తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ హీట్ అందుకుంది. ప్రజా ప్రతినిధుల భాష ప్రజలను ఏవగించుకుంటున్నారు. నాయకులు వీధిరౌడీల మాదిరిగా తిట్టుకోవడం సంప్రదాయ రాజకీయ నాయకులను, రాజయకీయవాదులకు ఆవేదన కలిగిస్తోంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మొన్నటిదాకా అధికారం వెలగబెట్టిన బీఆర్‌ఎస్ నాయకులు.. ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల తిట్లు, దూషణలు తలవంచుకునేలా ఉన్నాయి. పదేళ్ల పాటు పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా ప్రోత్సహించిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు అవే ఫిరాయింపులను కొనసాగిస్తోన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసర ఉద్రిక్తతలను కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాలు రాజకీయాలను కలుషితం చేసేలా పరిణమిస్తున్నాయి.
ప్రధానంగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, గతంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిల మధ్య మొదలైన మాటల యుద్ధం చినికి చినికి గాలివానలా తయారై రెండు పార్టీల మధ్య.. చివరకు రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా తయారవుతోంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఇరువురు నాయకులు బాహాటంగా తిట్టుకుంటూ.. మీడియా ముందు సవాళ్లు చేసుకుంటూ చివరకు ఒకరి ఇంటిపై మరొకరు దాడులకు దిగే స్థితికి చేరుకున్నారు. ఈ పరిణామాలు అందరికి ఆగ్రహం కలిగిస్తున్నాయి.
వాస్తవానికి బీఆర్‌ఎస్ పార్టీ టీఆర్‌ఎస్‌గా మనుగడలో ఉన్న సమయంలో.. తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సెంటి మెంట్‌ను రగిల్చింది. ఆపార్టీ నాయకులు దాన్ని ఓ డ్రైవ్‌గా పెట్టుకొని మరీ ఉద్రిక్తతలను రెచ్చగొట్టిన సందర్భాలను చాలామంది మర్చిపోలేదు. అవే పరిస్థితులను ఇప్పుడు ఆ నాయకులే రెచ్చగొడు తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో బీఆర్‌ఎస్ నాయకులే మళ్లీ సెంటిమెంట్‌ను రగులుస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంటే, తాము అధికారంలో ఉన్న పదేళ్ల పాటు అలాంటి ఊసే లేకుండా పాలన సాగించామని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే అలాంటి అరాచకాలను ఉసిగొల్పు తోందని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే.. మొత్తానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొందూ దొందే అన్నట్లుగా ముందుకు వెళ్తున్నాయి.
ఇక, తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన రెచ్చగొట్టే చర్యలకు ప్రధాన కారణం పార్టీ ఫిరాయింపులు. ఆ ఫిరాయింపుల పంచాయ తీయే రెండు పార్టీలూ, ఆపై రెండు రాష్ట్రాల పంచాయతీగా రూపుమార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు తమ ఇష్టానుసారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూనే ఉన్నారు. రాజ్యాంగంలో మార్పులు తెచ్చినా.. చట్టాలను కఠినతరం చేసినా… దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. అనైతిక చర్యలకు ప్రోత్సహిస్తున్నాయి. ప్రజలందరికీ చట్టాలు చేసే నేతలే ఈ రకమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఒడిగట్టడం సమాజమే సిగ్గుపడేలా చేస్తోంది.
గడిచిన పదేళ్లలో అదికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఒకరకంగా ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. దొరికిన వాళ్లను దొరికినట్లు బందెలదొడ్లోకి తోలినట్లు తోలింది. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ అధికారం లోకివచ్చిన తర్వాత ఆ పార్టీ తానేమీ తక్కువ తినలేదన్నట్లు వ్యవహరిస్తూ, బీఆర్‌ఎస్ మొదలుపెట్టిన ఫిరాయింపుల వ్యవహారాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు.. ఆ పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్లతోనే అదే పార్టీపై విమర్శలు చేయిస్తోంది. అయితే, ఈ అడ్డగోలు ఫిరాయింపులకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయకపోతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన డిసెంబర్‌లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. పార్టీ ఫిరాయింపు అని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా.. ఆయనపై అసెంబ్లీ స్పీకర్.. వేటు వేయకపోవడం వివాదాస్పదంగా మారింది. అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు కూడా ఫిరాయింపులకు పాల్పడ్డారని వారిపై వేటు వేయాలన్న బీఆర్‌ఎస్ విజ్ఞప్తిపై స్పీకర్ అంతగా దృష్టిపెట్టలేదు.
ఇక, సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ ఫిరాయింపుపై ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసినా సాంకేతిక కారణాలతో కేసు వీగిపోయింది. తాజా కేసులో కూడా ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్ రెడ్డి సాంకేతిక అంశాలను ప్రస్తావించినా కొట్టివేసేందుకు న్యాయమూర్తి అంగీకరించకపోవడం గమనార్హం. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్‌దే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. అయినా ఫలితం లేకపోయింది. ఒక్కోసారి సభ్యులు రాజీనామాలు చేసినా స్పీకర్లు వాటిని రాజకీయ కారణాలతో పెండిరగులో ఉంచిన ఘట్టాలు ఉమ్మడి ఏపీలో జరిగాయి.
ప్రస్తుతం , రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పదేళ్ల పాటు ఈ ఫిరాయింపు సమస్యను భరించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంపై ఫిరాయింపుల అంశంపై తీవ్ర విమర్శలు చేసింది. కేసిఆర్ వ్యూహాత్మకంగా ఆయా శాసనసభ పక్షాలను మొదట టీఆర్‌ఎస్, ఆ తరువాత బీఆర్‌ఎస్ విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. నిజానికి అది కూడా అనైతికమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరిగ్గా ఇదే వ్యూహంతో వెళ్లాలని అనుకుంది కానీ.. అవసరమైనంత మందిని తనవైపు తిప్పుకోలేక పోయింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం 38 మందిలో పది మంది మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఖతం చేయాలని ఇరు పక్షాలూ పోటాపోటీగా ప్రయత్ని స్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను బలహీన పరిచే లక్ష్యంతోనే ప్రస్తుత సీఎం ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఇందులో భాగమనే అనుకోవాలి. అయితే తనకు ఎవరూ కాంగ్రెస్ కండువా కప్పలేదని గాంధీ చెప్పడం అతని నిజాయతీని ప్రశ్నిస్తోంది. బీఆర్‌ఎస్ శాసనసభ పక్షం నేత కేసిఆర్ లేఖకు అనుగుణంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ను నియమించాల్సి ఉండగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన గాంధీకి పదవి కట్టబెట్టారు. హరీష్ రావును పీఏసీ చైర్మన్ చేయాలని ప్రతిపాదిస్తే… కనీసం ఆయనను సభ్యుడిగా కూడా చేయలేదు. గతంలో కేసీఆర్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చి విమర్శల పాలయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన గాంధీల మధ్య వివాదం మరో ట్విస్ట్. పోలీసులు కౌశిక్ ను హౌస్ అరెస్టు చేసి, గాంధీని చేయకపోవడం, ఆ తర్వాత ఆయన కౌశిక్ ఇంటిపైకి అనుచరులతో కలిసి దాడి చేయడం వంటివి జరిగాయి. ఇందులో పోలీసుల వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది .
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వాళ్ల అనర్హత ఓ అంశం అయితే, వాళ్ల వ్యవహారశైలి ప్రజల్లో చర్చను లేవనెత్తుతోంది. సాక్షాత్తూ ప్రజలు ఎన్నుకున్నవారే పరస్పరం దాడులు చేసుకుంటూ రౌడీలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు అరికెపూడి గాంధీ. ఈ నేపథ్యంలోనే కౌశిక్ ఇంటిపై కార్యకర్తలు, అనుచరులు టమోటాలు, గుడ్లతో దాడి చేశారు. దీంతో గాంధీతో పాటు పలువురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తనను హత్య చేయడానికి ఇంటికి వచ్చారని, బీఆర్‌ఎస్ పార్టీ తడాఖా చూపిస్తామని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. దీంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది
వారి తీరును ప్రత్యక్షంగా టీవీల్లో చూసిన ప్రజలు ఎమ్మెల్యేల ప్రవర్తన, మాటలు, చేష్టలను ప్రజలు ఏవగించుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో, చేష్టలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని, మధ్యలో కార్యకర్తలు బలయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు వీళ్లు వ్యక్తిగత దూషణలతో ప్రజలకు ఏం చెప్పాలను కున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఫలితంగా హైదరాబాద్ రౌడీ రాజకీయాలకు అడ్డాగా మారిందన్న భయం. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంది.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068