కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఎ పునరుద్ధరణ విషయంలో తమ దేశ వైఖరి, కాంగ్రెస్‌`నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి వైఖరి ఒకటేనని పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసీస్‌ వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దు వ్యతిరేక వైఖరి తీసుకున్నందుకు కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆ కూటమికి విజయం తథ్యమేనని కూడా అసీస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్‌ రక్షణ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే తీవ్రమైన అంశమేనని ఇప్పటికే బీజేపీ దుయ్యబట్టింది. కాబట్టి ఆ రెండు పార్టీలు జాతీయతను సమర్థించే పార్టీలు కావని తేలిపోయిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సెప్టెంబర్‌ 22న వ్యాఖ్యానించారు. నిజానికి పాక్‌ మంత్రి ఈ వ్యాఖ్య చేసిన తరువాత కూడా కాంగ్రెస్‌, లేదా రాహుల్‌ ఖండిరచలేదు. ఏమైనా ఆర్టికల్‌ 370ని మళ్లీ ఆవాహన చేయాలన్న కోరిక కొన్ని పార్టీలలో ఉంది. అదే ఆర్టికల్‌తో ఎన్నికల వైతరిణిని దాటాలనీ, మోదీని మళ్లీ దానితోనే ఎదుర్కొనాలని విఫలయత్నం చేస్తున్నాయి. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో దాని మీద కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) ఆధారపడ్డాయి. మా బాటలోకే ఆ రెండు పార్టీలు వచ్చాయని పాకిస్తాన్‌ ధీమాగా ప్రకటించడం అందుకే. 

సెప్టెంబర్‌ 18న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ తొలి విడత పోలింగ్‌ జరిగింది. 24 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ అంతా ప్రశాంతంగా జరగడం, అందునా 61 శాతం నమోదు కావడం చరిత్ర. పదేళ్ల అనంతరం, ప్రత్యేకించి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత శాసనసభ ఎన్నికలు జరుగుతుండడంతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పండితులు అక్కడి రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. కిస్త్‌వాద్‌ జిల్లాలో 77 శాతం, పుల్వామా జిల్లాలో తక్కువగా 44 శాతం పోలింగ్‌ నమోదైంది. పోస్టల్‌ బ్యాలెట్లు, మారుమూల ప్రదేశాల వివరాలు రావలసి ఉంది. భారీ పోలింగ్‌ 370 రద్దు తెచ్చిన సానుకూల మార్పునకు తొలి సంకేతంగా భావించాలి.

ఒకే దేశంలో రెండు చట్టాలు, ఇద్దరు ప్రధానులు, రెండు పతాకాలు ఉండడాన్ని వ్యతిరేకించే జాతీయవాదుల కల మోదీ సర్కారు హయాంలో ఆగస్టు 5, 2019న నెరవేరింది. ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే అదే ఆర్టికల్‌ 370ను ఆవాహన చేయాలని మోదీ వ్యతిరేకులు భావిస్తున్నట్టే ఉంది. ఇందుకు నిదర్శనం అసెంబ్లీ ఎన్నికలలో 370 రద్దు అంశాన్ని ఆ శక్తులు సాధనంగా వాడుకోవాలని చూడడమే. ఇందుకు కాంగ్రెస్‌ తోడ్పడుతున్నది. కశ్మీర్‌లో ముస్లిం జనాభాదే ఆధిపత్యం. రెండు ప్రాంతాల జనాభాను కలిపి చూస్తే ముస్లింలు 70 శాతానికిపైగా, హిందువులు దాదాపు 25 శాతం ఉంటారు. కశ్మీర్‌ లోయలో ముస్లింలు 90 శాతానికిపైగా, జమ్ము ప్రాంతంలో హిందువులు 65 శాతానికిపైగా ఉంటే, ముస్లింలు 30 శాతానికిపైగా ఉంటారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు (2024) జరిగాయి. అప్పుడు రద్దు అంశం వ్యతిరేకులకు ఉపకరించలేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని కీలకంగా చేయడానికి సెక్యులరిస్టులు, మేధావులు, వారిని అనుసరించే మీడియాతో పాటు పలు వర్గాలు ఇప్పటికీ ప్రయత్నించాయి. ఆర్టికల్‌ రద్దుపై దేశ వ్యాప్తంగా ప్రజలు సానుకూలంగా ఉండడంతోపాటు నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిసిన ఈ వర్గం లోక్‌సభ ఎన్నికల్లో ఆర్టికల్‌ రద్దు అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించలేదు. వారు ఊహించినట్టే ఆ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌లో ఐదు నియోజకవర్గాలకుగాను బీజేపీ, నేషనల్‌ కాన్ఫిరెన్స్‌ చెరో రెండు, ఇండిపెం డెంట్‌ ఒక స్థానంలో గెలవడంతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏకపక్ష తీర్పు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచి మోదీ ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రజామోదం లేదని ఎండగట్టాలని చూశాయి.

మతప్రాతిపదికన గట్టేందుకు యత్నాలు

జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి, శాంతిభద్రతల ప్రాతిపదికన కాకుండా మతవిభజనతో గట్టెక్కాలనే ఆశయంతో మతతత్వశక్తులతో, దేశద్రోహులతో పొత్తు పెట్టుకొని బీజేపీని అడ్డుకోవాలని శతవిధాలా కొన్ని సంస్థలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అక్కడ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూలో 43, కశ్మీర్‌లో 47 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కశ్మీర్‌ లోయలో బలహీనంగా ఉన్న బీజేపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదనే ఆలోచనతో కాంగ్రెస్‌ ‘ఇండి’ కూటమి పేరుతో పాకిస్తాన్‌కు వత్తాసు పలికే ఫరూక్‌ అబ్దులా నేతృత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకుంది. అది అభ్యంతరం చెప్పక పోయుంటే పాకిస్తాన్‌ పాట పాడే మరో పార్టీ పీడీపీతో కూడా జట్టు కట్టడానికి సిద్ధమైంది కాంగ్రెస్‌. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు తిరస్కరించారు. అయినా పాఠం నేర్వని కాంగ్రెస్‌ ఇప్పుడు దేశ ప్రయోజనాలనే పణంగా పెట్టడానికి సిద్ధ్దమైంది. ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్‌ లోయలోని 47 స్థానాల్లో కూటమి అత్యధిక స్థానాలు పొందాలని, బీజేపీకి పట్టున్న జమ్ము ప్రాంతంలో హిందూ ఓట్లను చీల్చే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రణాళికలు రూపొందించింది. జమ్ముకశ్మీర్‌ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలది ముఖ్య భూమిక కాగా, ప్రభుత్వ ఏర్పాటులో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ కీలక పాత్రను పోషిస్తున్నాయి.

రాష్ట్రంలో 1967, 1972 ఎన్నికల్లో వరుసగా మెజార్టీ సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. 2002లో ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడడంతో, సంకీర్ణ ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌ రెండో విడతలో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్‌ 2008లో 17 శాతం ఓట్లతో 17 స్థానాలు పొందింది. 2014లో 18 శాతం ఓట్లు పొందినా ఐదు సీట్లు కోల్పోయి 12 స్థానాలకు పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే 2004, 2009 ఎంపీ ఎన్నికలలో 2 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ 2014, 2019, 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేదు. 2024 ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఎన్సీ, పీడీపీలతో పొత్తు పెట్టుకుని 19 శాతానికి పైగా ఓట్లు సాధించినా ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు ఎన్సీతో పొత్తుపెట్టుకొని కశ్మీర్‌లో ఒకటి రెండు సీట్లు గెలిచి, జమ్మూలో మాత్రం పెద్ద ఎత్తున హిందువుల ఓట్లలో చీలిక తెచ్చే కుటిల యత్నాలకు పాల్పడిరది.

మరోవైపు మోదీ శకానికి ముందు రాష్ట్రంలో బీజేపీ ప్రభావం నామమాత్రమే. 1972లో జనసంఫ్‌ు 3 స్థానాలు గెలిచిన అనంతరం బీజేపీ 1987లో 2, 1996లో 8 స్థానాల్లో గెలిచి ఉనికిని చాటుకుంది. 2002లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 2008లో 12 శాతం ఓట్లతో 11 స్థానాలు గెలిచింది. 2014లో 22 శాతం ఓట్లతో 25 స్థానాల్లో గెలవడంతో బీజేపీ రాష్ట్రంలో కీలక పార్టీగా ఆవిర్భవించింది. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జమ్ములో బలపడిరది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014, 2019లో మూడు స్థానాలు గెలిచిన బీజేపీ, 2019 తర్వాత లద్దాఖ్‌ వేరుకావడంతో 2024లో జమ్ములో మిగిలిన రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి తన పట్టును నిలుపుకుంది. నియోజకవర్గాల పునర్విభజనతో జమ్ములో సీట్లు పెరగడం తమకు సానుకూలమనే భావనలో ఉన్న బీజేపీ, ఎక్కువ స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించింది.తన బలహీనత తెలిసిన బీజేపీ జమ్ములో ఒంటరిగా పోటీ చేస్తూ, అదే సమయంలో కశ్మీర్‌లో దాదాపు పదికిపైగా స్థానాల్లో సైద్ధాంతికంగా తమకు అనుకూలమైన స్వతంత్ర అభ్యర్థులతో ఎన్నికల అనంతరం అవగాహన కుదుర్చుకోవాలని చూస్తుంది.

జాతీయ దృక్పథంతో ఆలోచించకుండా సున్నితమైన మత విభజనతో బీజేపీని లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్న వర్గాలు ఆర్టికల్‌ 370 రద్దును ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ముస్లింలు కీలక పాత్ర పోషించే ఈ ఎన్నికల్లో వారు బీజేపీని ఎలాగూ ఓడిస్తారని, దీంతో ఆర్టికల్‌ రద్దు చేసిన బీజేపీ నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారని ప్రపంచానికి చూపాలని వారి ఎత్తుగడ. ప్రాంతీయ పార్టీలు తమకు లేని అధికారంతో ఆర్టికల్‌ 370 పునరుద్ధరిస్తామని కశ్మీర్‌ వ్యాలీలో వాగ్దానాలు చేస్తున్నా, కాంగ్రెస్‌ మాత్రం ఆచితూచి అడుగు లేస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు గట్టిగా డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెస్‌, ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ అంశాన్ని మాత్రం ప్రస్తావించడం లేదంటేనే దీని ప్రాధాన్యత తెలుస్తుంది.

పలు ప్రయోజనాల కోసమే ఆర్టికల్‌ రద్దు

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం తుడిచి పెట్టుకుపోయిందా? అని మేధావులు ప్రశ్నిస్తూ పెడర్థాలు తీస్తూ వక్రభాష్యాలు చెబుతున్నారు. ఆర్టికల్‌ రద్దు తర్వాత ఉగ్రవాద దాడులు, రాళ్ల దాడులు తగ్గాయని గణాంకాలే చెబుతున్నాయి. 2004 నుంచి యూపీఏ ప్రభుత్వ హయాంలో 7217 ఉగ్రదాడులు జరగ్గా, 2014 తర్వాత అవి 2259కు తగ్గాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత 900 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, రాళ్లురువ్వుడు ఘటనలు తగ్గాయని పార్లమెంట్‌లో హోం శాఖ సహాయ మంత్రి ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మరోవైపు ఉగ్రవాదులు కశ్మీర్‌లో తమ ఆటలు సాగకపోవడంతో తమ పంథాను మార్చుకొని అమాయక ప్రజలను ముఖ్యంగా పండిట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. కశ్మీర్‌ బదులు జమ్ములో దాడులకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రధాన లక్ష్యం కశ్మీర్‌లోకి తిరిగి రావాలనుకునే పండిట్లను, అక్కడ వ్యాపారాలను ప్రారంభించాలనుకునేవారిని భయభ్రాంతులను చేయడమే. ఇక్కడ మరో ప్రధానాంశం ఉగ్రవాద నిర్మూలన ఒక్కటే ఆర్టికల్‌ ముఖ్య ఉద్దేశం కాదు. స్వయం ప్రతిపత్తి ఆర్టికల్‌ను అడ్డుపెట్టుకొని అక్కడి రాజకీయ పార్టీలు, నేతలు, వేర్పాటువాదుల అరాచకాలను అడ్డుకోవడం కూడా ఒక లక్ష్యమే. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు అక్కడ కూడా అదే రకమైన పాలన, చట్టాలుండాలి. ప్రకృతి అందాలతో మెరిసే అక్కడ పర్యాటకులు పెరగాలి. రాష్ట్రం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలి. ఇవేవీ పట్టించుకోకుండా కశ్మీర్‌ ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పే మేధావులు జమ్ముతో పాటు దేశం ప్రజల మనోభావాలను పరిగనలోకి తీసుకోకపోడం విచారకరం.

జమ్ము కశ్మీర్‌లో గెలుపు కోసం ‘ఇండి’ కూటమితో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. బీజేపీని బూచిగా చూపి ముస్లింల ఓట్లను గంపగుత్తగా పొందాలని చూస్తున్నాయి. అవామీ ఇత్తేహాద్‌, అప్నీ వంటి చిన్న చిన్న పార్టీలు బీజేపీకి తోకపార్టీలుగా వ్యవహ రిస్తున్నాయని ‘ఇండి’ కూటమి, పీడీపీ విమర్శిస్తుంటే, ఎన్సీ, పీడీపీ పార్టీలే బీజేపీతో తెరచాటున ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపిస్తుండడంతో బీజేపీ కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ఆర్టికల్‌ 370 రద్దుకు లంకె పెడుతున్న కుహనా లౌకికవాదులు దేశంలోనే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్టికల్‌ రద్దు నిర్ణయాన్ని 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకంటే దేశ ప్రజల వాంఛ వారికి తెలుసు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వారికి తెలుసు. అప్పుడు మిన్న కుండా ఉన్నవారు ఇప్పుడు ఏదో జరగబోతుందనే ఆశతో 370 ఆర్టికల్‌ రద్దుపై గొంత్తెతున్నారు. ఆ ఆర్టికల్‌ను తిరిగి తీసుకొచ్చి జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అగ్నికి ఆజ్యం పోయడమే వీరి లక్ష్యమా? కాలం మారింది. ఆర్టికల్‌ 370 రద్దు చరిత్రలో కలిసి పోయింది. జమ్ముకశ్మీర్‌ గతంతో పోలిస్తే ఇప్పుడు రక్తసిక్తం దిశగా కాకుండా అభివృద్ధి వైపు పయని స్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న జమ్మూ కశ్మీర్‌ ప్రజాతీర్పు భారతదేశ కీర్తిని మరింత పెంచేలా ఉంటుందని ఆశిద్దాం. తీర్పు ఎలా ఉన్నా ఆర్టికల్‌ 370కి జీవం పోయడం ఎవరికీ సాధ్యం కాదు.

– డా. ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE