వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘ఏమే.. సార్‌ ‌లేడా?’’ అని లోపల్నించి గట్టిగా అరిచింది ఇంటావిడ.

‘‘ఉన్నారమ్మా.. బయట ఎవల్తోనో మాట్లాడతన్నారు’’ అంది ఆమె ఉండే గదివైపు అడుగులు వేస్తూ.

ఖరీదైన పటోలా సిల్క్ ‌సారీ భుజాల మీదగా కప్పుకుని గది గుమ్మం దగ్గరకు వచ్చింది ఇంటావిడ.

పని మనిషిని చూసి, అటూ ఇటూ చూస్తూ ‘‘సరేలే.. నువ్వోసారి ఇటు రా’’ అని పిలిచింది.

గదిలోకి వెళ్లి అద్దం ముందు నిల్చుంటూ ‘‘బేబీ లేచిందా?’’ అని అడిగింది.

‘‘ఇంకా లేదమ్మా’’ అంది పని మనిషి.

‘‘సరేలే.. ఇలా వచ్చి, ఇది కాస్త పెట్టు’’ అంటూ చుట్టూ కప్పుకున్న చీరను ఎడమ చేతిపైకి తీసుకుంది.

అప్పుడు చూసింది, జాకెట్టు వెనుక వెలాడుతున్న రెండు కొసలనూ. గట్టిగాలాగి హుక్కు పెట్టింది పనామె.

దాంతో ఇంటావిడ దీర్ఘంగా నిట్టూర్చి ‘‘సరిగ్గా పెట్టావా?’’ అంటూ వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ అడిగింది.

‘‘పెట్టానమ్మా’’ అంది పనామె.

ఆ మెరిసిపోయే వీపూ, నిగారించే మడతలు చూస్తూ..‘బగంతుడు ఈళ్లకే ఇట్లాంటి అందం ఎందుకిస్తాడో’ అనుకుంది.

‘అయినా, పైసలుంటే ఎట్లయినా బాగుంటారు’ అనుకుంది మళ్లీ తనే, కిచెన్‌లోకి వెళ్తూ.

అన్ని అలంకరణలూ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ఇంటావిడ, హడావిడిగా వెళ్లిపోతూ ‘‘అంతగా అయితే, నాలుగు రోజులుండి.. మళ్లీ వచ్చెయ్యవే. సార్‌తో చెప్పి జీతం కూడా పెంచమంటా. జాగ్రత్తగా వెళ్లిరా’’ అంది.

‘‘అలాగే, అమ్మా’’ అంటూ కారు దాకా వేగంగా వచ్చి.. డ్రైవర్‌ ‌కంటే ముందే డోర్‌ ‌పట్టుకుని కారులో ఎక్కుతున్న అమ్మగారికి సాయం చేసింది పనామె. కొంగు నడుము కిందకు వెళ్లిపోకుండా సుతారంగా పట్టుకుని అందించింది. ఆమె కూర్చున్నాక జుట్టు జాగ్రత్తగా పక్కకు తీసి, భుజాల మీదుగా సర్దింది. తరువాత మోకాళ్ల దగ్గర కుచ్చిళ్లు సర్ది, వాటిని పాదాల వరకూ సరిగా లాగుతూ.. ఆమె కాళ్లకు నమస్కరించుకుంది.

ఇంటావిడ అది గ్రహించింది. దాంతో ‘‘చాల్లే..’’ అంది కాస్త కంగారుగా.

హ్యాండ్‌ ‌బ్యాగులోంచి మూడు వేలు బయటకు తీసిందావిడ. మళ్లీ ఏమనుకుందో, రెండు అయిదొందల నోట్లు లోపల పెట్టేసి.. రెండు వేలు పనామె చేతిలో పెట్టింది.

‘‘ఉండనీ, అవసరానికుంటాయి’’ అంది.

‘‘మొన్నే జీతం ఇచ్చినారుగామ్మా’’ అంటూనే ఆ నోట్లను జాకెట్లో పెట్టేసుకుంది పనామె.

కారు ముందుకు కదిలింది. వెళ్లిపోతున్న కారును చూస్తుంటే పనామె కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి.

ఆమె ఆలోచనలు వెనక్కు తిరిగాయి.

                                                                                   *     *     *

హైద్రాబాద్‌ ‌మహా నగరంలోని విశాలమైన రోడ్డు మీద ఆటో వేగంగా దూసుకుపోతోంది. పొద్దుటి గాలి చల్లగా, హాయిగా తగులుతూ రాత్రి రైల్లో చేసిన ప్రయాణ బడలికను తీరుస్తోంది. ఒక పెద్దాయన, పెద్దావిడ, ఒకమ్మాయి, ఆ అమ్మాయి ఒళ్లో ఓ చంటిది ఆటోలో ఇరుక్కుని కూర్చున్నారు. వాళ్లు రోడ్లపై భవనాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా కళ్లింత చేసుకుని చూస్తున్నారు. కొన్ని మరీ ఎత్తుగా ఉండే సరికి ఆ అమ్మాయి ఆటోలోంచి తల బయటకు పెట్టి మరీ చూస్తూ, విస్తుపోతోంది. ఇంతలో వచ్చిన అద్దాల బిల్డింగ్‌లో వీళ్లు ఎక్కిన చిన్న ఆటో పే..ద్ద బస్సంత సాగి సర్రున మాయమై పోయేసరికి-ప్రపంచంలో ఏడు వింతలుంటాయని తెలియని వాళ్లు దాన్నే మొదటి వింతగా నోరెళ్లబెట్టుకుని చూశారు. సంబ్రమంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

అంతటి మహానగరంలో తమ కూతురు ఉండబోతోందన్న ఊహ పెద్ద వాళ్లిద్దరినీ ఆనందంలో తేలియాడిస్తోంది. ఇంతకీ ‘ఇంత పెద్దూరులో అల్లుడు ఏం పనిజేస్తున్నాడో’ అనుకున్నాడు పెద్దాయన మనసులో. ‘ఇంత ఘనంగా ఉన్న ఊరంట నా బిడ్డ ఎట్ట బతుకుతుందో’ అనుకుంటూ ఏమైనా చంటిదానిదే అదృష్టం అనుకుని, కూతురు ఒళ్లో నిద్రపోతున్న పిల్లని ముద్దాడింది పెద్దావిడ. ఆ అమ్మాయి పైకి మురిసిపోతూనే, లోపల్లోపల భయపడుతోంది ‘బతుకెట్టా ఉడబోతందా?’ అని.

వీళ్ల మనోభావాలతో సంబంధంలేని ఆటో దూసుకుపోతూనే వుంది. కాసేపటికి పెద్ద పెద్ద ఎత్తయిన భవనాలు, రంగురంగుల అద్దాల మాల్స్, ‌విశాలమైన ఆవరణలు మాయమైపోయి, చిన్నపాటి భవంతులు ప్రత్యక్షమయ్యాయి. వాటితోపాటే పాడుబడిన మేడలు, సగం కట్టి వదిలేసిన అపార్ట్ ‌మెంట్‌లు, అక్కడక్కడ చెత్త కుప్పలు కనిపించడంతో-తాము ‘ఇందాకటి ఊరులోనే ఉన్నామా? లేక వేరే ఊరులోకి వెళ్లిపోతున్నామా?’ అని ఆశ్చర్యపోయారు ఆటోలోని ముగ్గురూ.

ఇంతలో పెద్దాయన జేబులోని చిన్న ఫోను మోగింది.

‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగాడు అల్లుడు. మామ చెప్పలేకపోయాడు. ఫోను ఆటో ఆయనకు ఇమ్మన్నాడు. ఆటో ఆయన చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయి, ‘‘అక్కడికి ఎందుకు పోయారు?’’ అని అడిగాడు.

