా ఎదుర్కొంటున్నారు. ఎంతో ఖ్యాతి ఉన్న మలయాళ సినీ పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోయింది.

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ‘మీటూ’ అన్న ఒక్క పదం భారతీయ వెండితెరను కదిపేసింది. నటీమణులు చేసిన పెద్ద తిరుగుబాటుకు నినాదంలా మారింది. 2017లో మలయాళ నటి భావనా మేనన్‌ను కొందరు భౌతికంగా హింసించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం జస్టిస్‌ హేమ (కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి) నాయకత్వంలో అలనాటి నటి శారద, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేబీ వలసాలకుమారిలతో  కమిటీని నియమించింది. భావన మీద దురాగతం జరిగిన సంవత్సరమే ఏర్పడిన ఉమన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ సంస్థ కూడా మలయాళ సినిమా రంగంలో రాజ్యమేలుతున్న అసమానత, లైంగిక వేధింపుల మీద దర్యాప్తు జరిపించాలని గట్టిగా కోరింది. భావన ఇతర యూనిట్‌ సభ్యులు ప్రయాణంలో ఉండగా ఆ దుర్ఘటన జరిగింది. ఆ ఘటనతోనే దిలీప్‌ అనే ప్రముఖ నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మీద దాడి యావత్తు కుట్ర ఫలితమేనని తరువాత తెలిసింది. తరువాత దిలీప్‌ యథాప్రకారం ఆ ఉదంతంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించినా కేసు మాత్రం కొనసాగుతున్నది. చిత్రం ఏమిటంటే, సీపీఎం ఎమ్మెల్యే, మలయాళ సినీ నటుడు ఎం. ముఖేశ్‌ కూడా ఆరోపణలు ఎదుర్కొం టున్నారు. ఆయన మీద రేప్‌ కేసు నమోదైంది. ఈ అంశమే ఇప్పుడు కేరళలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం భారతీయ చలనచిత్ర రంగాన్ని కలవరపెడుతున్నది. రాజకీయ రంగు కూడా పులుముకుంది. సీపీఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మీద ఉన్న అత్యాచారం కేసులు ఒక్కసారిగా బయట పడ్డాయి. కాంగ్రెస్‌, బీజేపీల నుంచే కాకుండా, అధికార వామపక్ష కూటమి భాగస్వామి సీపీఐ కూడా ముఖేశ్‌ రాజీనామా చేయాలని కోరుతున్నది.

జస్టిస్‌ హేమ కమిటీతో ప్రకంపనలు

ఆగస్ట్‌ 19, 2024న జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక బహిర్గతం కావడంతోనే ప్రకంపనలు ఆరంభమైనాయి (వాస్తవానికి ఈ నివేదిక కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి డిసెంబర్‌, 2019లోనే అందింది). ప్రతిష్టాత్మక కేరళ చలనచిత్ర అకాడెమి, అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ పదవులకు దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణ, నటుడు సిద్దికి రాజీనామా చేశారు. వీరిద్దరి మీద లైంగిక ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతలోనే నటీమణులను నుంచి ఇతరుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దర్యాప్తు సంఘం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నివేదిక తప్పు పట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలైంది. ‘మలయాళ సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉన్న మాట అయితే నిజమే. పరిశ్రమలోని వారి మీద ఆరోపణలు రావడం కూడా నిజమే’ అన్నారు ప్రముఖ దర్శకుడు జోషి జోసెఫ్‌. నటీమణుల మీద లైంగిక వేధింపులు మలయాళ పరిశ్రమకే పరిమితమని ఎవరూ అనుకోవడం లేదు. మరొక బెంగాలీ నటి, టాలీవుడ్‌లో చిత్రాలు చేసే రితభరి చక్రవర్తి ఆరోపణలు అందుకు నిదర్శనం. బెంగాలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల గురించి బయటపెట్టాలని ఆమె కోరారు. జస్టిస్‌ హేమ కమిషన్‌ ఏర్పాటు, నివేదిక వెల్లడి పద్ధతిలోనే బెంగాల్‌లో కూడా జరగాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె విజ్ఞప్తి చేశారు కూడా. నిజానికి ఆమె సినీ పరిశ్రమ మీద తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఎన్నో కలలతో సినిమా పరిశ్రమకు వస్తున్నవారికి అర్థమయ్యేది ఒక్కటే. ఇది పైపై మెరుగులు పూసిన వ్యభిచార గృహమని. కాబట్టి బెంగాల్‌ వినోద పరిశ్రమలో ఉన్న దొంగల ముసుగులు కూడా తొలగించాలని ఆమె కోరుతున్నారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కూడా జస్టిస్‌ హేమ కమిటీ అవసరం ఉందని ప్రముఖ నటి సమంత అభిప్రాయడడం విశేషం. మాలీవుడ్‌లో జరిగిన ఉదంతాల మీద జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక స్వాగతించదగినదని ఆమె అన్నారు.

అమెరికా నుంచి భారత్‌కు మీటూ

మీటూ ఉద్యమం 2006లో అమెరికాలో ఆరంభమైంది. 2017 నాటికి ప్రపంచ వ్యాప్తమైంది. పని ప్రదేశాలలో స్త్రీలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి, భౌతికదాడుల గురించి గళం విప్పడమే, లోకానికి బహిర్గతం చేయడమే మీటూ ఉద్యమం లక్ష్యం. దీనితో మంచి ఫలితాలే వచ్చాయి. హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌ వికృతాలు మీటూ ఉద్యమం తోనే బయటపడినాయి. 2018లో తనుశ్రీదత్తా అనే నటి బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ మీద లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు. అయితే ఆధారాలు లేక 2019లో కేసు మూసివేశారు. తరువాత ఆమె సినిమా భవిష్యత్తు అగమ్యగోచరమైంది. సాజిద్‌ ఖాన్‌ కూడా ఇదే తరహాలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కైలాస్‌ఖేర్‌ మీద ఆరోపణలు వచ్చినా క్షమాపణలు కోరి బయటపడ్డాడు. అయితే జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వచ్చిన తరువాత మలయాళ నటి మిను మునీర్‌ పలువురి మీద ఆరోపణలు చేశారు. ఎం. ముఖేశ్‌, జయసూర్య, మణియన్‌పిల్ల రాజు, ఇదవెలా బాబుల మీద ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

భావనా మేనన్‌ మొదట తన ఉనికి బయటకు రాకుండా చూసుకున్నా తరువాత బహిరంగంగానే నటీమణులు పడుతున్న బాధల గురించి, వేధింపుల గురించి 2022లో ఒక ఉద్యమమే నిర్వహించారు. మొత్తానికి 265 పేజీల నివేదికను  జస్టిస్‌ హేమ ప్రభుత్వానికి ఇచ్చారు. కొద్దిమంది దర్శకులు, నిర్మాతలు, నటులు కలసి మలయాళ సినీరంగంలో అవాంఛనీయ పరిస్థితులను ఎలా ప్రవేశపెట్టినదీ, పెంచి పోషిస్తున్నదీ ఆ నివేదిక వెల్లడిరచింది. ఆ కొద్దిమంది బృందమే సినిమా రంగాన్ని శాసిస్తూ నటీమణులను తమ లైంగిక వాంఛలు తీర్చాలని బాహాటంగానే ఆదేశించే పరిస్థితులు ఉన్నాయని నివేదిక వెల్లడిరచింది. వారు గుప్పెడు మందే కావచ్చు. కానీ వారు చెప్పిన దానికి అంగీకరిస్తేసరి. లేదంటే ఎదురు తిరిగిన వారి భవిష్యత్తు అంధకా రమే. కొందరి సినీ జీవితాలు అసలు మొదలు కాకుండానే వీళ్లు అంతం చేశారని నివేదిక తెలియ చేసింది. ఈ వేధింపులకు వ్యతిరేకంగా ఏర్పడినదే ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌. ఇది జరిగిన సంఘట నల మీద పరిశోధన చేసి ఆధారాలు సంపాదించింది. ఆడియో క్లిప్‌లు, వాట్సాప్‌ సందేశాలు కూడా వాటిలో ఉన్నాయి.

మీటూ ఉద్యమంలో వినిపించిన మరొక పేరు గాయని చిన్మయి శ్రీపాద. ఈమె గతంలోనే తమిళ సినీ గేయరచయిత వైరముత్తు, నటుడు రాధారవిల మీద లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వచ్చిన తరువాత వేధింపులకు గురైన మహిళలు మరింత ధైర్యంగా ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూసుందర్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

తారకలు మసకబారాయి

‘మెరిసే తారకలతో, అందాల నెలవంకతో ఆకాశం పూర్తిగా అంతుపట్టని రహస్యాలతో నిండి ఉంది. కానీ శాస్త్రీయంగా చూస్తే మాత్రం తారకలు మసకబారిన సంగతి అర్థమవుతుంది. నెలవంక అంత అందంగా కూడా లేదని తెలిసింది’  అంటూ జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక ఆరంభమయింది. అభిమాన సంఘాల హడావిడి, డబ్బు మధ్య మసిలే వెండితెర వేల్పులు నిజ జీవితంలో హీరోలు కాదని సాధారణ ప్రజలు ఆలస్యంగా మాత్రమే గమనిస్తూ ఉంటారు. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మొదటి వాక్యాలు దానినే రుజువు చేస్తున్నాయి.

 సినిమా రంగానికి చెందిన కొందరు మహిళలు లైంగిక దాడులకు సంబంధించి సిద్దికి, ఎడవెలా బాబు, నిర్మాత రంజిత్‌, సీపీఎం ఎమ్మెల్యే ముఖేశ్‌, సుధీశ్‌, రియాజ్‌ఖాన్‌ పేర్లు బాహాటంగానే వెల్లడిస్తు న్నారు. ఈ జాబితాలోదే మరొక పేరు జయసూర్య. తన మీద లైంగిక దాడి చేసిన జయసూర్య మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మినూ మునీర్‌ అనే నటి కోరారు. ఎమ్మెల్యే ముఖేశ్‌ మీద తన మీద దాడి చేశాడని కూడా ఆమె ఆరోపించారు. కాబట్టి ఆయన రాజీనామా చేయాలని కూడా కోరారు. ఏ పక్షంలో, ఎలాంటి రాజకీయాలలో ఉన్నా  ఎవరూ కూడా ముఖేశ్‌ వంటి వ్యక్తులను సమర్ధించరాదని సూచించారు. మినూ మునీర్‌ ఫిర్యాదు మేరకే జయసూర్య, ముఖేశ్‌, ఎడవెలా బాబూల మీద ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనాయి. ఫిర్యాదులు చేసినందుకు ఇప్పుడు తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆమె చెప్పారు. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వెలువడిన తరువాత ఇంతవరకు నమోదైన కేసులు 17. జస్టిస్‌ హేమ నివేదికతోనే అమ్మ (అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌) రద్దయింది. దీని కార్య నిర్వాహక సంఘం రాజీనామా ఇచ్చింది. ఇందులో ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ కూడా ఉన్నారు.

జస్టిస్‌ హేమ కమిటీ నివేదికలో వెల్లడైన తరువాత, ఆ ఆరోపణల మీద విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.ఈ బృందం వేధింపుల వ్యవహారంలో సినీ ప్రముఖులలో చాలామందిని ప్రశ్నించే అవకాశం దండిగానే ఉంది. పైగా సిట్‌ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడిన తరువాత నటీమణులలో ధైర్యం పెరిగింది. ఇంతకాలం మౌనంగా ఉన్నవారు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. పలువురు ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిట్‌ ఏర్పడిన తరువాతే సోనియా మల్హార్‌ అనే నటి ఒక ఫిర్యాదు చేశారు. 2013లో తనను సెట్స్‌లోనే లైంగికంగా వేధించారని ఆమె ఆరోపణ. పీకల్లోతు ఆరోపణలలో ఉన్న జయసూర్యకు అంతా దూరంగా ఉండాలని ఆమె సూచించారు. దర్శకుడు రంజిత్‌ తనను వేధించాడని బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఆరోపించారు. ఇదొక సంచలనంగా మారింది. ఒక సినిమా గురించి చర్చించడానికి అని చెప్పి తన ఫ్లాట్‌కు పిలిచిన రంజిత్‌ చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడెమి అధ్యక్ష పదవిని వెలగబెడుతున్న రంజిత్‌ ప్రస్తుత సంచలనం నేపథ్యంలో పదవి నుంచి వైదొలిగారు.


ఏమిటీ జస్టిస్‌ హేమ నివేదిక? పినరయి ఎందుకు తొక్కి పెట్టారు?

ఫిబ్రవరి 17,2017న ప్రముఖ మలయాళీ సినీ నటి భావనా మేనన్‌ను ఆరుగురు నేరగాళ్లు అపహరించి లైంగికంగా వేధించారు. ఆ ఆరుగురిని నియమించినవాడు బహుశా మరొక ప్రముఖ నటుడు దిలీప్‌ అయి ఉండవచ్చునని విచారణ కమిషన్‌ అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. తరువాత పలువురు నటీమణులు భావనకు సంఫీుభావం ప్రకటించారు. సామాజిక మాధ్యమాలలో ‘అవల్‌కొప్పమ్‌’ (ఆమె వెంట మేం) పేరుతో ఉద్యమం నిర్వహించారు. ఆ ఘటన జరిగిన మూడు మాసాల తరువాత 14 మంది నటీమణులు కలసి పని ప్రదేశాలలో తమకు భద్రత ఉండేలా చూడాలని విన్నవిస్తూ వినతి పత్రం సమర్పించారు. అదే ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌. దేశంలో ఇలాంటి సంస్థ ఒకటి ఏర్పడడం ఇదే తొలిసారి. దీనితో కె. హేమ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సంఘాన్ని నియమించింది. సినీ పరిశ్రమలోని మహిళల సాధకబాధకాలు వినడం, నమోదు చేయడం, ప్రభుత్వానికి సూచనలు చేయడం ఈ సంఘం విధి. ఈ సంఘం ముందుకు వారంతా వచ్చారు. దారుణమైన అనుభవాలు వెల్లడిరచారు. మొత్తానికి 2019 నాటికి 5000 పేజీల నివేదిక తయార యింది. అది 40 మందికి చెందిన నివేదిక మాత్రమే. అదే ముఖ్యమంత్రికి అందించారు. అయితే ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటూ కార్యకర్తలు, జర్నలిస్టులు ఎంత వేడుకున్నా ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ అందుకు నిరాకరించారు. అది మహిళల జీవితాలకు సంబంధించి గోప్యంగా ఉండాలని, అయినా పెద్ద నివేదిక అని ఆయన చెబుతూ వచ్చారు. దీనితో సహజంగానే ఎవరిని రక్షించడానికి వామపక్ష ప్రభుత్వం నివేదికను బహిర్గతం చేయకుండా తొక్కి పట్టి ఉంచింది? అన్న ప్రశ్నలు వచ్చాయి. కారణాలు ఏమైనా మే, 2022లో ఒకటిన్నర పేజీ నివేదికను వెల్లడిరచారు. అవి కమిటీ చేసిన సిఫారసులు మాత్రమే. ఎట్టకేలకు న్యాయ పరమైన చిక్కులకు భయపడి ఆగస్ట్‌ 19న విడుదల చేశారు. నిజానికి ఇదొక కీలక నివేదిక. సినిమా అవకాశాల కోసం ‘మాఫియా’కు యువతులు ఎలా లొంగిపోతారు. లేదా లొంగదీసుకుంటారు. అసలు సినీ పరిశ్రమను ఈ మాఫియా ఎలా గుప్పెట్లో పెట్టుకుంది. ఆఖరికి లోపలి విషయాలు బహిర్గతం చేయడానికి యువతులు ప్రాణభయంతో ఎలా కంపించి పోతారో కూడా ఇందులో ఉంది.  ఆఖరికి మైనర్‌ బాలికలను కూడా వదలరని నివేదిక చెప్పింది. ఇంత కదలిక వచ్చిన తరువాత మాత్రమే పినరయి విజయన్‌ ప్రభుత్వం ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులే సభ్యులుగా దర్యాప్తు సంఘాన్ని నియమించింది.


దోషుల వైపే సీపీఎం?

ఒక పక్క తాము బాధితుల పక్షాన నిలబడతా మని చెబుతున్నప్పటికీ ముఖేశ్‌ విషయంలో లేదా రంజిత్‌ విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం దోషులకే కొమ్ము కాస్తున్న సంగతి అర్ధమవుతుంది. రంజిత్‌ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్‌ చెప్పారు. కానీ ఇతడి మీద ఆరోపణలు బహిర్గతం కాగానే  మొదట మంత్రి అన్న మాటలు దారుణంగా ఉన్నాయి. ఆగస్ట్‌ 25న ఆదివారం రంజిత్‌ రాజీనామా ఇచ్చారు. అంతకు ముందు రోజే చెరియన్‌ అన్నమాట ఇది: ‘రంజిత్‌ దేశంలోనే ప్రతిష్ట కలిగిన దర్శకుడు. కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రానే అలాంటి వ్యక్తి మీద కేసులు పెట్టడం సాధ్యం కాదు. అలా కేసు పెట్టినా నిలబడదు.’ తరువాత నష్ట నివారణకు ఆయన ఏవేవో మాట్లాడారు. రంజిత్‌ కూడా ఈ ఆరోపణల మీద న్యాయ పోరాటం చేస్తానని, నిజానికి ఈ ఆరోపణలన్నీ వామపక్ష ప్రభుత్వం కీర్తిప్రతిష్టలను దిగజార్చడానికి చేస్తున్నవేనని (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఆగస్ట్‌ 26, 2024) తేల్చిపారేశారు. కాబట్టి ఈయన కూడా సీపీఎంకు చెందినవాడని భావించడం తొందరపాటు కాదు. ఆఖరికి కేరళ వామపక్ష కూటమి భాగస్వామి సీపీఐ కూడా బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర రంజిత్‌ మీద చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేసింది. సిద్దికి తనను 2016లో లైంగికంగా వేధించాడని నటి రేవతి సంపత్‌ వెల్లడిరచారు. తన మిత్రులకు కూడా అతడితో ఇలాంటి అనుభవమే ఉందని కూడా చెప్పారు. ఈ వేధింపులు, ఇతర సమస్యలు  పెద్ద నటుల దృష్టికి కూడా వెళ్లాయనే చెప్పాలి. బహ్రెయిన్‌లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లినప్పుడు లిఫ్ట్‌లో ఒక సీనియర్‌ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి ఉష అనే నటి మోహన్‌లాల్‌కు, సీనియర్‌ నటి సుకుమారికి కూడా ఫిర్యాదు చేశారు. ఎవరి మీద ఎలాంటి చర్యలు లేవు. తరువాత ఉషకు మాత్రం  అవకాశాలు లేకుండా పోయాయి.

వాస్తవాలు దాస్తున్న సీపీఎం ప్రభుత్వం

లైంగిక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాజీనామా చేయాలా వద్దా అనేది సీపీఎం ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉందని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ సభ్యుడు వీడీ సతీశన్‌ అన్నారు. తన శిబిరంలో అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలను పెట్టుకుని ఆయన అంతకు మించి గట్టిగా ఏమడుగుతారు? జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక విషయంలో వామపక్ష ప్రభుత్వం కొన్ని విషయాలను దాచి పెడుతున్నదని ఆయన ఆరోపించారు. అసలు ఆ నివేదిక సూచించిన మేరకు, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడుతున్నదని ఆరోపించారు. నిజానికి జస్టిస్‌ హేమ కమిటీ నివేదికతో మలయాళ చలనచిత్ర పరిశ్రమ తలెత్తుకోలేని స్థితికి చేరుకుంది. కొందరు అమాయకుల మీద కూడా ఆరోపణలు వచ్చి ఉండవచ్చు. అయినా, లైంగిక వేధింపులు, మత్తు మందుల వాడకం వంటి అంశాలతో ఆ సినిమా పరిశ్రమ అపఖ్యాతి పాలైంది. అందుకే జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వచ్చిన తరువాత కూడా ప్రభుత్వం దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వెల్లడిరచిన వాస్తవాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని కేరళ హైకోర్టు న్యాయవాది సరీనా జార్జ్‌ కొచ్చిన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు.   ముఖేశ్‌ రాజీనామా చేయాల్సిందేనని కేరళకు చెందిన వందమంది మహిళా ఉద్యమకారులు కోరారు. లేకపోతే ఉద్యమించక తప్పదని కూడా ప్రభుత్వాన్ని  హెచ్చరించారు.

చెప్పుకోలేని బాధలు

 జస్టిస్‌ హేమ నివేదిక షూటింగ్‌ ప్రదేశాలలో నటీమణులు, ముఖ్యంగా జూనియర్‌ ఆర్టిస్టులు ఎలాంటి నరకం అనుభవిస్తారో కూడా తెలియ చేసింది. వీరికి కనీస వసతులు కూడా కల్పించరు. అర్ధరాత్రి వీరి నివాసాల తలుపులు కొడతారు. చిత్రీకరణ స్థలంలో కనీసం మూత్రశాలలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా మంచినీళ్లు కూడా వీళ్లు తాగరు. తాను మూత్రశాలకు పోవలసి వచ్చిందని, కానీ వెళ్లిరావడానికి పది నిమిషాలు పడుతుంది కాబట్టి ప్రొడక్షన్‌ విభాగం అనుమతించలేదని ఒక జూనియర్‌ నటి గోడు వెళ్లబోసుకున్నారు. అవకాశాల కోసం ‘సర్దుబాట్లు’ ఎలా తప్పవో, ఎలా ‘రాజీ’ పడతారో కూడా చాలా మంది వివరించారు. పైన చెప్పుకున్న ఆ కొందరితో కూడిన ఆ బృందం మాఫియా కంటే తక్కువేం కాదని తేల్చారు. తమకు జరిగిన అన్యాయాన్నీ, తాము భరించిన అణచివేతనీ, అవమానాలనీ బయటకు వెల్లడిరచడానికి కూడా నటీమణులు సంకోచించడం లేదా భయపడడం కూడా సినీ పరిశ్రమలో గమనించవలసిన అంశమని సాక్షాత్తు జస్టిస్‌ హేమ కమిటీయే వెల్లడిరచింది. కాబట్టి బయటకు వచ్చినవి కొన్ని మాత్రమేనన్నది మరచి పోరాదు.

సినిమా వంటి బలమైన సామాజిక మాధ్యమాన్ని భారతదేశంలో వామపక్ష సిద్ధాంతాల ప్రచారం కోసం నిస్సారం చేశారు. తెరమీద జీవిత చిత్రణ కంటే పాశ్చాత్య సిద్ధాంతాల ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి ఆ సిద్ధాంతాలు చెప్పే వారే ఆచరించరు. అందుకే సిద్ధాంతం ఆధారంగా వారు తీసిన సినిమాలు ప్రభావం చూపలేకపోతున్నాయి. సినిమా మీడియాను దుర్వినియోగం చేయడంలో వామపక్షవాదులదే పైచేయి. ఇప్పుడు ఇలాంటి ‘నేరస్థ’ కళాకారులను రక్షించుకోవడానికి కేరళ సీపీఎం ప్రభుత్వం పడుతున్న తపన కూడా అందుకే. హిందూ ధర్మాన్నీ, ఆచారాలనూ ఎద్దేవా చేస్తూ చిత్రాలు నిర్మించే వారి అసలు రూపం ఏమిటో ఇప్పుడు జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక బట్టబయలు చేసింది. ధనార్జన కోసం కుల వైషమ్యాలను చూపిస్తూ తమకు తాము పురోగాములుగా చెప్పుకునే వారి నిజరూపం కూడా బయట పడిరది.

హిందూధర్మం స్త్రీని భోగ వస్తువుగా భావిస్తుం దంటూ సిద్ధాంతాలు చెప్పే వీళ్లు సినీ పరిశ్రమను అందమైన వ్యభిచార గృహంగా మార్చేశారన్న ఆరోపణను ఎదుర్కొనవలసి వచ్చింది. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ పదే పదే సినిమాలు నిర్మించే మలయాళ, తమిళ సినిమా రంగాల కొందరు నిర్మాతలు, దర్శకులు, నటులు నిజ జీవితంలో ఎలాంటి వారో ఇప్పుడు తెలిసింది. ఇలాంటి వారికి వామపక్షం అండగా ఉండడమే పెద్ద ట్విస్ట్‌. సినిమా అనేది ఒక గొప్ప మాధ్యమం. ఆ రంగాన్ని పూర్తిగా వాణిజ్య మయం చేశారు. ఫలితంగానే స్త్రీ అక్కడ అంత చులకనగా మారిపోయింది. భోగవస్తువును మించి, అంగడి సరుకుగా మిగిలి పోయింది. దీని మీద ఇప్పుడైన నటీమణులు గళం ఎత్తడం స్వాగతించ వలసిందే. ఇలాంటి ఆ రంగాన్ని భ్రష్ఠు పట్టిస్తున్న శక్తులు వదిలి, శుభం కార్డు పడే తరుణం కోసం అంతా వేచిచూద్దాం.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE