బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విశాఖ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు కుంభవృష్టి పడింది. కానీ ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు అతలాకుతలమైనాయి. ఆగస్టు 29న చినుకులతో మొదలైన వర్షం ఆగస్టు 30, ఆగస్టు 31 సాయంత్రం వరకు ముంచెత్తింది. విజయవాడ, గుంటూరు నగరాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీకి గంటగంటకు వరద పోటెత్తడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీకి ఎగువ నుంచి 11,25,876 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా వచ్చిన నీరు వచ్చినట్టు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో మరింత పెరగొచ్చని, 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు సామాజిక మాధ్యమాలలో బ్యారేజీ గురించి వార్తలు ప్రజానీకాన్ని కంగారు పెడుతున్నాయి. ముఖ్యంగా సాగర్, పులిచింతల నుంచి విడుదల చేస్తున్న నీటితోపాటు కృష్ణా జిల్లాలోని మున్నేరు, బుడమేరు నుంచి 3.27 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా ప్రకాశం బ్యారేజికి వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు ఎగువ నుంచి 6.36 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా మొత్తం 24 గేట్లు ఎత్తి 6.02 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వచ్చే 6.02 లక్షల క్యూసెక్కుల నీటితోపాటు ప్రకాశం బ్యారేజీ ఎగువన వాగుల ద్వారా, క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన అతిభారీ వర్షం వల్ల మరో 3.27 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ప్రకాశం బ్యారేజీకి ఆదివారం 10.56 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాలన్ని ముంపునకు గురవుతు న్నాయి. సోమవారం నాటికి ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 5.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. సాగర్‌కు 4.83 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్టు ఆనకట్టకు ఉన్న 26 గేట్ల ద్వారా 5.16 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి ఢీకొన్న ఫిషింగ్ బోట్లు
వరద ప్రవాహం ధాటికి భారీ ఫిషింగ్ బోట్లు కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. మూడు నుంచి నాలుగు బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీ కొట్టి అక్కడే ఆగిపోయాయి. అవి ఢీ కొట్టిన తాకిడికి గేట్లు చైన్లు, గోడలు దెబ్బతినడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గత నెలలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకొని పోవడంతో సుమారు 75 టిఎంసీల నీరు సముద్రంలో కలసి పోయి వృథా అయిపోయింది. దాని వల్ల ప్రాణనష్టం అంతగా జరగలేదు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీకి నష్టం జరిగితే దిగువన ఉన్న లంక గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ – గుంటూరు మధ్య 30 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, విజయవాడలో 18 సెం.మీ, గుంటూరు తూర్పు మండలంలో 25 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యధిక వర్షం. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేయడంతో అన్ని గేట్లు తెరిచారు. సుమారు 11 లక్షల క్యూసెక్యుల నీరు సోమవారం నుంచి ప్రవహిస్తూనే ఉంది. వర్షం కాస్త తెరిపిచ్చిందనేంతలోనే మరో ఉపద్రవం బుడమేరు రూపంలో విజయవాడ, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టింది.
కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్నా పెద్ద వాగులను కలుపుకొని బుడమేరు పూనకమొచ్చినట్లుగా విరుచుకుపడింది. అప్పటికే కృష్ణమ్మ భారీగా ప్రవహిస్తుండటంతో.. బుడమేరు చానల్ నుంచి నదిలోకి నీరు కలిసే అవకాశం లేకపోయింది. పైగా… కృష్ణా నది నీరు కూడా ఎగదన్నింది. దీనికి తోడు.. విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారిలేకుండా పోయింది. 15 వేల క్యూసెక్యుల ప్రవాహ సామర్ధ్యం ఉన్న బుడమేరుకు మూడు, నాలుగు రెట్లు అధికంగా నీరు చేయడంతో కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగి పోయింది. విజయవాడ నగర పరిధిలో సుమారు పది కిలోమీటర్లకుపైగా విస్తరించి ఉన్న బుడమేరు పరీవాహక ప్రాంతాన్ని వరద ముంచెత్తడంతో కొన్ని ప్రాంతాల్లోకి ఐదారు అడుగుల ఎత్తు వరకూ వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో పది అడుగుల ఎత్తువరకూ నీరు నిల్చిపోయింది. బుడమేరు ఈ స్థాయిలో దండెత్తడం మాత్రం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఉదయం నుంచి రాత్రి వరకు మంచి నీరు, ఆహారం లేక జనం తల్లడిల్లిపోయారు. వరద ఉధృతికి సింగ్‌నగర్‌లోని విద్యుత్ కార్యా లయం, సబ్ స్టేషన్ కూడా మునిగి పోవడంతో అంకారం నెలకొంది. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది నిరాశ్రయులను పడవల్లో ఎక్కించుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వర్షాల కారణంగా ఎన్‌టిటిపిఎస్‌లో ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది.
బుడమేరుకు భారీ వరద
ఈ భారీ వర్షాలతో బుడమేరుకు భారీ వరద రావడంతో ఎన్‌టిఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు రెగ్యులేటర్ వద్ద అధికారులు ఒక్కసారిగా గేట్లు ఎత్తివేశారు. బుడమేరు వరద నీరు ఫెర్రీ వద్ద కృష్ణా నదిలోకి వెళ్లే విధంగా పదిహేనేళ్ల క్రితమే మళ్లించారు. అయితే, ప్రస్తుతం కృష్ణానది తీవ్ర ఉగ్రరూపం దాల్చి పోటెత్తి ప్రవహిస్తుండడంతో ఫెర్రీ వద్ద నీరు వెనక్కి ఎగదన్నుతోంది. దీనికితోడు తెలంగాణ నుండి వచ్చే వాగుల నీరు కలవడంతో జి.కొండూరు మండలం వెలగలేరు వద్ద బుడమేరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో, వెలగలేరు, హెచ్ ముత్యాలంపాడు, కవులూరు-కొండపల్లి మధ్య సుమారు ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. పలు చెరువుల కట్టలు తెగిపోయాయి. దీనిపై ప్రజలకు ఎటువంటి ముందస్తు సమాచారమూ ఇవ్వకపోవడం, బుడమేరు పరీవాహక ప్రాంతం ఆక్రమణలకు గురికావడంతో అనేక గ్రామాలతోపాటు విజయవాడ నగరం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. వర్షం నీటితోపాటు ఓవైపు ఎన్‌టిటిపిఎస్ కూలింగ్ కెనాల్, బూడిద చెరువు, మరోవైపు బుడమేరు పోటెత్తడంతో ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కవులూరు, ఈలప్రోలు, రాయనపాడు, పైడూరుపాడు, గొల్లపూడి తదితర గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. బాపట్ల జిల్లా పెసర్లంక అరవింద్ వారథి వద్ద కృష్ణా నదికి గండిపడింది. పోతర్లంక, కొల్లూరు, ఇతర లంక గ్రామాలకు చెందిన రహదారులు నీట మునిగి పోవడంతో రాకపోకలు స్తంభించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని మహానాడు లోకి వరద నీరు ప్రవేశించింది. గుంటూరు, పల్నాడు జిల్లాలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. అమరావతి మండలంలో వైకుంఠపురం, అమరావతి, గిడుగు, పొందుగల, మునుగోడు, ధరణికోట, అచ్చంపేట మండల పరిధిలోని కొనూరు, కస్టాల, చామర్రు, తుళ్లూరు, కొల్లిపర, తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలం, రాయపూడి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఆస్తి, ప్రాణనష్టం
వరద ప్రభావంతో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని వివిధ మండలాల పరిధిలో 50 గ్రామాలు ముంపు బారినపడ్డాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవించింది. దుర్గగుడి, కొండపల్లి ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌లో కొండచరియలు పడి ఐదుగురు, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒకరు మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో మురుగుకాల్వలోకి కారు కొట్టుకుపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌టిఆర్ జిల్లా చందర్లపాడులో వాగులో కొట్టుకపోయి మరొకరు మరణించారు. విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతాన్ని బుడమేరు ముంచెత్తింది. ఆ ప్రాంతానికి కొట్టువచ్చిన ఓ మహిళ మృతదేహం కారుపై ఇరుక్కుపోయింది. విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో ఓ యువకుడు, ఇబ్రహీపట్నం మండలం జూపూడిలో విద్యుత్ లైన్‌మ్యాన్ వరద నీటిలో గల్లంతయ్యాడు. సుమారు ఎనిమిది డివిజన్లలోని 30 వేల కుటుంబాలకు చెందిన లక్ష మందికిపైగా ప్రజలు వరదలో నీటిలో చిక్కుకుపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామం వద్ద హైవేవైపు వాహన దారులు ఎవ్వరూ రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడలో దుర్ఘాఘాట్, ఫ్లై ఓవర్లను మూసివేశారు.
జిల్లాల్లో వరద ప్రభావం
వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కర్నూలు, ఏలూరు, విశాఖలో కుండపోత వర్షం కురిసింది. పలు వాగులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39.7 అడుగులకు చేరింది. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 37.49 అడుగులకు చేరింది. కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షం కురిసింది. కర్నూలు ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఏరులై ప్రవహించింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతుండటంతో హైదరా బాద్ నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చాగలమర్రి మండలంలో వక్కిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. నూజివీడు పెద్ద చెరువుకు గండి పడడంతో నూజివీడు పరిసర ప్రాంతాలు వరద తాకిడికి గురయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న పలువురిని ఎన్టిఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. రామిలేరు వరద తాకిడికి పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామంతోపాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి.
అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీలో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలో జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్. పురంలో కాజ్ వే పై నుంచి నీరు ప్రవహించడంతో 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. విలీన మండలాల్లో శబరి, గోదావరి నదుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. డుంబ్రిగుడ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. శనివారం ఉదయం నుంచీ ఆదివారం (ఆగస్టు 31 నుంచి మరునాడు) ఉదయం వరకూ 83.7 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఇక… మున్నేరు వాగు పొంగడంతో విజయవాడ – హైదరాబాద్ మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
వరద నివారణ చర్యలు
విజయవాడలో బుడమేరు సృష్టించిన విలయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రివర్గ సహచరులు తక్షణం స్పందించారు. అధికారులకు, మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారు. వరద ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బోటులో పర్యటించి పరిస్థితులు సమీక్షించారు. బాధితులతో మాట్లాడారు. ప్రజలకు పాలు, ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్‌లు అన్నీ వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఖర్చుకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల నుంచి వాహనాలు, పడవలు తెప్పించారు. అక్షయ పాత్ర నుంచి, ఇతర ఏజెన్సీల నుంచి సరఫరా చేయగలిగిన ఆహారం తెప్పించారు. అధికారులు, మంత్రులకు ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, అనిత, నారాయణ, ఇతర ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ట్రాక్టర్‌పై వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి, బాధితులను పరామర్శించి వారికి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండి, ఎప్పటికప్పుడు సమీక్షించారు.
-తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్