భారత్, పాకిస్థాన్‌లు రెండూ వ్యవసాయాధారిత దేశాలే. విభజన కాకపోతే దేశాన్ని ముక్కలు చేసినట్టుగా, నదీ జలాలను కూడా పంచుకోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ, విభన జరిగింది, నదీ జలాల పంపిణీ జరిగింది. కొత్తగా ఉనికిలోకి వచ్చిన దేశమంటూ భారత్ పెద్ద మనసుతో సింధు జలాలలో అత్యధిక నీటిని పాకిస్థాన్‌కే కట్టబెట్టింది. అయినప్పటికీ, పాక్‌కు మాత్రం కృతజ్ఞత మాట పక్కన పెట్టింది, కనీస సుహృద్భావం లేకుండా పోయింది. అన్ని రకాలుగా లబ్ధి పొందుతూనే భారత్‌లోకి ఉగ్రవాదులను పంపి అరాచకాన్ని సృష్టిస్తున్న పాక్ ఆటలకు ఇక ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందేనంటూ భారత్ భావించింది. అందుకే, 1960, సెప్టెంబర్ 19న చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందంలో (ఇండస్ వాటర్ ట్రీటీ -ఐడబ్ల్యూటీ) సవరణలు చేయాలంటూ పాక్‌కు అధికారికంగా నోటీసులు ఇచ్చింది. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు కృష్ణగంగ, రత్లే జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి సుదీర్ఘకాలికంగా కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
వాస్తవానికి, భారత్, పాక్‌ల మధ్య తొమ్మిదేళ్ల చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహాయంతో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇందులో ప్రపంచ బ్యాంకు కూడా సిగ్నటరీనే. నాటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు యుజీన్ బ్లాక్ చొరవతో ఈ సంప్రదింపులు జరిగాయి. అత్యంత విజయ వంతమైన అంతర్జాతీయ ఒప్పందంగా దీనిని చూడటానికి కారణం భారత్ సహనమే. అది పాక్ చేసిన యుద్ధాలను, తీవ్రవాదం సహా పలు దుష్కర్మలను సహించి కొనసాగించింది.
ప్రస్తుతం తీసుకుంటున్న ఈ చర్య కేవలం వనరుల కేటాయింపులకే కాదు, జాతీయ భద్రతకు కూడా అవసరమైనదే. భారత్‌లో అల్లర్లను సృష్టించేందుకు పాక్ తీవ్రవాదులను పంపినప్పటికీ భారత్ ఎంతో సంయమనం పాటిస్తూ వ్యవహ రించింది. కానీ, ఇప్పుడు ఆ సహనం కూడా హద్దులు దాటడంతో శత్రుత్వం కలిగిన పొరుగు దేశపు అవసరాల కంటే స్వదేశపు అవసరాలకు ప్రాధాన్య తనివ్వాలని మన ప్రభుత్వం నిర్ణయించి పాక్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇంతకీ నోటీసు సారాంశం ఏమిటి?
భారతదేశం ఆగస్టు 30, 2024న పాకిస్థాన్‌కు పంపిన నోటీసులో, 1960లో దానిని ప్రారంభించి నప్పటి నుంచీ ఏకపక్ష జల ఒప్పందంగా ఉంటూ వస్తోందని, వాస్తవ ఒప్పందంలో అనేక ఆర్టికల్స్‌ను వాస్తవంగా అంచనావేసి, సమీక్షించవలసి ఉందని పేర్కొంది. సింధు జలాల వినియోగం, జనాభా గణాంకాలు మారిపోతు న్నాయి కనుక, భారత్ స్వచ్ఛ ఇంధనం దిశగా పురోగమిస్తున్నందున ఈ ఒప్పం దాన్ని పునఃపరిశీలించి, మార్చాలి అని వివరించింది. దీనితో పాటుగా, పాకిస్థాన్ వైపు నుంచి నిరంతరం సాగుతున్న తీవ్రవాద కార్యకలాపాలను ప్రస్తావించి, భారతీయ ఉదారత నుంచి అనుచితంగా లాభం పొందిన, పొందుతున్న పాకిస్థాన్ గుర్తించాలని, ఒప్పందాన్ని పునఃపరిశీ లించి, సమీక్షించాల్సిందేనని పేర్కొంది.
అసమంజసమైన ఒప్పందం
ఉమ్మడి సింధు నదీ వ్యవస్థ నుంచి పాకిస్థాన్‌కు 80శాతం జలాలను ఇస్తూ భారత్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేసింది. పాక్ కన్నా వైశాల్యం లోనూ, జనాభాలోనూ కూడా పెద్ద దేశమైన భారత్‌కు నీటి అవసరాలు కూడా ఎక్కువే ఉంటాయి. కానీ కేవలం 20శాతం జలాలు మిగిలాయి. ఈ జలాల్లో కూడా భారత్ కేవలం 4శాతం మాత్రమే ఉపయోగించుకుంటోందని తెలుస్తోంది.అందుకు కారణం, పాక్ సృష్టించే ఆటంకాలేనన్నది నిర్వివాదం. ఈ కేటాయింపు భిన్నమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య జరిగింది. ముఖ్యంగా, భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇంత సుదీర్ఘకాలం శత్రుత్వం కొనసాగుతుందని కానీ, భారత్‌లో తీవ్రవాదానికి పాక్ మద్దతునిస్తుందని కానీ ఊహించని సమయంలో చేసుకున్న ఒప్పందమిది. తర్వాత నుంచీ పాకిస్థాన్ పరోక్ష యుద్ధాలను ప్రోత్సహిస్తూ, భారత్‌లో చిచ్చు పెడుతున్నప్పటికీ ఈ అసమానమైన వాటాలు కొనసాగాయి. యుద్ధం, తీవ్రవాద సమయంలో కూడా భారత్ ఈ ఒప్పందాన్ని కఠినంగా అనుసరిం చింది. కానీ, భారత్‌కు హాని చేయాలనే లక్ష్యంతో ఉన్న దేశానికి లబ్ధి చేకూర్చేలా ఒప్పందానికి కట్టుబడి ఉండమనడం అసమంజసం.
ఒప్పందం కింద ఏ నదుల జలాలు ఎవరికి?
ఈ ఒప్పందం కింద సింధు, ఝీలం, చీనాబ్ నదీ జలాలను పాకిస్తాన్‌కు కేటాయించగా, భారత్‌కు తూర్పు నదులైన రావి, బియాస్, సత్లజ్‌లపై హక్కులు ఉన్నాయి. ఈ నదీ జలాల సహజ ప్రవాహం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు భారత్‌కు అనుమతి ఉంది. ఈ ప్రాజెక్టుల పట్ల పాకిస్థాన్ పదే పదే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అడ్డుకోవడంతో, అది భారత్‌కు జల ప్రవాహాన్ని ప్రభావితం చేసింది. సుదీర్ఘకాలంగా కృష్ణగంగ, రత్లె ప్రాజెక్టుల చుట్టూ అల్లుకున్న వివాదాల అనంతరం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు స్పందనగా, ప్రపంచ బ్యాంకు ఈ సమస్యల పరిష్కారానికి సమాంతర పక్రియలను చేసింది. తత్ఫలితంగా, భారత ప్రభుత్వం ఈ ఒప్పందపు వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని కూడా పునఃపరిగణించమని కోరుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంలోని ఆర్టికల్ 12 (3)కు అనుగు ణంగా ఒప్పందాన్ని సమీక్షించేందుకు ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు నిర్వహించేందుకు పాక్‌ను భారత్ ఆహ్వానించింది. ఈ ఆర్టికల్ ప్రకారం రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని కాలాను గుణంగా అప్పుడప్పుడు సవరించి, ఆమోదించ వచ్చునని ఆర్టికల్ 12(3) స్పష్టంగా చెబుతోంది.
ప్రపంచ బ్యాంకు జోక్యం పట్ల అసంతృప్తి
అమెరికా ఆధిపత్యంలో ఉండే ప్రపంచ బ్యాంకు సహజంగానే పాక్ వైపు మొగ్గు చూపుతూ వస్తోంది. పైగా మధ్యవర్తిననే సాకు చూపి, సింధు నదీ లాల ఒప్పందంలో గతంలో జోక్యం చేసుకోవడం పట్ల భారత్‌లో అసంతృప్తి చెలరేగుతున్నది. ఇరు దేశాల మధ్య జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నడుస్తున్న వివాదాన్ని పరిష్కారం చేస్తామన్న సాకుతో సమాంతర పక్రియలను ఏకకాలంలో అమలులోకి తేవడం పట్ల భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇది సింధు జలాల ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా లేదని భారత్ స్పష్టం చేసింది. వివాదాల పరిష్కారంలో పాక్ చూపుతున్న వైఖరి కారణంగా ఒప్పందాన్ని పునః సమీక్షించాలని భారత్ నిర్ణయించుకొని, పాక్‌కు నోటీసు పంపింది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ తనదైన శైలిలో స్పందిం చింది. భారత్ ఒక తటస్త నిపుణుడిని ఈ వ్యవహా రంపై నియమించాలని కోరుతుండగా, పాక్ మాత్రం హేగ్‌లో గల కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ద్వారానే దీనిని పరిష్కరించాలని పట్టుబడుతోంది. దీనితో భారత్ హేగ్ కోర్టులో పక్రియలను బాయ్‌కాట్ చేసింది.
జగడాలమారి పొరుగు
భారత్‌కు తనవైపు చేపడుతున్న అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పాక్ తన నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది. వాస్తవానికి, ఒప్పందంలో అంతర్గతంగా ఉన్న సహకార స్ఫూర్తి పదాల్లో కనిపిస్తోందే తప్ప చర్యల్లో కనిపించడం లేదు. ఒక దశాబ్దకాలం కిందట జమ్ము నగరంలో తావి నది నుంచి ఒక కాలువను కట్టడానికి సంబంధించి పాకిస్తాన్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం వారివైపు నుంచి వచ్చిన నిపుణులు నిర్మాణాన్ని చూసిన తర్వాత తమ అభ్యంత రాలను ఉపసంహరించుకున్నారు. ఈ ఒప్పందంలోని ఆర్టికల్స్‌లోని అంశాలను పాక్ ఉపయోగించు కున్నంత తరచుగా భారత్ ఉపయోగించలేదు. దానివల్ల భారత్‌కు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం, నిర్మాణ ఖర్చు పెరగడం వంటి అనేకానేక సమస్యలు వస్తున్నాయి. ఈ క్లాజును ఉపయోగించి అభ్యంతరపెడుతున్నామంటూ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి పాక్‌కు ఒక కాగితం ముక్క ఖర్చైతే, భారత్ అప్పటికే దానిని ప్రారంభించి ఉన్నందున కోట్ల రూపాయలు నష్టపోతోంది.
తీవ్రవాదంతో విసిగిపోయిన భారత్
వీ•న్నింటికీ తోడుగా భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఇస్తున్న మద్దతు సుస్పష్టంగా కనిపిస్తున్నప్పుడు దాని పట్ల ఉదారత చూపడం కూడా తప్పే. వారు భారత్‌ను అస్థిరం చేసేందుకు చురుకుగా పని చేస్తున్నప్పుడు మెజారిటీ సింధు నదీ జలాలపై నియంత్రణను వారికి ఉండనివ్వడం వ్యూహాత్మకంగా విధ్వంసకరం. కొన్ని దశాబ్దాలుగా, ఏం జరిగినా పట్టించుకోకుండా భారత్ ఒప్పందానికి కట్టుబడి ఉంది కనుకనే, తన భారత వ్యతిరేక విధానాలు, చర్యలతో పాకిస్థాన్ పురోగ మించగలిగింది. తీవ్రవాద దాడులు, తిరుగుబాట్లకు మద్దతు, చొరబాట్లను ప్రోత్సహిస్తూ భారత్‌ను లోకువ చేసింది. ఈ ఒప్పందాన్ని సమీక్షించాలన్న భారత్ నిర్ణయం కేవలం జలాలకు సంబంధించిన వ్యవహారం కాదు, అది ఒక సందేశాన్ని పంపడం. ఈ ఒప్పందాన్ని పట్టుకువేళ్లడం ద్వారా మనం ఒక శత్రురాజ్యాన్ని పోషిస్తుంటే, అందుకు బదులుగా అది తీవ్రవాదానికి మద్దతునిచ్చి, నిధులు సమకూరు స్తోంది.
భారత్ చర్య తీసుకోవలసిన సమయం
సింధు జలాల ఒప్పందంలో మార్పులు చేయడం అన్నది న్యాయమే కాదు భారతదేశ భద్రతకు కీలకం కూడా. అందుకే సింధు నదీ జలాల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, రక్తం, నీరు కలిసి సాగలేవంటూ స్పష్టం చేశారు. పెరుగు తున్న జనాభా, స్వచ్ఛమైన ఇంధన అవసరాల కోసం మరిన్ని జల వనరులు కావాలి. భారత భూభాగమైన పీఓకే నుంచి ప్రవహించే జలాలపై తీవ్రవాదులకు నిధులను, ఆయుధాలను ఇచ్చి ప్రోత్సహించే దేశానికి అంత వాటా అందుబాటులో ఉండడం సమంజసం కాదు. అది తన లబ్ధి కోసం తన జలాలను ఉపయో గించేలా చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
భారత్ కనుక ఈ ఒప్పందాన్ని పునః సమీక్షించ గలిగితే దేశ నీటి సమస్య తీరిపోతుంది. మరొక హరిత విప్లవం దేశంలో సాధ్యమవుతుంది. బారాముల్లాకు భారీగా విద్యుత్ అందచేయవచ్చు. అంతేకాదు, భారత్ క్లిష్టమైన భూభాగాలను చేరుకునేందుకు జలమార్గాలను సృష్టించుకునేందుకు తోడ్పడుతుంది. దీనితో పాటుగా, వరదలు, కరువు, నీటిపారుదల సమస్యలు తీరిపోతాయి. భారత్ వాటాగా వచ్చిన నదులను ఉత్తర-మధ్య భారత దేశంతో అనుసంధానం చేస్తే పూర్తిగా ఉత్తర భారతదేశానికి నిరంతర జల ప్రవాహం ఉండేలా తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. అంటే, సింధు నదిని గంగతో (సింధు-ఝీలం-చినాబ్, సత్లజ్-రావి-బియాస్-యమున-గంగ)లను అనుసంధానం చేయడం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రయాగరాజ్ వద్ద యమున, గంగతో కలుస్తుందన్న విషయం తెలిసిందే. మంచి పంపిణీ వ్యవస్థను ఉపయోగించి, ఈ కాలువల వ్యవస్థ జమ్ము, కశ్మీర్, హిమాచల్, డెహ్రాడూన్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యుపి, ఎంపీలకు ప్రత్యక్షంగానూ, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒరిస్సాకు పరోక్షంగానూ తోడ్పడవచ్చన్నది వారి అంచనా. భారత్ ఈ ప్రాజెక్టును తలపెడితే, దేశంలో దాదాపు 36.47శాతం జనాభాకు తోడ్పడుతుందన్నది వారి భావన. ఇది భారీ ఆర్ధిక, పర్యాటక కారిడార్‌ను సృష్టిస్తుందని వారి భావన.
నిత్యం శాంతిని తిరస్కరించే శత్రువు పట్ల సానుభూతి చూపడాన్ని కొనసాగించడం అమాయ కత్వమే కాదు ప్రమాదకరం కూడా. ఒకవైపు భారత దేశ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూనే మరోవైపు ఒప్పందపు లాభాలను పాకిస్థాన్ ఉపయోగించుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలన్న భారత్ డిమాండ్ న్యాయమైన, అవసరమైన అడుగు. భారతదేశపు గుండెలపై తీవ్రవాదాన్ని ఉపయోగించే శత్రురాజ్యపు మౌలికసదుపాయాల కోసం రాయితీలివ్వడాన్ని నిలిపివేయలన్న దేశం పట్టుదలకు అది ప్రతిబింబం. తన వనరులను తన పౌరుల లబ్ధికి ఉపయోగపడేలా చూడడమే కాక, తీవ్రవాద బెదిరింపుల నుంచి తన సరిహద్దులను భారత్ సురక్షితం చేసుకోవాలి. తన ప్రయోజనాలను మరచి, శత్రువైన పొరుగుకు మేలు చేయాలనే వైఖరిని కొనసాగించడం ఇకపై ప్రత్యా మ్నాయం కాబోదు.
– నీల