‘‘ఏమో, నాకెట్ల తెలుస్తది. మీవోళ్లని అడుగు. ఇప్పుడు యాడకు తీస్కరావలో సక్కగ చెప్పు’’ అన్నాడు ఆటోవాడు.

అల్లుడు చెప్పాడు. మరికాసేపటికి ఆటో మామూలు మేడలు, పాత అపార్ట్‌మెంట్‌లు, కిరాణా షాపులు, టీకొట్లు ఉండే ప్రాంతంలోకి ప్రవేశించింది. అప్పుడు ఆటోలోని వారికి కాస్త ఊపిరి వచ్చింది.

‘ఇదంతా మన ఊరి దగ్గర టౌన్‌ ‌లెక్కే ఉంది’ అనుకున్నారు.

ఇంతలో ఆటో ఓ టీకొట్టు దగ్గర ఆగింది. ఆటో డ్రైవర్‌ అక్కడి వాళ్లని అడ్రస్‌ అడిగాడు.

‘‘ఇట్ల సక్కగ పోయి రైట్‌ ‌తీస్కో. తరువాత లెఫ్ట్ ‌తీసుకుని ముందకు పోతే..’’ అంటూ ఒకడు అడ్రస్‌ ‌చెబుతుండగానే, మరొకడు కలుగజేసుకుని ఎక్కడకు పోవాలో తెలుసుకుని..

‘‘అయ్యన్నీ కావుగానీ, ఒగ పనిజెయ్‌.. అటు చూడు ఆ గల్లీలెల్లి నీల్లొస్తన్నాయ్‌ ‌గదా. అట్లా ఎంబడి పో. అంటే ఉల్టా అన్నట్టు. నీళ్లు ఎటు తిరుగుతుంటే అటే.. పో. నువ్వడిగిన ఇంటి దగ్గరుంటవ్‌’’ అని చెప్పాడు.

ఏదో భారీ వర్షం కురిసినట్టు ఆ సిమెంట్‌ ‌రోడ్డు వెంట నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. సందులు గొందులు తిరుగుతూ నీళ్ల వెంట పోయిన ఆటో, నీళ్లు ఎక్కడ్నించి వస్తున్నాయో కనిపెట్టలేక పోయిందిగానీ, అడ్రస్‌ను మాత్రం దొరికిచ్చుకుంది.

‘‘బావున్నావా బాబూ’’ అంటూ అల్లుడిని పరామర్శిస్తూ ఆటో దిగారు పెద్దవాళ్లిద్దరూ.

మొగుడ్ని చూసి సిగ్గుపడుతూ, మురిసిపోతూ, నవ్వుకుంటూ.. చంటిదాన్ని మొగుడికి అందించింది ఆమె.

                                                                                   *     *     *

అలా సుమారు పది, పన్నెండేళ్ల క్రితం ఆటో దిగిన ఆ అమ్మాయే, ఇప్పుడు ఆరితేరిన పనామె అయ్యింది.

చంటి బిడ్డను ఎత్తుకుని వచ్చినామె, తరువాత చంటాడ్ని కనింది. ఏనాడూ మొగుడును ఇది కావాలి, అది కావాలి అని అడగలేదు. నగరపు సొగసులకు చిక్కలేదు. పైసాపైసా కూడ బెట్టింది. ఆమె ఒక్క పొద్దు లేవలేకపోతే, ఆ ప్రాంతంలోని సుమారు అరడజనుకుపైగా ఇళ్లల్లో అల్లకల్లోలం చెలరేగే అంత పనిమంతురాలనిపించుకుంది. పాచి పనులు, గిన్నెలు తోమడం, బట్టలుతకడం ..ఒక్కటేమిటి ఏం చెప్పినా చేసేది. చంటి పిల్లల ముడ్లు కడిగేది. డైపర్లు మార్చేది. ఆదివారాలు అమ్మగార్ల తలలకు హెన్నా పెట్టేది. అడక్కుండానే వంటింట్లో సామాన్లు సర్ది పెట్టి, అల్మారాలను సుబ్బరంగా తుడిచేది. దాంతో అందరూ ఆమె పట్ల ఆదరం చూపారు. పిల్లల స్కూలు ఫీజులకు జీతంలో పట్టుకోకుండానే డబ్బులు ఇచ్చేవారు. విరిగిపోయిన బొమ్మలు, సగం రాసి వదిలేసిన నోట్సులు, బిగుతైపోయిన బట్టలు పిల్లలకు దొరికేవి. తమకు మోజు తీరిపోయిన చీరలను పనామెకు ఇచ్చేసేవారు. పండుగలకీ, పబ్బాలకీ తక్కువ రకానివే అయినా కొత్త చీరలు పెట్టేవారు.

‘‘సారువేమైనా ఉంటే ఇయ్యరామ్మా, మా ఆయన తొడుక్కుంటాడు’’ అని అడిగి మొగుడుకు కూడా లోటు లేకుండా చూసేది. ఆ మొగుడు మంచివాడు కాకపోయినా, చెడ్డవాడు కాడు. అంటే, ఆమెలా డబ్బులు కూడబెట్టడు, అలాగని పనిజేసి సంపాదించిందంతా తాగుడుకే తగలేయడు.

‘సిటీలో అన్నీ మోసాలని అందరూ అంటారుగానీ, చుట్టూ ఇంతమంది దయ చూపుతుంటే మనకేటి లోటు’ అని మొగుడు పెళ్లాలిద్దరూ అనుకునేవారు. అలా ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుని బతుకు బండిని ఓపికున్నంతలోనే ఒడ్డుకు చేర్చాలని తాపత్రయపడుతున్నప్పుడే ఈ కుటుంబం పరిచయం అయ్యింది.

ఆ కుటుంబానికి ఆ బస్తీ మొదట్లో ఇండిపెండెంట్‌ ‌హౌస్‌ ‌వుంది. అప్పడప్పుడే రియలెస్టేట్‌లో కలిసి వస్తూండటంతో-ప్రస్తుతం ఉంటున్న ఇంటి మీద ఇంకో ఫ్లోర్‌ ‌లేపారు. ‘పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. చదువుకోవడానికి ఉంటాయ’ అని పైన రెండు రూమ్‌లు వేసాడు. ఆపైన ప్లాస్టిక్‌ ‌రేకులతో షెడ్డులా కట్టి, పార్టీలకు వేదికగా చేసుకున్నాడు.

డబ్బు ఎప్పుడూ, వస్తూనే బద్ధకాన్ని వెంటేసుకుని వస్తుంది. అందుకే పిల్లలు ఎదిగొచ్చిన ఇంట్లో పని చేసుకోలేక ఇంటావిడ ఆపసోపాలు పడిపోయేది. ఓ పక్కన చిట్టీల వ్యాపారం పెరిగింది. మరోపక్క కిట్టీ పార్టీల కొత్త హడావిడి మొదలయ్యింది. అందుకే పనామెను తనకు మాత్రమే పనిచేసేలా పెట్టుకో వాలనుకుంది. అలాగే, వ్యాపార పనుల కోసం ఆయనకూ తిరుగుడు ఎక్కువయ్యింది. ఓ డ్రైవర్‌ని పెట్టుకుంటే బావుంటుందనుకున్నాడాయన.

అతడికి అదే బస్తీలో బాగా లోపలకు, వెస్ట్ ‌ఫేసింగ్‌ది ఓ నాలుగు వందల గజాల స్థలం ఉంది. అక్కడ సిమెంట్‌ ఇటుకలతో, రేకులతో రెండేసి గదుల చొప్పున రెండు వాటాలు వేసాడు. ఒక దాంట్లో పనిమనిషి కుటుంబం, రెండో దాంట్లో డ్రైవర్‌ ‌కుటుంబం ఉండాలి. ఆ రెండు కుటుంబాల్లోని ఆడామగా తమ ఇంటికే పనిజేయాలి. అందుకు మామూలుగానే జీతం ఇస్తారు. ఇంటికి అద్దె ఏమీ తీసుకోరు. ఈ షరతులకు ఒప్పుకుని డ్రైవర్‌ ‌కుటుంబం వెంటనే వచ్చి చేరిపోయింది.

పనామె మాత్రం ఆలోచనలో పడిపోయింది. ‘నలుగురు నాలుగు జేతులేసేదీ, ఈమె ఒక్క చెయ్యేసేదీ సమానమైతదా? ఈమెను నమ్ముకొని అందర్నీ కాదంటే.. రేపు మల్ల ఏమైన తేడ వస్తే?’ అని తీవ్రంగా ఆలోచించింది.

కానీ, ఇంటి కిరాయి మిగులుతుంది, మొగుడికి కూడా మంచిగ పని దొరుకుతుందని ఒప్పేసుకుంది. ఆ రియలెస్టేట్లు, ఆళ్ల వ్యాపారాలు, ఆళ్ల పార్టీలు తెలిసిన మొగుడు వెంటనే ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు.

రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆ ఇంట్లో అస్తమాటూ పని ఉంటోంది. వచ్చేవాళ్లందరికీ టీలు, కాఫీలు, టిఫిన్లు చేయడం, అందివ్వడం, రాత్రిళ్లు పార్టీలు.. అందుకు అన్నీ వండటం, అమర్చడం, తరువాత కడగడం, తుడవ•డం-ఒక్కటేమిటి ఎన్నో పనులు. కాకపోతే, వెజ్‌ అయినా, నాన్‌ ‌వెజ్‌ అయినా ఎప్పుడూ మిగులూతూనే ఉండేది. వాటితో పనామె ఇంట్లోని నలుగురు పొట్టలు నిండిపోయేవి. ఆ నిండుదనం శరీరపు నిగారింపులోనూ కనిపించడం మొదలయ్యింది. అది ఆ ఇంటి వాళ్ల కంటిచూపును దాటిపోలేదు. కంటగింపు కాకుండానూ పోలేదు. అందుకే క్రమేణా విసుగులూ, కోపాలూ ఎక్కువయ్యాయి. అయినా, ‘ఎట్టేవాల్లు ఓ మాటనరేటి?’ అనుకుంటూ పనోళ్లు పదేళ్లు నెట్టు కొచ్చేశారు.

కానీ, అతి త్వరలోనే వారికొక అగ్నిపరీక్ష ఎదురయ్యింది.

ఇంటర్‌ ‌చదువుతున్న పనామె కొడుకు ఫస్టియర్‌లో 85శాతం మార్కులు సాధించడం ఆ కుటుంబంలో సంతోషాన్ని, యజమాని కుటుంబంలో కలకలాన్ని రగిలించింది.

‘‘ఎందుకే వాడ్నలా కాల్చుకు తింటావు. ఎంత చదివి, ఎన్ని మార్కులు తెచ్చుకుంటే ఏం లాభం? ఏదో పని చేసుకోవలసిందేగా?’’ అని ఇంటావిడ ముఖం మీదే అనేసింది, అక్కసుగా.

ఆమె విసురు ఏ మాత్రం పట్టనట్టు ‘‘ఆడు, ఆడంతట ఆడే సదువుకుంటాడమ్మా. మేమేమీ అనమాడ్ని. సాఫ్టేరు చేయాలని కలటమ్మా. మొన్న సెప్తన్నాడు’’ అంది పనామె మురుసుకుంటూ.

‘‘ఇంజినీరింగే?’’ అంది, ఇంటావిడ ఆశ్చర్యపోతూ.

‘‘అదే కావల్సునమ్మా, ఆడు ఇంకేదో పేరన్నాడు. అది చేస్తే మంచి కంపెనీలల్ల జాబొస్తదని, పైసలు కూడా మంచిగ ఇస్తారని అంటున్నాడు. ఏటవుద్దో సూడాల’’ అంది తన ధోరణిలో పనామె.

ఇంటామె విసవిసా వంటింటిలోంచి లోపలి బెడ్రూమ్‌లోకి వెళ్లిపోయింది.

పౌడర్లు పూసుకుని, బుస్సుమని బాడీ స్ప్రే కొట్టుకుంటున్న మొగుడిని చూడగానే ‘‘చూశారా, ఆ వెధవ ఏకంగా బీటెక్‌ ‌చేస్తాడుట’’ అంది చిరచిర లాడుతూ.

ఆయనేమీ మాట్లాడకుండా ‘ఎవరూ?’ అన్నట్టు చూశాడు.

‘‘ఇంకెవడు, వాడే. ఫ్రీగా ఇల్లు ఇచ్చి, కుటుంబం అంతటినీ నెత్తి మీద పెట్టుకుని మేపుతున్నారుగా?’’ అంటూ ఉద్రేకంతో ఊగిపోయిందావిడ.

ఆయనకు సుపుత్రుడు గుర్తుకు వచ్చాడు. ‘‘డబ్బు రుచి మరిగాడు. మంచి స్నేహాలే పడుతున్నాడు. తోవలోనే ఉన్నాడు. రేపు నేను పాలిటిక్స్ ‌లోకెళ్తే, వాడూ వెనకాలే వస్తాడు కదా. చదువంటావా? మనకెందుకే? ఏదో నామ్‌ ‌కే వాస్త్ ఉం‌టే చాలదా? చదువుకునే వాళ్లకంటే వాడు ఎక్కువే సంపాదిస్తాడు’’ అన్నాడు.

‘‘అదే, ఆ నామ్‌ ‌కే వాస్తే అయినా ఉండాలి కదా? పనిదాని కొడుకు ముందు పోతుంటే, వీడు వెనుక నడవాలా?’’ అని నిలదీసిందావిడ.

‘‘మాట్లాడ్తాలేవే’’ అనేసి అతడు అప్పటికి బయటపడ్డాడు.

ఓ రోజు రాత్రి పార్టీ పూర్తయ్యాక, అంతా క్లీన్‌ ‌చేస్తూ పనామె మొగుడు ఎదురు పడ్డాడు. కాసేపు వాడితో ఆ మాటా, ఈ మాటా మాట్లాడి ‘‘ఏమ్రా, ఏమంటున్నాడు నీ కొడుకు? ఆ పెద్దపెద్ద సదువులవీ నీతోని కావుగానీ.. చక్కగా డ్రైవింగ్‌ ‌నేర్చుకోమను. మంచిగ ఉంటుంది. మనకాడే ఉంటడు. చేతిలో పనుంటే దాని విలువే వేరు. నీకు తెల్వదారా?’’ అన్నాడు.

‘‘అట్లాగే, అయ్యా.. ఆడితో చెప్తా’’ అన్నాడు పనామె మొగుడు.

వాడేదో తేడాగా వాగుతాడు, నయానో, భయానో ఒప్పించాలని అనుకున్న ఆయనకు, వాడు అంత మామూలుగా ఒప్పేసుకోవడం అసంతృప్తి కలిగించింది. అయినా జరగబోయేది తమకు మేలే కాబట్టి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు.

అయ్యగారూ. అమ్మాగారూ అన్న మాటలను పనామె, ఆమె మొగుడూ తర్కించుకున్నారు.

‘దేవుళ్లాటోల్లు డ్రైవర్‌ ‌పనిచ్చి పైసలిస్తామంటుంటే ఇంకా సదువెందుకే?’’ అన్నాడతను

‘‘మన పిల్లోడు సక్కగ సదువుతుంటే నిప్పులు పోసుకునేటోళ్లు దేవుల్లెట్లా అగుతారూ?’’ అంది పనామె.

‘‘ఏటి, సదివేసి అమెరికా ఎలిపోతాడనే? డాలర్లు ఒంపేస్తాడు, ఓయమ్మ కొంగుసాచీవే..’’ అన్నాడతను.

‘‘డాలర్లే పంపుతాడో, రూపాయలే పంపుతాడో.. నానేటి ఆశపడ్నానా? అమ్రికా పోకపోతే.. అమీర్పేట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఏటయిందంట? ఈడదాకా వస్తామని అనుకుంటిమా మనం, ఇప్పుడు రాలే’’ అని ఎదురు ప్రశ్నించిందామె.

‘‘నా కొడుకు సదువుకుంటే గొప్పోడు కాకపోయేట్టయితే.. ఆలకెందుకంట అంత కడుపుమంట?’’ అని నిలదీసింది.

‘‘నీకర్థంగాట్లే.. మనమెప్పుడూ ఆళ్ల సేతికిందనే ఉండాల. ఆళ్ల దయ, దరమం మీద ఆదారపడుకోని బతుక్కోవాల. పదేండ్ల పైసంది ఈ కుటుంబాన్ని సాకుతున్నాం. రేపు నా కొడుకు, ఆడి పెండ్లాం, పిల్లలు గూడా.. ఈళ్ల దయాదాక్సిన్యాలపైనే బతకాల్నా? ఎంత ఇసం నింపుకున్నారు ఈల్ల కడుపులల్ల. ఇన్నాళ్ల సంది తెల్వకనేపాయె’’ అంటూ చేతులు తిప్పుతూ తిట్టుకుంటూ దుమ్మెత్తి పోసింది. నోటితో కాండ్రిచి వూసింది.

‘పాచిపని చేసుకునేదైనా పెండ్లాం.. పెండ్లమే’ అని ఆమె తెలివికి తలొగ్గేశాడు మొగుడు.

                                                                                   *     *     *

‘‘ఓ.. యాడజూస్నా.. అల్లంత ఎత్తున ఆకాశంలోకెళ్లి అపార్టుమెంట్లు కడతన్నారు. ఏ మూలకు పోయినా నాలుగిళ్లు దొరకవా ఏటి, పనిజేసుకోనీకి?’’ అనేదే ఆమె ధైర్యం. ఆ ధైర్యంతోనే కుటుంబతో కలిసి నగరానికి మరోవైపు ప్రయాణం ప్రారంభించిందామె. ఆత్మశుద్ధిలేని అభివృద్ధిని చెమటతో ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు వాళ్లు. తాము రెక్కలు ముక్కలు జేసుకున్నారు. పిల్లలైనా చాకిరీని తప్పించుకుని రెక్కలిప్పుకుని పైకి పైపైకి ఎగరాలన్నదే పనామె ఆశ. పనామె, ఆమె మొగుడు, కూతురు ఆటోలో ఇరుక్కుని కూర్చున్నారు. మరో ఆటో ట్రాలీలో సామాను వేసుకుని, స్నేహితుడి బైక్‌పై వెనుకే వస్తున్నాడు కొడుకు. ఒకప్పటి బెరుకు లేదు ఆమె ముఖంలో, పైగా కుటుంబం తోడుందన్న ధీమా తొణికిసలాడుతోంది.

‘నీళ్లలో తడిసినవాళ్లు బట్టలు మార్చుకుంటే, చెమటలో తడిసినవాళ్లు చరిత్రను మారుస్తార’ని ఆ ఆటో వెనుక రాసి ఉన్నట్టు వాళ్లెవరికీ తెలియనే తెలియదు.

– దేశరాజు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE