నివాళి

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్‌ మల్లాపురం భీష్మాచారి సెప్టెంబర్‌ 12 రాత్రి నాగపూర్‌ నుండి భాగ్యనగర్‌కు రైలులో వస్తుండగా గుండెపోటుతో మరణించారు.

భీష్మాచారి మే 31, 1951లో జన్మించారు. ఒక సోషలిస్టు, యూనియన్‌ నాయకుడి కుమారుడు సంఘ్ ప్రచారక్‌ కావడమే కాదు, అత్యంత ప్రముఖస్థాయికి ఎదగడం విశేషం. 1960లో భాగ్యనగర్‌లో ఖైరతాబాద్‌ శాఖలో స్వయంసేవకు లయ్యారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యక్రమాల ఆకర్షితులయ్యారు. 1970లో సంఘప్రచారక్‌గా మొదటిసారి సంగారెడ్డికి వెళ్లారు.

1971లో నాటి దక్షిణ క్షేత్ర ప్రచారక్‌ యాదవ్‌రావ్‌జీ సలహా మేరకు తొలుత చెన్నై ప్రచారక్‌గా తరువాత సెలం విభాగ్‌ ప్రచారక్‌గా పని చేశారు.

పంజాబ్‌లో ఖలిస్తాన్‌ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో (1980లో) నాటి సర్‌కార్యవాహ శేషాద్రీజీ ఆయనను పంజాబ్‌కు పంపారు. అంతటి సవాళ్లతో కూడిన వాతావరణంలో ఆయన సాహసంతో వివిధ బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత విశ్వవిభాగ్‌ సంయోజక్‌ డా॥శంకర్‌ తత్త్వవాది సూచన మేరకు ఫిజీ వెళ్లారు. అక్కడి నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, మలేషియా, శ్రీలంక, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌ తదితర దేశాలలో పని చేశారు. ఆస్ట్రేలియాలో పని చేస్తుండగా ఆయనకు తొలిసారి గుండెపోటు వచ్చింది. కొంతకాలం భాగ్యనగర్‌లో ఉండి కోలుకున్నారు. మధ్య మధ్యలో సంఘ పనికోసం విదేశాలలో పర్యటించేవారు. భరతమాత ఋణం తీర్చుకోవటమే తన ధ్యేయంగా సాగిన భీష్మాచారి జీవితం మనకు ఆదర్శం.


‘కడవరకు సమాజం కోసమే జీవించారు’

మాతృభూమి సేవ కోసం జీవితాన్ని అర్పించిన మల్లాపురం భీష్మాచారి ఆకస్మిక స్వర్గవాసం మనసుని కలచివేసింది. సంస్థకూ, వ్యక్తిగతంగా నాకూ ఈ వార్త శరాఘాతం వంటిది. 1967 నుండి భాగ్యనగరంలో కార్యకర్తలుగా కలసి  పెరిగాం. ఇద్దరమూ భాగ్‌ శారీరక ప్రముఖులుగా సాఠేజీ చేతిలో ఎదిగాం. భీష్మను సంగారెడ్డికి, నన్ను విశాఖపట్నానికి  ప్రచారక్‌లుగా సోమయ్య గారు పంపించారు. తర్వాత వారు తమిళనాడు కేంద్రంగా  విశ్వవిభాగ్‌లో అత్యంత సమర్థంగా పనిచేశారు. విశ్వవిభాగ్‌లో చెరగని ముద్ర వేశారు.  ఫిజీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో విశిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. స్వయంసేవకుల కష్టసుఖాలలో భాగస్వాములయ్యేవారు. అపరిమితమైన శక్తి, ఉత్సాహం కలవారు. కుటుంబ సమస్య వచ్చినప్పుడు ఇంటికి వచ్చి సేవ చేసి మళ్లీ ప్రచారక్‌గా వెళ్లారు. కొంత అనారోగ్యం, కొంత ఇంటి బాధ్యత కారణంగా ప్రచారక్‌ బాధ్యతను విరమించినా నిరంతరం సమాజసేవలోనే గడుపుతున్నారు. వారి మరణం మనందరికీ తీరని లోటు. భౌతికంగా వారు మన మధ్య లేకున్నా వారి జీవితం నిరంతరం ప్రేరణ ఇస్తుంది. చిన్ననాటి మిత్రుడు, తోటి ప్రచారక్‌ను, బంధువును కోల్పోయాను. అరుణాచల్‌ పర్యటనలో ఉన్నందున వారి అంతిమ దర్శనానికి నోచుకోలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. వారి చరణాలకి వినమ్ర శ్రద్ధాంజలి. వారికి సద్గతులు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

– వి.భాగయ్య , అఖిల భారత కార్యకారిణి సభ్యులు

About Author

By editor

Twitter
YOUTUBE