‌సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచనం

‘ఎప్పుడైతే ప్రజలంతా ఒక్కటవుతారో… అప్పుడు క్రూరాతి క్రూరమైన పాలకులు సైతం వాళ్లముందు నిలబడలేరు’ అన్నారు ఉక్కు మనిషి సర్దార్‌ ‌వల్లభభాయ్‌ ‌పటేల్‌. ఆ ‌వ్యాఖ్యలు ఎవరి గురించైనా హైదరాబాద్‌ ‌సంస్థానానికి రాజైన ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌విషయంలో అక్షరాల వర్తిస్తాయి. తాను అవతారపురుషుడినని, దేవుడినని, ఎవరికి భయపడనని గొప్పలకు పోయిన నిజాం… పరిస్థితుల వికటించి, ఉక్కుమనిషి సర్దార్‌ ‌వల్లభభాయ్‌ ‌పటేల్‌ ఎత్తులకు చిత్తయి, విమానాశ్రయంలో ఆయన ముందు తల వంచి

నమస్కరించి స్వాగతం పలికాడు.

విదేశీ దురాక్రమణదారులు దేశ భాషా సంస్కృతులు, సాహిత్యాలను అణచివేశారు. ముఖ్యంగా తెలంగాణా ప్రజానీక అస్తిత్వానికే ముప్పు తెచ్చారు. కుతుబ్‌ ‌షాహీలు పార్శీ భాషను, నిజాంలు ఉర్దూ భాషను పాలితుల నెత్తిన రుద్దారు. 1911లో సంస్థానానికి రాజైన ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌పచ్చి మతోన్మాది. ఇస్లాం మతం మాత్రమే వర్థిల్లుతూ ఇతర మతాలన్నీ అంతం కావాలన్నది ఆతని కల. తన సంస్థానంలో మత శాఖాధిపతి బహదూర్‌ ‌యార్‌ ‌జంగ్‌తో రజాకార్‌ ‌సంస్థను స్థాపింప (1927) చేశాడు. అదే రంగుమార్చుకుని మజ్లీస్‌-ఏ-ఇత్తేహాదుల్‌-‌ముస్లిమీన్‌’‌గా మారింది. దానికి కాశీం రజ్వీ అధ్యక్షుడుకాగా, ఆ సంస్థ అనేక అకృత్యాలకు పాల్పడేలా పూర్తి సహాయ సహకారాలు అందించాడు నిజాం. ఆదనకి రజాకార్లు, పోలీసులు రెండు కళ్లు లాంటివి. వారి అకృత్యాలకు బలికాని వారు లేరు. మహిళలు ఎదుర్కొన్న అవమానాలు వర్ణనాతీతం. నిజాం కిరాయి మూకల అకృత్యాలను పంటి బిగువున భరిస్తూ రక్తాశ్రువులు చిందించని ఆడపడుచులు లేరు. బతుకమ్మ పండుగపై దాడులు, మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించి, ఆనందించే రాక్షసత్వం తారస్థాయికి చేరింది. రజాకార్ల, పోలీసుల ధాటికి తట్టుకోలేక ఊళ్లకు ఊళ్లే నిర్మానుష్యమయ్యాయి. ఈ దురాగతాలను అడ్డుకు నేందుకు సకల వర్గాలు, వర్ణాలు ఏకమయ్యాయి. సురవరం, వట్టికోట, కాళోజీ, దాశరథి లాంటి వారు, ‘కవిత్వాన్ని కాలక్షేపం కోసం కాకుండా ఉద్యమానికి, సామాజిక వికాసానికి సాధనంగా ఉపయోగించాలి’ అనే సంకల్పంతో అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్నారు. రజాకార్ల దుశ్చేష్టలను ఉటంకిస్తూ, కాళోజీ నారాయణరావు ‘మన కొంపలార్చి మన స్త్రీలను చెరిచిన/ మన పిల్లలను చంపి మనల బంధించిన/కిరాతకులను కసి ఆరిపోకుండ బుస కొట్టుచుండాలె/కాలంబురాగానే కాటేసి తీరాలె’ అని నిజాంను హెచ్చరించాడు.

‘ఓ నిజాము పిశాచమా..! కానరాడు/ నిను బోలిన రాజు మాకెన్నడేని’… ‘తరతరాల బూజు మా నిజాం రాజు దిగిపోవోయ్‌’ అని దాశరథి నినదించారు. ‘మాకు వద్దీ నిజాం రాజు/ఈ కఠిన పాషాణ సదృశు/డీ నిరంకుశ లోహమూర్తి/మాకు వద్దు మాకు వద్దు’ అని హీరాలాల్‌ ‌మోర్వా (ఖమ్మం) గర్జించాడు. ‘బండెనక బండి కట్టి/పదహారు బండ్లు కట్టీ ఏ బండ్లే పోతావు కొడుకో… /నైజాం సర్కరోడా’ అని బండి యాదగిరి నిజాం సర్కార్‌ ‌నిగ్గదీశాడు. మరోవంక గొప్ప దేశభక్తుడు, కవి, వక్త, చరిత్ర కారుడు వినాయక దామోదర సావర్కర్‌.. ఆర్య సమాజ్‌, ‌హిందూ మహాసభ కార్యకర్తల సత్యాగ్రహ ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ‘హిందువుల డిమాండ్లను అంగీకరించు. లేకుంటే ఉద్యమం తప్పదు’ అని నిజాంను హెచ్చరించారు.

‘హైదరాబాద్‌ ‌సంస్థానాధీశుని పాదాలు హిందూ మహాసముద్రంలో కడుగుతా. ఎర్రకోటపై అసఫ్‌ ‌జాహీ పతాకాన్ని ఎగురువేస్తా. హైదరాబాద్‌ ‌కనుక భారత్‌లో కలిస్తే హైదరాబాద్‌లోని హిందువులను ఊచకోత కోస్తా’ అనే రజాకార్ల నేత కాశీం రజ్వీ వాచలత్వానికి పటేల్‌ ‌దీటుగానే స్పందించారు. ‘రజ్వీని, అతనిని ప్రోత్సహిస్తూ వత్తాసు పలికే అందరి భవిష్యత్‌ ‌ప్రమాదంలో పడడమే కాదు. వారి వంశాలు కూడా నిలవవు. హైదరాబాద్‌ ‌కచ్చితంగా విలీనమై తీరుతుంది. మా రక్తమాంసాలతో నిర్మించుకున్న భారత్‌ ‌యూనియన్‌ అస్తిత్వానికి సవాల్‌ ‌చేసే వారిని సహించేది లేదు. వారిని స్వతంత్రంగా కొనసాగిం చడం కల్ల. అది పగటి కలగానే మిగిలిపోతుంది’ అని తీవ్రంగా హెచ్చరించారు. నిజాం నిరంకుశత్వం నానాటికి పేట్రేగిపోవడంతో, ఆతనికి ముగుతాడు వేయడానికి సైనిక ప్రయోగమే శరణ్యమనుకున్నారు పటేల్‌. ‌దృఢసంకల్పం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో దేశంలోని అన్ని సంస్థానాల విలీనంతో భారత దేశ సమగ్రతను కాపాడిన ఆయన మిగతా రెండు సంస్థానాలు హైదరాబాద్‌, ‌కశ్మీర్‌పై దృష్టి సారించారు. అప్పటి గవర్నర్‌ ‌జనరల్‌ ‌సి. రాజ గోపాలాచారి దానికి ‘సైనిక చర్య’ (సైనిక పరిభాషలో ‘ఆపరేషన్‌ ‌పోలో’) అని నామకరణం చేశారు. అయితే సైనిక చర్య నిర్ణయమైనా, ఎప్పుడు జరపాలనే దానిపై కేంద్ర పెద్దలు తర్జనభర్జనలో పడిపోయారు. సెప్టెంబర్‌ 15, 1948 ‌దాకా వేచి చూద్దామన్న కొందరి సలహాలను పటేల్‌ ‌పట్టించుకోలేదు. జాగు చేస్తే భారత వ్యతిరేక శక్తులు తేరుకుని ఆటంకాలు సృష్టించవచ్చని, జిన్నా మరణ దుఃఖంలో ఉన్న పాకిస్తాన్‌కు సమయం ఇవ్వకూడదని, మరోవంక, 16న ప్యారిస్‌ ‌లో భద్రతా మండలి సమావేశం ఉన్నందున ఈలోగానే తంతు ముగించేయాలని పటేల్‌ ‌గట్టిగా నిర్ణయించారు. 13న ముహూర్తం పెట్టారు. మేజర్‌ ‌జనరల్‌ ‌జె.ఎన్‌.‌చౌదరి నేతృత్వంలో సైనికచర్య జైత్రయాత్ర ప్రారంభమైంది. ‘నేను నియంతను. ఎవరికి తలొంచను’అని బీరాలు పోయిన నిజాంకు కాళ్లు చేతులు ఆడడంలేదు. 17వ తేదీ సాయంత్రం సరిగ్గా 5 గంటల ప్రాంతంలో ఓటమిని, లొంగుబాటును అంగీకరించాడు. మరో రెండు గంటలకు భారత్‌ ‌ప్రతినిధి జనరల్‌ ‌మున్షీ సూచన మేరకు దక్కన్‌ ‌రేడియోలో ప్రసంగించాడు. ఆపరేషన్‌ ‌పోలో ఇంత వేగంగా ముగుస్తుందని ఊహించలేదన్న విలేకరుల వ్యాఖ్యకు, పటేల్‌ ‌సమాధానమిస్తూ, ఈ సంస్థానం స్వాతంత్య్ర సాధనలో ఆర్యసమాజ్‌, ‌హిందూ మహాసభ, వందేమాతరం సోదరుల సేవలు మరువలేనివి అని బదులిచ్చారు.

స్వరాజ్య సమరంతో సమానంగా, సమాంత రంగా సాగించిన ఉద్యమాన్ని అణగిదొక్కేందుకు నిజాం, రజాకార్లు చేయని ప్రయత్నమంటూలేదు. అదే సమయంలో వారి దాడులను ఎక్కడికక్కడ ప్రతిఘటించసాగింది. గ్రామరక్షక దళాలతో ఆత్మరక్షణ చేసుకుంటూ వచ్చింది. సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా, సబ్బండ వర్గాలు ఏకమై నిజాం అనే రక్తపిపాసిని, రక్తపిశాచిని తరిమి తరిమి కొట్టిన ప్రజా ఉద్యమం ప్రపంచంలోనే అరుదైనదిగా వాసికెక్కింది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE