ఇటీవల బాంగ్లా పరిణామాలు ప్రపంచానికీ, ముఖ్యంగా ఆసియాకు ముప్పు తెచ్చేటట్టు ఉన్నాయి. షేక్‌ ‌హసీనా ఆ దేశం నుంచి బయటపడిన వెంటనే తాత్కాలిక ప్రభుత్వం ఇస్లామిస్ట్ ‌నాయకులను విడుదల చేసింది. ఇప్పుడు వాళ్లు పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ మనిషే అని భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. భారత్‌తో తెగతెంపులు చేసుకుని, నరేంద్ర మోదీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించవలసిందని సలహా ఇచ్చారు. దీనిని కేవలం ఒక ఉన్మాది ప్రేలాపనగా పరిగణించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. బాంగ్లాదేశ్‌ ‌విపరిణమాలు మణిపూర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. వీటి మధ్య జాతీయగీతాన్ని మార్చాలన్న ఒక డిమాండ్‌ ‌తెరపైకి రావడం మరొక పరిణామం. దీనిని 1971లో భారతదేశం బాంగ్లా మీద రుద్దిందన్న వాదనను మతోన్మాద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా ఇవన్నీ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వాలన్న దురద తాత్కాలిక ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది.

ఈ చిన్న దేశంలో మైనారిటీలు చరిత్రలో కనీవినీ ఎరుగనంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నారు. ఆగస్ట్ 5‌న షేక్‌ ‌హసీనా అవామీ లీగ్‌ ‌ప్రభుత్వం కూలిన తరువాత మైనారిటీలకు చెందిన ఇళ్లు, వ్యాపార సంస్థలు మొత్తం 1.068 ధ్వంసం చేశారు. ఇందులో హిందువులవే ఎక్కువ. పైగా 506 దాడి ఘటనలు అవామీ లీగ్‌ ‌మద్దతుదారులైన హిందువుల ఆస్తుల మీదే జరిగాయి. దాదాపు 22 ప్రార్థనా స్థలాల మీద కూడా దాడులు జరిగాయి. దేశ నైరుతి ప్రాంతంలోఉన్న ఖూల్నాలో ఎక్కువ దాడులు జరిగాయి. ఇక్కడ 395 ఇళ్లను దగ్ధం చేశారు. బాంగ్లాదేశ్‌ ‌దినపత్రిక ప్రోతోమ్‌ అలో ఈ నివేదికను వెల్లడించింది. జరిగిన మత ఘర్షణలలో కనీసం ఇద్దరు హిందువులు చనిపోయారు. ఈ ఇద్దరిలో విశ్రాంత ఉపాధ్యాయుడు మృణాల్‌ ‌కాంతి చటర్జీ ఒకరు. ఆగస్ట్ 5 ‌రాత్రే ఆయనను నరికి చంపారు. అయితే గాయపడినవారు చాలామంది ఉన్నారు. ఒక ప్రశ్న తప్పక వస్తుంది. బాంగ్లా రిజర్వేషన్‌ ‌వ్యతిరేక హింసలో దాదాపు 600 మంది చనిపోయారు. వారిలో కేవలం హిందువులు ఇద్దరే అంటే ఎంత వరకు నమ్మవచ్చు?  హిందువులతో పాటు అక్కడ మైనారిటీలు క్రైస్తవులు, అహమ్మదీయ ముస్లింల మీద కూడా దాడులు ఎక్కువగానే జరిగాయి. కొన్ని చర్చ్‌లను ధ్వంసం చేశారని బాంగ్లా దేశ్‌ ‌క్రిస్టియన్‌ ‌సంఘం వెల్లడించింది. హసీనా నిష్క్రమణ తరువాత మహమ్మద్‌ ‌యూనస్‌ ‌నాయక త్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు వంటి మైనారిటీ వర్గాల ప్రతినిధులు 40 మందితో సమావేశం జరిపి భరోసా ప్రకటించారు. కానీ అదంతా బూటకమని తేలింది.

చాలాచిత్రంగా పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీలో బాంగ్లా మతోన్మాదులు తమ ప్రతినిధిని చూసుకుంటున్నట్టే ఉంది. ‘నరేంద్ర మోదీ పాలన నుంచి పశ్చిమ బెంగాల్‌కు విముక్తి కల్పించండి! ఆ రాష్ట్రానికి స్వాతంత్య్రం ప్రకటిం చండి!’ అని జషీముద్దీన్‌ ‌రహమాని హాఫీ మమతకి పిలుపునిచ్చాడు. ఇతడు అల్‌ ‌కాయిదా అనుబంధ అన్సురుల్లా బాంగ్లా టీమ్‌ ‌నాయకుడు. హఫీని బాంగ్లాలో మహమ్మద్‌ ‌యూనస్‌ ‌నాయకత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం నెల క్రితం జైలు నుంచి విడుదల చేసింది. భారతదేశ ప్రముఖ ఆంగ్ల చానల్‌ ‌కూడా ఈ విషయాలు వెల్లడించింది. నిజానికి జూలై ప్రాంతంలో బాంగ్లా సంక్షోభం ఆరంభమైన తరువాత విద్యార్థులు కోల్‌కత్తా రావచ్చునని మమత పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. హఫీదంతా నేర చరత్రే. ఇతడిని 2013లో జైలుకు పంపారు. అందుకు కారణం సెక్యులరిస్టుగా పేరున్న ఒక బ్లాగర్‌ను చంపాడన్న ఆరోపణ ఉంది. హసీనా దేశం వీడిన తరువాత మహమ్మద్‌ ‌యూనస్‌ ‌నాయకత్వంలో అనధికార, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం, హఫీని జైలు నుంచి విడుదల చేయడం తెలిసిందే. నిజానికి యూనస్‌కు బాంగ్లాదేశ్‌ ‌నేషనలిస్టు పార్టీ, ముస్లిం మతోన్మాద సంస్థలు కొమ్ము కాస్తున్నాయి.  అందులో జమాత్‌ ఇ ఇస్లామీ సంస్థ కూడా ఉంది. హిందువుల మీద, వారి ఆస్తుల మీద యథేచ్ఛగా దాడులు జరుగుతున్న సమయంలో తాత్కాలిక ప్రభుత్వం హఫీని విడుదల చేసింది. ఈ ఉన్మాది ఇంతకు ముందు కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇండియాను విచ్ఛిన్నం చేస్తాం. ఢిల్లీ మీద ఇస్లామిస్ట్ ‌జెండా ఎగురవేస్తాం అన్నదే ఆ ప్రకటన సారాంశం. ఈ పనిలో చైనా సాయం కూడా తీసుకుంటామని వెల్లడించాడు. సిలిగురి నడవాను వేరు చేసి, ఈశాన్య భారతాన్ని వేరు చేస్తామని హఫీ బెదిరిస్తున్నాడు. సిలిగురి కారిడార్‌నే చికెన్‌ ‌నెక్‌ అం‌టారు. దీనిని దిగ్బంధిస్తే ఈశాన్య భారతంతో మిగిలిన భారతా వనికి సంబంధాలు తెగిపోతాయి. మీరు (భారత ప్రభుత్వం) బాంగ్లా వైపు ఒక అడుగు వేస్తే మేం చైనాను చికెన్‌ ‌నెక్‌ ‌దగ్గరకు చేరుస్తాం. సెవెన్‌ ‌సిస్టర్స్‌ను ఈ ‘స్వాతంత్య్రోద్యమం’లో పాల్గొనవలసిందని కోరతాం అని కూడా హఫీ ఆ ప్రకటనలో పేర్కొన్నాడని మీడియా తెలియచేసింది. జైలు నుంచి బయటకు అడుగు పెట్టగానే హఫీ చేసిన మరొక ప్రకటనలో-కశ్మీర్‌ను భారత్‌ ‌నుంచి విడగొట్టడానికి ప్రయత్నం చేస్తానని అన్నాడు. స్వేచ్ఛను పొందడానికి సిద్ధంగా ఉండమని కశ్మీర్‌లకు చెప్పండి! కశ్మీర్‌ ‌స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌ ఉమ్మడిగా సహకరిస్తాయని కూడా అతడు చెప్పాడు. తన కేసి చూస్తేనే భారత్‌ ‌కళ్లు పీకేస్తానని కూడా అంతులేని వాచాలత్వం ప్రదర్శించాడు. అలాగే పట్టుకుంటే చేతులు కూడా నరికేస్తాడట.

బాంగ్లా అంటే 18 కోట్ల ముస్లింల పవిత్ర దేశం. దీనివైపు చూస్తే కళ్లు తీస్తామని హఫీ చెప్పేశాడు. హసీనా అధికారంలో ఉండగానే ఈ ఇస్లామిస్టు ఉగ్రవాద ముఠాలను జైలులో ఉంచింది. ఆమె దేశం నుంచి వెళ్లగానే, తాత్కాలిక ప్రభుత్వం వీరికి స్వేచ్ఛ ఇచ్చింది. హసీనా దేశం వీడిన తరువాత కూడా చెలరేగిన హింసకు వీరే కారణమయ్యారు. అంటే ప్రధానంగా హిందువుల మీద జరిగిన దాడులకు వీరే కారణం.

అయితే విశ్లేషకులు ఇవన్నీ ఉన్మత్త ప్రేలాపాలుగా పరిగణించడానికి సిద్ధంగా లేరు. బాంగ్లాదేశ్‌ ‌ఘర్షణల కారణంగా మణిపూర్‌ను మరింత ఉద్రిక్తం చేసే అవకాశాలే ఉన్నాయని వారు అంటున్నారు. ఈ మేరకు మణిపూర్‌లో భద్రతా బలగాలను హెచ్చరించడం కూడా జరిగింది. బాంగ్లా గొడవలు దీనికి ఎందుకు ఊత ఇస్తాయో చెప్పడానికి ఉన్న బలమైన కారణం- జమాతుల్‌ అన్సారీ ఉగ్రవాద ముఠా. జమాతుల్‌ అన్సార్‌ ‌ఫిల్‌ ‌హిందాల్‌ ‌షార్కియా అని పిలిచే ఆ సంస్థ ఈశాన్య భారతంలో, తూర్పు భారతంలో కొంత పునాది ఉంది. దీనినే భారత ఉపఖండ అల్‌ ‌కాయిదాగా కూడా పిలుస్తారు. జమాత్‌ అన్సారీకీ కుకీ చిన్‌ ‌నేషనల్‌ ‌ఫ్రంట్‌కు దగ్గర సంబంధాలు ఉన్నాయి.  ఈ రెండు సంస్థలు కలసి చిట్టగాంగ్‌ ‌కొండలలో తమ శ్రేణులకు సాయుధ శిక్షణ శిబిరాలు నిర్వహించాయి. ఇలాంటి శిబిరాలు ఇంకా నిర్వహించాలని కూడా ఆ రెండు సంస్థలు లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్నాయి. భారత్‌ను, ముఖ్యంగా ఈశాన్య భారత్‌ను అస్తవ్యస్తం చేయడమే ఆశయంగా ఆయుధాలు ఎత్తిన మణిపూర్‌ ‌సంస్థలతో కూడా జమాతుల్‌ అన్సార్‌ ‌చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్నది. మైన్మార్‌ ‌నుంచి వచ్చే మత్తు మందుల డబ్బు,  ఉపఖండ అల్‌ ‌కాయిదా, ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేక దేశం ఏర్పడాలన్న అమెరికా ఒత్తిడి విషయంలో భారత్‌ అ‌ప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు బాహాటంగానే హెచ్చరిస్తు న్నారు. జమాతుల్‌ అన్సారీ, కుకీ చిన్‌ ‌నేషనల్‌ ‌ఫ్రంట్‌ ‌గతంలోనే బాంగ్లాదేశ్‌ ‌భద్రతా బలగాలతో తలపడ్డాయి. ఆ ఘర్షణలలో 20 మంది కుకీచిన్‌ ‌నేషనల్‌ ‌ఫ్రంట్‌ ఉ‌గ్రవాదులను బాంగ్లా బంధించింది.

కుకీచిన్‌ ‌నేషనల్‌ ‌ఫ్రంట్‌కు ఉన్న బలాన్ని బట్టి అది ఈశాన్య భారతంలో కల్లోలం సృష్టించగలిగే స్థాయిలోనే ఉన్నది. వీళ్ల దగ్గర ఆయుధాలు కూడా ఎక్కువే ఉన్నాయి. దాదాపు 6,000 అత్యాధునిక ఆయుధాలు దీని వద్ద ఉన్నాయని అంచనా.

బాంగ్లాలోని అరాచక తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశ మూలాలను కూడా మార్చుకోవాలని అను కుంటున్నది. ఇది ముస్లిం మతోన్మాదుల మొదటి లక్షణమే. ప్రస్తుతం మతోన్మాదుల ప్రాబల్యంతో నడుస్తున్న బాంగ్లా తాత్కాలిక ప్రభుత్వం బహుశా అది ఆశించినదే ముందుకు వచ్చింది. ఆడబోయిన తీర్థమే ఎదురైందంటే ఇదే కూడా. ‘అమర్‌ ‌సోనార్‌ ‌బాంగ్లా’ అనే జాతీయగీతాన్ని మార్చాలని ఒక విచిత్ర డిమాండ్‌ ‌మొదలయింది. ఇది రవీంద్రనాథ్‌ ‌టాగోర్‌ ‌రాసిన సంగతి తెలిసినదే. అయితే ఇంకా భాషాభిమానం, మూలాల మీద అభిప్రాయం పూర్తిగా చావని కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. మాజీ సైనికాధికారి గులాం ఆజామ్‌ ‌జాతీయగీతాన్ని మార్చాలన్న నినాదాన్ని తీసుకువచ్చాడు. నిజానికి ఇతడు జాతీయగీతం ప్రాసంగితను ప్రశ్నిస్తున్నాడు. అలాగే రాజ్యాంగం చట్టబద్ధతని కూడా ప్రశ్నించాడు.

అయితే ఉడిచి షిపిగోష్టి అనే సంస్థ జాతీయగీతం మార్పు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పెద్ద ప్రదర్శన నిర్వహించింది. జాతీయ పతాకాన్ని ఎగురవేసి అంతా ఈ అమర్‌ ‌సోనార్‌ ‌బాంగ్లా అంటూ జాతీయ గీతాలాపన చేశారు. ఢాకాలోని నేషనల్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ఎదురుగానే ఈ కార్యక్రమం నిర్వహించారు. జాతీయగీతాన్ని మార్చాలన్న మాట 1971 ఉద్యమంలో ఓటమి శక్తులదేనని షపిగోష్టి నాయకుడు బదయూర్‌ ‌రహమాన్‌ ఆరోపించారు. ఇంత జరిగిన తరువాత ఇక తప్పదన్నట్టు తాత్కాలిక ప్రభుత్వంలో మత వ్యవహారాల శాఖ మంత్రి ఖాలిద్‌ ‌హుసేన్‌ ‌జాతీయగీతం మార్పు ఆలోచన లేదని ప్రకటించ వలసి వచ్చింది.

1971లో బాంగ్లాదేశ్‌ ఆవిర్భవించిన తరువాత జనవరి 13,1972న టాగోర్‌ ‌రచన అమర్‌ ‌సోనార్‌ ‌బాంగ్లా గీతాన్ని జాతీయగీతంగా ఆ దేశం స్వీకరించింది. బెంగాల్‌ ‌విభజన సమయంలో టాగోర్‌ ఈ ‌గీతం రాశారు. అందుకే మతోన్మాదులు దీనిని వలసపాలన అవశేషంగా చిత్రిస్తున్నారు. దీనిని బ్రిటిష్‌ ‌కాలంలో, వలసపాలనకు వ్యతిరేకంగా రాసిన సంగతి వాళ్లు సౌకర్యంగా మరచిపోతున్నారు. నిజానికి ఇందులో బ్రిటిష్‌ ‌వ్యతిరేకత, వలస పాలన అవశేషం అనే భావన కంటే, భారత వ్యతిరేకతే ఎక్కువ. నాడు బ్రిటిష్‌ ‌వ్యతిరేక గీతంగా మారిన ఈ పాటను, 1971 విమోచనోద్యమంలో (పాకిస్తాన్‌ ‌నుంచి) తూర్పు బెంగాల్‌ ‌వాసులు తమకు ప్రేరణ గీతంగా ఉపయోగించుకున్నారు.

నిజానికి పాత రాజ్యాంగాన్ని, జాతీయగీతాన్ని మార్చాలన్న ప్రతిపాదన మతోన్మాద జమాతే ఇస్లామి ఆశయం. ఈ మాట పైకి అన్న గులామ్‌ ఆజామ్‌ ‌కూడా ఆ పార్టీ సానుభూతిపరుడే. ఇతడి తండ్రి ఆమీర్‌ ‌జమాతే ఇస్లామీ నాయకుడు. అమర్‌ ‌సోనార్‌ ‌బాంగ్లా గీతం స్థానంలో రాదగిన గీతాలు దేశంలో చాలా ఉన్నాయని జామాతే ఇస్లామి చెబుతోంది.పైగా టాగోర్‌ ‌గీతాన్ని ఆనాడు భారత్‌ ‌మన మీద రుద్దిందని ఒక వికృత వాదాన్ని కూడా జమాతే ఇస్లామీ ప్రారంభించింది.

మసీదులలో నమాజ్‌ ‌జరిగే వేళలకి ఐదు నిమిషాల ముందే దుర్గాపూజ కార్యక్రమాలు, మంత్రాలు, మంగళవాయిద్యాలు అపేయాలని బాంగ్లాదేశ్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం అక్కడి హిందువు లకు ‘విన్నవించింది’ అట. నమాజ్‌ ‌వేళలలో సంగీతం, మ్యూజిక్‌ ‌సిస్టమ్‌ ‌నిలిపివేయాలని తాము కోరగా హిందువులు ‘అంగీకరించారు’ అని హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌మహమ్మద్‌ ‌జహంగీకర్‌ ఆలం చౌధురి సెప్టెంబర్‌ 10‌వ తేదీన చెప్పారు. బాంగ్లాదేశ్‌ ‌హిందువులు పెద్ద ఎత్తున చేసుకునే పండుగకు ముందు ఏర్పాట్ల సమీక్ష పేరుతో చౌధురి ఈ ప్రకటన చేశాడు. దేశంలో ఈ ఏడాది 32,666 దుర్గా మంటపాలు ఏర్పాటు చేస్తామని, అందులో 157 ఒక్క ఢాకాలోనే ఉంటా యని కూడా తెలియచేశాడు. ఆంక్షలు హిందువులను నిరాశ పరిచినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో బాంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి యూనస్‌ల సమావేశం సాధ్యమేనా అన్న ప్రశ్నలు వెలువడు తున్నాయి. యూనస్‌ ‌చెబుతున్నట్టు బాంగ్లా-భారత్‌ ‌సంబంధాలు కనీస మర్యాదలతో ఉండాలంటే జమాతే ఇస్లామి వంటి సంస్థలను యూనస్‌ అదుపు చేయవలసి ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళా డాక్టర్‌ ‌హత్య, తూర్పు బెంగాల్‌లో (బాంగ్లా)లో ఒక మహిళా రాజకీయవేత్త పలాయనం తోను సంక్షోభాలు ఏర్పడడం వింతే.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE