పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్య పోకడలు మరుగున పడి, నియంతృత్వ ధోరణే రాజ్యమేలిందన్న వాదనలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్‌పార్టీకి అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా ఈ విమర్శలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌  హయాంలో నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు  ఆలోచన, నిర్ణయాధికారం మేరకే   పరిపాలన సాగిందని విపక్షాలే  కాదు.. రాజకీయ విశ్లేషకులు కూడా వాదించిన పరిస్థితి ఉంది.  కాంగ్రెస్‌ పార్టీని ముప్పతిప్పలు పెట్టిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌  ఇచ్చే పనిలో పడ్డారు ప్రస్తుత  ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పదేళ్ల పాలనలో కొనసాగిన అకృత్యాలు, అరాచకాలు, ఒంటెత్తు పోకడలు, ఖజానాకు చిల్లులు పెట్టిన నిర్ణయాలు వంటివి బయటకు వస్తున్నాయి. అధికారంలో ఉన్నన్నాళ్లు.. కనీసం ఆలోచనకు కూడా రాని రీతిలో ఊహించని అంశాలు, తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

ఏ పని అయినా… ఏ అంశం అయినా కాంట్రాక్ట్‌ ఇచ్చే సమయంలో అతి తక్కువ ధరకే కేటాయింపులు చేసి, తర్వాత భారీగా అంచనాలు పెంచే విధానం బీఆర్‌ఎస్‌ హయాంలో కొనసాగింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి అంశాన్నీ సునిశితంగా పరిశీలిస్తూ, లోటుపాట్లు, పొరపాట్లను వెలికి తీస్తోంది. అందులో భాగంగానే బయటపడిన అంశంపై పూర్తిస్థాయిలో విచారణకు సిద్ధమవుతోంది. కాంట్రాక్టర్ల అంచనాలు పెంచే అంశంలోనే రూ. లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. కాంట్రాక్టులు కేటాయించే సమయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా తమకు చెందిన వాళ్లకే అప్పగించినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కాళేశ్వరం నుంచి.. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కొత్త కలెక్టరేట్ల నిర్మాణం, అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారకజ్యోతి.. చివరకు సెక్రటేరియట్‌ నిర్మాణం లోనూ కమీషన్ల దందా నడిచినట్లు ఆనవాళ్లు బయటపడుతున్నాయి. పై కాంట్రాక్టుల అంచనాలు అమాంతం పెంచేసినప్పటికీ, దాదాపు అన్నింట్లోనూ నాసిరకం పనులు జరిగినట్లు అధికారులు, అలా రూ. లక్షల కోట్ల ప్రజాధం వృథా అయిందని, ఎంపిక చేసిన కొన్ని కంపెనీలకు రూ. కోట్లకు కోట్లు ప్రోత్సాహాకాలు ఇచ్చినట్లు, అతితక్కువ ధరకే సర్కారు భూములను కట్టబెట్టినట్లు కూడా బయటకు వస్తోంది. వీటన్నింటిపైనా సమగ్ర నివేదిక అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 ప్రభుత్వం కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో జ్యుడీషియల్‌ కమిషన్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. మరికొన్నింటిపై విజిలెన్స్‌, ఏసీబీ విచారణ చేపడుతోంది. ఒక్కో శాఖ ఆధ్వర్యంలో అంచనాల వ్యయం పెంపు తతంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తున్న కొద్దీ పదేళ్లలోని పనులు, కాంట్రాక్టుల విషయంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. మొదట్లో టెండర్‌ దాఖలు చేసే సమయంలో అంచనాలు తక్కువగా చూపించడం, ఆ తర్వాత కొంతకాలానికి వాటిని సవరించడం. పనులు పూర్తయ్యే సరికి ఖర్చు రెండు మూడిరతలు కావడం వంటివి కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు నిబంధనలను గత పాలకులు బేఖాతరు చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.

ఐటీ పరిశ్రమల శాఖపై నిర్వహించిన సమీక్షలోనూ,కొన్ని కంపెనీలకు గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. రూ. లక్షల కోట్లు పెట్టి పనులు చేయించామని, అప్పులు తెచ్చి క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ చేశామని గొప్పగా చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్‌ నాయకుల వ్యవహార శైలిని బట్టబయలు చేయాలని సీఎం రేవంత్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లోని పనులు, కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చారు? ఎంతకు ఇచ్చారు? ముందు అనుకున్న అంచనాలు ఎంత? ఎప్పుడెప్పుడు ఎంత పెరిగింది..పెంచారు ? నిబంధనల ప్రకారం సవరించారా? లేక ఇంకేదైనా లోగుట్టు ఉందా ? దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి? పనులు చేపట్టిన కంపెనీలు, ఏజెన్సీలు ఎవరివి? వాటికి బ్యాక్‌ గ్రౌండ్‌ లింకులు ఏమున్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన భారీ వర్షాలు, వరదలకు వందల సంఖ్యలో చెరువులకు గండ్లు పడ్డాయి. మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు ఎక్కడికక్కడ పగిలిపోయాయి. రెండేళ్ల క్రితం వరదలు వచ్చినప్పుడూ ఇదే జరిగింది. రాష్ట్రంలో చిన్న,పెద్ద దాదాపు 46 వేల చెరువులను మిషన్‌ కాకతీయ పథకం కింద బాగుచేసినట్లు గత ప్రభుత్వం చెప్పుకుంది. కానీ, ఎక్కడా పనులు పూర్తిగా చేయలేదన్న విషయం వరదల నష్టంతో బట్టబయలయ్యింది. మిషన్‌ కాకతీయ కోసం గత ప్రభుత్వం బడ్జెట్‌లో ఏకంగా రూ.6, 532 కోట్ల మేర కేటాయింపులు చేసి, 80 శాతం వరకు ఖర్చు చేసింది. మిషన్‌ కాకతీయ టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగినట్లు మొదటినుంచీ ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లినా పట్టించుకోలేదు. గ్రామాల్లో మిషన్‌ కాకతీయ చెరువుల కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నది మనోళ్లేనని.. చూసీ చూడనట్లు వదిలేయండని అప్పట్లో బీఆర్‌ఎస్‌ పెద్దలు కొందరు అధికారులను ఆదేశించినట్లు ప్రస్తుత సర్కార్‌ దృష్టికి వచ్చింది. పైగా ఒక్కో చెరువు టెండర్‌ అప్రూవల్‌కు ఇంత మొత్తం ఇచ్చుకోవాల్సిందేనంటూ పైస్థాయి నుంచి ముందే వ్యవహారం కుదుర్చుకుని అనుమతులు జారీ చేశారని కూడా నివేదికలు వచ్చాయి. ఒక్కో చెరువుకు అవసరమైన దానికంటే ఎక్కువ అంచనా వ్యయానికి అప్రూవల్స్‌ తీసుకున్నారని, అయినా పనులు  నాణ్యతగా చేయలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇలా నాసిరకం పనుల వల్లే చిన్నపాటి వర్షాలు, వరదలకే చెరువుల కట్టలు తెగిపోతున్నాయని, గండ్లు పడుతున్నాయని అంటున్నారు.

ఇటు.. రాష్ట్ర పరిపాలన భవనమైన సెక్రటేరియెట్‌, జిల్లా పరిపాలన భవనాలైన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాల విషయంలోనూ గత ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా అంచనాలు పెంచేసింది. నాసిరకం పనులతో ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. సెక్రటేరియెట్‌లోని కొన్ని గదుల్లో వర్షపు నీరు లీక్‌ అవుతోంది. కొన్నిచోట్ల పెచ్చులు ఊడిపోతున్నాయి. మొదట సెక్రటేరియెట్‌ నిర్మాణ ఖర్చును రూ. 400 కోట్లుగా అంచనా వేసి, బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. టెండర్లు ఖరారైన తర్వాత రూ. 619 కోట్లు ఖర్చవుతుందని, ఆ తర్వాత ధరలు పెరిగాయంటూ నిర్మాణ ఖర్చును రూ. 800 కోట్లకు పెంచేశారు. అది ఆ తర్వాత రూ. వెయ్యి కోట్లకు చేరింది. పనులు పూర్తయినా కూడా లెక్కలపై స్పష్టత లేదు. అసలేం జరిగిందో వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. సెక్రటేరియెట్‌ నిర్మాణానికి సంబంధించి 2020 అక్టోబర్‌లో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. కానీ, దీంట్లోనూ కొన్ని సబ్‌కాంట్రాక్టులు బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులకు దక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం సెక్రటేరియెట్‌ నిర్మాణ సమయంలో వీడియో తీసేందుకే దాదాపు రూ. కోటి కేటాయించినట్లు లెక్కలు చూపించారు. వాస్తవానికి ఏడాది కాలంలో పూర్తి కావాల్సిన పనులు ఆలస్యం కావడంతో ఖర్చును అంతకంతకూ పెంచుతూ పోయారు. జిల్లా సమీకృత కలెక్టరేట్లలోనూ ఇదే వ్యవహారం నడిచింది. జిల్లాల్లో అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రులు తమకు అయినవారికి సబ్‌ కాంట్రాక్టులు ఇప్పించుకున్నట్లు ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సమీకృత కలెక్టరేట్లకు రూ. 1500 కోట్లుగా వేసిన అంచనా, రూ.1850 కోట్లు దాటింది.

 ఇటు.. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ మెట్రోకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ప్రాజెక్ట్‌ డీపీఆర్‌లో రూ. 4,650 కోట్లు అవుతుందని అంచనా వేయగా, శంకుస్థాపనకు వచ్చేసరికి అంచనా వ్యయం మరో రూ.1600 కోట్లకు పెరిగింది. అసలు సంబంధం లేని రూట్‌ను ఎంచుకోవడం ఏమిటి? ఆ ప్రతిపాదనలను పెంచడం ఏమిటి? ఎవరికి కమీషన్‌ల కోసం ఇలా చేశారు? అనే విమర్శలు ఉన్నాయి. ఈ పనులను సబ్‌కాంట్రాక్టుల కోసం తనకు నచ్చినవాళ్ల పేర్లను గత ప్రభుత్వంలోని మున్సిపల్‌ శాఖ మంత్రి ఎల్‌ అండ్‌ టీకి సూచించినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి విమానాశ్రయం మెట్రో రూట్‌ను మార్చారు.

 ఇక జీహెచ్‌ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, ఆయా కార్పొరేషన్లలో చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, ఇతర వీధిదీపాలు వంటి కాంట్రాక్టులన్నీ నాటి మున్సిపల్‌ శాఖ మంత్రి చెప్పినవాళ్లకే దక్కాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. హైదరాబాదలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్ల నిబంధనలు మార్చినట్లు తేలింది. పైగా టెండర్‌ను ఓ కంపెనీ దక్కించుకుంటే అందులోని పనులను పూర్తిగా సబ్‌ కాంట్రాక్టర్లు చేపట్టినట్లు వెల్లడైంది. గత ప్రభుత్వంలోని ఓ మంత్రి బావమరిది బినామీలు, ఆ మంత్రి పీఏ బినామీలు ఈ సబ్‌ కాంట్రాక్ట్‌? పనులు చేపట్టినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.

అంతేకాదు..పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత సర్కార్‌ ఎంపిక చేసిన కొన్ని పరిశ్రమలకు ప్రోత్సాహాల కింద కూ. 2,250 కోట్లు ఇచ్చినట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎంఎస్‌ఎంఈలకు గల దాదాపు రూ.4,500 కోట్ల బకాయిలు ఇవ్వకుండా, పదుల సంఖ్యలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఏమినే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హైదారబాద్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం అంచనా వ్యయాలను రెట్టింపు చేసింది. ఇప్పటికీ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర పనులు పూర్తి కాలేదు. అమరవీరుల స్మారక చిహ్నానికి, ముందు అనుకున్న స్టీల్‌కు బదులు నాసిరకం స్టీల్‌ వాడినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు రూ. 400 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత అంచనా వేశారు. పూర్తయ్యే సమయానికి అది రూ. 600 కోట్లు దాటింది. సచివాలయం వద్ద లుంబినీ పార్కు వద్ద అమరవీరుల స్మారక చిహ్నాన్ని రూ. 80 కోట్ల అంచనాతో చేపట్టగా, దాని ఖర్చు రూ. 177 కోట్లకు పెరిగింది. ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కన రూ.104 కోట్ల అంచనాలతో 2016లో అంబేద్కర్‌విగ్రహ ఏర్పాటుకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. తర్వాత ఆ ఖర్చు బాగా పెరిగింది. నాలుగు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ల అంచనా వ్యయాన్ని కూడా గత సర్కార్‌ భారీగా పెంచింది. వరంగల్‌ ఆస్పత్రి నిర్మాణానికి రూ. 1100 కోట్లు అనుకుంటే, మరో రూ. 726 కోట్లు పెరిగింది. రూ.2,679 కోట్లతో ఎల్బీనగర్‌, సనత్‌ నగర్‌, అల్వాల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వగా, ఆ అంచనా వ్యయం రూ. 3,562 కోట్లకు చేరింది. పూర్తయ్యేసరికి ఎంత అవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ నాలుగు ఆస్పత్రుల అంచనా వ్యయంపైనా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆఖరికి ప్రగతి భవన్‌ నిర్మాణం కూడా రూ.38 కోట్లతో మొదలుకాగా, గత ప్రభుత్వం రూ. 46 కోట్లకు పెంచేసింది. అటు.. మిషన్‌ భగీరథ కోసం రూ. 32 వేల కోట్లు ఖర్చు చేశారు. టెండర్‌ నిబంధనలేవీ పాటించకుండా వ్యవహారం నడపగా, ఇందులో దాదాపు రూ.20 వేల కోట్ల అవినీతి జరిగినట్లు భావిస్తున్నారు. లక్షా 50 వేల కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు వేసినట్టు, ఈ పథకం కింద 2.72 కోట్ల జనాభాకు మంచినీళ్లు అందుతున్నట్టు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. కానీ, క్షేత్రస్థాయి సర్వేలో 53 శాతం ఇళ్లకు నీళ్లే అందడం లేదని తేలింది.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068 

About Author

By editor

Twitter
YOUTUBE