– మంగు కృష్ణకుమారి

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘అమ్మా అమ్మా…’’ చెలికత్తె కపిల నందినీదేవి మందిరంలోకి వచ్చింది.

నందినీదేవి, కపిలవస్తు మహారాజు శుద్దోధనులవారి రాజ్యంలో ఉంటుంది.

మహారాజుగారి తనయుడు నందుడికి నందినీదేవి అన్నా, ఆమె అందమన్నా చాలా మోజు. అలాగని ఆమెకి మహారాణీ హోదా ఇవ్వలేదు. ఆ ఒక్కటి తప్ప, సకల సౌకర్యాలు, దాస దాసీజనాలూ, అంతఃపుర భోగాలూ, పట్టు వస్త్రాలు, నగలూ దేనికీ లోటు చేయలేదు.

నిలువునా నందుడి ప్రేమతో తడిసి ముద్దయ్యే నందిని అంతకన్నా ఏదీ, ఏనాడూ కోరలేదు.

నందినీదేవి ప్రధాన మందిరంలోకి అందరికీ అనుమతి లేదు. కపిల ఆమె ఇష్టసఖి. కపిల ఉద్వేగ పూరితమయిన వార్తలు నందినికి చెప్తూ ఉంటుంది.

ద్రాక్ష గుత్తులు అందిస్తూ, కదళీ ఫలాలని వలిచి ఇస్తూ, తేనెని కలిపిన పాలని అందిస్తూ కపిల చెప్పే కబుర్లు ఆ పాలకన్నా తియ్యగా ఉంటాయి. ఆ కదళీఫలం కన్నా కమ్మగా ఉంటాయి. ద్రాక్ష సారాయిలా మత్తుగా కూడా ఉంటాయి.

‘‘అమ్మా, సిద్ధార్ధులవారు, చెలికాడు చెన్నుడి సాయంతో, ‘కంతక’ నెక్కి, రాజభోగాలు వదిలి అడవికి నిష్క్రమించేరుటమ్మా…..’’

‘‘అదేమిటీ? మళ్లీ ఎప్పుడు వస్తారు?’’ అయో మయంగా అడిగింది.

కపిల పకపకా నవ్వింది.

‘‘రాడం కాదమ్మా…వారు, రాజమందిరం మీదన, ముందర చిన్న వరండా చాటునించీ, గవాక్షాలు తొలగించి, రహదారిలోంచి నడుస్తున్న కడు వృద్ధుడినీ, ఒక రోగ పీడితుడినీ, ఒక శవాన్నీ చూసేరట’’

‘‘అయితే… అవి రోజూ ఉన్నవేగా?

‘‘ఏమోనమ్మా సిద్ధార్థులవారు చలించిపోయేరట. మహారాజుకి కూడా తెలీకుండా, అడవులకి పయనం అయ్యేరట. చెన్నుడు చెప్తేనే కదమ్మా తెలిసింది?’’

‘‘కపిలా, ఈ చిన్న విషయాలకే యువరాజుగారు ఇన్ని భోగాలు వదిలి వెళతారంటావా? మరేదయినా కారణం అయి ఉంటుందా? అంది నందిని.

ఏవయినా రోజూ ఉన్నవే. సామాన్య మానవులకి రోజూ చూసే చిన్న విషయాలనిపించే వాటిలోనే, జిజ్ఞాస పరులకి ఏదో కొత్త కనిపిస్తుంది.

ఆ రహస్యం తెలుసుకునే కోరిక ఆపుకోలేక తమ జీవితం అంకితం చేస్తారు. ఆ జ్ఞ్ఞానమే సమాజాన్ని నడిపించే కరదీపిక అవుతుంది. ఫలం చేతికి రావాలంటే చెట్టు ఎన్ని దెబ్బలు తినాలి? పూజలు అందుకొనే విగ్రహంగా మారాలంటే శిల ఎన్ని ఉలి దెబ్బలు తినాలి?

ఇవేవీ నందినికి తెలీదు. ఆమె ఆలోచించదు కూడా.

‘‘పోనీ ఆ కంతక అశ్వం విశ్వాసపాత్రురాలే అనుకుందాం…కానీ ‘ఛన్న’ చేసినది ఏం బాగుందే? యువరాజు ఇలా అంటే మాత్రం… శుద్ధోధన మహారాజు చెవిన వేయవద్దా?’’ అంది బాధా, కోపం కలగలిపి.

‘‘అయ్యో…ఆ ఛన్నడు మొదట యువరాజుకే ‘కంతక’ అంత విశ్వాస పాత్రుడమ్మా…మహారాజు దండిస్తారన్న భయమే లేకుండా కోటలో తిరుగుతు న్నాడుట’’ కపిల చెప్పింది.

‘‘యశోధరాదేవికి మగపిల్లవాడని విన్నాం’’

‘‘అవునమ్మా. రాహులవారి ఆటపాటలు కూడా సిద్ధార్దుల వారి నిర్ణయాన్ని మార్చలేదనే అనుకుంటు న్నారట’’

‘‘అయ్యో. యశోధర ఏం పాపం చేసిందే… ఇంత ఘోరమేమిటే?

‘‘అమ్మా అదేకాదు.. ప్రజలంతా ఒక విషయం తలచుకుంటున్నారు.

మహారాణీ మాయాదేవి, ఆరు దంతాల ఏనుగు తన గర్భంల•కి కుడివైపునించీ, ప్రవేశించినట్లుగా ఒక స్వప్నంలో దర్శించిందిట. తరువాతే మన సిద్ధార్ధులవారు జన్మించేరట’’

‘‘అవునట’’

‘‘సిద్ధార్ధుడు జన్మించిన ఐదవ దినము నాడు, అతని భవిష్యత్తు చెప్పమని, జ్యోతిష్కులని శుద్ధోధనులవారు ఆహ్వానించేరట. వారిలో కౌండిన్యుడనే పండితుడు.. సిద్ధార్ధుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జ్యోస్యం చెప్పేరట. అసలు సిద్ధార్థుడంటేనే అనుకున్నది సాధించేవారనిట’’ కపిల చెప్పింది.

నందిని మాత్రం..మహాప్రజాపతి మూగగా విలపిస్తోందేమో, యశోధర రాహలుడిని చూస్తు ఎంత దుఃఖిస్తుందో అని తలచుకొని విలపించింది.

ఒక హంస బాధపడితే చూడలేనివాడు, దాని గాయాన్ని కడిగి లేపనం పూసి, దేవదత్తుడు మోపిన అభియోగానికి దోషిలా మహారాజు దగ్గర నిలబడ్డ

గౌతముడు, కట్టుకున్న భార్యని వదిలేయడ•మా?

నందిని గురుతు కొచ్చినప్పుడల్లా బాధపడు తుంది. అక్క యశోధర అంతపాటి తన భర్తని పట్టి ఉంచలేకపోయిందా?

భార్య అందానికి, మోహానికీ, పురుషులు ‘దాసోహం’ అంటారని కదా లోకం అంటుంది? అందునా సిద్ధార్ధుడు కూడా మంచి వయసులో ఉన్న సుందరాంగుడు కూడా. ఇరవైతొమ్మిది ఏండ్ల వయసు.ఎంత నిండు యవ్వనం? మరి యశోధర ఎక్కడ ఓడిపోయింది? గర్భవతిగా ఉన్నపుడు భర్తని ఆకట్టుకోలేకపోయిందా? వంశాంకురాన్ని కానుకగా ఇచ్చిందిగా! అయినా, భార్యని ఈ పరిస్థితిలో భర్త ఎంత అపురూపంగా చూడాలి? హతవిథీ..’’

‘‘ఈ సూర్యవంశం మహారాజులకి భార్యలని వదిలేయడం ఒక అలవాటా?’’ యశోధర కళ్లలో కదులుతూ ఉంటే కోపంగా అంది.

కపిల చెప్పే కబుర్లని మించినవి వినాలని నందినికి ఉబలాటం.

నందుడు పన్నీట జలకాలాడి, పుప్పొడి కలిపిన మంచి గంధంపొడితో తన దుస్తులు సువాసన చేసుకొని, నందినీదేవి మందిరంలో ఆమె ఒడిలో మైమరచి ఉన్నపుడు… అతనిని ఓరగా చూస్తూ, సిద్ధార్థుల వారి విషయ ప్రస్తావన చేసింది.

‘‘మరే.. మహాభినిష్క్రమణం. అందరూ చేయ గలిగేది కాదు’’ క్లుప్తంగా తేల్చేడు నందుడు. విస్తు పోయింది నందిని.

తనేమడిగినా తనని కవ్విస్తూ, నవ్విస్తూ వివరంగా చెప్పేవాడు. మధ్య మధ్యలో తన అందాన్ని తదేకంగా చూస్తూ, చెంపలమెఱుపునో, కళ్ల సొగసునో, నడుము వంపునో, ఒంటిరంగునో పొగు డుతూ, తాకుతూ, మురుస్తూ తన్మయుడవుతూఎన్నో కబుర్లు చెప్పే ప్రియుడు నందుడు. మరి ఈ రోజు ఇలా… ?

బహుశా సోదరుడి నిష్క్రమణ, తండ్రి శుద్దోధనుడి బాధ నందులవారిని సైతం మనసు కలవర పడేలా చేసిందేమో…

నందిని సాధ్యమైనంతగా నందుడిని భోగాల్లో ముంచెత్తడానికే నిశ్చయిం చుకుంది.

‘‘ఏమే కపిలా…..నందులవారి ఆగమన వార్త ఏమన్నా తెలిసిందా?’’ మెత్తటి తల్పం మీదనించి లేస్తూ మెత్తగా అడిగింది నందిని.

‘‘ఇంకా తెలీదమ్మా, అమ్మా, మరే…’’

కపిల గొంతులో ఏదో చెప్పాలన్న ఉత్సుకత.

‘‘ఏమిటే… చెప్పరాదూ?’’

‘‘ఇంకేముందమ్మా… సిద్ధార్థుల వారి సంగతులే.. సిద్ధార్ధ్దుల వారు పరివ్రాజక జీవితమే గడుపుతారట’’

చెవులు మూసుకుంది నందిని.

‘‘ఎంత బాధాకరమే మహారాజుకీ, యశో ధరక్కకీ?’’ అంది.

మగధలో సిద్దార్థుడు పరివ్రాజ జీవితం, భిక్షాటన మొదలెట్టేడని విని భయపడింది. సాక్షాత్తు బింబిసారుల వారే తట్టుకోలేక పోయేరట. తన సింహాసనం సిద్ధార్థుల వారికి బహుకరిస్తానన్నారట.

నందినికే నవ్వాగలేదు. కావాలంటే, శుద్ధోధనులవారు సిద్ధార్థునికి సింహాసనం ఇవ్వరనా? అయినా ఈ గౌతముడి అన్వేషణ దేనికి? నందినికి బోధపడటం లేదు. ఇంత పెద్ద సామ్రాజ్యం, అందమయిన భార్య, వంశం నిలిపే కుమారుడిని వదిలి ఇతను దేనిని వెతుకుతున్నాడు? ఏం సాధించాలని?

యశోధర బయటి ప్రపంచం మొహం చూడడం మానేసిందిట. తండ్రి మొహమే తెలీని రాహులుడి, నడకలు, పరుగులే రాజమందిరానికి కళ తెస్తున్నాయిట. మహాప్రజాపతికి మళ్లా బాధ్యత మొదటికి వచ్చింది.

ఆనాడు అక్క మరణంతో రోజుల పిల్లాడు సిద్దార్థుడిని పెంచింది. ఇప్పుడు… తండ్రి మహాభినిష్క్రమణం.. తల్లి ఉదాసీనతతో మళ్లా రాహులుడి పెంపకం మహా ప్రజాపతిదే అయింది. ఆమె మనసుకి ఆనాటి బలం లేదు.

నందినికి ఇవన్నీ, మనశ్శాంతి తగ్గే విషయాలే అన్న భావన.

బింబిసారులవారికి సిద్ధార్ధుడు మాటిచ్చేడట. తనకి జ్ఞాన సముపార్జన అవగానే మగధకే వస్తానని.

నందిని ఆశ్చర్యంతో నోరు తెరిచింది.

ఇంకా జ్ఞాన సముపార్జనా? అయినా ఇల్లూ సంసారం రాజరికపు భోగాలు వద్దని, పరివ్రాజక జీవితం ఎంచుకున్న ఈ శాక్యమునికి ఇంకా జ్ఞానం రాలేదట.

నందిని తనలో తను నవ్వుకుంది.

అలరకలమ అనే సన్యాసి, తన బోధనలతో సిద్ధార్ధుని ప్రావీణ్యుడిని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడనీ, కాని అ బోధనలవల్ల సిద్ధార్ధుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అ కోరికను నిరాకరించాడనీ విని నందిని నిర్ఘాంతపోయింది.

కపిల వచ్చి చెప్పిన ప్రకారం…సిద్ధార్ధుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్ధుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడట.

నందిని మనసులో ఇదీ అని చెప్పలేని భయాలు లేస్తున్నాయి.

బయటకి ఏ మాట అనాలన్నా భయం.

రాజ్యంలో సిద్ధార్థుడి పట్ల పెరుగుతున్న జనాకర్షణ ఆమెకి తెలుస్తూనే ఉంది.

‘‘అమ్మా… సిద్ధార్ధులవారు, కౌండిన్యుడనే యోగి వద్ద శిష్యరికం చేసేరటమ్మా’’ కపిల హడావిడిగా చెప్పింది.

‘‘ఇంకా వారికి గురువు అవసరం ఉందిటే?’’

‘‘అందరూ ఆహారం త్యజించారటమ్మా, సిద్ధార్ధులవారు రోజుకి ఒక గింజగానీ, ఒక ఆకుగానీ ఆహారంగా తీసుకుంటారుట’’ ఆందోళనగా అంది కపిల.

‘‘పోనీలేవే… గాలి భోంచేస్తారు కాబోలు’’ కసిగా అంది నందిని. ఆ కసి ఎందుకో నందినికి తెలీటం లేదు.

‘‘అమ్మా… విన్నారా?’’ కపిల ఇలా అన్నదంటే.. ఏదో సిద్ధార్ధులవారి కబురే.

‘‘చెప్పవే…’’

‘‘మన సిద్ధార్థుల వారి శరీరం అంతా క్షీణించి పోయిందిట. పాపం నదిలో స్నానం ఆచరించేవేళ తెలివితప్పి పడితే, శిష్యులు మోసుకొచ్చేరట’’

‘‘ఆఁ… సంసారానికీ, శరీరానికీ కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి కదే… సంసార ధర్మం వదిలిస్తే జరిగినట్టు శరీర ధర్మం వదిలిస్తే జరుగు తుందను కోడం ఎంత తెలివిలేని పని?’’ నందిని గొంతులో తెలీని ఆవేదన.

కపిల వచ్చింది

‘‘అమ్మా… మనం ఇంక భయపడేది ఏమీ లేదు. సిద్ధార్దులవారు, అనాపనసతి ద్వారా ఒక మార్గాన్ని కనిపెట్టేరటమ్మా’’

‘‘అంటే ఏమిటే?’’

‘‘అదేనమ్మా ఊపిరి బిగపట్టీ, వదిలీ చేస్తారే అలా చేస్తున్నారట. సుజాత అనే పల్లెపడుచు, వారికి అన్నం, పాలు ఆహారంగా తెచ్చి ఇస్తున్నదిట. వారు స్వీకరిస్తున్నారట అమ్మా’’

కపిల మాటలకి నందిని బుగ్గన వేలేసుకొని ఉండిపోయింది. ‘‘ఇదేమేటి? మా యశోధరక్క అందించే మధుర ఫలాలు, దివ్య రాజభోజనాలు పనికిరాక పోయేయి. ఈ సుజాత ఎవరే? ఈమె కూర్చిన ఆహారం ఎలా పనికొచ్చిందే?’’ దిగులుగా అంది.

‘‘ఏమోనమ్మా… అందరూ సిద్ధార్థుల వారు చేసినది చాలా గొప్పపని అంటున్నారమ్మా’’ కపిల అంది.

ఆరేళ్ల తపస్సు ఫలించిన రోజు.

గౌతముడికే కాదు ప్రపంచానికే ఆనందం కలిగిన ఆ రోజు.. బుద్ధగయలో బోధి వృక్షంకింద సిద్ధార్థుల వారికి జ్ఞానోనోదయం అయింది. అప్పటినించీ వారు గౌతమ బుద్ధులయేరు.

కపిల ఉద్రేకంతో చెప్పిన వార్తకి నందిని ఎలాటి రోమాంచిత భావం పొందక

‘‘అయితే ఏమిటే? నిన్నటికీ ఈ రోజుకీతేడా ఏమిటే?’’ అంది.

‘‘ఎందుకు లేదమ్మా… బుద్ధులవారు బోధకులు అయ్యేరట. శిష్యులకి నాలుగు పరమసత్యాలు బోధిస్తున్నారట.

 శిష్యులు మంత్రముగ్ధులై వింటారట’’

‘‘పోనీలెద్దూ… ఆడువారం, మనం విని ఏం చేయగలం?’’ నిర్వికారంగా అంది నందిని.

నందుడు రాడం మానటం లేదు. నందుడు ఉన్నంతకాలం, నందిని పడకగది వదలదు. అతన్ని రంజింపచేసే ఏ క్రీడా మరువదు. తన వలపు మత్తులోంచి నందుడు పైకి రాకుండా జాగ్రత్త పడుతూనే ఉంటుంది.

కపిల గౌతముడి సమాచారం ఇవ్వడం మాననూ లేదు. గంగాతీర పరీవాహక ప్రాంతాలు పర్యటించేడట. గౌతముడి మతంలో, ధర్మం, సంఘం ముఖ్యమైనవని అందరికీ బోధించి నమ్మించేడట.

ఎవరి పేరువింటే ప్రజలు గడగడ లాడతారో, ఆ గజదొంగ అంగుళీమాలుడూ, నరమాంస భక్షకుడు అళవకుడూ… గౌతమబుద్ధుని బోధలకి మనసు మారి, బుద్ధుని కాళ్ల మీదపడి, బౌద్ధ భిక్షకులుగా మారేరట.

గౌతమబుద్ధుడు, తన శిష్యపరివారంతో మగథ వచ్చేడనీ, బింబిసారుడు ఉద్యానవనంలో ఒక ఆశ్రమం కట్టించి, అందరికీ ఇచ్చేడని, గౌతముడు తన శిష్యులతో ప్రస్తుతం అక్కడే ఉన్నాడని తెలిసి… కపిలవస్తు నగరం అంతా ఊగిపోయింది. యశోధర గుండెల్లో ఏం పొంగుతుందో ఎవరికీ తెలీదు.

నందిని మనోవేదన ఏమిటో ఆమెకీ తెలీటం లేదు.

రోజూ కపిలని అడిగి సమాచారం రాబడుతూనే ఉంది. ఇప్పుడు కపిలే కాదు, కపిలా, గౌతమీ అందరూ నందిని చుట్టూ చేరి ఉద్రేకంతో చెప్తున్నారు.

శుద్ధోధనులవారు, గౌతమబుద్ధుని కపిలవస్తు రమ్మని తొమ్మిది మంది భృత్యులని పంపితే, తొమ్మిదిమందీ, బుద్ధుని శిష్యులలో కలిసిపోయేరట.

కానీ గౌతమబుద్ధుని బాల్యమిత్రుడు కులుదాయి మాత్రం శుద్ధోధనుని ఆహ్వానం బుద్ధునికి తెలియజేసాడు. గౌతమబుద్ధుడూ, అతని పరివారం కపిలవస్తు కాలినడకన బయలుదేరేరట. రేపో, మాపో రావచ్చుట. రాజ్యంలో చాలామంది పెదవులమీద

‘‘బుద్ధం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి’’

అన్న మంత్రం నిలిచిపోయి ఉన్నది.

నందిని గుండె గంగా ప్రవాహం అవుతున్నది. దేహంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుంది. చెలికత్తెలందరినీ పిలిపించింది. గడియలో మందిరం అంతా, అలంకరించాలని ఆదేశించింది.

 ఆ రాత్రి తప్పక తన మందిరానికి రావాలని నందుడికి వర్తమానం పంపింది. మనసులో వేయి ఆలోచనలు. ఎలా అయినా నందుని తనింట కొన్నాళ్లు ఉంచాలి.

నందుడు రాత్రికి వస్తున్నాడన్న శుభవార్త వచ్చింది. నందిని పాలసముద్రంలా ఎగసిపడింది. అలంకరించిన ఇల్లంతా స్వయంగా పరీక్షించింది.

మంచి నెయ్యి పోసి హెచ్చుకాంతినిచ్చే దీపాలు అంతటా అలంకరించింది.

మధురమయిన పదార్ధాలు సిద్ధం చేయించింది. ఒకరిద్దరిని తప్పా మిగిలిన అందరినీ పంపించేసింది.

పన్నీట జలకాలాడి ఒళ్లంతా సర్వాంగ సుందరంగా అలంకరించుకుంది. ఒళ్లంతా కళ్లు చేసుకొని నందులవారి ఆగమనం కోసం చూస్తోంది. గుర్రపు డెక్కల సవ్వడితో లేచింది. లోపలికి వస్తున్నది తన నందుడు..తన ప్రియుడు. తన దేవుడు.. ఆరడుగల అందగాడు. కళ్ల నిండా తేజస్సు. తనకి అంతుపట్టని లోతయిన భావ వీచికలు ఏవో ఉన్నాయి అతని నయనాల్లో.

నందిని చూపులే ఆహ్వానం పలికేయి

పడకగది నిండా పూలపరిమళం. పూలపుప్పొడి మత్తు సువాసన. నందుడు మంచంమీద కూచొని చేతులు చాపేడు. అమాంతం అతని చేతుల్లో వాలిపోయింది నందిని. ‘‘దేవీ ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నావు?’’ అన్నాడు నందుడు. తన అభద్రతా భావాలు పైకిచెప్పే ఉద్దేశం లేదు నందినికి.

‘‘మీ గురించి ఆలోచించి, ఆలోచించి అలిసి పోయేను స్వామీ… నన్ను వీడొద్దు’’ అంటూ కారే కన్నీరు తుడుచుకుంటూ అతన్ని బిగియారా కౌగిలించుకుంది.

నందుడి చేతులు పట్టుతప్పుతున్నాయి.

ఆపాదమస్తకం పరిశీలనగా చూసేడు.

చందమామలాటి మోము, సోగకళ్లు. బుగ్గమీద సొట్టా. కడు ఇంపయిన చేతులూ, పారిజాత పూలలాటి పాదాలూ… తాకుతూ కిందకి వంగి ఆగేడు నందుడు. ‘‘అయ్యో… దేవీ, ఏమిది? లేతమొగ్గలాటి పాదాలకి లత్తుక ఏది? ముక్కున ముక్కెరా, పాదానికి లత్తుకా లేకపోతే సొగసు తగ్గిపోదూ?’’ అన్నాడు చిలిపిగా.

లేచి, ఎర్రటి లత్తుక భద్రపరిచిన భరిణ తెచ్చింది. నందుడు లాక్కున్నాడు. ‘‘దేవీ… నువ్వు ఇలా కూచో…’’ అని నందినిని శయ్యపై కూచుండబెట్టీ తను కింద కూచున్నాడు.

నందిని గాభరాగా ‘‘అయ్యో స్వామీ తమరు ఇలా…’’ అనబోతూ ఉంటే

‘‘శృంగారంలో, పరివ్రాజక జీవితంలో కొన్ని తప్పులు ఉండవు దేవీ! ఉండు’’ అని ఆమె లేత పాదాలు తనచేతిలోకి తీసుకున్నాడు. సంతోషంతో పులకరించాల్సిన మేను అతని మాటలకి ఉలిక్కిపడింది.

పొడుగైన చేతివేళ్లలోకి ఒక పక్షి ఈక తీసుకొని దానితో లత్తుక తీసి నందిని పాదాలమీద సున్నితంగా దిద్దుతున్నాడు నందుడు. అతని గిరజాల జుత్తుమీంచి సంపెంగ నూనె సువాసనలు వస్తున్నాయి. పచ్చటి మేని ఛాయ మెరిసిపోతోంది. వంగి లత్తుక దిద్దుతూ ఉంటే, ముక్కు కోటేరు పోసినట్టుంది. ఆ కళ్లలో ఆ తేజస్సు ఏమిటది? ఆ తేజస్సు వెనక ఉన్న భావం…? ఏదీ అంతుపట్టటం లేదు నందినికి. ఓరగా నందులవారి పక్కచూస్తూ, అసంకల్పితంగా అంది.

‘‘ఇంత రమణీయమయిన, ఆనందభరితమయిన జీవితం వదులుకొని, సిద్ధార్థులవారు ఆ మహాభి నిష్క్రమణ ఎలా చేసేరో?’’

రాత్రి నీడ నందడి మొహం మీద కొద్దిగా పడుతోంది. అతని కళ్లలో తేజస్సు పెరిగిందిగానీ, తగ్గలేదు. రెండో పాదానికి కూడా లత్తుక వేయడం పూర్తిచేసి, పక్షి ఈక పక్కన పెట్టేడు. లేచి నిలుచొని

‘‘దేవీ… ఏమన్నావు? ఈ జీవితం వదిలి

సిద్ధార్దుడు ఎలా అడవికి వెళ్లాడనా?

ఇదిగో, ఇలా’’ అంటూ లేచి చకచకా నడుస్తూ ఆ చీకటిలో కలిసిపోయేడు.

నిశ్చేష్టురాలయి చూస్తోంది నందిని.

కపిల వచ్చి ఏదో చెప్తోంది. ఏవీ చెవిలోకి వెళ్లలేదు. ఒకటే మంత్రం తన భవిష్యత్తుని నిర్ణయించే, తనకి దిశామార్గం చూపించే మంత్రం

‘‘బుద్ధం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి’’

ఓం శాంతి శాంతి శాంతి.

 

వచ్చేవారం కథ.. 

మానవత్వాన్ని బత్రికించు కుందాం –

టి.విజయలక్ష్మీ దత్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE