ప్రపంచం ఏమనుకుంటే ఏమిటి? సున్నీ వక్ఫ్ బోర్డు తన పని తనదే అనుకుంటున్నది. బిహార్ రాజధాని పట్నాకి సమీపంలో ఉన్న గోవిందపూర్ అనే గ్రామం ఉంది. అసలు ఆ గ్రామం మొత్తం వక్ఫ్ ఆస్తి, కాబట్టి ముప్పయ్ రోజులలో ఖాళీ చేసి వెళ్లాలని ఇటీవల నోటీసు బోర్డు నోటీసు ఇచ్చింది. దీని మీద అక్కడి ప్రజానీకం హైకోర్టును ఆశ్రయించింది. మీ ఆధారాలు చూపించమని కోర్టు బోర్డుని ఆదేశించింది. ఏలాంటి ఆధారాలు అది అందించలేదు. పైగా ఒకసారి వక్ఫ్ ఆస్తి అంటే అది ఎప్పటికీ వక్ఫ్ ఆస్తేనని మాత్రం చెప్పింది. కాబట్టి కోర్టు కాస్త ఉపశమనం కల్పించింది. మేమంతా నివాసం ఉంటున్న ఈ భూమి వక్ఫ్ బోర్డుదంటూ తమకు నోటీసు అందిందని, కాబట్టి ముప్పయ్ రోజులలో ఖాళీ చేయాలని అందులో ఉందని కానీ మేం ఇక్కడ యాభయ్ ఏళ్లుగా ఉంటున్నామని గోవిందపూర్ నివాసి రామ్‌లాల్ చెప్పారు. ఆయనే ఈ న్యాయపోరాటంలో ముందున్నారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ఉంటే అది ఎప్పటికీవక్ఫ్ ఆస్తిగానే ఉంటుందని బోర్డుచైర్మన్ ఇష్రదుల్లా చెప్పారు. ఆ రాష్ట్ర మంత్రి జామా ఖాన్ పాము చావకుండా, కర్ర విరక్కుండా చెప్పారు. ఈ విషయం మీద దర్యాప్తు జరగాలి. అది వక్ఫ్ బోర్డుది అయితే వక్ఫ్ బోర్డుదే. వారికే అప్పగిస్తాం. లేదంటే కాదని చెబుతాం అన్నారాయన.
వక్ఫ్ బోర్డు కన్ను డేగ కన్ను వంటిది. ఏ ఆస్తిమీదైనా దాని కన్ను పడవచ్చు. ఇంకా చెప్పాలంటే భూప్రపంచం మీద ఉన్న ఏ ఆస్తినైనా అది చూడవచ్చు. ఇప్పుడు గోవిందపూర్ పరిణామం మాత్రమే కాదు, గతంలోను చాలా గడుసుగా చాలా కీలకమైన ప్రదేశాలను, ఆస్తులను తమవిగా ప్రకటించింది. అందుకే వక్ఫ్ బోర్డును సంస్కరించివలసిన అవసరం దృష్ట్యా పార్లమెంట్‌లో దాని సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. అయినా దాని ఆగడాలు ఆగడం లేదు. వక్ఫ్ బోర్డుల లావాదేవీలలో మరింత జవాబుదారీతనం, మహిళలకు స్థానం కల్పించడం వంటి అంశాలను చేర్చాలని కేంద్రం భావిస్తున్నది. నిజానికి ఈ సవరణ ముస్లింల నుంచి వచ్చిన అభిప్రాయం మేరకే జరుగుతున్నది.
భగవంతుడి పరం చేసిన ఆస్తినే వక్ఫ్ అంటారు. మసీదుల, దర్గాలు, శ్మశాన వాటికలు, శరణాలయాలు, విద్యాసంస్థల కోసం ఆ ఆస్తులను వినియోగించాలి. ఈ ఆస్తులను ఇస్లాం పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి ఇచ్చిన స్థిరాస్థిగా పరిగణిస్తారు. ముస్లిం చట్టం నిర్దేశించిన మేరకు మత, ధార్మిక కార్యక్రమాలకు వెచ్చిస్తారు.
వక్ఫ్ 1995 చట్టాన్ని అడ్డం పెట్టుకుని వక్ఫ్ కొన్ని ఆస్తులు తనవిగా ప్రకటించుకుంది. అవి చాలా వివాదాస్పదమయ్యాయి. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకునే వక్ఫ్ 2017లో సుప్రీంకోర్టు భవనం నిర్మించిన స్థలం తమదని ప్రకటించుకుంది.
సెప్టెంబర్ 2022లో తమిళనాడు వక్ఫ్ బోర్డ్ తిరుచందురై గ్రామం మొత్తం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది.ఆ గ్రామంలో మెజారిటీ ప్రజలు హిందువులు.
అయోధ్య రామ జన్మభూమి వివాదాస్పద స్థలం తమదేనని వక్ఫ్ ప్రకటించుకుంది. తరువాత సుప్రీంకోర్టు ఆ స్థలం హిందువులకు చెందుతుందని తీర్పు చెప్పింది.
కృష్ణ జన్మభూమిగా హిందువులు విశ్వసించే మధురలో ఆ క్షేత్రానికి చుట్టుపక్కల భూములన్నీ తమవేనని వక్ఫ్ ప్రకటించుకుంది. కృష్ణ జన్మభూమికి సమీపంలో నిర్మించిన షాహి ఈద్గా మీద కూడా వక్ఫ్ తన హక్కును ప్రకటించుకుంది. ఇక్కడే ఉన్న కేశవదేవుని ఆలయం కూడా వక్ఫ్ పరిధిలోనిదని ప్రకటించుకున్నారు. అది కృష్ణుడి ఆలయం.
వారణాసిలో విశ్వేశ్వరుని మందిరాన్ని ఆనుకునే ఉండే జ్ఞానవాపి మసీదు తమదేనని వక్ఫ్ వాదిస్తు న్నది. కానీ అక్కడ హిందూ దేవాలయాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువుల వాదన.
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న భోజ్‌శాల తమదేనని వక్ఫ్ వాదన. కానీ అది భోజరాజు కాలంలో నిర్మించిన సరస్వతి అమ్మవారి ఆలయమని చరిత్ర.
గుజరాత్‌లోని రుద్ర మహాలయం వక్ఫ్ ఆస్తి అని వాదిస్తారు. కానీ అది శివాలయమే.
గుజరాత్‌లోని విఖ్యాత సోమనాథ్ దేవాలయం ఆస్తిని కూడా వక్ఫ్ తమదిగానే చెబుతుంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇవన్నీ ఆనందరంగనాథన్ ఒక టీవీ చర్చలో వెల్లడించిన అంశాలు. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్‌కు కాంగ్రెస్ కానుక
తిరుచిరాపల్లిలోని 1500 ఏళ్ల నాటి ఒక హిందూ దేవాలయంతో పాటు, హిందువులు ఎక్కువగా నివసించే ఏడు గ్రామాలు తమ ఆస్తేనని ఆ మధ్య తమిళనాడు వక్ఫ్ బోర్డ్ ప్రకటించిన తరువాత మరొక నిర్వాకం కూడా బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని 123 ప్రభుత్వ స్థలాలను 2014లో నాటి యూపీఏ-కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు ‘కానుక’గా కట్టబెట్టింది. 2014 లోక్‌సభ ఎన్నికలు జరగడానికి కొంచెం ముందు ఒక రహస్య నోట్ ద్వారా కానుక అప్పగింతకు సన్నాహాలు చేశారు. మార్చి 5, 2014న ఆ రహస్య నోట్ వెళ ్లవలసిన వాళ్లకి వెళ్లింది. దీని మీద అదనపు కార్యదర్శి జేపీ ప్రకాశ్ సంతకం కూడా ఉంది. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఉద్దేశించిన ఆ నోట్‌లో, ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయం, డీడీఏ అధీనంలో ఉన్న ఆ 123 స్థలాల ఆధిపత్యం ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు దఖలు పరచాలని ఉంది. ఒక్క ఫోన్ కాల్‌తోనే ఇదంతా సజావుగా సాగిపోయింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదంతోనే ఇది జరిగింది కూడా. వక్ఫ్ బోర్డుకు సమర్పించిన ఆ స్థలాలన్నీ సరిహద్దులలోనో, నిర్జన ప్రదేశాలలోనో లేవు. కన్నాట్ ప్లేస్, అశోకా రోడ్, మధురా రోడ్‌లతో పాటు వీవీఐపీ నివాసాలు ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి.
అంతకు ముందు వక్ఫ్ బోర్డ్ ఒక సప్లిమెంటరీ నోట్ కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఫిబ్రవరి 27,2014లో పంపించిన ఆ నోట్‌లో ఆ 123 స్థలాల మీద తమకు అధికారం కావాలని కోరింది. బోర్డు కోరిన వారానికి ఆ స్థలాల మీద దానికి అధికారం అప్పగించే విధంగా నాటి కేంద్ర మంత్రిమండలి ఆ రహస్య నోట్ విడుదల చేసింది.
అయితే 2014 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఎన్‌డీఏ-బీజేపీ ప్రభుత్వం రావడంతో ఈ కానుకల కథ అడ్డం తిరిగింది. ఫిబ్రవరి, 2015లోనే ఈ నాటకం మీద దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తరువాత మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భూసేకరణ చట్టంలోని 48వ సెక్షన్ ప్రకారం కానుకల పేరుతో ధారాదత్తం చేసిన ఈ స్థలాలను స్వాధీనం చేయరాదని హిందూ సంఘాలు కూడా వాదన లేవదీశాయి.
యూపీఏ ప్రభుత్వం అధికారం ఇచ్చింది కాబట్టి ఆ స్థలాలను అభివృద్ధి చేసుకునే అధికారం వక్ఫ్‌బోర్డుకు వచ్చింది. దీనితో ఈ స్థలాలలో మసీదులు, దర్గాలు, శ్మశానవాటికలు నిర్మిస్తామని నోడల్ అధికారి ఆలం ఫారూకీ ప్రకటించారు కూడా. ప్రభుత్వం తీసుకున్న కానుకల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ముస్లింల అభివృద్ధి కుంటుపడుతుందని బెదిరించారు. వక్ఫ్ ఆస్తుల మీద వచ్చిన డబ్బును ముస్లింల అభ్యున్నతికే ఖర్చు చేస్తామని చెప్పారు. పైగా 123 స్థలాలలో అతి కొద్దిగా మాత్రమే ఖాళీగా ఉన్నాయనీ, మిగిలినవన్నీ ఆక్రమణలలోనే ఉన్నాయని, ఆక్రమణలు తొలగించే అధికారం ఇప్పుడు తమదని కూడా ఫారూక• చెప్పారు.
చివరికి బీజేపీ ప్రభుత్వం కానుకల వ్యవహారం మీద ఢిల్లీ న్యాయశాఖ ఉన్నతాధికారి జేఆర్ ఆర్యన్ నాయకత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమించింది. మే, 2016లో నియమించిన ఈ సంఘం ఆరు మాసాలకే నివేదిక ఇవ్వాలని గడువు విధించారు. కానీ ఈ ఆస్తులు వక్ఫ్ బోర్డుకు చెందుతాయా? లేదా? అనే కీలక అంశాన్ని నిర్ధారించడంలో ఆర్యన్ బృందం విఫలమైందని విమర్శ వచ్చింది. మరొక ఆరు మాసాలు ఇచ్చాక కూడా ఆ బృందాన్ని లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీని పరిష్కార బాధ్యత నాటి వక్ఫ్‌బోర్డు కమిషన్‌కు అప్పగించారు. ఇతడు ఆప్ ప్రభుత్వం నియమించిన వ్యక్తి. దీనితో కథ మళ్లీ అడ్డం తిరిగింది.
2005లో తాజ్‌మహల్ తమదేనని వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. అందుకు సుప్రీంకోర్టు ఇది ఎప్పుడు దఖలు పడిందని ప్రశ్నించింది. అంతేకాదు, షాజహాన్ మీకు ఎప్పుడు దఖలు పరిచాడో చెప్పే పత్రం చూపాలని ఆదేశించింది. అంతా మౌనం దాల్చారని విష్ణు జైన్ ఇదే చర్చలో అన్నారు. వక్ఫ్ ఆస్తులకు ఎన్ని కోణాలో కదా!
– జాగృతి డెస్క్