బాంగ్లాదేశ్‌లో హిందువుల మీద గుడ్డి వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. దాదాపు 49 మంది హిందూ ఉపాధ్యాయులను స్థానికులు, విద్యార్థులు రాజీనామా చేయించినట్టు వార్తలు వచ్చాయి. బాంగ్లా అగ్రరాజ్యాల మధ్య బంతిలా మారిన క్రమంలో బలైన వారి సంఖ్య ‘దాదాపు 650’ అని ఒక కాకిలెక్కను ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యాలయం విడుదల చేసిన నివేదిక వెల్లడిరచింది. జూలై 16-ఆగస్ట్‌ 11 మధ్య సంభవించిన చావులు ఇవన్నీ. ఇవి సరైన గణాంకాలు కావని ఆ సంస్థ ఒప్పుకుంది. ఇది ప్రాథమిక నివేదిక అని కూడా చెప్పుకుంది. షేక్‌ హసీనా దేశంలో ఉన్నంతవరకు జరిగిన హత్యాకాండలో 400 మంది, తరువాత జరిగిన మారణకాండలో 250 మంది వరకు మరణించి ఉంటారని భాష్యం చెప్పింది.  ఇంకా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలలో దారుణంగా గాయపడిన వారు, పోలీసులు, సైన్యం చేతులలో చావుదెబ్బలు తిన్నవాళ్లు తరువాత ఎంత మంది చనిపోయారో తెలియడం లేదని కూడా నివేదిక చెప్పింది. ఎంత మంది హిందువులను చంపారో కూడా ప్రత్యేకంగా ఏమీ తెలియచేయలేదు.

ఇంతకీ బాంగ్లా అల్లర్లు రిజర్వేషన్‌లకు సంబంధించినవి మాత్రమే కాదని ఇప్పటికే రూఢ అయింది. డీప్‌స్టేట్‌ ఒక ముఠా తాము ఎక్కడైనా గొడవలు సృష్టించగలమని, ప్రభుత్వాలనీ, అధినేత లనీ కూల్చగలమని చెప్పడానికి ఇదొక ప్రయోగమని చెబుతున్నారు. పక్కదేశాలకు హెచ్చరికగా కూడా ఇలాంటి పనులు చేస్తారని అనిపిస్తుంది. దీని మూల్యం ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారమే అయినా 650 ప్రాణాలు. ఇందులో అంతర్జాతీయ రాజకీయాలు ఉన్నాయి. ప్రభుత్వాధినేతల తప్పిదాలు కూడా కనిపిస్తాయి. అంతిమంగా మతోన్మాదులకు అవకాశాలు కల్పించడం కూడా ఉంది. పాకిస్తాన్‌ ఏర్పడినప్పుడు జిన్నా ఇది సెక్యులర్‌ అన్నాడు. అలాగే బాంగ్లాదేశ్‌ను సెక్యులర్‌ రాజ్యమన్నాడు షేక్‌ ముజిబూర్‌ రహమాన్‌. ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పడిన దేశాలు సెక్యులరిజాన్ని బతకనివ్వవు. చరిత్ర రుజువు చేసినదేమిటి? ఇదే.

ఇస్లాం, సెక్యులరిజం ఒకచోట ఇమడవు

‘ఇస్లాంను అధికారిక మతంగా ఎంచుకుంటే, ఇక తమది సెక్యులరిజం అని ఆ దేశం ప్రకటించు కోలేదు’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు జస్టిస్‌ సురేంద్ర కుమార్‌ సిన్హా. ఈయన బాంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీవిరమణ చేశారు. నిజానికి పదవీ విరమణ చేయించారు. ఆ పదవి వరకు బాంగ్లాలో వెళ్లిన ఏకైక హిందువు ఆయనే. ఏమైనా షేక్‌ హసీనా ఆ దేశం విడిచి భారత్‌లో తలదాచుకోవడం, దరిమిలా పరిణామాల గురించి ఈ మాజీ ప్రధాన న్యాయమూర్తి కాస్త న్యాయంగానే మాట్లాడారని అనుకోవచ్చు. ‘షేక్‌ హసీనా పదవి విడిచి వెళ్లక తప్పదు. అది అనివార్యం. అలాగే మహమ్మద్‌ యూనస్‌ నాయకత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగబద్ధం కాదు.’ అన్నారాయన. మొత్తానికి ఇస్లాం, సెక్యులరిజం బద్ధశత్రువున్న విషయాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పి నందుకు సిన్హా గారిని అభినందించి తీరవలసిందే. ఈయనను 2017లో హసీనా ప్రభుత్వమే అవినీతి ఆరోపణల మీద పదవి నుంచి తొలగించింది. 11 ఏళ్ల జైలు శిక్ష కూడా పడిరది. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. బాంగ్లాదేశ్‌ సెక్యులర్‌ దేశంగా కొనసాగడం అనే అంశం మీద ప్రముఖ పత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన చర్చలో సిన్హా ఈ విషయం చెప్పారు. దేశ అధికారిక మతంగా ఇస్లాంను ప్రకటించుకుని బాంగ్లాదేశ్‌ సెక్యులర్‌ దేశంగా మనలేదని ఆయన స్పష్టంగా చెప్పారు. మీరు సెక్యులరిస్ట్‌ దేశమని చెప్పుకుంటున్నారు. కానీ రాజ్యాంగంలో ఇస్లామ్‌ను అధికారిక మతంగా ప్రకటించుకున్నారు. ఈ రెండూ ఒకచోట  కలసి ఉండవు అన్నారాయన. బాంగ్లాదేశ్‌లోని 48 జిల్లాలలో 278 ప్రదేశాలలో హిందువుల మీద తాజాగా దాడులు జరిగాయని ది బాంగ్లాదేశ్‌ నేషనల్‌ హిందూ గ్రాండ్‌ అలయెన్స్‌ నివేదించింది. కాబట్టి ఏ ఉదారవాది, ఏ మేధావి, ఏ జర్నలిస్ట్‌ ఇస్లాంకూ, ప్రజాస్వామ్యానికీ ముడిపెడితే నమ్మవలసిన అవసరం లేదని జస్టిస్‌ సిన్హా మాటలను బట్టి, అనుభవాన్ని చూసి అర్ధం చేసుకోవడం మంచిది. ముస్లిం మతోన్మాదం ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని సమూలంగా నిర్మూలించ దలిచింది. ఇస్లాం, ప్రజాస్వామ్యం కలసి ఉండడం అంటే ఒంటె, వ్యాపారి కథే ఎక్కడైనా.

1947 విభజన చరిత్ర మీద పెద్ద గాయమే చేసింది. వర్తమానం మీద చెరిగిపోకుండా కనిపిస్తున్న ఆ గాయం బాపతు మచ్చ కూడా తనదైన తీవ్రతను చూపిస్తున్నదంటే సత్యదూరం కాబోదు. పాకిస్తాన్‌ విభజనకు మూల పురుషుడు మహమ్మదలీ జిన్నా ఆదిలోనే తాను సాధించిన ప్రత్యేక దేశానికి మతం కారణం  కాదని అర్ధం చేసుకోవలసిన పరిస్థితి ఎదురైంది. తూర్పు బెంగాల్‌ వాసులంతా ఇక పాకిస్తానీ పౌరులుగా ఉర్దూ మాట్లాడాలని ఆదేశించి తీవ్ర భంగపాటుకు గురయ్యాడు. తమకు బెంగాలీ ముఖ్యమని అక్కడి ప్రజలు ముక్తకంఠంతో జిన్నాకు చెప్పారు. ఇప్పటికీ ఆ దేశ జాతీయగీతం రవీంద్రనాథ్‌ టాగూర్‌దేనన్న వాస్తవం తెలుసుకోవాలి. కానీ అవన్నీ గతమేనా? పంజాబ్‌, సింధ్‌ ప్రాంతం మీద ఇస్లాం ఉన్మాదపు విషపు గోళ్లు ఎంత తీవ్రంగా చొచ్చుకుపోయాయో, ఒకనాటి తూర్పు బెంగాల్‌ అనే నేటి బాంగ్లాదేశ్‌లో కూడా, అక్కడి ప్రజల రక్తంలో కూడా అంత తీవ్రంగాను చొచ్చుకుపోయాయని తాజా అల్లర్లు రుజువు చేస్తున్నాయి. గుర్తించవలసిన వాస్తవం కొత్తది. నాటి మతోన్మాదాన్ని నేటి క్రైస్తవ సామ్రాజ్యవాదం శాసిస్తున్నది. దీనికే అనేక పేర్లు, అమెరికా ఆధిపత్యం లేదా డీప్‌స్టేట్‌ ఏమైనా వాటన్నిటి ఉద్దేశం ఒక్కటే. విశ్వాన్ని కల్లోల పరచడం. వీలైతే క్రైస్తవాన్ని రుద్దడం. అప్పటివరకు క్రైస్తవ సామ్రాజ్యంతో చేతులు కలిపి తుది ఫలితం తమ వశం చేసుకోవచ్చునన్నది ఇస్లాం మతోన్మాదపు ఎత్తుగడ.

ఇంతకీ తూర్పు బెంగాల్‌ ప్రాంత ఇస్లాం మూలాలు ఎలాంటివి? ఈ ప్రశ్న ఎందుకు అంటే, షేక్‌ హసీనా భారత్‌కు చేరిన దరిమిలా అక్కడ హిందువుల మీద జరుగుతున్న హత్యాకాండకూ, ఆ గతానికీ బంధం ఉంది. 1947కు ముందు అక్కడ ఇస్లాం విస్తరించిన తీరు, మతహింస చరిత్ర దానిని రుజువు చేస్తాయి.

భారత్‌కి ఇస్లామ్‌ మొదటిగా తురుష్క దోపిడీ దొంగలు, దురాక్రమణదారుల వల్ల ప్రవేశించినా ఒక ప్రధాన మతంగా ఆవిర్భవించడానికి మన చరిత్రలోని కొన్ని మలుపులు దోహదం చేశాయి. ఇస్లాం ఆది నుంచి తన విస్తరణకు నమ్ముకున్నది కత్తి మొననే. 1206లో బానిస రాజుల పాలన ఢల్లీి పరిసరాలలో ఆరంభమైంది. 1236లో టిబెట్‌ పర్యాటకుడు ధర్మస్వామిన్‌ హిమాలయ శ్రేణుల నుంచి బెంగాల్‌కు వచ్చాడు. బెంగాల్‌కు చెందినవారే టిబెట్‌లోని తెగలలో బౌద్ధం విస్తరించడానికి దోహదం చేశారు. అప్పుడు టిబెట్‌ ప్రాంతం రాజకీయ అనిశ్చితి నుంచి బౌద్ధారామాల ద్వారా సుస్థిర పాలనకు వాతావరణం ఏర్పడుతున్న కాలంలో ఈ పరిణామం జరిగింది. అయితే తాము ఎక్కడి నుంచి బౌద్ధం దిగుమతి చేసుకున్నారో, అదే బెంగాల్‌లో పరిస్థితులను చూసి ధర్మస్వామిన్‌ కంగు తినవలసి వచ్చింది. అది కూడా స్వీయానుభవాలతో. ఆయన ఒకసారి పడవ మీద ఒక నది దాటుతున్నాడు. ఆ పడవలోనే ఇద్దరు తురుష్క సైనికులు ఉన్నారు. సైనికులు క్షణంలో దోపిడీ దొంగలయ్యారు. ఉన్న బంగారమంతా తమ స్వాధీనం చేయమని ఆదేశించారు. అందుకు ధర్మస్వామిన్‌ నిరాకరించి, ఆ ఇద్దరి గురించి స్థానిక పాలకుడికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీనితో ఆ తురుష్క సైనికులిద్దరూ మొదట ధర్మస్వామిన్‌ చేతిలోని భిక్షాపాత్రను లాక్కున్నారు. అక్కడే చంపేస్తామని బెదిరించారు. దీనితో సాటి బౌద్ధభిక్షువులు ఆపి, ధర్మస్వామిన్‌కే నచ్చచెప్పారు. ఆ నగలు, డబ్బు ఆ తురుష్కులకు ఇచ్చేసి, ప్రాణాలు దక్కించుకోమని. టిబెట్‌ ధర్మస్వామిన్‌కు తెలియని వాస్తవం, అప్పటికి బెంగాల్‌ ప్రాంతంలో తురుష్కుల దోపిడీ సర్వసాధారణం. ఢల్లీి సుల్తానేట్‌ తిష్ట వేస్తున్న సమయంలో గంగా పరీవాహక ప్రాంతంలో తురుష్క సైనికులు, యువకులు దోపిడీలను ఉపవృత్తిగా మార్చుకున్నారు. అయితే స్థానిక ‘రాజా’లకి తురుష్క సైనికులే దిక్కు. తురుష్క సైనికులే క్రమంగా బౌద్ధారామాలను దోచేసి, నగరాల మీద పట్టు సాధించారు. ఒకరకంగా పాలకుల అవతారం ఎత్తారు.

మన సెక్యులర్‌ చరిత్రకారులు చచ్చినా ప్రస్తావించని చరిత్రకారుడు రిచర్డ్‌ ఈటన్‌ ఈ కీలక విషయం బహిర్గతం చేశారు. ఈటన్‌  ‘ది రైజ్‌ ఆఫ్‌ ఇస్లామ్‌ అండ్‌ ది బెంగాల్‌ ఫ్రాంటియర్‌ 1204-1760’ గ్రంథంలో రెండు విషయాలు ఉన్నాయి. దోపిడీదొంగల నుంచి పాలకుల స్థాయికి ఎదిగిన ముస్లిం పాలకులు తమ జీవన విధానం యావత్తు సుదూర బాగ్దాద్‌, ఇరాన్‌, కొంతవరకు ఢల్లీి పాలకుల విధానాలనే, భాషనే అనుసరించారు తప్ప, స్థానిక సంస్కృతిని, భాషను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే అవకాశంగా గ్రామీణ ప్రాంత జమిందారులు, పాలకులు కొంత బలంగా ఉండేవారు.  రెండో అంశం` సూఫీయిజం ప్రవేశం. ఈ పరిణామాలకు వందేళ్ల తరువాత ఇరాన్‌, మధ్య ఆసియా సూఫీ గురువులు, వారి భారతీయ శిష్యగణం సాయంతో ఆ వర్గాన్ని వృద్ధి చేశారు. సరిహద్దులలోని ప్రజలను మతాంతరీకరణ చేశారు. సంస్కృత గ్రంథాలను అనువదించుకున్నారు. ఇదంతా ఇస్లాం పరిధినీ, ఆరాధననీ దాటని తతంగమే. అవన్నీ ఇస్లాంను సున్నిత మార్గంలో ప్రచారం చేసే చర్యలే. అయినా నగరంలో ఉండి పాలించే ముస్లిం పాలకులకు గ్రామీణ ప్రాంత భూస్వాములు, తాబేదారుల నుంచి నిరంతరం బెడద ఉండేది. సుల్తానేట్‌ ప్రతినిధులను భూస్వాములు, తాబేదారులు కూలదోసేవారు. ఇలాంటి కూల్చివేతల సమయంలోనే 1400 సంవత్సరంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఒక ముస్లిం సుల్తాన్‌ను (పట్టణ ప్రాంతంలో) కూలదోసిన గ్రామీణ ప్రాంత హిందూ పాలకులు రాజ్యం తమ చేతులలో ఉంచడానికి ఒక రాజీ చేసుకున్నారు. దాని ప్రకారం తమ వారసుడైన ఒక బాలుడిని మతం మార్చి సింహాసనం ఎక్కించారు. అంటే పుట్టుక చేత హిందూ. పాలకునిగా ముస్లిం. ఇది సూఫీ ఆధ్వర్యంలో జరిగింది. నిజానికి ఇక్కడ పై చేయి ఎవరిది? ఓటమి ఎవరిది అన్నది అర్ధం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. అతడు సుల్తాన్‌ జలాలుద్దీన్‌ మహమ్మద్‌ (1418-1433). ఇతడే ఇరాన్‌, ఢల్లీి పాలకుల అడుగుజాడలను వీడి దేశీయమైన బాట పట్టాడు. బెంగాల్‌ సంస్కృతిని గౌరవించాడు. బ్రాహ్మణులను పోషించాడు. దుర్గామాత బొమ్మతో నాణేలు విడుదల చేశాడు. మసీదులను కూడా బెంగాలీ వాస్తు మేరకు నిర్మించాడు. ఇతడే త్రిపుర, ఒడిశా వరకు రాజ్యాన్ని విస్తరించాడు. కాని అంతిమంగా ఇతడిలోను ముస్లిం పాలకుడు కనిపించాడు.

ఇలాంటి నేపథ్యంలో జరిగిన పరిణామం బెంగాల్‌ మీద మొగలుల ఆధిపత్యం. కానీ బానిస పాలకుల వారసుల కాలంలోనే బెంగాల్‌ కొత్త వైష్ణవం ప్రారంభమైంది. చైతన్య మహాప్రభు బోధనలు వ్యాప్తి చెందాయి.

సుల్తానేట్‌కు చెందిన వారు మళ్లీ విజృంభించారు. 16వ శతాబ్దానికి తమ ఆధిపత్యానికి హిందువులతో పాటు మరొకవర్గం కూడా పోటీకి తయారైందని భావించవలసి వచ్చింది. వారే ఆంగ్లేయులు. ఆ క్రమంలో ముస్లింలు సూఫీల మీద దుష్ప్రచారం ఆరంభించారు. సూఫీలు ఎన్నో హిందూ ఆలయాలను ధ్వంసం చేయడమే కాకుండా, అవిశ్వాసులను చంపారని కూడా బానిసరాజుల వారసులు దొంగ చరిత్రలు వెలువరించారు. కానీ మొరాకో నుంచి వచ్చిన 14వ శతాబ్దపు పర్యాటకుడు ఇబన్‌ బతూతా చెప్పిన వివరాలు ప్రకారం సూఫీలు అలాంటి చర్యలకు ఒడిగట్టలేదు.

ఈ విషయాన్ని కూడా రిచర్డ్‌ ఈటన్‌ ప్రస్తావించారు. 17వ శతాబ్దంలో మతం మారిన గ్రామీణ ప్రాంత వ్యవసాయదారులు కూడా సూఫీలను ప్రతినాయకులను చేస్తూ కథలు వ్యాపింపచేశారు. కానీ సూఫీలని జిహాదీలనీ, ఘాజీలని నిందిస్తూనే, అడవులను ముస్లిముల ఆవాసాలు మార్చిన మహత్యం వారిదని కీర్తించారు.

1971లో తూర్పు బెంగాల్‌ బాంగ్లాదేశ్‌ అయింది. 1988లో తమది ఇస్లామిక్‌ జీవన విధానం ప్రధానంగా ఉండే దేశమని ప్రకటించుకుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ జరిగింది. అంటే అంతకాలం మరుగున పడిన మతోన్మాదం, పాకిస్తాన్‌ వారసత్వం ఒక్కసారిగా తలెత్తాయి. తరువాత బాంగ్లాలోని హేతువాదులు, హిందువులు, ఇతర మైనారిటీలు ముస్లిం మతోన్మాదులకు లక్ష్యంగా మారారు. భారత సైనికులను వెన్నుపోటు పొడిచిన బాంగ్లా సైనికులు మన వారిని దారుణంగా చంపారు.

 మైనారిటీ, మెజారిటీ ఈ మాటలు ముస్లింల ఆధ్వర్యంలో జరిగిన దాడులకు సంబంధించి ఇంకా ఉపయోగించవలసిన అవసరం ఉందా? ఈ దాడులన్నీ ఏకపక్షమే. ముస్లిం మతోన్మాదులు చేస్తున్నావే. బాంగ్లాదేశ్‌లో హిందువులు మైనారిటీలు. కాబట్టి మెజారిటీ ముస్లిం మతస్థులు దాడులకు దిగారు. సిక్కులు, క్రైస్తవులు హిందువుల కంటే అల్ప సంఖ్యాకులు కాబట్టి బాంగ్లా ముస్లిం మతోన్మాదులు వీరినీ విడిచిపెట్టలేదు.

భారత్‌లో మెజారిటీలు హిందువులు. కానీ హనుమజ్జయంతి ప్రదర్శనల మీద, శోభాయాత్రల మీద ముస్లింలు ఎందుకు దాడి చేస్తున్నారు? రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఢల్లీి, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో ఎన్ని చోట్ల ఇటీవల కాలంలో దాడులు జరిగాయి? దీనికి కొసమెరుపు ఆగస్ట్‌ 17న మహారాష్ట్రలో మళ్లీ మత ఉద్రిక్తతలు చెలరేగాయి. బాంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఒక హిందూ సంఘం ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటే వారి మీద ముస్లింలు వచ్చి రాళ్లు రువ్వారు. దీనిని ఏమనాలి? ఇలాంటి వాస్తవాలను భారతదేశంలోని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఉదారవాదులు, ప్రధానంగా స్త్రీవాదులు అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. మైనారిటీ ముస్లింలకు మద్దతు ఇవ్వడం, మతోన్మాదులుగా మారిన ముస్లింలను అంటకాగడం ఒకటి కాదు.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE