అట్టా మెత్తగా వున్నావేంది డార్లింగ్‌..?’’ అన్నా చిట్టెమ్మమ్మమ్మ కుక్కిమంచంలో కూర్చొని ఆమె భుజం చుట్టూ చేతులేస్తా..

’’ఏవుందిరా..మామూలే..ఎప్పుడుండేదే..’’ అంది చూపుడువేలు చుట్టూ బొటనవేలు తిప్పుతా తల తిప్పుకొని.

ఆమె శుక్లాల పూలు పూసిన కళ్లల్లో ఏదో దిగులు ముసిరి వుంది. జీవం లేని ఆమె కళ్లు యాడో చూస్తన్నాయి.

‘‘కాదులే..ఏందో చెప్పు..!’’

‘‘ఏం లేదులేరా..’’ అని గువ్వలా ముడుచుకొని కుక్కిమంచంలో ముణగదీసుకొని పొణుకుంది.

‘ఏందబ్బా..’ వాసన పొడుం ఏసిన ముక్కు పొడుం తీసుకురమ్మని’ అడగటల్లేదు..’, మా అయ్యగదా కత ఏదయినా చదవరా’ అని బతిమాలడటల్లేదు..’ఊర్లో విశేషాలు ఏందని’ అడగటల్లేదు..అట్టా గుడ్డలమూటలా గమ్మున పొణుకోనుంది.

‘‘మ్మా..లే..టీ తాగు!’’ పొగలు గక్కుతున్న బుడ్డ స్టీలుగ్లాసుతో వచ్చి నులుచుంది రవణం పిన్ని. ముసలమ్మ దగ్గర్నుంచి ఉలుకు లేదు. పలుకూ లేదు.

‘‘ఇది బాగుందమ్మా..ఉరిమురిమి మంగళవ్మిద పడిందని, మద్దెలో నేనేం చేసాను పాడు పీడాకారం.. అందరికందరూ నన్ను ఏదిచ్చుకు తినేవోళ్లే..లే..లేసి తాగు’’ నిష్టూరంగా అంటా రవణం పిన్ని ఆడే నులుచుంది.

ఏం మాట్టాడకుండా మెల్లగా వణుకుతున్న తలతో బలంతాన లేచి కూచొని వణుకుతున్న చేతుల్తో గ్లాసందుకుంది చిట్టెమ్మమ్మమ్మ.

‘‘రెండురోజుల మించి ఇదే వొరసరా..అటు ఆయనికి చెప్పలేను..ఇటు ఈవిడికి చెప్పలేను.మద్దెలో నేను సత్తన్నాను..’’ రవణం పిన్ని రుసరుసలాడతా ఇంటోకి ఎళ్లిపోయింది.

నాకేం పాలు పోలా. కొంచేపటికి నేనూ ఇంటోకి ఎళ్లా.

అఖిలాండమ్మక్క పక్క గదిలో మంచం వి•ద అటు తిరిగి పొణుకోనుంది. అలికిడయినా తిరిగి చూడ్లా. ఆమె ఆడపిల్లలిద్దరూ ముభావంగా చెరో వేపు బట్టలు మడతపెడతా వుండారు. ఎవ్వరేం మాట్టాడటం లేదు. ఇంటో కోటేశ్వర్రావు బాబాయ్‌ ‌లేడు. ప్రసాద్‌ ‌బావ లేడు. బజారు పోయినట్టున్నారు. మొత్తానికి ఏందో ఇంటో వాతావరణం వేడి మింద వుంది.

టయ్యిం పన్నెండవతా వుంది.బాగా ఎండెక్కింది. దొడ్డో ములక్కాయ చెట్టు వి•ంచి కాకి కా..కా..అని అరుత్తా వుంది.

‘‘చెయ్‌.. ఇష్షో.. పాడు కాకని..’’ రవణం పిన్ని వంట గదిలోంచే కాకిని తోలింది.‘‘కాకి అరిత్తే చుట్టాలొత్తారంటారు. అసలికే లేక ఈడ అఘోరిత్తా వున్నాం..ఇంక మళ్లీ చుట్టాలా..!’’ రవణం పిన్ని గొణుక్కుంటా మధ్య గదిలోకి వచ్చి, అఖిలాండమ్మక్క వంకా, ఆడపిల్లల వంకా ఒక నిమిషం నిరసనగా మొకం పెట్టి చూసి, పొడుగ్గా నిట్టూర్చి పంచలోకి ఎళ్లింది. చిట్టెమ్మమ్మమ్మ కుక్కిమంచంలో ఇంకా ముణగదీసుకొని పొణుకునే వుంది. డొక్కలు పైకి కిందకి ఎగసి పడుతుండగా ఎగశ్వాస దిగశ్వాస తీస్తా, నడుం వి•ద చేతులుంచుకొని పంచలో బండల వి•ద పడతన్న ఎండపొడ వంక చూస్తా నిరామ యంగా ఒక నిమిషం అట్టాగే నిల్చుంది రవణం పిన్ని. బండల వి•ంచి ఎండ రవణం పిన్ని మొకం లోకి కొడతా వుంది. ఆ ఎల్తురుకి ఆమె మొకంలో విచారం మరింతగా అవుపడతా వుంది.

ఇంతలో భుజం వి•ద టర్కీ టవలుతో మొకం వి•ద చెమట తుడుచుకుంటా కోటేశ్వర్రావు బాబాయ్‌ ఇం‌టోకి వచ్చాడు. సరాసరి దొడ్డోకి పొయ్యి చేతి పంపుతో నీళ్లు కొట్టుకొని మొకం కాళ్లుచేతులు కడుక్కొని ఇంటోకి వచ్చాడు. ‘‘ఏవేఁ..కూరేం చేసా..?’’ అన్నాడు నీళ్లు తుడుచుకుంటా

‘‘కాయగూరలేం లేవు. ఉల్లిపాయలేసి కారం ఏయిస్తా’’ అంది రవణం పిన్ని.

‘‘ఎప్పుడూ అది లేదు..ఇది లేదు అంటానే వుంటది.. ఛీ.. నీయమ్మ’’ కోటేశ్వర్రావు బాబాయ్‌ ‌తనలో తనే కూర లేనందుకు తిట్టుకున్నాడు. రవణం పిన్ని పట్టించుకోనట్టు వచ్చి ఉల్లిపాయ కారం చేసింది.

‘‘నాకా ఉల్లిపాయ కారం వద్దు..’’ అఖిలాండ మ్మక్క మధ్య గదిలోంచే అరిచి చెప్పింది.

‘‘వేడేడి అన్నం వి•ద ఉల్లిపాయ కారం ఏస్కొని ఒక బొట్టు నెయ్యి చుక్క తగిలించామంటే..నా సామిరంగా.. వుంటదీ..’’ రవణం పిన్ని మాట పూర్తి కాలేదు..

‘‘కారం తింటే కడుపులో మంటగా వుంటంది! డాక్టరు కారం తగ్గించమన్నాడు.. నాకొద్దా పాడు కారం’’ మంచం వి•ంచే కంచం వెనక్కి నెట్టేసింది అఖిలాండమ్మక్క. ఆ మాటకి రవణం పిన్నికి కడుపులో కాలింది.

‘‘ఈడ వి• బాబుగాడి ముల్లేం లేదు విరగబడి పోవడానికి.. వున్నప్పుడు చేసి పెడితే వయినంగా తిన్లేదా ఏంది!? లేనప్పుడు కాత్త సర్దుకుపోవాలి.. ఒక్కదాని రెక్కల కష్టం వి•ద ఇంటిల్లపాదీ తిని కూర్చుంటా వుంటే ఎట్టా జరుగుద్ది..?’’ రవణం పిన్ని ఈ మాటలంటున్నప్పుడు ప్రసాద్‌ ‌బావ అప్పుడే వచ్చినట్టున్నాడు. ఈ మాటలిని తమనే అంటన్నట్టుగా ముక్కుపుటాలు పొంగించుకుంటా ఏం మాట్టాడ కుండా విసురుగా పోయి కూచున్నాడు.

బయట ఏదో అలికిడి అయితే ఏందా అని చూత్తే కాకి అరిచినట్టే.. రవణం పిన్ని చిన్నమ్మాయి విజయ.. అల్లుడు నారాయణ వత్తన్నారు.

ఆళ్లని చూసి రవణం పిన్ని మొకంలో ఒక నిమిషం ఆనందం తళుక్కుమంది. ఇంతలోనే అది వేడి గచ్చు వి•ద తడి కాలిముద్ర లాగ మాయం అయ్యింది. అయినా మొకం వి•ద నవ్వు పులుంకొని ‘‘ఇప్పుడేనాయ్యా.. రావడం!’’ అంది.

‘‘పదింటికే వచ్చాము అత్తయ్యా.. ఊళ్లో పనుంటే చూసుకొత్తన్నాం’’ నారాయణ బావ బదులిచ్చాడు.

‘‘రండి..కాళ్లూ చేతులు కడుక్కొత్తే అన్నం తిందురు గానీ..’’ అంటా రవణం పిన్ని చీరకొంగుకి కట్టి వున్న చిల్లర విప్పి లెక్కపెట్టింది.

‘‘మోహన్రావు కాడ కోడుగుడ్లు తే పోరా..’’ అని ఆ డబ్బులు నా చేతికిత్తే నేను మోహన్రావు కొట్టుకి అట్టెళ్లి ఇట్టొచ్చా.

రవణం పిన్ని గబగబా కోడిగుడ్డు పొరుటు చేసి ఇద్దరికీ అన్నం పెట్టింది.

’’వి•రు కూడా రండే అఖిలాండమ్మా.. అందరం కలిసి తిందాం..’’ అని రవణం పిన్ని పిలిచింది.

‘‘ఆఁ..ఆళ్లని తిననీలే..ఒక పూట తినకపోతే ఏం చావంగా..’’ అంది అఖిలాండమ్మక్క ఆడ్నుండే పెడసరంగా

తింటన్నోడల్లా ఆగి నారాయణ బావ చివుక్కున తలెత్తి విజయక్క మొకంలోకి చూసాడు.‘ఆమె అంతేలే..వి•రు తినండ’న్నట్టు విజయక్క సైగ చేసింది.

తిని, తువ్వాలుకి చెయ్యి తుడుచుకుంటా పంచలోకి వచ్చి కూచున్నాడు నారాయణ. మెల్లింగా అల్లుడు పక్కన జేరాడు బాబాయ్‌. ‌కూరచట్టెలన్నీ పక్కకు సర్ది, నారాయణ ఎదురుంగా వచ్చి, గోడకు చేరగిలబడి కూచుంది రవణం పిన్ని. విజయక్క నారాయణ బావ పక్కన వచ్చి నుంచుంది.

ఒకరి మొకాలు ఒకరు చూసుకుంటా ఒక నిమిషం ఆడ ఎవరూ ఏం మాట్టాడలా. ఏం మాట్టాడుకుంటారా అని అఖిలాండమ్మక్క, ప్రసాదు బావ ఒక చెవి ఇటేసి వుంచారు.

‘మాట్టాడు’ అన్నట్టు అల్లుడు నారాయణ వేపు చూసాడు కోటేశ్వర్రావు బాబాయ్‌. ‌నారాయణ బావ ఇబ్బందిగా కదిలి, వు..హ్హు.. అని గొంతు సవరించు కున్నాడు.

‘‘అదే అత్తయ్యా.. నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారు..?’’ అన్నాడు చిన్నగా

రవణం పిన్ని ఏం చెప్పాలో తెలియనట్టు నీళ్లు నమిలి..‘‘నాదేముందయ్యా.. నాకు ఈడైనా ఆడైనా యాడైనా ఒకటే.. ముసలమ్మదే ఇబ్బంది.’’అని విషయాన్ని చిట్టెమ్మమ్మమ్మ వి•దకి తోసింది.

‘‘ఏంది మామ్మా..నీకు ఏ ఇబ్బందీ లేకుండా ఈడున్నట్టే ఆడ సుబ్బరంగా చూసుకుంటాం.. ఒక్క రవ్వ కూడా ఏ లోటూ రానీయం..ఏవంటావ్‌..?’’ అన్నాడు చిట్టెమ్మమ్మమ్మ వంక తిరిగి.

‘‘అయ్యా.. నారాయణా.. నువ్వు చూసుకుంటా వయ్యా.. బంగారంలా చూసుకుంటావు.. నేనే.. ముసల్దాన్ని.. గుడ్డిదాన్ని.. ఇయ్యాలో రేపో గుటుక్కు మనేదాన్ని.. ఈ నాల్రోజులు ఈడే వుండనియ్యం డయ్యా..ఈ ఇంటోనే ఎళ్లమారనియ్యండయ్యా….’’ చిట్టెమ్మమ్మమ్మ తల వణుకుతా బాధగా చెప్పింది గానీ మాట మాత్రం వణకలా.. ఖంగున మోగింది.

నారాయణ బావ ఏదో అనబోయి..అనకుండా మిన్నకుండి విజయక్క వంక చూసాడు. ఇంక విజయక్క కల్పించుకోని, ‘‘అది కాదే అమ్మమ్మా.. పొద్దాక ఉప్పుకి పప్పుకి ఎతుక్కుంటా ఎందుకు వి•రీడ చెప్పు..? గుంటూరొత్తే అంతా మేం చూసుకుంటాం అంటన్నాం కదా..అమ్మకి మందులకి డబ్బులు పంపే పన్లేకుండా ఆడే మందులు ఇప్పిత్తాం..నానకి కూడా ఆఫీసు కాడ సిమెంటు లెక్కలు అయీ చూత్తా కాలక్షేపం అయిద్ది కదా..’’ అంది.

 చిట్టెమ్మమ్మమ్మ ఏం మాట్టాడకుండా తల వూగిస్తా, చూపుడువేలు చుట్టూ బొటనవేలు తిప్పుతా కూచుంది.

 ‘‘అమ్మమ్మా ఏంది మాట్టాడవు..తీసుకెళ్లి హాయిగా అన్నీ చూసుకుంటాం అంటన్నాంగా అమ్మమ్మా.. ఇంకా ఏం కావాలి ?వి•రు పడే అగచాట్లు చూడ్లేకే ఆయనని ఒప్పించి తీసుకొచ్చా.. మళ్లా చూసావా..ముసలాల్లిట్టా బాధ పడతావుంటే ఒక్క కూతురూ పట్టించుకోలేదని రేపు ఊరోళ్లంతా అంటారు..’’

 ‘‘……………’’

 ‘‘ఏంది అమ్మమ్మా.. ఇంతసేటు అడుగుతుంటే ఏం మాట్టాడవ్‌..‌కొంపదీసి నిన్ను ఆడకి తీసుకెళ్లి నీ ఇల్లు అమ్మేసుకుంటామనుకున్నావా ఏంది? నీ సొమ్ము ఒక్క పైసా కూడా మాకొద్దు.. మేమేవి• నీ సొమ్ముకి ఆశపడి లేము..’’ విజయక్క గొంతులో కించిత్‌ ఏడుపు గీర తొంగిచూసింది.

‘‘మామ్మోవ్‌.. ‌నీ సొమ్ము మాకేం వొద్దు. అంతకయితే ఈడిల్లు అద్దెకిచ్చి ఆ డబ్బులు వి•రే తినండి!’’ అందుకున్నాడు నారాయణ బావ.

 ‘‘అమ్మా.. విజయా.. అట్టనమాకమ్మా.. మిమ్మల్ననుకున్నవాళ్లు పుట్టగతులు లేకుండా పోతారు.. ఇన్నాళ్ల మించి ఇంత గంపెడు సంసారం ఎల్లమారతందంటే వి• ఉప్పు తినకుండా జరుగు తుందామ్మా.. అట్టాటియి మనసులో పెట్టుకోమాకు.. అది గాదు.. ఏందంటే.. ఈడే పెరిగా.. ఈడే రాలిపోవాలని.. అంతే! అంతకన్నా ఏం లేదు..!’’ చిట్టెమ్మమ్మమ్మ విజయక్క చేతులు పట్టుకుందామని గాలిలో చేతులు చాచి తడుముతా అంది.

అప్పటిదాకా ఉగ్గబట్టుకొని ఓపిగ్గా ఈ మాటలన్నీ వింటన్న కోటేశ్వర్రావు బాబాయ్‌కి ఇంక ఊగ్రం వచ్చింది. భుజాన వున్న టవల్ని విదిలించి ‘‘ఛస్‌.. ‌నీయమ్మ.. ముసలిముండా.. సక్కంగా తీస్కెళ్లి నీడ పట్టునుంచి వేళకింత కూడు పెడతానంటే ఏం దొబ్బిడాయి నీకు? నీయమ్మ..నువ్వు తినవు..మమ్మల్ని తిననీవు.. నీ కోట్ల ఆస్తులేమన్నా కట్టుకెళ్లిపోతారా! నీ యమ్మ.. ఇల్లు నీ పేర వుందనేగా మిడిసిపాటు.. ఒక్క పోటు పొడిచానంటే చచ్చూరుకుంటావ్‌. ‌పీడా పోయిద్ది..’’ ఆవేశంతో ఊగిపోతా ఏం మాట్టాడు తున్నాడో తెలియకుండా పళ్లు కొరుకుతా చెయ్యెత్తి కొట్టడానికన్నట్టు చిట్టెమ్మమ్మమ్మ వి•దకి దూసుకొచ్చాడు.

గోడకి చేరగిలబడి కూచున్న రవణం పిన్ని చటుక్కున శివంగిలా లేచింది. నారాయణ బావ ఎదురుగా అడ్డం పోయాడు. నేను బాబాయ్‌ని వెనుక నుంచి గట్టిగా వాటేసుకొని పట్టుకున్నా.

‘‘ఏవయ్యోవ్‌..ఏం‌ది..చెయ్యి నోరు లేస్తందీ..? నీ బాబుగాడి ముల్లేవి• లేదిక్కడ.. దాని సొమ్ము తింటూ..దాన్నే కొట్టబోతన్నావే..ఆఁ..పైసా సంపాదిచ్చలేవు గానీ పెద్ద నీలుగుతున్నావే! అంత రోషం గల్లావాడివయితే ఈడ వుండబాకు.. ఎవరుండమన్నారు..? పో.. ఎవరు ముద్ద పెడితే ఆళ్లకాడకే పో.. సిగ్గు లేకుండా ముసలాళ్లవి•దకి వస్తన్నావే!’’ కళ్లు పెద్దయ్యి చేసి..గొంతు పెద్దది చేసి కోటేశ్వర్రావు బాబాయ్‌ ‌మొకం వి•ద చేతులాడిస్తా కోపంతో ఊగిపోయింది రవణం పిన్ని. ఆమెలో అంత కోపం నేనెప్పుడూ చూడ్లా..

ఇటు చూత్తే చిట్టెమ్మమ్మమ్మ కాత్త కూడా తొణకలా..‘‘ఏందబ్బాయ్‌.. ‌చంపుతావా.. చంపు! చావనన్నా చస్తా గానీ..నేను ఈడ్నుంచి కదల్ను..ఆడకి పోను..నే జచ్చిన తర్వాత వి•రేమైనా జేస్కొని ఊరేగండి..’’ అంది తెగేసి.

 ‘‘చూసావాయ్యా ముసిల్దాని గోరోజనం..’’

 ‘‘మావయ్యా.. నువ్వాగు.. ఆమె అంత ఇదిగా రానని చెప్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం? మనమొకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడట.. హు.. మంచికి రోజులు కావు..’’ నారాయణ బావలో మావగారింట తన మాట చెల్లలేదనే పట్టింపు అవుపడతా వుంది.

‘‘నేనీ ఆడ పెత్తనంలో వుండలేనమ్మో.. బతకలేనమ్మో.. నేనొచ్చేస్తానయ్యా వి•తోటోఁ..’’ కోటేశ్వర్రావు బాబాయ్‌ ‌సప్పంగా చల్లారిపోయాడు.

 చేసేదేం లేదన్నట్టు కాసేపటికి నారాయణ బావ, విజయక్క, కోటేశ్వర్రావు బాబాయ్‌ ‌నీరసంగా తలలు ఏలాడేసుకొని ఊరికి ఎళ్లిపోయారు.

అమ్మ.. తుపానొచ్చి తెరిపిచ్చినట్టుంది. లోపల్నుంచి అఖిలాండమ్మక్క కిక్కురుమనలా. చిట్టెమ్మమ్మమ్మ చూపుడువేలుకి బొటనేలు చుడతా ఏం జరగనట్టు కుక్కిమంచంలో గమ్మున కూచోనుంది. రవణం పిన్ని ఇంటి బయట బరిగొడ్డు పాక లోకి పోయింది.

రవణం పిన్ని బాగా బతికిన కుటుంబం. ఒంటి నిండా నగల్తో, మొకం నిండా నవ్వుతో రవణం పిన్ని జాంజట్టీగా వుండేది. కోటేశ్వర్రావు బాబాయ్‌ ‌తో పెళ్లయినాక.. ఇద్దరు పిల్లలయినాక కూడా బ్రహ్మాండంగా వున్నారు. ఒకసారి కోటేశ్వర్రావు బాబాయి కల్లు తీయను చెట్టెక్కి,చూసుకోక ఈతముల్లు కంట్లో గుచ్చుకొని కన్ను జన కారిపోయింది. ఏం చేసినా కన్ను రాలా. ఈలోపు బాబాయి బ్రాందీ షాపుల కాడ పెట్టిన పెట్టుబడులకు భాగస్తులు సున్నం పూసారు. కన్ను లేకపోవడం వల్ల డ్యూటీ కూడా చేయలేక ఇంటిపట్టునే వుండిపోయాడు. ఇక అదే అలవాటయి ఏ పనికీ పోక తిని కూచోవడమే అయింది. దెబ్బ వి•ద దెబ్బలా అత్తగారింట పొసగక పెద్దమ్మాయి అఖిలాండమ్మ ఇద్దరు పిల్లల్ని, భర్తను ఏసుకొని రవణం పిన్ని భుజాల వి•ద దిగబడింది. అఖిలాండమ్మ ఆయన ప్రసాదరావు మడిసి మంచోడే గానీ నిదానం మడిసి. పల్లెత్తి మాట్టాడడు. ఉలకడు. పలకడు. ఏ పని కాడ పెట్టినా జమాయించుకు రాలేడు. టయానికి తింటాడు. పోయి మన్ను తిన్న పాములా పొణుకుంటాడు. ఇట్టాంటి మడిసినిచ్చి చేసి గొంతు కోసారని ఆఖిలాండమ్మక్క రవణం పిన్నిని నిత్యం సాధింపు. ఉన్న రెండెకరాల పొలం..వుంటన్న ఇల్లు చిట్టెమ్మమ్మమ్మది వుండమట్టి తింటానికి వుండానికి సరిపోయింది గానీ లేదంటే పరిస్థితి మరింత అధ్వానంగా వుండేది. సంకలో పిల్లని పెట్టుకొని సముదాయించుకుంటా తిరుగుతున్నట్టు చిట్టెమ్మమ్మమ్మని చిన్నపిల్లకు చేసినట్టే.. స్నానం కాడ్నుంచి..బాత్‌రూమ్‌ ‌కాడ్నుంచి..ప్రతొక్క పనీ రవణం పిన్నే చూసుకోవాల్సి వచ్చేది. చిట్టెమ్మమ్మమ్మకి రవణమ్మ కూతురు కాదు.. రవణం పిన్నే చిట్టెమ్మమ్మమ్మకి తల్లిలా చేస్తా వుంటది. యాడకైనా ఊరెళ్లాల్సి వస్తే చిట్టెమ్మమ్మమ్మతో రవణం పిన్నికి బలే ఇరకాటం.

నాలుగు రాళ్లు చేతిలో ఆడక ఊపిరి ఆడక రవణం పిన్ని మెల్లగా ఒక చిన్న బర్రిగొడ్డును తెచ్చుకొని, నాలుగిళ్లలో పాలు పోస్తా.. వేణ్ణీళ్లకు చన్నీళ్లు అన్నట్టు సంసారాన్ని గుట్టుగా లాక్కొస్తా వుంది. అట్టున్నా పర్లా.. ఈ నరకబాధలన్నీ పడలేక రవణం పిన్నికి షుగరొచ్చి పడింది. దానికి తోడు ఉబ్బసం తగులుకుంది.. ఎన్ని మందులు తిన్నా.. ఆ రెండు జబ్బులు రవణం పిన్నిని తినేస్తా వున్నయ్యి. విజయక్కే మందులకని..ఆటికని వీటికని గుంటూరు నుండి డబ్బులు పంపిత్తా వుండేది. రవణం పిన్నికి ఒక్క అఖిలాండమ్మక్కే తలకు మించిన భారం. ఇటు పుల్ల తీసి అటు పెట్టదు.. పైగా నోరు తెరిస్తే పుల్లవిరుపు మాటలు.

అప్పుడప్పుడు కూరకి కూడా జరగక రవణం పిన్ని కిందావి•దా అవడం చూసి విజయక్కే ఆలోచించి తన కాడే ఆళ్లని చివరిదాకా వుంచుకొని చూద్దామనుకున్నట్టుంది.

నాకు మెల్లమెల్లగా విషయం చూచాయగా అర్థమయింది. చిన్నంగా మళ్లీ చిట్టెమ్మమ్మమ్మ కుక్కిమంచంలో చేరా.

‘‘కాదు డార్లింగ్‌..ఈడుండి ఇన్ని అగచాట్లు పడకపోతే విజయక్క ఎమ్మిడి ఎళ్లొచ్చు కదా..ఆళ్లు సరిగా చూత్తారా చూడరా అనా ఏంది డార్లింగ్‌!’’ అన్నా.

చిట్టెమ్మమ్మమ్మ కాసేపు ఏం మాట్టాడలా.

నేనే మళ్లీ రెట్టించా. ‘‘ఏంది డార్లింగ్‌..ఆళ్లు సరిగా చూడరంటావా?’’

‘‘ఛా..విజయా..అల్లుడు బంగారం లాంటి మడుసులురా..అదేం కాదు..’’

‘‘మరి ఇంకేంటి..?’’

‘‘ఎళ్తాంరా..బానే వుంటది. వుంటానికి తింటానికి తడుముకోకుండా బానే వుంటది.. కానీ ప్రతి దానికీ ఆళ్ల వి•ద ఆధారపడాల్సిందేగా..ఏది కావాలన్నా ఆళ్లని దేహీ అని అడగాల్సిందేగా..ఈడ తిన్నా తినపోయినా.. తిట్టుకున్నా కొట్టుకున్నా మన అనేది వుంటది. మన గుట్టుమట్లు మనకే వుంటయ్యి..ఆడ అట్టా కుదురిద్దా..?ఎంత కూతురు మనదైనా అల్లుడు మనవాడవుతాడారా! మనకున్న కుంచెం ఆళ్ల చేతిలో పెట్టి మనం ఆళ్ల ముందు చేతులు చాచి నుంచుంటామా..? మన ప్రాణం ఒప్పుద్దా..?’’

‘‘నీ సొమ్ము వద్దంటున్నారుగా..డార్లింగ్‌..’’

‘‘ఇపుడు వద్దంటార్రా..రేపేదైనా పరిస్థితులు తోసుకొత్తే వద్దంటారా? ఆ మడుసులు మంచోళ్లే.. కానీ ముంచుకొచ్చే అవసరానికి మంచోళ్లు.. చెడ్డోళ్లు అనుండదు. పరిస్థితులు బట్టి అవసరాలు.. అవసరాల బట్టి మడుసులు మారిపోతారు..అయినా అది కాదు నా బాధ.’’

‘‘మరి ఎంతకాలమని ఇట్టా వుంటారు..ఇప్పుడు కాకపోయినా రేపనేరోజయినా ఎళ్లక తప్పదు గదా!’’

‘‘ఏమోరా! నాకదంతా తెలీదు. ఇది నా ఇల్లు. నా లోకం. ఇది దాటి ఎళ్లేది నా లోకం ఎట్టవుద్ది? ఇరవై ఇరవై ఐదేళ్ల మించి ఈ ఇంటో తడుంకుంటా తడుంకుంటా తిరుగుతా నా పన్లు నేను చేసుకుంటా వున్నా..ఈ ఇంటో అంగుళమంగుళం యాడ ఏముంటదో నాకు తెలుసు..పాసుకు పోయినా దొడ్డికి పోయినా ఈడ అలవాటయిపోయింది.ఎప్పుడయినా ఎళ్లలేక బయటే పోతే వి• పిన్ని ఎత్తిపోసేది. ఆడ ఎట్టా కుదురుద్ది? పొద్దపొద్దాక తడుంకుంటా ఆడ ఎట్టా ఎళ్లను..ఆళ్ల ముందు సిగ్గు పోదారా..?మనం ఆగం పట్టవాఁ..’’

‘‘……………’’

‘‘కళ్లు పోయిన ఇన్నేళ్ల మించి ఈడే ఎళ్లదీస్తన్న. వచ్చేపోయే మడుసులు పలకరిత్తా వుంటే కాత్త ఆయువు పోసుకొని ఇన్నాళ్ల బట్టి బతుకుతున్నా. వి• పిన్ని చిన్నపిల్లలాగ నన్ను సాకబట్టి ఈ మాత్రం బతుకుతున్నా. ఈడ్నుంచి నన్ను కదిలిత్తే నేను బతకలేనురా.. మనసుకు ఎంత నచ్చచెప్పుకుందా మనుకున్నా నావల్ల కావడం లేదురా! ఒకటే అనుకుంటన్నా.. ఏది ఏమయినా గానీ ఇంక నా కట్టె ఈడ కాలాల్సిందే! నా బూడిద ఈ మట్టిలో కలవాల్సిందే.. బొందిలో ప్రాణమున్నంతదాక ఈడే! నేను పోయిన తర్వాత వాళ్లు ఏమయినా చేసుకోనీ.. తర్వాత సంగతి పెరుమాళ్లకి ఎరుక..ఇక నాకింక ఏ బాధా లేదు. విజయా వాళ్ల మనసు కష్టపెట్టానే అనే బాధ తప్ప. నాకు ఏ బాధా లేదు. రవణమ్మ ఉన్నదాక నాకు ఏ దిగులూ చింతా లేదు’’ చిట్టెమ్మమ్మమ్మ గాజుకళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారతా ఆమె గుంటబుగ్గల వి•ద నుంచి జారి ఒళ్లో పడతా వున్నాయి.

ఆలోచిస్తా వుంటే చిట్టెమ్మమ్మమ్మ చెప్పింది కరెక్టుగానే అనిపిస్తా వుంది. చెట్టు వేర్లు తెంపేసి ఇంకో చోటకి తీస్కెళ్లి పాతితే చెట్టు బతకొచ్చు..బతకక పోవచ్చు..

అవును..చిట్టెమ్మమ్మమ్మ చెపుతున్నది కరెక్టు.

చిట్టెమ్మ చెప్పిందే కరెక్టు.

-పి. శ్రీనివాస్‌ ‌గౌడ్‌

వచ్చేవారం కథ..

నేటి నిజం

– అద్దెపల్లి జ్యోతి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE