రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజే 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలను విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించింది. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ గ్రామసభల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే పనులకు సంబంధించి జాబితాతోపాటు స్వర్ణ గ్రామ పంచాయతీకి సంబంధించి రూ.4,500 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించింది. సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ఈ సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ జిల్లా వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొనగా, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని మైసూరావారిపల్లెలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ పాల్గొన్నారు. బీజేపీ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌ పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో పాల్గొనగా, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు ఆయా జిల్లాల్లో గ్రామసభల్లో పాల్గొని సర్పంచులలో నూతనోత్తేజాన్ని కలిగించారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా ఏదో ఒక గ్రామసభలో పాల్గొని గ్రామసభల ప్రాధాన్యాన్ని తెలియజేశారు.

ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించి గ్రామసభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా గ్రామాల్లో ఏయే పనులు అవసరమో అధికారులు ముందుగానే గుర్తించి గ్రామసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామసభల ద్వారా ఉపాధి పనులకు ఆమోదం లభించడంతో ఉపాధి హామీ సిబ్బందికి ఊరట లభించింది. సర్పంచులు ఇకపై గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇది మార్గదర్శకంగా నిలిచిందంటున్నారు. ఆయా సభల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చేసిన ప్రసంగాలు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల్లో ఆత్మసైర్యం నింపాయి. గ్రామ పంచాయతీలు ఒక వైభవ స్థితికి వస్తాయని, గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నమ్ముతున్నారు. దీంతో గ్రామాలకు దక్కాల్సిన నిధులు, విధులు సమకూరతాయని, సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధిశాఖను నిర్వహించడంతో ఆ శాఖకు అత్యంత ప్రాధాన్యమేర్పడిరదని పేర్కొంటున్నారు. చాలా జిల్లాల్లో 75 శాతం వరకు వైసీపీ సర్పంచులు ఉండటంతో కొందరు సభలకు రాకున్నా మిగతా వారు మాత్రం పాల్గొని గ్రామ సభలను నిర్వహిం చారు.

పంచాయతీలకు జవసత్వాలు

రాష్ట్రంలో కుప్పకూలిన పంచాయతీరాజ్‌ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామసభ నిర్వహణపై మొట్టమొదట దృష్టి సారించింది. గ్రామాల్లో స్థానిక పాలన సక్రమంగా జరగాలంటే గ్రామస్థుల సమష్టి నిర్ణయం ఉండాలి. దానికి మూలం గ్రామసభలు. అవి మొక్కుబడిగా కాకుండా వాస్తవంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగితే ప్రజల మనోభావాలను పంచుకునే అవకాశముంటుంది. కేంద్రం కూడా గ్రామ సభలను బలోపేతం చేసేందుకు నిర్ణయ్‌ అనే పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ప్రజల భాగస్వామ్యం కల్పించడం, పారదర్శకత, జవాబు దారీతనం పెరిగేలా గ్రామసభలు నిర్వహించేందుకు పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్‌ శాఖను అధ్యయనం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలు బలోపేతమవ్వడం వెనుక మూలాలను పరిశీలించారు. అక్కడ పనిచేసి వచ్చిన పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ అనుభవంతో వ్యవస్థను బలోపేతం చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా దానిని చేపట్టాలని నిర్ణయిం చారు. తద్వారా గ్రామ సభల ప్రాధాన్యాన్ని స్పష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామాల్లో నాలుగు రకాల సౌకర్యాలు సమకూర్చాలన్నారు. కుటుంబాలకు కనీస అవసరా లైన విద్యుత్‌, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్లు, ఎల్‌పీజీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలన్నారు. గ్రామాలకు ఉమ్మడి సౌకర్యాలైన తాగునీటి సరఫరా పథకం, డ్రైనేజీ, ద్రవ,ఘన వ్యర్థాల నిర్వహణ, వీధిలైట్లు, సీసీ రోడ్లు, అన్ని గ్రామాల మార్కెట్లకు, సమీప నగరాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. గ్రామ పంచాయతీ రోడ్లు, అంతర్గత రోడ్డు, లింక్‌ రోడ్లు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో మౌలిక వసతు లైన కందకాలు, ఫారంపాండ్స్‌ ఏర్పాటు చేయాలి. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఉద్యాన వనం, సెరికల్చర్‌కు అవసరమైన మౌలిక వసతులు, పశువుల కొట్టాలు, పశువులకు సంబంధించిన వసతులు ఏర్పాటుచేయాలి. వీటన్నింటినీ సాధించడం ద్వారా స్వర్ణ గ్రామ పంచాయతీలను సాధించుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ గ్రామసభల్లో చేర్చారు. సభకు రెండు రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1452 కోట్లు విడుదల చేసింది. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు.. అర్బన్‌ పరిధిలో రూ.454 కోట్లు విడుదల చేశారు. అలాగే పంచాయతీల్లో స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశా లిచ్చింది. మేజర్‌ పంచాయతీలకు గతంలో రూ.250, మైనర్‌ పంచాయతీల్లో రూ.100 మాత్రమే నిధులు కేటాయించగా వాటిని రూ.25,000, రూ.10,000 లకు పెంచింది. ఈ చర్యలన్నీ పంచా యతీలకు మంచిరోజులు రానున్నాయనేందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి.

ముఖం చాటేసిన వైసీపీ సర్పంచులు

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు దాదాపుగా 70 శాతం మంది వైసీపీ నాయకులే ప్రతినిధులుగా ఉన్నారు. సర్పంచ్‌ నుంచి జడ్పీటీసీ, కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ వరకు ఇలా అన్ని విభాగాల్లోనూ వైసీపీ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో గ్రామ సభలకు కొంతమంది వైసీపీ సర్పంచులు ముఖం చాటేశారు. సర్పంచులు ఎన్నికల్లో గెలిచాక తొలిసారిగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీల్లో అత్యంత కీలకమైన గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తుంటే కొంత మంది వైసీపీ సర్పంచులు సభలకు దూరంగా ఉన్నారు. మరి కొందరు, తమకు సమాచారం ఇవ్వలేదని కుంటి సాకులు చెబుతూ సభలకు గైర్హాజరయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో వైసీపీ సర్పంచులు సభలకు హాజరై కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి వేదికపై ఆశీనులయ్యారు. గ్రామసభను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు పంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన పనులు, ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ దిశగా చర్చించి అక్కడికక్కడే మరికొన్ని ప్రతిపాదనలు కూడా పంచాయతీ తీర్మానం పుస్తకంలో నమోదు చేశారు. వైసీపీ సర్పంచులు హాజరుకాని సభల్లో పంచాయతీ కార్యదర్శులు తీర్మానాలు చేయించారు. దీంతో అత్యధిక పంచాయతీల్లో సభలు విజయ వంతమై నట్లయింది.

రూ. 4,500 కోట్ల విలువైన పనులకు తీర్మానాలు

‘మన పంచాయతీ… మన సాధికారత’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఊళ్ల బాగు కోసం ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రచారం చేసి తగు చర్యలు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ కోసం 49 రకాల పనులు, వ్యవసాయ అనుబంధ పనులు 38 రకాలు చేపట్టేందుకు ఈ సభల్లో తీర్మానాలు చేశారు. మొత్తం 87 రకాల పనులు, వేతనాలకు రూ.4,500 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 9 కోట్ల పనిదినాలు, 87 రకాల పనులతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతుంది. గ్రామ సభలు నిర్వహించడంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా గ్రామాల్లో అందుతున్న సౌకర్యాలు తెలుపుతూ నాలెడ్జి బోర్డులు ఏర్పాటు చేశారు.

గతంలో ఏమైంది?

ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో రూ.40,579 కోట్లు నిధులు వచ్చాయి. గ్రామీణాభివృద్ధి కోసం ఈ నిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి. కానీ ఆ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2014-19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం రూ.240కోట్లు ఉంటే 2019-23 సంవత్సరాల్లో కేవలం రూ.170 కోట్లే వచ్చింది. క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణం. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు సర్వ స్వతంత్రత తీసుకురావాలనే సంకల్పంతో పని చేస్తోంది. ఆయా గ్రామాల ప్రత్యేకతలను గ్రామసభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్‌ చేయాలని భావించింది. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగుమతి చేసి సంపద సృష్టించే మార్గాలను ఆన్వేషించడమే తమ లక్ష్యంగా పేర్కొంది. పంచాయతీల్లో చాలా భూమి నిరుపయోగంగా ఉంటోంది. దాన్ని క్రమ పద్ధతిలో వినియోగించు కోవాలి.

స్వచ్ఛ భారత్‌ను మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీల్లో ఓ ప్రణాళిక ప్రకారం ఎక్కడా చెత్త లేకుండా క్లీన్‌, గ్రీన్‌ గ్రామాలుగా తయారు చేసేలా దృష్టి పెడుతున్నారు. పంచాయతీలకు సంబం ధించి వృథాగా ఉన్న స్థలంలో కలప మొక్కలను పెంచాలని భావిస్తున్నారు. గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులను పర్యవేక్షించాల్సిన, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పని చేయలేదు. ఆ విభాగానికి కూడా పోలీస్‌ అధికారిని హెడ్‌గా పెట్టాలని ఆలోచిస్తున్నారు. పంచాయతీల్లో పెండిరగ్‌లో ఉండిపోయిన రూ.2వేల కోట్లను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. మెటీరియల్‌ కాంపోనెంట్‌ గ్రాంట్‌ను త్వరలోనే ఇస్తామంటోంది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE