శైవక్షేత్రాలలో ఆరాధ్యదైవం శివుడు. ఇది సర్వ సాధారణమైన విషయం. కానీ వికారాబాద్‌ ‌జిల్లా, పూడూరు మండలంలో వెలసిన అతి ప్రాచీన ఆలయం శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయం. దామగుండమనే క్షేత్రంలో ఉంది. ఆలయ ప్రధాన ద్వారం ఎదుట గరుత్మంతుడు వెలిశాడు. ఆయన శ్రీమహావిష్ణువు వాహనం. ఇదీ దామగుండం ప్రత్యేకత. అందుకే ఈ క్షేత్రాన్ని విష్ణుభగవానునితో అనుసంధానమైన శ్రీరామలింగేశ్వర క్షేత్రమంటూ స్కందపురాణంలో ప్రస్తావించారు.

స్థలపురాణం :

స్కందపురాణంలో సనత్కుమారుడు నారద మహర్షికి ఈ స్థల మహాత్మ్యాన్ని వివరించినట్లు కనిపిస్తుంది. తదనుసారం దీన్ని ‘విభాండక క్షేత్ర’మని కూడా వ్యవహరిస్తారు. రామాయణ కాలంలో విభాండక రుషి దశరుథునితో పుత్రకామేష్ఠి యజ్ఞాన్ని జరిపించి, తర్వాత ‘దామగుండ’ క్షేత్రంలో తపస్సు చేశాడట. ఈయన కుమారుడే రుష్యశృంగుడు. ఈ క్షేత్రంలోని సరోవరాన్ని ‘దామ సరోవరం’ అని పిలుస్తారు. మరో పౌరాణిక నామం నీలకంఠాశ్రమం. మార్కండేయ మహర్షితో సహా ఎందరో రుషులు ఈ క్షేత్రంలో తపస్సు చేశారని పురాణగాథ. ఇక్కడే మార్కండేయ గుహ ఉన్నది.

పురాతన కాలంలో ఇక్కడ ‘ఇసుక’తో కూడిన శివలింగం ఉండేది. దీనినే విభాండక మహర్షి పూజించేవాడని చెబుతారు. శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన కోటిలింగాల్లో ఇదొకటి. ఆలయ జీర్ణోద్ధరణ కూడా 1665లో కాకతీయ రాజుల కాలంలో జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దామసరోవరం, ఉత్తరాన బ్రహ్మ సరోవరం, వాణీ• సరోవరం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ క్షేత్రంలో దాముడు, గుండుడు అనేవారు వసించినట్లు, వారి వ్యవసాయ క్షేత్రాల్లో శిలారూపంలో లింగం లభించడం, దాన్ని వారు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించడం వల్ల దామగుండం పేరుతో ఖ్యాతి గాంచింది. ఇది స్వయంభూలింగం. దామగుండం, భైరవ క్షేత్రం, అనంతగిరి, రాకమచర్ల, లొంక ఆంజనేయ /శివక్షేత్రాలను (పరిగి దగ్గర) పంచారామ క్షేత్రాలుగా పిలుస్తారు. దామగుండం క్షేత్ర సమీపంలో భైరవ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాల్లో శివదర్శనం, పూజలు గావించినవారికి పిశాచాది,  ఈతిబాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. చుట్టూ దట్టమైన అడవులు ప్రశాంతమైన స్థలంలో ఈ ప్రాచీన ఆలయాలు వెలిశాయి.

ఈ క్షేత్రంలో శ్రావణమాసంలో సోమవారాలు, శివరాత్రి పర్వదినాలు, ఫాల్గుణ బహుళ దశమి నుండి ఉగాది వరకు ప్రత్యక్ష పూజలు జరుగుతాయి. వేలాదిమంది భక్తుల దర్శిస్తారు.

ఫాల్గుణ మాసంలో బహుళ దశమి నుండి అయిదురోజులు రథోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంలో ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉంచుతారు.

ఈ శైవక్షేత్రం ప్రకృతి రామణీయకత మధ్య, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ రామలింగేశ్వరా లయాన్ని ఇటీవలి కాలంలో ఇక్కడ నుంచి తరలించాలన్న ప్రభుత్వ యత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంలో ఉత్సవాలు జరుగుతుంటాయని ఆలయంలోని కొలను (గుండం) ఎల్లప్పుడూ నీటిలో కళకళలాడుతుందనీ, ఇక్కడి అయిదు నీటిగుండాలు వేసవిలోనూ యాత్రికులను ఆదుకుంటూ ఉంటాయి. అందువల్ల ఈ పుణ్య క్షేత్రానికి ప్రాముఖ్యం ఏర్పడిది.

అయితే ఇక్కడి అటవీప్రాంతానికి చెందిన మూడువేల ఎకరాల భూముల్లో నావికాదళానికి చెందిన రాడార్‌ ‌వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల ఈ ప్రసిద్ధ ఆలయానికి ముప్పు ఏర్పడనుంది. ఇందువల్ల పన్నెండు లక్షల చెట్లు నిర్మూలించక తప్పదని చెబుతున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యతకు విపరీతమైన నష్టం జరుగుతుంది. ప్రాచీన రామలింగేశ్వర ఆలయానికి భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందనటంలో ఎలాంటి సందేహంలేదు.

నేటి వికారాబాద్‌ ‌జిల్లాలోని అనంతగిరి, దామగుండం, రాకమచర్ల అటవీ క్షేత్రాలు, ప్రకృతి రామణీయతకు ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రతీకలు. అనంతగిరి పద్మనాభస్వామి ఆలయం, దామగుండం శ్రీరామలింగేశ్వర ఆలయం రాకమచర్ల శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కలుపుతూ ‘యాత్రా సర్క్యూట్‌’ ఏర్పాటు చేస్తే ఈ వెనుకబడిన ప్రాంతంలో యాత్రతోపాటు, ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఈ క్షేత్ర సందర్శనం కల్గిస్తాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించి, టూరిజం అభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.

 ఆచార్య మత్స్యరాజ హరగోపాల్‌

[email protected]

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE