సెప్టెంబర్ 25 పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి
ఆనందదీపం ఆరిపోయింది.
మన జీవితదీపాలను వెలిగించి
మనమిక అంధకారాన్నెదిరించాలి
సూర్యుడు మరలిపోయాడు.
మనమిక తారల వెలుగుల్లో
దారితీయాలి
మన నెచ్చెలి, మన ఆప్తుడు
మన మహానాయకుడు, మార్గదర్శి
మనలనొదిలి వెళ్లిపోయారు.
ఆయన పావన సంస్కృతినే
ఎదలో పదిలపరచుకొని,
కర్తవ్యపథాన పురోగమించాలి
ఆత్మ సమర్పణే ఆయన జీవితం
శరీరంలోని కణకణమూ,
జీవితంలోని క్షణక్షణమూ
మాతృదేవి చరణసీమకు
అత్యంత భక్తితో అర్పించుకున్నారు
ఈ దేశమంతా ఆయన నివాసం
సమాజమంతా ఆయన కుటుంబం
ఆయన మనసున ఒకే ఒక స్వప్నం
ఈ జాతి జగత్తుకు వెలుగవ్వాలి
దానిని సాధించడమే ఆయన జీవనవ్రతం
రాజకీయమాయనకు సాధనమే
కాని సిద్ధి కాదు
అది ఆయనకు మార్గమే
కాని మందిరం కాదు
‘రాజకీయాన్నాధ్యాత్మీకరించాలి’
అదే ఆయన కోరిక
ఈ దేశ ఉజ్వలగతం నుండి
ప్రేరణ పొంది
ఉజ్వలతరి భవిష్యత్తును నిర్మించాలి
ఇదే ఆయన ఏకైక వాంఛ
శతాబ్దాల తరబడి క్షతియెరుగని
జాతి జీవితపు వేళ్ల ద్వారా
రనగ్రహణ చేస్తాయి ఆయన ఆశయాలు
ఆయినా ఆయన రూఢవాిది కాదు
భవిష్యత్తును నిర్మించేందుకు
భారతదేశాన్ని
సమృద్దిశాలిని చేసి నవశకాన్ని నెలకొల్పాలనే
దివ్యకల్పన ఆయన జీవితం
ఆయన అనుపమ ఆలోచనాశీలి
ఆలోచనాపరిధుల్లోనే
గుడుగుడు గుంజాలాడడం
ఆయనను సంతృప్తిపరచలేదు
అందువల్లనే,
అతీత గౌరవ గరిమతో పయనించే
అద్భుత స్వరూపాన్నిచ్చారు జనసంఘానికి
ముందున్న సవాళ్ళ నెదుర్కొనే
శక్తి సామర్థ్యాలను వికసింప జేశారు
ఈనాటి జనసంఘ స్వరూపం
ఆయన జాతికిచ్చిన ప్రసాదం
ఏ పదవినీ ఆయన కోరలేదు
ఆయనెన్నడూ శాసనసభ్యుడు కాదు
కాని శాసనసభ్యులనెందరినో సృష్టించారు
ఏ పదవీ వరించ సిద్ధంకాని ఆయనను
ఎంతో కష్టంమీద
అధ్యక్ష పదవీ భార నిర్వహణకు
అంగీకరింపచేయవలసి వచ్చింది
ఆ క్షణానే ఆయన ప్రేరేపణ చేశారు`
‘పదండి పదండి
వింధ్యాచలం దాటి పదండి
కన్యాకుమారి దగ్గర
మాతృశ్రీ పాదాలను
పవిత్ర సాగర జలాలు
ప్రక్షాళనం చేసే చోటున
సమైక్యభారత జాగృతి మంత్రం
పునశ్చరణ చేద్దాం
పదండి పదండి’
అని ప్రేరేపించారు
ఆయన నేతృత్వంలో అచట
ఆ సేతు హిమాచలమూ
భారతీయ ఏకాత్మను ప్రతిధ్వనింపజేయాలని
సంకల్పం చెప్పుకున్నాం
ఆయన అధ్యక్షతన జరిగిన
ఆ కాలికట్టు సమావేశం
జాతి జీవితంలో చరిత్రనే సృష్టించింది
‘జనసంఘ కార్యసిద్ధి సాధక చారిత్రక దృశ్యం’
అని అద్భుతమందింది జనం
జాతి మనసున ఆశ, విశ్వాసం
చెలరేగింది.
‘కాలికట్టులో
జనసంఘం కొత్త రూపు దాల్చిం’దన్నారు.
దేశ విదేశీయులు కొందరు
కాని జనసంఘం కొత్త రూపు దాల్చలేదు
ఆ చూచే కళ్లల్లోనే క్రొత్త మార్పు వచ్చింది.
ఆ కళ్లల్లో కొన్నిట పాపము, అసూయా
ఆసురిక హింసావలయము నిండిపోయాయి
ఆ కళ్లను కలవరపెట్టిందా దృశ్యం
ఆ అసురీ వీక్షణం
దీనదయాళ్‌జీని నేడు మన నుండి వేరు చేసింది.
ఎవరి చిరుసైగచేత
లక్షలాది ప్రజలు
ప్రాణాలను సైతం ధారపోయడానికి
సిద్ధంగా ఉన్నారో
ఆయన, ఆ మహనీయుడు
ఆ అర్ధరాత్రివేళ, కారుచీకటిలో
తన అనుయాయులను
తనపై ఆశలు నిల్పుకున్న దేశీయులను
అందరిని వదలివేసి
మృత్యుదేవి ఒడిలో ఒరిగిపోయినారు
ఈ గాయం ఎన్నటికీ
పచ్చిగానే ఉంటుంది
ఈ ముల్లు మన గుండెల్లో
కెలుకుతునే ఉంటుంది
ఆయన ఏ కార్యం కోసం
జన్మించారో, జీవించారో, పోరాడారో
ఆ కార్యంలోనే అసువులర్పించారు
ఆయన కాయం ఆ కార్యం కోసమే
అర్పితమైపోయింది
అయినా ఆ కార్యం, ఆయన స్వప్నం
అర్ధార్థంగా, అపరిపూర్ణంగా
మిగిలి ఉన్నాయి మనముందు,
ఆయనపై జరిగిన దురంతం
జాతి జీవితంపై జరిగిన దురంతం
ఆయన తనువుపైని వఘాతాలు
జాతీయ ప్రజాస్వామ్యంపై ప్రహారాలు
ఈ రాక్షస మూకల
దేశద్రోహం, ప్రజాస్వామ్య శత్రువుల
సవాలును స్వీకరిస్తున్నాం మనం
మన నేతను మన నుండి వేరుజేసి
మన ప్రగతికి ఆవరోధం కల్పిచామని
భ్రమిస్తున్నారు వాళ్లు
ఆయనంటే ఏమిటో వాళ్లకు తెలియలేదు
ఆయన అనుయాయులమైన మనం
ఏ మట్టిన పుట్టామో వాళ్లకు అర్థం కాలేదు
ఆయన కార్యం వ్యక్తినిష్టం కాదు
అది తత్వనిష్టం
ఆదర్శం కోసం జీవించడం
పోరాడడం మనకాయన నేర్పారు
ఆయన అడుగుజాడలో పోరాడి
ఆయన స్వపాన్ని రూపొందించి తీరుతాం
వియోగ వ్యధితులమైన మనం
వివేకాన్ని కోల్పోవడం జరగదు
ఈ దారుణ దుఃఖంతో
అవశులమై అకర్మణ్యులం కాబోము
ఆయన ఉత్తరాధికారులం మనం
అందుకు తగ్గట్లు ఉత్తుంగ తరంగంలో
విజృంభిస్తాం
రండీ! ఆయన హృదయం నుండి
చిందిన ఒక్కొక్క రక్తబిందువును
చందనంగా నుదుటన ధరించి
కర్తవ్య పథాన పురోగమిద్దాం
ఆయన చితాగ్నియందలి
ఒక్కొక్క కణము
మన హృదయము నుద్దీపింపజేయగా
ప్రయత్నాల పదసీమను
పరిశ్రమకు పరాకాష్ఠను
అందుకుందాం
ఈ నవ దధీచి వెన్నెముకతో
వజ్రాయుధాన్ని నిర్మించి
ఆధునిక వృత్రాసురునంతము చేద్దాం
ఈ పవిత్రభూమిని
నిష్కంటక మొనరిద్దాం
ఆయన పార్థివ దేహం
లేదిప్పుడు మనముందు
కాని ఆయన పావనతత్వం ఉంది
ఆయన పావన కార్యం ఉంది
దానికై మనల్ని మనం అర్పించుకుందాం
అదే ఆయనకు శ్రద్ధాంజలి.
(ప్రయోగలో శ్రీ అటల్ బిహారీ వాజపేయి 1968 ఫిబ్రవరి 18న చేసిన ప్రసంగానికి స్వేచ్ఛానువాదం)
25.03.1968 జాగృతి