– గంగుల నరసింహారెడ్డి 

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఉదయం తొమ్మిది గంటల సమయం కావస్తుండగా అల్పాహారం ముగించుకొని పాఠశాల కెళ్లడానికి తయారు కాసాగాడు శివశంకర్‌. ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఊరి ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పని చేస్తున్నాడతడు.

‘‘టైమవుతుంది. లంచ్‌బాక్స్‌ తెచ్చివ్వు’’ తల దువ్వుకుంటూ వంటింట్లోని భార్యనుద్దేశించి అన్నాడు.

‘‘అయిపోయింది, తెస్తున్నా’’ అందామె లోపల్నుండి.

సరిగ్గా తొమ్మిది గంటలకు మోటారు సైకిలుపై బయలుదేరతాడతడు. ఇరవై నిమిషాలలోపే బడికి చేరుకుంటాడు. ప్రార్థన ప్రారంభమయ్యే సమయం కన్నా ముందే బడిలో ఉండడం అతనికి నిత్యకృత్యం.

ఇంతలో ఎవరో బయట నుండి ‘‘శంకరన్నా శంకరన్నా’’ అని పిలిచారు.

బయటకు వచ్చి చూసిన శివశంకర్‌కు పక్కింటి బాలరాజు కనిపించాడు. ‘ఏమి సంగతి’ అని అతడు అడగకముందే –

‘‘అన్నా, మీ దోస్తు రామకృష్ణ సచ్చిపోయిండం టనే’’ అని ఆదుర్దాగా చెప్పాడు బాలరాజు.

పక్కలో పిడుగుపడినట్లుగా అదిరిపడ్డాడు శివశంకర్‌.

‘‘నిజమా? ఏమయిందిరా ?’’ నిర్ఘాంతపోతూ అడిగాడు.

‘‘అవునన్నా నిద్రలోనే పానం పోయిందంట. గుండె పోటు అని అనుకుంటున్నారు’’

ఈలోగా శివశంకర్‌ భార్య కూడా బయటకువచ్చి ఈ వార్త విని, ‘‘అయ్యో ఎంత పనయింది. నిన్న సాయంత్రమే రచ్చకట్ట కాడ కలిశిండు. మనిషి ఎప్పట్లాగనే ఉషారుగ్గనిపించిండు’’ అంటూ వాపోయింది.

శివశంకర్‌ వెంటనే తమ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఫోన్‌ చేసి విషయం చెప్పి సెలవుకు అనుమతి తీసుకున్నాడు.

‘‘నేను పోయి చూసొస్త’’ అని భార్యతో చెప్పి రామకృష్ణ ఇంటికి బరువైన గుండెతో బయలుదేరాడు శివశంకర్‌. వీళ్ల ఇంటి నుండి వాళ్లింటికి అయిదు నిమిషాల నడక.

దారిలో కలిసిన వాళ్లందరూ ఆ చావు కబురే చెబుతున్నారు.

శివశంకర్‌, రామకృష్ణలు ఇద్దరూ బాల్య స్నేహితులు. హైస్కూలు దాకా కలిసే చదువుకున్నారు. శివశంకర్‌ కుటుంబంతో పోల్చుకుంటే రామకృష్ణ కుటుంబం కలిగిన కుటుంబమే. రామకృష్ణ తండ్రి నారాయణ ఓ మోతుబరి రైతు. ఇద్దరి కులాలు వేరైనా ఊరి వరుసల ప్రకారం పరస్పరం ‘బావా’ ‘బావా’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఇరు కుటుంబాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలున్నా అవి వారి అనుబంధానికి అడ్డురాలేదు. రామకృష్ణ పదవ తరగతితోనే చదువు ఆపేసి వ్యవసాయంలో దిగితే శివశంకర్‌ తన చదువు కొనసాగించి, ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించి ఊరి నుండే రాకపోకలు కొనసాగిస్తూ ఉండడంతో వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం వారి వయసుతో పాటే పెరిగింది. ఇద్దరికిప్పుడు దాదాపు అరవై సంవత్సరాల వయసు.

శివశంకర్‌, ఆ ఇంటికి చేరుకునే సరికి వాకిలి నిండా ఊరి జనం ఉన్నారు. అతన్ని చూసి దారి వదిలారు.

అప్పటికే నేలపై పడుకోబెట్టి ఉన్న రామకృష్ణను చూడగానే దుఃఖం ఆగలేదు శివశంకర్‌కు. వలవలా విలపిస్తూ ‘‘ఏందిరా బావా, నన్నొక్కన్ని చేసి వెళ్లి పోయినవా, నేను రిటైరయినంక ఇద్దరం కలిసి ఎన్నెన్నో యాత్రలకు పోదామనుకుంటిమి. చిన్నప్పటి లాగ కలిసి తిరుగుదామనుకుంటిమి… అయ్యో…’’

అంటూ చనిపోయిన రామకృష్ణ ప్రక్కన కూలబడి పోయాడతడు.

‘‘వీళ్లిద్దరికీ మంచి దోస్తానా’’ అంటున్నారెవరో.

అలాగే ఏడుస్తూ కూర్చున్న శివశంకర్‌ను అయిదు నిమిషాల తరువాత బలవంతంగా లేపి ఇవతలకి నడిపించుకుంటూ వచ్చారు.

మరో అయిదు నిమిషాల తరువాత తేరుకొని ‘‘కొడుకులకు, బిడ్డకు ఫోన్‌ చేసిండ్రా’’ అడిగాడు శివశంకర్‌ తనను పట్టుకున్నతన్ని.

‘‘చేసినం, అట్లనే ఈన అక్కలిద్దరికి కూడా ఫోన్‌ చేసి చెప్పినం.’’

మరి కొంతసేపటి తరువాత ఇంకాస్తా తేరుకు న్నాడు శివశంకర్‌. తనకు సన్నిహితులైన వారిని దగ్గరికి పిలిచి మొట్టమొదట చేయవలసిన పనుల్ని పురమాయించాడు.

శవాన్ని సరయిన పద్ధతిలో పడుకోబెట్టించి తల దగ్గర దీపం పెట్టించాడు. అయిదారు కొయ్య చెక్కల్ని తెప్పించి వాకిట్లో చిన్న మంటను ఏర్పాటు చేశాడు. మరో గంటలో షామియానా, కుర్చీలూ, నీళ్ల బాటిల్సు కూడా నాగర్‌ కర్నూలు నుండి వచ్చేశాయి.

రామకృష్ణకు ఇద్దరు అక్కలు. అతనే చిన్నవాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పిల్లలు ముగ్గురూ హైదరాబాద్‌లోనే ఉంటారు. అక్కలు మాత్రం ఒకరు మహబూబ్‌నగర్‌లో మరొకరు జడ్చర్ల దగ్గర ఉంటారు. అతని తల్లి అయిదేళ్ల క్రితమే చనిపోగా రెండేళ్ల క్రితమే భార్య కూడా చనిపోయింది. ఉన్న పొలాన్ని కౌలుకిచ్చి, ముసలి తండ్రికి సేవలు చేస్తూ ఇంత కాలం గడుపు కొచ్చాడు రామకృష్ణ.

‘‘ఆ ముసలాయిన పొద్దుగాల్నుంచి ఏడుస్తునే ఉన్నాడు, ఊకుంట లేడు’’ శివశంకర్‌ దగ్గరికి వచ్చి చెప్పాడొకతను,

‘‘అవును మామను మర్చేపోయిన నేను’’ అంటూ లోపలికి వెళ్లాడు శివశంకర్‌.

శివశంకర్‌ను చూడగానే బావురుమన్నాడు రామకృష్ణ తండ్రి నారాయణ. దాదాపు ఎనభై అయిదు సంవత్సరాల వయసుంటుందాయనికి.

‘నా తలకు కొరివి పెట్టాల్సినోడు నాకన్నా ముందే పాయెగదా నాయినా’ అంటూ రామకృష్ణ చేయి పట్టుకొని విలపించసాగాడు. ఆ ముసలాయన దీన పరిస్థితిని చూడగానే శివశంకర్‌కు కూడా కన్నీళ్లు ఆగలేదు.

 బలవంతంగా దుఃఖాన్ని దిగమింగుకుంటూ, నారాయణ చేయి పట్టుకొని ‘‘ఉర్కో మామా, ఏడువకు, మన చేతిలేముంది? అంతా దేవుని లీల, ఆయనెందుకో నిన్ను చిన్న సూపు చూసిండు. ఇంత టీ అయినా తాగు,’’ అంటూ బలవంతంగా నారాయణకు రెండు బిస్కట్లు తినిపించి, టీ త్రాగించాడు.

రామకృష్ణ ఆకస్మిక మరణం, అతని సంతానానికి గానీ, తోబుట్టువులకు గానీ ఒక ‘లోటు’గా అవుతుందే తప్పా ఇంకేమీ కాదు. కాని అతని ముసలి తండ్రికి మాత్రం అపార నష్టమూ, కష్టమూ అవుతుంది.

కొడుకంత మంచిగా ఆ ముసలాయన్ని ఎవరు చూసుకుంటారు? ఆ విషయం అర్థమై శివశంకర్‌కు నారాయణ ముందుముందు పరిస్థితిపై జాలి కలిగి హృదయం ద్రవించిపోయింది.

మరో గంట తరువాత రామకృష్ణ అక్కలూ బావలూ వచ్చారు. అక్కలిద్దరూ గుండెలు బాదు కుంటూ విలపించారు. మరో రెండు గంటల్లో రామ కృష్ణ కొడుకులూ, కూతురూ కూడ తమ తమ కుటుంబాలతో తరలివచ్చారు. మరోసారి అందరి ఏడుపులూ మిన్నంటాయి.

కొడుకుల దుఃఖం కొంత ఉపశమించాక శివశంకర్‌ వారినిద్దర్ని దగ్గరికి పిలిచి జరుగవలసిన కర్మకాండ గురించి చర్చించాడు.

‘‘జరుగవలసినదంతా మీరే చూసుకోవాలి మామా’’ అంటూ రామకృష్ణ పెద్దకొడుకు శివ శంకర్‌కు డబ్బులిచ్చాడు.

ఊరి బయటనున్న శ్మశానంలో చితికి ఏర్పాట్లు జరిగాయి. తప్పెట్ల వాళ్లిచ్చారు. కాటికాపరి వచ్చాడు. రామకృష్ణ శవయాత్రకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది. అంతకు ముందురోజు రాత్రిదాకా అందరితో కలివిడిగా మాట్లాడిన రామకృష్ణ మరో గంటలో చితిమంటలో దహనమై బూడిదగా మారాడు.

భారంగా ఇంటికి తిరిగివచ్చి, ఇంటి బయటనే స్నానం చేసి భార్య అందించిన బట్టలు ధరించి ఇంట్లోకి వెళ్లాడు శివశంకర్‌.

భోజనం చేయాలనిపించలేదు. మనసంతా దిగులుగా ఉంది. రామకృష్ణతో గడిపిన జ్ఞాపకాలు ఎన్నెన్నో సినిమా రీళ్లలా కళ్ల ముందు కదలాడు తున్నాయి. అర్ధరాత్రి దాటాకగాని నిద్రపట్టలేదతనికి. ఆ కలత నిదుర కలలోనే రామకృష్ణ కనిపించాడు. అతని మొహంలో అంతులేని విచారం కనబడిరది శివశంకర్‌కు. రామకృష్ణ తనకేదో చెప్పాలని ప్రయత్ని స్తున్నట్లుగా కూడా తోచిందతనికి.

‘‘ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు రామకృష్ణా’’ నిద్రలోనే గట్టిగా అరిచాడు శివశంకర్‌.

ఈలోగా భార్య తట్టి లేపడంతో మెలుకువ వచ్చిందతనికి.

‘‘అయ్యో, ఏందో కలవరిస్తున్నవు?’’ అడిగిందామె.

‘‘ఏదో పీడకలొచ్చిందిలే’’ అని లేచి మంచినీళ్లు తాగి పడుకున్నాడు కానీ, మళ్లీ నిదుర పట్టలేదతనికి.

 * * * * * * 

తరువాత వరుసగా మూడురోజుల పాటు పాఠశాలకు వెళ్లి రావడంతోనే సరిపోయింది శివశంకర్‌కు, రామకృష్ణ ఇంటివైపు వెళ్లి రావడానికి వీలుపడ లేదతనికి. ఈ మూడు రోజుల నుండి కూడా అతని కలలోకి రామకృష్ణ వస్తూనే ఉన్నాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ దీనంగా, నిస్సహాయంగా చూస్తూనే ఉన్నాడు.

ఆ ఆదివారం ఉదయం రామకృష్ణ వాళ్లింటికి వెళ్లి రావాలని తయారవుతుండగా రామకృష్ణ చిన్నబ్బాయి నుండే ఫోన్‌ వచ్చింది శివశంకర్‌కు.

‘‘మామా, ఇయాల అయిదొద్దులు కదా, బూడిదెత్తుతున్నం. నీవు రావాలే’’ అని చెప్పాడు.

‘‘అక్కడికి రావాలనే తయారవుతున్నరా, వస్తున్నా’’ అని బయలు దేరాడతను. దారిలోనే ఎదురయ్యారు ఆ కుటుంబసభ్యులు. శ్మశానంలో చితి కాల్చిన చోట అస్థికల్ని ఏరి కుండలో భద్రపరచి, తలా ఇంత బూడిద ఎత్తి ప్రక్కనున్న చెట్ల మొదళ్లలో పోశారు.

తరువాత అందరితో కలిసి శివశంకర్‌ కూడా వాళ్లింటికి చేరుకున్నాడు. ఆ ఇల్లు అప్పుడు అయిదు రోజుల క్రితం శవం లేచిన ఇల్లులా లేదు. పిల్లల అల్లరితో, పెద్దల నవ్వులతో సందడిగా, కోలాహలంగా ఉంది.

‘‘ఈ రోజు భోజనాలు మేం పెడ్తున్నంరా శంకరూ, తినిపో’’ అంది ఆ ఇంటి పెద్ద ఆడపడచు, రామకృష్ణ పెద్దక్క.

‘సరే వదినా’’ అని అరుగుపై కూర్చున్నాడు శివశంకర్‌. అదే అరుగుపై గోడవైపు వేసివున్న మంచంపై పడుకొని ఉన్నాడు నారాయణ. మంచం దాకా వెళ్లి అతని చేయి పట్టుకొని ‘మామా’ అని పిలిచాడు.

అతన్ని చూడగానే ముసలి నారాయణకు అప్రయత్నంగానే కన్నీరు కారింది. శివశంకర్‌ మనసంతా అదోలా మారింది. మంచం కోడుపై కూర్చొని ఆ వృద్దుని చేయిని పట్టుకొని ‘‘అంతా ఆ పైవాడి లీల. మనసును గట్టి చేసుకో’’ అని ఓదార్పుగా అన్నాడు.

‘‘నా గతే అగుడయిపోయిందిరా, జల్ది సచ్చిపోతే బాగుండు’’ అన్నాడు నారాయణ గద్గద స్వరంతో.

‘‘అట్లనుకుంటే ఇంకా నీరసపడిపోతావు. నీ బిడ్డలు, మనవండ్లు, మనవరాలు.. ఇంత మంది ఉండంగ నీకేం కష్టం కాదు, ఊరుకో’’ అని ఊరడిర చాడే గాని అతనికి తెలుసు రామకృష్ణ లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరని.

ఈలోగా నారాయణ పెద్ద కూతురు తండ్రికి కంచంలో అన్నం పెట్టుకొని వచ్చింది. మంచంపై నుండి లేచాడు శివశంకర్‌.

‘‘శివశంకరు మామా! లోపలికిరా భోంచేద్దువు గాని’’ అని రామకృష్ణ పెద్ద కొడుకు లోపల్నుండి పిలిచాడు.

అతడు లోపలకి వెళ్లేసరికి చాలామంది కనిపించారు. మగవాళ్లంతా మందు తాగుతున్నారు. కల్లు కూడా తెచ్చినట్లున్నారు. మాంసాహార వంటకాలతో ఇల్లంతా ఘుమఘుమలాడిపోతోంది.

చావుకు సంబంధించిన ఇలాంటి భోజనాల కార్యక్రమంలో మందు తప్పని సరిగా ఉండాల్సిందే. ఓ మందు గ్లాసును శివశంకర్‌ దగ్గరికి తెచ్చారొకరు, సున్నితంగా తిరస్కరించాడతడు.

‘‘మామ మందు తాగడు’’ రామకృష్ణ కూతురు చెప్పింది. మటనూ, చికెనూ, పలావు దండిగా పెట్టుకొని తెచ్చి అతనికి అందించారు.

‘‘రేపు మా చిన్నత్తా, ఎల్లుండి మేమూ. ఆవలెల్లుండి మా వదిన తల్లిగారూ, ఆ తరువాత చిన్నొదిన తల్లిగారూ ఇలా ఈ వారమంతా భోజనాలు ఏర్పాటుచేస్తున్నాము’’ గర్వంగా ఎవరితోనో అంటుంది రామకృష్ణ కూతురు.

అంటే ఈ వారమంతా అందరికీ భోజనాలతో పాటు మందు కూడా సప్లయి చేయబడుతుందన్న మాట అని మనసులో అనుకొని చిన్నగా నవ్వు కున్నాడు శివశంకర్‌, అది ఆ ప్రాంతపు సాంప్రదాయం మరి!

‘‘ద్వాదశ దినకర్మ వచ్చే ఆదివారం నాడే వస్తున్నది మామా మర్చిపోకు’’ అన్నాడు రామకృష్ణ పెద్దకొడుకు అతని దగ్గరికి వచ్చి.

‘సరే’ అన్నట్లుగా తల ఊపాడు. భోంచేస్తూనే అందరి వంకా కలియచూశాడు. ఎవరి ముఖాల్లోనూ కొంచెమైనా విషాదచ్ఛాయలు కనబడడం లేదు.

‘‘మటన్‌ లేతగా బాగుంది.’’

‘‘చికెన్‌ ఫ్రై కల్లులోకి అదిరింది’’

‘‘కల్లు పుల్లగా కాకుండా తీయగా బాగుందిరో, ఎక్కడ్నుంచి తెప్పించార్రా ?’’

‘‘మసాల వడలు బాగున్నాయి ఓ రెండోస్కో’’

అన్నీ ఇలాంటి మాటలే వినబడుతున్నాయి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రామకృష్ణ గురించి మాట్లాడ్డం లేదు.

ఇక భోజనం సయించలేదు శివశంకర్‌కు, మారు పెట్టించుకోకుండా చేతులు కడుక్కొని ఇంటికి బయలుదేరాడు .

మనసంతా వికలమయి భారంగా నడిచాడు.

ఆ రాత్రి కూడా అతని కలలోకి రామకృష్ణ వచ్చాడు. ఆ మొహంలో అదే దిగులు!

* * * * * * 

ఆ తరువాతి వారం రోజుల పాటు రామకృష్ణ ఇంటిలో జరిగిన భోజనాల గురించి ఊరిలోని వారందరూ గొప్పగా చెప్పుకోసాగారు. కానీ రాత్రిపూట శివశంకర్‌ కలలోకి దిగులు మొహంతో రామకృష్ణ క్రమం తప్పకుండా రావడం మాత్రం మానలేదు. కారణమేంటో అర్థంగాక అతడు గింజుకోసాగాడు.

తండ్రి ద్వాదశ కర్మను కొడుకులు ఎంతో బ్రహ్మాండంగా చేశారు. హైదరాబాద్‌ నుండి వచ్చిన వారి బంధుమిత్రుల కార్లతో ఊరంతా నిండిపోయి, ఊరిలో పండుగ వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం పూట ఊరంతటికి మాంసాహర భోజనం పెట్టారు. దగ్గరి వాళ్లకూ కావల్సిన వాళ్లకూ ఖరీదైన మందును పెట్టారు. బ్రాహ్మణులకు భారీగా సంభావనలిచ్చారు. గంగిరెద్దులు వారినీ, కాటికాపరినీ నజరానాలతో సంతృప్తి పరచారు.

‘రామకృష్ణ చనిపోయినా అదృష్టవంతుడేరా, అతని దినాలను పిల్లలు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు.’’

‘‘అవున్రా మనూర్ల ఇంత బాగా ఎవరికీ జరుగలే.’’

‘‘ఊరంచున దొడ్డికాడ తండ్రికి పెద్ద బిందానం కట్టించి, చుట్టూ పూలతోట పెడ్తారంట’’

‘‘అస్థికల్ని నదిల కలుపనీకె అందరు బీచుపల్లికి పోతుంటే వీళ్లు మాత్రం తండ్రి అస్థికల్ని విమానంల తీస్కపోయి కాశీలో కలిపొస్తరంట’’

ఇలా ఊరిలోని చాలామంది రామకృష్ణ కర్మకాండ గురించి అబ్బురంగా చెప్పుకుంటున్నారు.

కర్మకాండ ఆర్భాటాన్ని చూస్తూ, ఊరి వాళ్ల పొగడ్తల్ని వింటూ ఉన్న శివశంకర్‌కు మాత్రం ఆ తతంగం ఏమీ సంతృప్తిని కలిగించకపోగా బాధనే రగిల్చింది. ఆ సందడిలో అతడిని పట్టించుకోలే దెవ్వరు. రామకృష్ణ ఫోటో దగ్గరికి క్యూలో వెళ్లి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించి భోంచేయ కుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.

ఆ రాత్రి అతనికి రోజులానే కలలో రామకృష్ణ మొహం ప్రత్యక్షమయింది. తనకింత ఘనంగా కర్మకాండ జరిగిందన్న సంతోషం ఆ మొహంలో ఏ కోశానా లేదు. పైగా రోజు కన్నా దిగులు మోతాదు కాస్త ఎక్కువగానే ఉంది.

ఆ తరువాత మూడు రోజులపాటు శివశంకర్‌ కలలో రామకృష్ణ అదే దిగులు మొహంతో కనిపించాడు.

* * * * * * 

దినాలైన మూడు రోజుల తరువాత కాశీకెళ్లిన రామకృష్ణ కొడుకులిద్దరు తిరిగి వచ్చారని తెలిసింది శివశంకర్‌కు.

ఆరోజు మధ్యాహ్నం శివశంకర్‌ పాఠశాలలో ఉండగా రామకృష్ణ పెద్ద కొడుకు నుండి ఫోన్‌ వచ్చింది.

‘‘మామా స్కూలు నుండి వచ్చినంక సాయంత్రం మా ఇంటికి రావాల్నే. తాత విషయం మాట్లాడాలే. ఆయినే నిన్ను పిలువనంపమంటున్నడు.’’

‘‘సరే, అయిదు గంటలకల్లా వస్తానులే’’ అన్నాడు శివశంకర్‌. అప్పటి నుండి అతని మనసులో నారాయణ గురించిన ఆలోచనలే రాసాగాయి.

‘నిజమే కదా, ఆ ముసలాడిని ఇప్పుడేం చేస్తారు. ఎవరి దగ్గరుంచుకుంటారు. ఇన్ని రోజులుగా తనీ విషయం గురించి ఎందుకు ఆలోచించలేక పోయాడు?’ అని తనలో తనే మధనపడ్డాడు.

పాఠశాల ముగిసిం తరువాత ఇంటికి చేరుకొని మొహం కడుక్కొని టీ తాగి, భార్యకు విషయం చెప్పి రామకృష్ణ ఇంటికి బయలుదేరాడు.

అతనక్కడికి చేరుకునేసరికి నారాయణ ఉన్న అరుగుపైనే రామకృష్ణ ముగ్గురు పిల్లలతో బాటు ఇద్దరు అక్కలూ వాళ్ల భర్తలూ కూడా సమావేశమై ఉన్నారు.

అతడు వెళ్లి నారాయణ మంచం ప్రక్కనే కింద కూర్చున్నాడు.

‘‘తాతను ఒక్కన్ని ఈ ఇంట్లో ఉంచలేం. మా ఇండ్లళ్లో మాతోని ఉంచుకోనీకె మాకు వీలుపడదు. అందుకే హైదరాబాద్‌ దగ్గర ఓల్డేజ్‌హోంల ఉంచు దమను కుంటున్నం మామా’’ అన్నాడు రామకృష్ణ పెద్దకొడుకు.

‘‘అవుర్రా శేఖరూ, నాయనను మా దగ్గరన్నా ఉంచుకుందమనుకుంటే మాకు సేతగాకుండయింది. మాకే ఒకరు చెయ్యాలి.’’ అంది రామకృష్ణ పెద్దక్క.

వాళ్ల మాటల్ని బట్టి, అతనక్కడికి వెళ్లేసరికే చర్చలు జరుపుకొని ముసలాయన గురించి వారు నిర్ణయం తీసుకున్నట్లుంది.

అందుకు ఏమని జవాబివ్వాలో అర్థంగాక ‘నిజమే కదా’ అన్నట్లుగా తలపంకించాడు.

‘‘కాని తాతనేమో ఈడనే ఉంట అంటున్నాడు. బయట ఎక్కడా ఉండడంటా. ఓల్టేజీ హోంలంటే ఇప్పుడు అప్పట్లాగ కాదు. చాలా నీటుగా ఉంటు న్నాయి. ఇంట్ల మనకన్నా వాళ్లే బాగ చూసుకుంటారు. నీవు తాతకు నచ్చజెప్పు మామా’’ అన్నాడు రామకృష్ణ చిన్న కొడుకు.

తలతిప్పి నారాయణ వంక చూశాడు శివశంకర్‌. ఒక్క క్షణం దేహంలో గగుర్పాటు కలిగినట్లుగా అనిపించిందతనికి. ఎందుకంటే ఆ ముసలాయన మొహంలో తనకు రోజూ కలలో కనిపించే రామకృష్ణ మొహంలోని దిగులే కనిపిస్తోంది.

‘‘నన్నేడికో తీస్కపోయి పడేయవద్దని నీవయినా, సెప్పురా శంకరూ. నాకీ ఇంట్లనే ఉండి ఈడ్నే సావాల నుందిరా. నన్నిక్కడినే ఉంచమని సెప్పురా’’ అంటూ కన్నీరు కారుస్తూ, బలహీన స్వరంతో అంటూనే రెండు చేతులెత్తి అందరికీ నమస్కారం చేయబోయాడు. శివశంకర్‌ గభాలున లేచి నారాయణ చేతుల్ని ‘‘వద్దు వద్దంటూ’’ పట్టుకున్నాడు.

శివశంకర్‌కు ఏం మాట్లాడాలో తోచడం లేదు. పక్కన ముసలాయన చిన్నగా రోదిస్తూనే ఉన్నాడు.

‘‘నే నీన్నే సస్తరా, నే నీన్నే సస్తరా ‘‘ అని దీనంగా వేడుకుంటున్నాడు.

‘‘పొద్దు గాల్నుంచి ఇట్లనే ఏడుస్తున్నాడు’’ అంది నారాయణ చిన్న కూతురు, రామకృష్ణ చిన్నక్క.

శివశంకర్‌ మనసంతా గందరగోళంగా తయారయింది. ముసలాయన వేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతూంది. ఓ రెండు మూడు నిమిషాల వరకు పరి ష్కారం గురించి ఆలోచించాడు.

ఉన్న పళంగా ఈ ముసలాయన్ని ఓల్డేజీ హోంకు పంపకుండా తాత్కాలికంగా నైనా ఉపశమనం కలిగించాలి, అనే నిర్ణయానికి వచ్చాడతడు. ఆ నిర్ణయం బాగుంటే దాన్నే కొనసాగించవచ్చు ననుకున్నాడు.

‘‘ఓల్డేజ్‌ హోం వారు నెలకు ఎంత తీసుకుం టారు?’’ అని రామకృష్ణ పెద్దకొడుకు వైపు తిరిగి అడిగాడు శివశంకర్‌.

‘‘ఇరవై వేల పైనే అవుతుంది మామా, మేమిద్దరం అన్నదమ్ములం చెరి సగం పెట్టుకుందమను కుంటున్నాం’’

‘మామ ఇష్టం ప్రకారం ఇక్కడే ఉంచుదాంరా అందుకు నేనిద్దరు మనుషుల్ని మాట్లాడతాను. వంట చేయడానికి ఓ ఆడమషీ, పగటిపూట స్నానం చేయించడానికి, రాత్రిపూట తోడుగా పండుకోవ డానికి ఓ మగమనిషినీ మాట్లాడతాను. ఆ ఇద్దరికీ ఈ ఇరవై వేలు సరిపోతాయి. నేను రోజూ సాయంత్రం ఇక్కడికి వచ్చి మామను చూసుకుంటా. మామ బాధ్యత ఇక నాకొదిలేయండి’’ అన్నాడు శివశంకర్‌ చిరునవ్వుతో.

సమస్య తీరిందని అందరూ హాయిగా నిట్టూర్చి అతనికి కృతజ్ఞతలు తెలిపారు.

ముసలాయనకు కన్నీరు ఆగిపోయి వెలుగురేఖ మెరిసింది. శివశంకర్‌ను దీవిస్తున్నట్లుగా చేతిని పైకెత్తి చిరునవ్వు నవ్వాడు.

ఇంటికి తిరిగి వస్తున్న శివశంకర్‌కు మనసు లోంచి ఏదో భారం దిగిపోయినట్లుగా హాయిగా ఉంది. ఇంటికి చేరుకొని భార్యకు తను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాడు.

‘‘మంచి పనిచేసినావు. ఎప్పుడయినా వంటామె రాకుంటే నేను వండి పెద్దాయనకు పంపిస్తానులే’’ అతని నిర్ణయాన్ని మెచ్చుకుంటూనే తన సహకారం వెల్లడిరచిందామె.

ఆ రాత్రి కలలో శివశంకర్‌కు రామకృష్ణ కనిపించాడు. అప్పుడతని మొహంలో ఇన్నాళ్ల నుండి కనిపించిన దిగులు లేదు. పైగా స్నేహితుని వంక కృతజ్ఞతగా చూస్తున్నట్లుగా ఉంది. అంతకు నుంచి కళ్లలో తృప్తితో కూడిన శాంతి కూడా కనిపించింది శివశంకర్‌కు.

ఆ మరునాటి రాత్రి నుండి శివశంకర్‌కు కలలోకి రామకృష్ణ రావడం మానేశాడు.

About Author

By editor

Twitter
YOUTUBE