జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ అందించిన సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. డిసెంబరు 4న ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దానితో పాటు దాదాపు కొన్ని రాజ్యాంగ సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయవలసి ఉంటుంది. ఈ పక్రియ అంతా పూర్తికావటానికి సుదీర్ఘ సమయం పడుతుంది. 2029 నాటికి గాని జమిలి ఎన్నికలు (లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, ఆ తర్వాత 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు) కార్యరూపం దాల్చే అవకాశం లేదు.
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని, ప్రజల భాగస్వామ్యానికి, వాళ్లు మరింత చైతన్యవంతం కావటానికి ఇదో ముందడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించిన సందర్భంగా ఆయన స్పందించారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాధాన్యతను మోదీ వివరించారు. తరచూ ఎన్నికలు నిర్వహిస్తూం డటం వల్ల దేశ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతోందని చెప్పటమే కాదు. దేశంలోని రాజకీయ పక్షాలతో పాటు, భాగస్వామ్యపక్షాలన్నీ ఈ పక్రియను ముందుకు తీసికెళ్లటానికి చొరవ తీసుకోవాలని కోరారు. ఒకే దేశం-ఒకే ఎన్నికకు దేశవ్యాప్తంగా ఏకగ్రీవ మద్దతు లభించిందని కోవింద్ స్వయంగా పేర్కొన్నారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని బీజేపీ హర్షం ప్రకటిస్తే, కాంగ్రెస్ నాయకత్వంలోని దాదాపు రెండు డజన్‌ల రాజకీయ పార్టీలు అది ఆచరణ సాధ్యం కాదని, అనవసరమని వాదిస్తున్నాయి.
అసలు జమిలి ఎన్నికలు ఈ దేశానికి కొత్త కాదు. 1957లో-బిహార్, బాంబే, మద్రాస్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్- మొత్తం ఏడు రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించారు. 1967లో నిర్వహించిన 4వ సార్వత్రిక ఎన్నికల వరకూ ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ అనేది అమలులో ఉంది. ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలను తమ పదవీకాలం పూర్తి కాకుండానే రద్దు చేయటం ప్రారంభించాయి. దానికి తోడు సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైంది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఏర్పాటయిన సంకీర్ణ ప్రభుత్వాలు అర్థాంతరంగా కుప్పకూలటంవల్ల వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించటం అనివార్యంగా మారింది. 1968, 1969లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా రద్దయ్యాయి. 1970లో ఏకంగా లోక్‌సభే రద్దయ్యింది. దానివల్ల ఒకే సారి ఎన్నికలు నిర్వహించే వలయం దెబ్బతింది.
ఈ ఆలోచనకు ఎలా బీజం పడింది?
2017లో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలో తొలిసారిగా జమిలి ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తరపున చేసిన ప్రసంగంలో, ఎన్నికల సంస్కరణపైన నిర్మాణాత్మకమైన చర్చ చేయవల సిందిగా సూచించారు. స్వాతంత్య్రం తొలిరోజుల్లో అనుసరించిన మాదిరిగా లోక్‌సభ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఒకేసారి ఎన్నికలకు వెళ్లే విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించారు. అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి ఎన్నికల కమిషన్ కార్యా చరణను ముందుకు తీసికెళ్లాలని సూచించారు.
దాంతో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 2, 2023న మాజీ రాష్ట్రపతి కోవింద్ ఛైర్మన్‌గా, మరో ఎనిమిది మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాజకీయ ప్రముఖులు అమిత్ షా, అర్జున్ రామ్ మేఘవాల్, మాజీ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్ సభ డాక్టర్ సుభాష్ సి కాశ్యప్, 15వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ ఎన్.కె. సింగ్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ప్రభృతులు ఇందులో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదురి సభ్యునిగా ఉండటానికి తిరస్క రించారు. ఇదంతా కంటితుడుపు చర్యగా అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి 14వ తేదీన కోవింద్ కమిటీ 18వేల పేజీలతో తన నివేదికను రాష్ట్రపతి ముర్ముకు అందించింది. జమిలి ఎన్నికలలో భాగంగా రెండు దశల ఎన్నికలకు కమిటీ సిఫార్సు చేసింది. లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అనంతరం 100 రోజులలోగా పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా ఉపయోగించాలి. దేశవ్యాప్తంగా ఈ అంశంపైన లోతుగా చర్చించాలి. అలాగే ఆచరణలోకి తేవటానికి ఒక కమిటీని కూడా నియమించాలని సూచించింది.
ఒకే దఫా ఎన్నికలు నిర్వహించటం అనేది ఎన్నికల పక్రియను సమూలంగా మార్చి వేస్తుందని కమిటీ అభిప్రాయపడింది. 32 రాజకీయ పార్టీలు, సమాజంలో ఉన్నతోద్యోగాల్లోఉన్నవారు, పదవీ విరమణ చేసిన వాళ్లు, న్యాయకోవిదులు ఈ ప్రతిపాదనను స్వాగతించారని, దాదాపు 21వేల మంది తమ అభిప్రాయాలను ప్రకటిస్తే సలహాలు ఇచ్చిన వారిలో 80 శాతం మంది దీనికి సుముఖంగా ఉన్నారని ప్రకటించారు.
జమిలి ఎన్నికలు ఎందుకు?
జమిలి ఎన్నికలను సమర్థిస్తున్నవారి వాదనలు చూస్తే.. తరచూ ఎన్నికలు నిర్వహించటం వల్ల ప్రభుత్వ ఖజానాపైన భారం పడుతోంది. దానికితోడు రాజకీయ పార్టీల ఖర్చులను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏడాదిలో కనీసం ఐదుసార్లు ఎన్నికలు నిర్వహిస్తు న్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చేరిస్తే వాటి సంఖ్య పెరుగుతుంది.
- అకాల ఎన్నికలు అస్థిరతకు, అనిశ్చితికి కారణ మవుతాయి. సప్లై చెయిన్స్ పైన, ఆర్థికాభివృద్ధి పైన, వ్యాపార పెట్టుబడులపైన ప్రభావం చూపుతోంది.
- ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వయంత్రాంగాన్ని తరచూ అటూ ఇటూ మార్చటం వల్ల పౌరులకు ఇబ్బంది కలుగుతోంది.
- ప్రభుత్వ అధికారులను, సెక్యూరిటీ సిబ్బందిని తరచూ ఎన్నికల్లో వినియోగించటం వల్ల వాళ్ల విధులపైన ప్రభావం పడుతోంది.
- ఎన్నికల వల్ల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్) అమలులోకి రావటం వల్ల 45 నుంచి 60 రోజుల పాటు విధాన నిర్ణయాలు తీసుకోవటం ఆగిపోతోంది. దానికి తోడు అభివృద్ధి కార్యక్రమాల వేగం మందగి స్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రకటనలూ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది.
- ఎన్నికల పట్ల ఓటర్లలో నిరాసక్తత పెరిగి వారి భాగస్వామ్యానికి సవాలు ఎదురవుతోంది.
ప్రతిపక్షాల అభిప్రాయం
ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాం గంలో ఎక్కడా లేదని కొందరు వాదిస్తున్నారు. ఎన్నికయిన రాష్టప్రభుత్వాలను రద్దు చేయటానికి రాజ్యాంగపరంగా రాష్ట్రపతికి సంక్రమించే అత్యవసర అధికారాల గురించి చర్చించినప్పుడు కూడా రాజ్యాంగ సభ జమిలి ఎన్నికల ప్రస్తావన చేయలేదు. దీన్ని బట్టి ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం అనేది సహేతుకమైన, వివేకవంతమైన, ప్రజాస్వామ్య నిర్మాణానికి అనుకూలమైన నిర్ణయం కాదు అని అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగం ప్రధాన లక్ష్యమైన సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని చెప్పారు.
జమిలి ఎన్నికల నిర్వహణకు నియమించిన కమిటీలో భారతదేశం భిన్నత్వం ప్రతిబిం బించలేదని, కమిటీ ప్రజా బాహుళ్యంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఏ ఒక్క ముఖ్యమంత్రిని, ప్రాంతీయ పార్టీనేతను కమిటీలో తీసుకోకపోవటాన్ని తప్పు పడుతున్నారు. కోవింద్ ప్యానల్ సిఫార్సులను కేబినెట్‌ఆమోదించగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ‘‘హర్యానా ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసే ప్రయత్నం’’ అని వ్యాఖ్యానించారు. ఇండీ బ్లాక్ సభ్యులు బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పందిం చారు. ఇది రాజ్యాంగ నిర్మాణాన్ని దెబ్బతీయటమే అని మమత అంటే, ఆచరణ సాధ్యం కాని ఆలోచన అని స్టాలిన్ అంటారు. ఆప్, సమాజ్ వాదీ పార్టీలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. జమ్ము కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్,పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీలు సానుకూలంగా ఉన్నాయి.
సవాళ్లు, అవరోధాలు
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే మొత్తం 6 రాజ్యాంగ సవరణలు చేపట్టవలసి ఉంటుంది. ఈ సవరణలు చేపట్టటం అనేది ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తుంది. రాజ్యాంగ సవరణలను పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించాలి. లోక్ సభలో బీజేపీ ఆ మార్కు దాటాలంటే సొంత బలగంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. రాజ్యసభలో మరింత కష్టపడాలి.
లోక్‌సభలో ప్రస్తుతం ఎన్డీయే బలం 293, జమిలి ఆమోదానికి అవసరమైనది 362 మంది. రాజ్యసభలో ఎన్డీయేబలం 121, జమిలి ఆమోదానికి అవసరమైనది 164. మనది పార్లమెంటరీ ప్రజా స్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. వాటిని ఒప్పించాలి. అందుకు పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు సరేననాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలిని అంగీకరిం చాలి. ప్రస్తుతం బీజేపీ (దాని మిత్రులు) 19 రాష్ట్రాలతోపాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది. దాని వల్ల రాష్ట్రాల ఆమోదం పొందటం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇక చేపట్ట వలసిన రాజ్యాంగ సవరణలేమిటో ఇప్పుడు చూద్దాం.
- ప్రజాప్రాతినిధ్య చట్టం
హౌస్ తన ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నా లేదా రద్దయినా ఆరు నెలల వ్యవధిలో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని ఈ చట్టం చెబుతోంది. అసెంబ్లీకి ఐదేళ్ల పదవీ కాలం, ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారు అన్న అంశాల్లో మార్పులు చేయవలసి వస్తుంది. ఇలా మార్పు చేయటం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయటమని ఒకే దఫా ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పార్టీలు చెబుతున్నాయి.
రాజ్యాంగంలోని 368వ అధికరణం గురించి ప్రస్తావిస్తున్నాయి. రాజ్యాంగ సవరణకు అనుసరించ వలసిన విధివిధానాలను అది చెబుతుంది. దాంతో పాటు రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే శక్తి పార్లమెంటుకు లేదని చెబుతుంది. ఇకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని 141, 152 సెక్షన్లు సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన అంశాలను చర్చి స్తాయి. అలాగే 147, 151ఏ సెక్షన్లు ఉపఎన్నికల అంశాలను చర్చిస్తాయి.
- రాజ్యాంగ అధికరణ 83(2),
అధికరణ 172(1)
ఆర్టికల్ 83 (లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమి తికి సంబంధించినది), ఆర్టికల్ 172 (1) (రాష్ట్రాల అసెంబ్లీకు ఐదేళ్ల గడవుకు నిర్దేశించేది, ఆర్టికల్ 83 (2), 172(1) లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితికి సంబంధించినవి. దీని ప్రకారం తాము మొదటిసారి సమావేశం అయిన నాటి నుంచి ఐదేళ్ల పాటు కొనసాగుతాయి. (మధ్యలో రద్దు కాపోతే). ఇంతకు ముందే అవి రద్దు కావచ్చు. ఏ రాజకీయ పార్టీకి తగినంత మెజార్టీ లేనప్పుడు, అవిశ్వాస తీర్మానంలో తమ మెజార్టీని నిరూపించుకోలేనప్పుడు, పార్టీ ఫిరాయింపులు చోటుచేసుకున్నప్పుడు లేదా అలాంటి అనుకోని పరిణామాలు ఉత్పన్నమై హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది.
ఏకకాల ఎన్నికలు నిర్వహించటానికి ఐదేళ్లకు ముందుగా ఆయా అసెంబ్లీలను రద్దు చేయవలసి ఉంటుంది. అవి పూర్తి కాలం పనిచేయవు. లేదా ముందు ప్రభుత్వం ఐదేళ్లలో కొంత కాలం పనిచేసి ఉంటే మిగిలిన కాలపరిమితి వరకే అవి అధికారంలో ఉంటాయి. అందుకు రాజ్యాంగంలో ఈ అధికరణ లను సవరించాలి.
ఆర్టికల్83 (పార్లమెంట్ హౌసెస్ కాలపరిమితి), ఆర్టికల్ 172(రాష్ట్ర అసెంబ్లీల కాలపరిమితి)లను సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్యానల్ ప్రతిపాదించింది. దీనికి రాష్ట్రాల ధృవీకరణతో పనిలేదు.
- కేంద్రపాలిత ప్రాంతాలకు నిబంధనలు
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలకు కూడా సవరణలు చేయాలి. నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్, 1991లోని సెక్షన్ 5 (అసెంబ్లీల కాలపరిమితి), గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్, 1963 లోని సెక్షన్ 5 (అసెంబ్లీల కాలపరిమితి)ను సవరించవలసి ఉంటుంది. అలాగే జమ్ము కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్, 2019లో సెక్షన్ 17 (అసెంబ్లీల కాలపరిమితి)ని కూడా సవరించవలసి ఉంటుంది.
- ఆర్టికల్ 356, ఆర్టికల్ 85, ఆర్టికల్ 174
రాజ్యాంగ నిబంధనలో ఆర్టికల్ 356 అనుసరించి రాష్ట్రంలో ఎన్నికలయి ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఈ అధికరణకు సవరణ చేస్తే గానీ పార్లమెంటు హౌస్‌లను గానీ, అసెంబ్లీలను గానీ నిర్ణీత వ్యవధికి ముందుగా రద్దు చేయటం సాధ్యం కాదు. ఆర్టికల్ 356లోని అత్యవసర నిబంధనలు ప్రభుత్వం పూర్తికాలం పనిచేయకుండా అసెంబ్లీలను దెబ్బతీస్తున్నాయి. దానితో పాటు హంగ్ హౌస్ ఏర్పడటం, అవిశ్వాస తీర్మానం తదితర సంఘటనలు హౌస్ ముందుగా రద్దు కావటానికి దోహదం చేస్తున్నాయి.
ఒక దేశం ఒక ఎన్నికలకు సంబంధించిన నివేదికలో ముంబయ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రాజోగ్ కీలకమైన సూచనలు చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించ టానికి ఆర్టికల్ 85(1), 174(2), 83 (2) లకు సవరణలు చేయాలని ప్రతిపాదించారు.
- ఆర్టికల్ 325
జమిలి ఎన్నికలకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ ఒకే ఓటరు జాబితా, ఒకే ఫొటో ఐడెంటీ కార్డు ఉండాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లను సంప్రదించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల జాబితాను రూపొందించవలసి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి రాష్ట్రానికి తమవైన పంచాయతీ, మున్సిపల్ చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం అవి ఓటరు జాబితాలను రూపొందించుకుంటాయి. ఇప్పుడు ఒకే ఓటరు జాబితా అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. తప్పనిసరిగా ఆర్టికల్ 325 ని సవరించాలి. ఇలా చేయటం వల్ల దాని ప్రభావం ఆర్టికల్ 234కె, 243 జడ్‌ఏ పైన పడుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన జాబితా ఈ చట్టానికి లోబడి ఉంటుంది.
- ఆర్టికల్ 324ఏ
ఆర్టికల్ 83, ఆర్టికల్ 172లను సవరించటంతో పాటు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించటానికి కొత్తగా రాజ్యాంగంలో 324ఏ ఆర్టికల్ ని జోడించాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ కొత్త 324ఏ చట్టం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే, పంచాయతీ, మున్సిపాలిటీలకు ఒకే దఫా ఎన్నికలకు మార్గాన్ని సులభతరం చేస్తుంది.
ఒక దేశం-ఒక ఎన్నిక ఎలా పనిచేస్తుంది?
2029కు ముందు ఎన్నికలు నిర్వహించి, ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయని రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది నుంచి చూస్తే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళ నాడు సహా మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలు సాగుతాయి. కోవింద్ ప్యానల్ సూచన ఏమిటంటే ప్రతి అసెంబ్లీ కాల వ్యవధి 2029 సాధారణ ఎన్నికలకు అనుగుణంగా ఉండే విధంగా సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది. అంటే దీనర్థం 2025 ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ నాలుగేళ్లు మాత్రమే అధికారంలో ఉంటే, 2028లో కర్ణాటక ఎన్నికల్లో గెలిచే పార్టీ 12 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఒక దేశం ఒక ఎన్నికకు అనుగుణంగా అన్నింటిని సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది.
జమిలి ఎన్నికల వల్ల ఎవరికి లాభం?
జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యతలు ముందుకొస్తాయి. అదే సార్వత్రిక ఎన్నికల విషయానికొచ్చే సరికి ఓటరు చూసే అంశాలు వేరు. భారతదేశంలో ప్రధానమైన సమాఖ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు వేరుగా ఉంటాయి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించటం వల్ల రాష్ట్ర, ప్రాంతీయ అంశాలు మరుగున పడతాయి. ఈ విధానం వల్ల ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ పార్టీలు ఎక్కువ ప్రయోజనం పొందుతాయి. ఇది రాజ్యాంగ నిర్మాణా నికి కీలకమైన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అంటున్నారు.
జమిలిపైన మరికొన్ని ప్రతిపాదనలు
లా కమిషన్ 170వ నివేదిక (1999)లో లోక్‌సభకు, అసెంబ్లీలకు ప్రతి ఐదేళ్లకు ఒకేసారి ఎన్నికలకు సిఫార్సు చేసింది. పార్లమెంటరీ కమిటీ 79వ నివేదిక (2015)లో ఒకేసారి ఎన్నికలను రెండు దఫాల్లో నిర్వహించాలని సూచించింది. లా కమిషన్ తన ముసాయిదా నివేదికను 2018లో సమర్పించింది. దీని ప్రకారం లోక్‌సభతో పాటు సగం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి నిర్వహిం చాలి. ఆ తర్వాత రెండున్నరేళ్ల తర్వాత మిగిలిన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. దీనికి అనుగు ణంగా అసెంబ్లీల కాలపరిమితిని పెంచటం గానీ కుదించటం గానీ చేయాలి. ఇందుకు రాజ్యాంగ పరంగా, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951కి సవరణలు చేపట్టాలి. దక్షిణాఫ్రికా, స్వీడన్, జర్మనీ,బెల్జియం తదితర పార్లమెంటరీ డెమోక్రసీలు తమ లెజిస్లేచర్లకు నిర్ణీతమైన కాలపరిమితి విధించాయి. దక్షిణాఫ్రికాలో ప్రతి ఐదేళ్లకు నేషనల్ అసెంబ్లీలకు,ప్రొవిన్షియల్ లెజస్లేచర్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. దేశ అధ్యక్షుడిని నేషనల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. స్వీడన్ ప్రధాని, జర్మనీ ఛాన్సలర్‌లను ప్రతి నాలుగేళ్లకో మారు లెజిస్లేచర్లు ఎన్నుకుంటారు. జర్మనీ ఛాన్సలర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టా లంటే ముందుగా వారసుడిని ఎంపిక చేసుకుని తీరాలి. 2017లో నేపాల్ కొత్త రాజ్యాం గాన్ని స్వీకరించి అన్ని స్థాయిల్లోనూ ఒకే ఎన్నికను నిర్వహించవచ్చు.
మధ్యే మార్గంగా…
ఒకేసారి ఎన్నికలకు రాజకీయపార్టీలకు సుముఖంగా లేని నేపథ్యంలో మధ్యే మార్గాన్ని అనుసరించవచ్చని కొందరు నిపుణులు ప్రతిపాదిస్తు న్నారు. దేశవ్యాప్తంగా ఒకే సారి లోక్‌సభ ఎన్నికలను నిర్వహించటం, అనంతరం రెండున్నర సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం గురించి ఆలోచించవచ్చని అంటున్నారు. ప్రభుత్వం తన పూర్తి కాలం పనిచేయకుండా అర్థంతరంగా కుప్పకూలితే ముందు చెప్పినట్టు, కొత్త ప్రభుత్వం మిగిలిన కాలపరిమితి వరకే పనిచేయాలి. అలాగే దేశంలో ఉపఎన్నికలను అన్నింటిని కలిపి ఏడాదికి ఒక్కసారి నిర్వహించవచ్చు. ఇలా చేయటం వల్ల ప్రజాస్వామ్య, ఫెడరల్ అంశాల్లో రాజీ పడకుండా సాధించవచ్చని వాదిస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఈ అంశాలను విశ్వాసంలోకి తీసుకుంటే వచ్చే దశాబ్దంలో దీన్ని సాధించవచ్చు తర్వాత రోజుల్లో దానిని కొనసాగించవచ్చు.
డాక్టర్ పార్థసారథి చిరువోలు
సీనియర్ జర్నలిస్ట్, 9908892065