అది 1952. ఆ పత్రిక ‘గృహలక్ష్మి’. ఏడు దశాబ్దాల కిందటి సమాచారం.
‘స్వర్ణ కంకణ ప్రదానోత్సవ సంచిక’ అని ముఖచిత్రంపై ఉంది.
అప్పటి ఆ పుస్తకంలో ‘స్థానాపతి రుక్మిణమ్మ’ గురించిన వివరముంది.
అప్పటికి ఆమెకి 40 ఏళ్లయినా లేవు. అయినా తన ఘనతకి సంబంధించే ప్రత్యేక ప్రశంస ఇప్పుడు సరిగ్గా శతాబ్ది వసంతం.
వనితా రత్నాలను స్వర్ణకంకణంతో సత్కరించడం ఆ సంస్థ ప్రత్యేకత. ప్రతీ సంవత్సరం అదొక ఉత్సవ ఉత్సాహం.
మొదట్లో కనుపర్తి వరలక్ష్మమ్మ, అనంతర కాలంలో వాసా ప్రభావతి ఆ విజేతల జాబితాలో ఉన్నారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కె.రామలక్ష్మి, ఇల్లందల సరస్వతీదేవి, తెన్నేటి హేమలత, కోడూరి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి, ఆనందా రామం, వాసిరెడ్డి సీతాదేవి, వింజమూరి సీతాదేవి, నాయని కృష్ణకుమారి, మాలతీ చందూర్‌…‌మరెందరో మహిళా సారస్వతమూర్తులు. ఆ క్రమంలో రుక్మిణమ్మ పేరు అంతటా మారుమోగింది. ఆమెను ‘మధుర కవయిత్రి’గా కీర్తించారందరూ.
కథలు, కవితలు, నాటికలు, పద్యాలు, వచన పురాణాలు, కావ్యఖండికలు… అనేకానేక పక్రియలో ఆరితేరిన ప్రతిభా నిధి. తెలుగు విశ్వవిద్యాలయం ఆ ప్రజ్ఞాశాలిని ‘శతాబ్ది తెలుగు వెలుగు’ గా అభివర్ణించింది. అద్వితీయ కవితా ప్రకర్షకు పేరెన్నికగన్న రుక్మిణమ్మ తెలుగుతోపాటు సంస్కృత భాషలోనూ దిట్ట.
తొలి కవితా సంపుటి వెలువడే నాటికి ఆమె 18 ఏళ్ల యువతి! ప్రధానంగా ‘పూలమాల’తో చదువరులందరి ఆదరాభిమానాలనీ సంపాదించుకున్న ఆ కవనరాణి ప్రాచీన, ఆధునికకాల సమన్వయకర్త. తన పుట్టినరోజు సెప్టెంబరు ఆఖరివారంలో.

గోదావరి ప్రాంతంలోని నిడదవోలులో పుట్టారు రుక్మిణమ్మ. విశాఖవాసి సత్యనారాయణతో పరిణయం. పుట్టినింట, మెట్టినింట కూడా తనదైన విశిష్టత కనబరచారు ఆమె.
ఏదైనా చదివినా, ఎవరినుంచి ఏమైనా విన్నా ఠక్కున అప్పచెప్పగలిగిన ఘటికురాలు.
ఏకసంథా గ్రాహి అన్నమాట. చదివింది చదివినట్లు, విన్నది విన్నట్లు వెంటనే వెల్లడించే నిపుణత తన సొంతం.
బాల్యంలో ‘భామాకలాపం’ చూశారు. అది నృత్యకళా సంబంధం. సంగీత సమ్మిళితం. విఘ్నేశ్వర స్తుతి, సరస్వతీ ప్రార్థన, వెన్నెలపదం పక్రియ, దరువు, దశావతార వర్ణన, చిట్టచివరిగా మంగళ హారతి. ఈ అన్నీ రుక్మిణమ్మకు కొట్టిన పిండి అయ్యాయి.
అలాగే అధ్యాత్మిక రామాయణం. ఇది బ్రహ్మాండ పురాణంలోనిది. ఆత్మతత్వబోధ అంతర్భాగంగా ఉంటుంది. ఆ సారాంశమంతటినీ ఆమె ఎంతగానో ఆకళింపు చేసుకున్నారు.
తెలుగువారి జానపద కళారూపం గరుడాచలనాటకం (యక్షగానం). దీనిలో అనేకానేక కీర్తనలు.
లాలి లక్ష్మి జగదీశ రమ్యచరిత
లాలి మృదుభాష దీనపోష రమ్యహార
లాలి పట్టాభిషేక శ్రీ రమణితోడ
నిద్రజెందుడి భదాద్రి నిర్మల చరిత!

జోజో ఇనకులధీశుడు, జోజో నరసింహదేవ
జోజో శౌరి జోజో రాక్షస సంహార
జోజో నరసింహదేవ జో రఘురామా
ఇలా అన్నింటినీ కంఠస్థం చేసిన ప్రతిభ రుక్మిణమ్మది.
సంస్కృత భాషాభ్యాసం అంతా ఇంటి దగ్గరే. రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం… మరెన్నో ఆంధ్ర ప్రబంధాల అభ్యసనమంతా అక్కడే.
మహాకవి కాళిదాసకృతికి భావానువాదాలను పఠించారు. ప్రధానంగా రఘువంశం కావ్యంలోని అధ్యాయాలు (సర్గలు) మొత్తాన్నీ ఆకళింపు చేసుకున్నారు. దిలీప, రఘు, అజ, దశరథ, శ్రీరామ, లవకుశ రాజుల చరిత్రను ఇతిహాస పూర్వకంగా అధ్యయనం చేశారు. ప్రాచీన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పరిశోధించారు.
‘తురగవారమ్ముతో దొలుత నిలిచి’ అంటూ కవితాత్మక హర్షధ్వానాలు చేశారామె. ఝాన్సీదేవిది వీరోచిత పోరాట చరిత్ర. సమరతంత్ర విద్యలెన్నింటినో రావు సాహెబుకు నేర్పింది. మిత్ర రాజ్యాలన్నింటినీ సమీకృతం చేసింది. ప్రత్యర్థి సేనలను హడలగొట్టింది. తన సేనావాహినికి ఎనలేని ధైర్యాన్ని ఇచ్చింది. అక్షరాలా ధీమంతురాలంటూ రుక్మిణమ్మ చేసిన అభివర్ణన కావ్యసమరోత్సాహ సూచిక.
ఆమె ‘పూర్వగానం’ చేసిన తీరు అపూర్వం, అపురూపం.
చారుదత్తం నాటకాన్ని మలచిన రీతి హృదయంగమం.
‘దూత ఘటోత్కచం’ పేరిట పదక్రీడ సాగించిన వైనం హృద్యం. దేవీ భాగవతం, గోలోకం అనేవి తన వచన పురాణ కృతులు. పూర్ణ వ్యావహారికం అవి. పాఠకుల సమాదరణను అందుకున్నాయి.
వేదాలు, ఉపనిషత్తులలోని కీలక అంశా లెన్నింటినో తాత్పర్యాలు సహా వచనంగా అందించారు. అవన్నీ సూక్తి సమన్వితాలు. భగవాన్‌ ‌తత్వ ప్రతి పాదితాలు.ఆ పుస్తకం ‘దేవుడు’.
ప్రార్థన, ప్రతిజ్ఞ, యుక్తిమాల వంటి కథానికలు రచించారు. కాదంబిని, వత్సరాజు, తదితర రచనలూ వెలువరించారు. నీలాటి రేవు వంటి కథల ఆవిష్కరణతో ఆకట్టుకున్నారు.
ఛాయ, లీల అనే రచనలనీ వెలయించారు కాని వాటి వివరాలు మరింతగా పాఠక ప్రపంచానికి తెలియాల్సి ఉంది.
ఆమెకి కవిత్వం ఒక ఉపాసన. సరస్వతీమాతకు ఆత్మీయ సేవిక. తన ఖండకావ్యాల్లో ఒకటి తెనుగు తోబుట్టువులకు అంకితం చేశారు.శ్లోకాలకు స్వేచ్ఛానువాదాల్లో తనదైన ప్రతిభను జోడించారు. ఆమె పద్యాలు మరికొన్నింటిలో తత్వచింతన అపారంగా గోచరిస్తుంది.
క్షణము చిత్తమ్ము, విత్తమ్ము క్షణమె సుమ్ము
క్షణము జీవితమెల్లను, క్షణము నటన
ఎరుక తెలియుడు, యమునికి కరుణలేదు. అంటారు ఒక చోట.
వీటన్నంటికీ తోడు, ఆమె ఆధునిక ధోరణిని ప్రతిబింబించే కథల సంపుటీకరణ ‘దయ్యం’ కథలు అని పేరుపెట్టి ఆనాడే సంచలనం కలిగించారు. ఆ రచన వెలువడేనాటికి ఆమెకి ఇరవై సంవత్సరాలు.
నన్నెచోడుని ‘కుమార సంభవం’లోని ద్వాదశ ఆశ్వాసాలనూ సమగ్ర పరిశీలనాధ్యయనం చేశారామె. జానుతెలుగు పద ప్రయోగచాతురిని ఎంతగానో అవగతం చేసుకున్నారు. మార్గదేశి కవిత్వాల విశ్లేషణ కృషిని కూలంకషంగా కొనసాగించారు. కవి చమత్కారాలు సహృదయానందదాయకాలు. చదివిన కొద్దీ చవులూరించేవి.
జలవాసులైన హరిల
క్ష్ములు వర్ష నిశావసానమున మేల్కొని క
న్నులు విచ్చి చూచినట్టులు
జజోత్పల రుచులు వెలసె శారదవేళన్‌ఇటువంటి అనేక ఉదాహరణలను ఆమె తన సమీక్ష రచనల్లో ప్రస్తావించి విపులీకరించారు.
కాళిదాసు విరచిత ‘మేఘసందేశం’ (దూతం) ప్రశస్తిని పలు సభల్లో విశదీకరించార. వర్ణన నైపుణ్యం, అలంకార పటిమ, శ్లోక సందేశాలను వివరించేవారు.
సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరాసా,
నరేన్ద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వినర్ణ భావం పప భూమిపాల:
ఇందుమతీదేవి నడిచే దీపశిఖ అని, కాంతి పుంజం ఆవరించి ఉందని, కల్యాణ అలంకృతు రాలనీ అభివర్ణించడాన్ని కవయిత్రి పలుమార్లు సదస్సుల్లో ఉటంకించేవారు. ఎంతో కొనియాడేవారు.
రుక్మిణమ్మ సాహితీ వ్యాసంగానికి, నిరంతర కృషికి సముదాత్త ఉదాహరణలు ఎన్నెన్నో. ఆంధప్రశస్తిని తన ఖండ కావ్యం ‘పూలమాల’లో మరింత తేటతెల్లం చేశారు. ధీర అతివ ఝాన్సీ లక్ష్మీబాయి సమర తంత్రాన్ని చదువరుల కళ్లకు కట్టించారు.
‘రణ శిక్షణములాది రాజ్య తంత్రంబులు
రావు సాహెబునకు రహిని తెలిపి
బాందాయు రోహిలా బంగాళబుందేలి
సేనల వేగమే చేరగట్టి
పరిసంధి హృదయముల్‌ ‌భగ్నమౌనట్టుల
ఆ కథాంశాలన్నింటినీ విద్యాధికులనుంచి స్వీకరించానన్నారు!
పాత్రలు, స్థలాలపేర్లలో కొన్ని యథార్థాలు, మరికొన్ని కల్పితాలు, ప్రతి పదమూ అందరికీ అర్థమయ్యేదే. ‘ఆ వీధి చాలాకాలం తుడిచినట్లు లేదు. గబ్బిలాలు కీచుకీచుమంటున్నాయి. ఉండి ఉండి నక్కల ఊళలు…’ ఇలా సాగుతుంది కథన శైలి.
మరికొన్ని కథలన్నీ సంభాషణలతో కొనసాగుతాయి.
దయ్యం, దయ్యాలు… ఈ పేర్లతో ఉత్కంఠ రగిలించారామె. ఈ సంకలనంలోని కొన్ని శీర్షికలు: కవి, కొరివి, దేవతా…దయ్యమా. ఇటువంటి రచనలన్నీ తన తొలి ప్రయత్నం అన్నప్పటికీ, కథాకథన కౌశలం కనిపిస్తుంది. వీటిల్లో.
‘ప్రొద్దుజారింది. చీకటి పడింది. దీపాలు పెట్టారు. అతను తలుపుతట్టి వచ్చాడు. వీధి తలుపులు వేయమన్నాడు’..(ఇలా ఉంటాయి వాక్యాలు). సంభాషణల విధానం ఉత్సుకత రేకెత్తిస్తుంది.
‘ఓరే! ఇలాగోసారి చూడ్రా!
నీ సంగతి నాకు తెలుసులే.
ఇదిగో! నేనెలా ఉన్నానో చూడూ
ఎలా ఉంటే నాకెందుకు?
నిన్నేమీ చేయనులే
ఏమీ చేయకపోయినా సరే, నిన్నుమాత్రం చూడను.
ఎంచేత?
(ఈ విధంగా పదునుగా, ధాటిగా ఉంటాయి సంభాషణాత్మక కథలు. ఇంతకు మించిన వాడుక ఇంకెక్కడా లేదనిపిస్తుంది.)
‘ఆ, కా, మా, ….వై కోను స్నాతః’ అనే ప్రయోగం మరో కథలో ఉంది, చదువుతున్నంతసేపూ కట్టి పడేస్తుంది.
ఇంతకీ ఆ వాక్య అర్థం …
ఆషాఢ, కార్తిక, మాఘ, వైశాఖ మాస పౌర్ణమి తిథుల్లో తెల్లవారుజామున స్నానం చేస్తోంది ఎవరూ? అని.
అదొక కెవ్వు కేక. విన్నది ఒక దారి తప్పిన పండితుడు. కన్నూమిన్నూ కానని చీకటిలో అర్ధరాత్రి అతడు ఓ చెట్టు దిగువకు చేరతాడు. నడక బడలికతో ఒళ్లు తెలియనంతగా నిద్రపడుతుంది. అంతలో వినవస్తుందీ భీకరధ్వని.
ఇంతటి విభిన్న అక్షర విన్యాసం స్థానాపతి రుక్మిణమ్మ సొంతం. ఆ రచనల్లో విస్తృత, విలక్షణత పుష్కలం.
దశాబ్దాల కిందటే అటు ప్రాచీన, ఇటు ఆధునిక రీతి దక్షతతో వెలుగులందించిన మహిళా ధీమణి.
‘పరోపకారం వల్ల పుణ్యం, పరపీడవల్ల పాపం విధిగా వస్తాయి’ తరహా వాక్యనిర్మాణాలు ఆమె పరిశీలనాసక్తిని వెల్లడిస్తున్నాయి.
‘భారత జాతీయతాబోధకాలైన ఉపన్యాసాంశాలు దేశ సౌభాగ్య సంపదుద్దీపకాలు’.. ఇటువంటి గంభీర ప్రయోగాలనీ చేసిన నిపుణురాలు.
ఆమె జన్మించి శతాధిక సంవత్సరాలైంది. ప్రాచీనాంధ్ర కవయిత్రిగా నాలుగోతరం ప్రత్యేకతను ఆసాంతం కనబరిచారు. రచనల సంఖ్య ఇరవైలోపు ఉంటుంది. ప్రతీ రచనా ఆ రోజుల్లో అశేష పాఠకాదరణ అందుకోగలిగింది.
చారిత్రక ప్రసిద్ధుల విశిష్టతను కీర్తిస్తూ కవితలూ రాశారు రుక్మిణమ్మ. శ్రీకృష్ణ దేవరాయల దేవేరుల్లోని తుక్కాంబ జీవిత చరిత్రను పంచకంగా వెలయించారు. కథనక్రమాన్ని వెలుగులోకి తెచ్చి ఆ విధంగానూ తానేమిటో నిరూపించు కున్నారు.
అక్షర యజ్ఞ నిపుణురాలు. ప్రయోగ రంగాన ధీరురాలు స్థానాపతి రుక్మిణమ్మ. గృహలక్ష్మిగా దీక్షాకంకణధారి. సృజన రచనాలోక విజయ విహారి.

-జంధ్యాల శరత్‌బాబు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE