కృష్ణానది, బుడమేరులకు వచ్చిన వరదలు విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను ముంచేసింది. ముఖ్యంగా బుడమేరు భారీ వరద వల్ల విజయవాడ, దాని పరీవాహ ప్రాంతాల్లోని గ్రామాలు నీటమునిగాయి. బుడమేరుకు పడిన భారీ గండ్లతో వరద నీరు విజయవాడ సింగ్‌నగర్‌ ‌ప్రాంతంలోని 10 డివిజన్లు, కృష్ణానది వరదలవల్ల భవానీపురం, విద్యాధరపురం, కబేళా, చిట్టినగర్‌లలోని పలు డివిజన్లపై ప్రభావం చూపింది. ఈ ప్రాంతంలోని ఇళ్లన్నీ కనీసం 5 అడుగుల మేర, లోతట్టు ప్రాంతాలైతే 8 అడుగుల మేర మునిగిపోయాయి. ఈ పది డివిజన్లలోని 3 లక్షల మంది ప్రజలు ఇబ్బందిపడ్డారు.

కింద గదులు మునిగిపోగా పై అంతస్తులకు వెళ్లి అక్కడ బాధితులు ఆశ్రయం పొందారు. పడవలు లేక మొదటి రెండు రోజులు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఆహారం, నీరు లేక అలమ టించిపోయారు. కరెంటు లేక చీకట్లో బిక్కుబిక్కు మంటూ గడిపారు. ఛార్జింగ్‌, ‌టవర్లు పనిచేయక బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. పడవల రాకతో మూడో రోజు నుంచి సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించి బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేసింది. బాధితులకు ఆహారం, నీరు, పాలు, పండ్లు, ఫలహారాలు మూడుపూటలా అందిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు స్వీయ పర్యవేక్షణలో బుడమేరుకు పడిన గండ్లను పూడ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో రోజూ పర్యటిస్తూనే ఉన్నారు. వరద నీటిలో నడుస్తూనే బాధితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు నూనె, కిలో పంచదార, రెండు కిలోల ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో కిలో పది రూపాయాలకే కూరగాయలు పంపిణీ చేశారు. విజయవాడ కలెక్టర్‌ ‌కార్యాలయాన్ని క్యాంప్‌ ‌కార్యాలయంగా చేసుకుని పనిచేశారు. అన్ని జిల్లాల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పించి, వరద నీరు తగ్గిన ఇళ్లలో పేరుకున్న బురదను తొలగించే పనులు ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల నుంచి కార్మికులను రప్పించి పారిశుధ్యపనులు చేయిస్తు న్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్‌ ‌ముంపు ప్రాంతాల్లో బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నారు. మొబైల్‌ ‌వాహనాలను అందుబాటులో ఉంచి వైద్యపరీక్షలు చేయించి, మందులు ఉచితంగా అందిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ ‌చౌహాన్‌, ‌బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే వైఎస్‌ ‌చౌదరి తదితరులు కృష్ణానది, బుడమేరు ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను, రైతులను పరామర్శించారు. కేందప్రభుత్వం అన్నివిధాలా అదుకుంటుందని వారికి ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన రూ.3,400 కోట్ల డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫండ్‌ ‌నిధులతో అన్నదాతలను ఆదుకుంటామని చెప్పారు.

బుడమేరు ప్రస్థానం

ఎన్టీఆర్‌ ‌జిల్లా ఎ.కొండూరు మండలం జమ్మలవాయికొండ బుడమేరు జన్మస్థానం. సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాను తాకుతూ తిరిగి ఎన్టీఆర్‌ ‌జిల్లాలోకి ప్రవేశిస్తుంది. సుమారు వంద కిలోమీటర్లు ప్రవహించి… ఏలూరు జిల్లాలోని కలపర్రు వద్ద కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ క్రమంలో పలు చిన్న, పెద్దా ఏర్లను కలుపుకొంటూ వెళుతుంది. బుడమేరును అటూ ఇటూ ఆక్ర మించడంతో బెజవాడలో ఏరు కాల్వగా మారి పోయింది. సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్ఠంగా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005, 2009లో భారీ వర్షాలకు 75 వేల క్యూసెక్యుల వరద రావడంతో విజయవాడ చాలావరకు దెబ్బతింది. బుడమేరు తన ప్రయాణంలో చాలా మలుపులు, మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినపుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుండేది. విజయవాడను బుడమేరు ముంపు నుంచి కాపాడేందుకు వెలగలేరు వద్ద హెడ్‌ ‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. దీనికి దిగువన ఇబ్రహీంపట్నం వద్ద బుడమేరు డైవర్షన్‌ ‌చానల్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమంలో బుడమేరు వరదను కృష్ణా నదిలోకి కలుపుతారు. కృష్ణానదిలోని ప్రకాశం బ్యారేజి వద్ద నీటిమట్టం 12 అడుగుల ఎత్తు ఉంటేనే బుడమేరు నీరు కృష్ణానదిలోకి వెళ్తుంది. అంతకు మించి ఎత్తుంటే నీటిని తీసుకోదు.

భారీ వర్షపాతంతో వరద

వారం క్రితం జిల్లాలో 30 సెం.మీ.వర్షం పడి, బుడమేరుకు అత్యధికంగా వరద నీరు చేరింది. అత్యధికంగా వచ్చి చేరే వరదలో పులివాగు ఒకటి. జి.కొండూరు మండలం పడమర వైపు ఉన్న అటవీ ప్రాంతంలో పుట్టిన పులివాగులోకి గడ్డమణుగు లోయ ప్రాంతంలోని దొర్లింతల వాగు తోడై ఉధృతంగా ప్రవహిస్తున్నది. గత 30 ఏళ్లలో పులివాగు ఆ స్థాయిలో ప్రవహించ•లేదు. మైలవరం, తిరువూరు నియోజకవర్గాలతో పాటు ఎ.కొండూరు మండలంలో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. ఆగస్టు 31 వ తేదీ రాత్రికి వెలగలేరు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌వద్దకు సుమారు 30 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. బుడమేరు వరద నీరు మళ్లింపు కాలువ (బీడీసీ) ద్వారా సుమారు 8 వేల క్యూసెక్యులు, హెడ్‌ ‌రెగ్యులేటర్‌కు 11 గేట్లు పూర్తిగా ఎత్తి మిగిలిన వరదను దిగువకు విడుదల చేశారు. ఆ మరునాడు కూడా బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగింది. గడచిన 30 ఏళ్లలో ఈ స్థాయిలో బుడమేరుకు వరద రాలేదు. బీడీసీకి పలు చోట్ల గండ్లు పడి వరద ప్రవాహం ఊళ్ల మీద పడింది. మరోవైపు కృష్ణానదిలో 18 అడుగులు దాటి నీటి మట్టం ఉండటంతో డైవర్షన్‌ ‌ఛానెల్‌ ‌నుంచి బుడమేరు నీటిని పంపినా నది తీసుకోలేదు. దాంతో బుడమేరు వరద బలహీనంగా ఉన్న గట్లను తెంపుకుని గ్రామాలు, పొలాల్లోకి వచ్చేసింది. సింగ్‌నగర్‌లోకి వరద నీరు భారీగా చేరిపోయింది. వారం రోజుల పాటు రోజూ ఎడతెరపి లేకుండా నీరు పడటంతో వరద నీరు వస్తూనే ఉంది. బుడమేరు, పులివాగు ఉగ్రరూపం దాల్చడంతో జి.కొండూరు మండలంలోని వెల్లటూరు, ఆత్కూరు, జి.కొండూరు, హెచ్‌.‌ముత్యాలంపాడు, కందులపాడు, కవులూరు, వెలగలేరు గ్రామాలతో పాటు విజయవాడ రూరల్‌ ‌మండలంలోని కొత్తూరు తాడేపల్లి, పైడూరుపాడు, రాయనపాడు, జక్కంపూడి, షాబాద తదితర ఏరియాల్లో వేల ఎకరాలు వరి పొలాలు, కొన్ని చొట్ల పత్తి పొలాలు ముంపు బారిన పడ్డాయి.

ఆక్రమణలతో ముంపు

విజయవాడను ముంచెత్తిన వరదకు భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే, బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరిచండలో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణంగాచెబుతున్నారు. ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపాన్ని మార్చేయడం మరో కారణం. కొల్లేరును కబ్జా చేసి చేపలు, రొయ్యలు చెరువులు చేశారు. అందులోకి వరద నీరు వేగంగా చేరే పరిస్థితి లేదు. విజయవాడ కాల్వలతో పాటు బుడమేరు గట్లను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకునే కార్యక్రమాలు 1980 దశకంలో విజయవాడలో కమ్యూనిస్టు పార్టీల ప్రోత్సాహకంగా భారీగా జరిగాయి. తర్వాత 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని విధంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. బుడమేరులో ఏటా సాధారణ సీజన్‌లో గరిష్ఠంగా 11వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది. రెండు, మూడు దశాబ్దాల కిందట బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమనూరు ప్రాంతాల్లో ఉన్న ‘‘యూ’’ టర్నింగ్‌లను సవరించాలని 20 ఏళ్ల క్రితమే ఇరిగేషన్‌ ‌శాఖ ప్రతిపాదించింది.

ఆధునికీకరించకే ఈ సమస్య

బుడమేరుకు 2005, 2009లో వచ్చిన వరదల వల్ల విజయవాడ నగరం ముంపు బారిన పడింది. బుడమేరు విస్తరణ చేపట్టాలని, ఆధునీకరించాలని తెలుగుదేశం, వామపక్షాలు అప్పట్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. కానీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. 50 వేల క్యూసెక్యుల వరద నీరు వచ్చినా బుడమేరు పరీవాహ ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండాలంటే బుడమేరుకు మళ్లింపు కాలువ, పోలవరం కుడి కాలువలను 37,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్ధ్యానికి తగ్గట్లుగా విస్తరించాలి. 2011లోనే బుడమేరు సహజ ప్రవాహమార్గాన్ని రూపొందించి ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50, 60 కిలోమీటర్ల మేర ఆధునికీకరణ పథకాన్ని అమలు చేయాలని భావించారు. ‘మొదటి రీచ్‌లో 62 మీటర్ల వెడల్పు 4.063 నుంచి 4,761 మీటర్ల లోతు తోను, రెండో రీచ్లో 110 మీటర్ల వెడల్పు 2.584 నుంచి 4.802 మీటర్ల వరకు లోతు, మూడో రీచ్లో 180 మీటర్ల వెడల్పు 2. 620 మీటర్ల లోతుతో వరద కాలువను కొల్లేరు సరస్సు వరకు విస్తరించాలి. అవి పూర్తి చేసి, బుడమేరు వరద ప్రవాహమార్గంలో అడ్డంకులను తొలగించే మరమ్మతులు చేస్తే బుడమేరు వరద ముంపు ముప్పు నుంచి విజయవాడ నగర ప్రజలను రక్షించడానికి వీలయ్యేదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

కార్పొరేషన్‌ ‌వైఫల్యం

విజయవాడ ముంపు నుంచి ప్రజలను హెచ్చ రించడంలోనూ, రక్షిత చర్యలు పట్టడంలోనూ విజయవాడ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌విఫలమైంది. విజయవాడ కార్పొరేషన్‌ ‌యంత్రాంగం ఒకప్పుడు ఒంటిచేత్తో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేది. ప్రస్తుతం కార్పొరేషన్‌ అధికారులు అలంకార ప్రాయంగా మారిపోయారు. గత యాభై ఏళ్ల చరిత్ర చూస్తే వర్షాకాలంలో విజయవాడలో మూడు రకాల విపత్తులు వస్తుంటాయి. కృష్ణా వరదలు, బుడమేరు వరదలు, కొండచరియలు విరిగిపడటం! ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి విరుచుకుపడ్డాయి. ఇలాంటపుడు జిల్లా, నగర యంత్రాంగాలు గరిష్ఠ స్థాయిలో అప్రమత్తం కావాలి. క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన ఉంటేనే వీటిని ఎదుర్కోవటం సాధ్యమవుతుంది. నగరంలో వచ్చే విపత్తులకు సంబంధించి 2011లో కార్పొరేషన్‌ ‌విపత్తు ప్రణాళికను రచించింది. విపత్తుల సమయంలో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళిక ఇది! ఇందులో నగర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం – దాని పరిధిలోని శాఖలు అప్పటి పట్టణాభివృద్ధి సంస్థ వీజీటీఎం- ఉడా, పోలీసు వ్యవస్థలన్నీ సంఘటితంగా ఈ ప్రణాళికను అమలు చేయాలి. ఆ ప్రణాళిక ఏమైందో కూడా తెలియని పరిస్థితి. 24 గంటలు వర్షం పడితే బుడమేరు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పైగా… 36 గంటల సేపు రికార్డు స్థాయిలో కురిసింది. ఇలాంట ప్పుడు నగర యంత్రాంగం, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేయాలి. రెండు రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసినా ఆ పని చేయలేదు. క్షేత్రస్థాయిలో మొక్కుబడిగా పర్యటించారే తప్ప రాబోతున్న ఉపద్రవాన్ని అంచనా వేయటంలో విఫలమయ్యారు. బుడమేరు ఉగ్రరూపం దాల్చిన తర్వాత కూడా యంత్రాంగాలు కార్యాచరణలోకి దిగలేదు. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ వరదలో చిక్కుకుని డాబాలు, మిద్దెలపై ఎక్కారు. ఆ తర్వాత కంట్రోల్‌ ‌రూమ్‌లకు, జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేసి వేడుకున్నా బాధితులను బయటకు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ పోలీసు యంత్రాంగం తీరు మరింత విస్తుగొలిపేలా ఉంది. వరద మొదలుకాగానే జనం సురక్షిత ప్రాంతాలకు బయలుదేరగా… ‘మీరు బయటికి రావొద్దు. ఇళ్లలోనే ఉండండి’ అని బారికేడ్లు పెట్టి మరీ అడ్డుకున్నారు. సింగ్‌ ‌నగర్‌ ‌ఫ్లైఓవర్‌ ‌వద్ద ట్రాఫిక్‌ను, జనాన్ని కూడా నియంత్రించలేక పోయారు. మరోవైపు బయటి నుంచి ‘సందర్శకులూ’ ఆ ప్రాంతానికి పోటెత్తారు. దీంతో… పడవలను తీసుకొచ్చిన లారీలకూ గంటల తరబడి దారి దొరకలేదు.

ఇదిలా ఉంటే రాష్ట్రం జలప్రళయంతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే ప్రతిపక్షంగా వైసీపీ తీరు విమర్శలపాలౌతోంది. అధికారంలో ఉన్నపుడు జరుగుతున్న 198 సాగునీటి అధునీకరణ పనులను రద్దుచేసిన జగన్మోహన్‌ ‌రెడ్డి అందులో బుడమేరు ఆధునీకరణకు సంబంధించిన పనులున్న సంగతి మరచిపోయారు. ఇప్పుడు బుడమేరు ముంపుతో ఇబ్బందిపడుతున్నపుడు ప్రజలను ఆదుకోవాల్సింది పోయి తప్పంతా ప్రస్తుత ప్రభుత్వంపై తోసి రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నాలు చేయడాన్ని బాధితులు తప్పుపడుతున్నారు. విజయవాడ కార్పొరేషన్‌ను వైసీపీయే నిర్వహిస్తోంది. వరదల సమయం నుంచి విజయవాడ మేయర్‌ ‌రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీను, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇన్‌ఛార్జులు, మాజీ మంత్రులు అసలు కనిపించలేదు.

సింగ్‌నగర్‌ ‌ముంపు ప్రాంతాల్లో గెలిచిని వైసీపీ కార్పొరేటర్లు కూడా కనిపించలేదు. ఒక్క మంచినీటి బాటిల్‌, ఒక్క ఆహార పొట్లం పంపిణీ చేయకక పోయినా విమర్శలకు మాత్రం ముందుంటున్నారు. వారి దృష్టంతా రాజధాని అమరావతిని ఎలా దెబ్బతీయాలనే దానిపైనే. అమరావతి మునిగి పోయిందని సోషల్‌ ‌మీడియాల్లో అసత్యప్రచారం చేస్తూనే ఉన్నారు.

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్‌ ‌నిరాకరణ

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైన, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ ‌మంజూరును హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్‌ ‌చేసి తమకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని టీడీపీ న్యాయవాదులు వాదించారు. అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తీర్పు చెప్పింది. 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపు కున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసుపై దృష్టి సారించారు. ఈ ఘటనపై మంగళగిరి రూరల్‌ ‌పోలీసులు క్రైం నెంబర్‌ 650/2021‌గా కేసు నమోదు చేశారు. ఐపీసీ 307 సెక్షన్‌తో పాటు మరికొన్ని సెక్షన్లు జోడిరచారు. ఐపీసీ 147,148, 452, 427, 323, 324, 506, 326, 307, 450, 380, రెడ్‌విత్‌ 109, 120‌బి, 149 తదితర సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం 106 మందికి టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. 21 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. మిగతా 85 మందికి మంగళగిరి రూరల్‌ ‌పోలీసులు ఈ నెల 19 నుంచి నోటీసులు జారీ చేశారు. వీరిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోపాటు విజయవాడకు చెందిన వైసీపీ నేత దేవినేని అవినాశ్‌, ‌మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, అరవ సత్యం వంటి ముఖ్య నేతలున్నారు. చంద్రబాబు నాయుడునివాసంపై దాడి ఘటనలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ ‌తదితరులున్నారు. నందిగం సురేష్‌ను అరెస్టుచేయగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారంటున్నారు.

-తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE