ఇటీవలి వర్షాలూ, వరదలూ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. యథాప్రకారం సేవాభారతి బాధితులకు తనదైన తీరులో సేవలు అందించింది. అందరి మన్ననలు పొందింది. కులమో, మతమో ఆధారంగా కాకుండా మనిషికి సేవ చేస్తుందన్న ఖ్యాతి ఈ స్వచ్ఛంద సంస్థకు ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్ఫూర్తితో, ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించి కార్యకర్తలు చేసిన సేవ మెచ్చదగినది. మొన్న ఖమ్మం, విజయవాడలలో సంస్థ అందించిన సేవలను గురించి సేవాభారతి ప్రాంత కార్యదర్శి (తెలంగాణ) సీవీ సుబ్రహ్మణ్యం జాగృతి యూట్యూబ్‌ ‌ఛానెల్‌తో తమ అనుభవాలను పంచుకున్నారు. అవి పాఠకుల కోసం…

‘మానవసేవే మాధవసేవ’ అన్న సూక్తిని త్రికరణశుద్ధిగా ఆచరించే కర్మయోగులు సేవాభారతి కార్యకర్తలు. ప్రకృతి ఆగ్రహించినా, మానవ తప్పిద మైనా ముందుగా చేరుకునేది సేవాభారతి. మొన్న వయనాడ్‌లో చూశాం… ఇపుడు తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నాం. వీరి సేవల గురించి మీడియాలోనూ, సోషల్‌ ‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీ కార్యక్రమాల గురించి చెప్పండి!

ఆగస్ట్ 31, ‌సెప్టెంబర్‌ 1‌వ తేదీన కురిసిన భారీ, అతి భారీవర్షాల వలన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వరద నీరు వచ్చింది. వాగులు పొంగాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌దగ్గరున్న వాగు కావచ్చు, బయ్యారం కావచ్చు. ఇవన్నీ పొంగాయి. లోతట్టు ప్రాంతాలు, నగరాలు, పట్టణాలు కూడా జలమయమయ్యాయి. వరదలు వచ్చినపుడు నదీ పరీవాహక ప్రాంతాల్లో, ఎక్కడో గ్రామాలు, లంక గ్రామాలు మునుగుతాయని అనుకుంటాం. ఈసారి ఖమ్మం, విజయవాడలలో వాటి నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు మునిగాయి. వరంగల్‌, ‌ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచి విపరీతమైన వరదనీరు రావటం కూడా నష్టం చేసింది. అనేక కుటుంబాలు, ఇళ్లు నీటిలో చిక్కుకుపోయాయి. కొన్నిచోట్ల మొదటి అంతస్తు దాకా నీరు చేర•టం వలన చాలామంది ఇళ్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. సుమారు 10వేల కుటుంబాలకు నష్టం జరిగిందని మా అంచనా.

వరద సమయంలోనూ, తగ్గిన తర్వాత కార్యక్రమాలు ఎలా కొనసాగాయి?

వరదలో ప్రజల ప్రాణ రక్షణ ప్రధానం. కాబట్టి ఆ లక్ష్యంతోనే పనిచేస్తాం. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. ప్రభుత్వ సంస్థలు లేదా ఇతర ఏ సంస్థలైనా తరలించే పనిచేసినప్పటికీ, సురక్షిత ప్రాంతాలకి తరలించిన తరువాత వారికి ఆహారపదార్థాలు అందించడం, అవసరాలు తీర్చడం ముఖ్యం. అందుకోసమే వరద సహాయ శిబిరాలు. స్కూల్స్ ‌కావచ్చు, ఫంక్షన్‌ ‌హాల్స్ ‌కావచ్చు. అక్కడికి బాధిత కుటుంబాల్ని తరలిస్తాం. తరువాత కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అనేక రకాల కుటుంబాలు దగ్గరగా ఉండటం, శుచిశుభ్రత విషయంలో సమస్యలు వస్తాయి. వృద్ధులు, పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఉంటారు. వీటిని పరిష్కరించటం వ్యవస్థకు సవాల్‌ ‌లాంటిది. మొదట ఆహారం, అత్యవసర ఔషధాలు ఇస్తాం. అక్కడ తయారు చేసిన ఆహారాన్ని అందిస్తాం. వరద తగ్గుముఖం పట్టినప్పుడు కూడా సమస్యలు వస్తాయి. అంతా బురదతో నిండి ఉంటుంది. ఆ బురద శుభ్రం చేయడానికి నీరు ఉండదు. ఖమ్మంలో వాటర్‌ట్యాంకర్‌ ‌ద్వారా నీళ్లు అందించి ఇళ్లను శుభ్రం చేయాల్సి వచ్చింది. వరద వచ్చిన దగ్గరి నుంచి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి 15, 20 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఖమ్మంలో వరద ఉధృతి తగ్గినప్పటికీ, సేవా కార్యక్రమాల నిర్వహణ క్లిష్టంగా ఉంది. ఖమ్మంలోనే చాలా కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకొనిపోయాయి. చాలా పనిచేసే స్థితిలో లేవు. దానికి సంబంధించి కూడా సేవాకార్యం చేయాలని సేవాభారతి సంకల్పిం చింది. వరదతో సర్వస్వం కోల్పోతారు. కాబట్టి వాళ్ల అవసరాలు తీర్చడానికి సేవాభారతి చూస్తుంది.

ముంపు ప్రభావాన్ని పల్లెలు, పట్టణాలు, నగరాల్లో కూడా చూసాం. సేవ వరకు మూడు ప్రాంతాలలో ఎట్లాంటి విధానాలను అనుసరిస్తారు?

గ్రామీణ క్షేత్రంలో ఇళ్లతో పాటు పొలాలకు నష్టం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో ఇళ్లు, వాహనాలు, పత్రాలు సహా స్థిరాస్తులకు నష్టం ఉంటుంది. నగరాలలో, గ్రామాలలో నష్టం ఒకటే అయినా నష్ట తీవ్రత, అది జరిగే తీరు వేరుగా ఉంటుంది.

విజయవాడ, ఖమ్మం ఏకకాలంలో మునిగాయి. ఇటువంటి పరిస్థితిలో సేవలను ఏ విధంగా సమన్వయం చేస్తారు.

 సేవాభారతి కార్యక్రమాల మీద ప్రతిరోజు సమీక్షా సమావేశం జరుగుతుంది. కార్యక్రమాలు ఏం జరిగాయి, సమస్యలు ఏమిటి, తరువాత రోజు చేయాల్సిన పని, అనుకున్న పని ఎంతవరకు అయింది వంటి అంశాల మీద సమీక్ష అది. క్షేత్రస్థాయి కార్యకర్తలకు పెద్దలు సూచనలిస్తారు. దాని ప్రకారం ఎప్పటికప్పుడు నివేదిక వస్తుంది. ఏది అవసరం? మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? అవసరమయినవి అందించగలుగుతున్నామా లేదా? సహాయ సామాగ్రి చాలా చోట్ల నుంచి వస్తుంది. వేరే రాష్ట్రాల్లో నుంచి వస్తోంది. ఈ సామాగ్రిని సమన్వయం చేయడం, వరదలు వచ్చినప్పుడు కావలసిన చోట్లకి పంపించడం ఒక సవాల్‌. ‌కనుక, సమీక్ష చేస్తాం. దాన్నిబట్టి గ్రౌండ్‌లో ఉన్న కార్యకర్తలు సర్వే చేసి ఏవైతే అవసరం ఉంటాయో అవి ఇక్కడి నుంచి పంపిస్తారు.

 ప్రకృతి విపత్తులు ఎప్పుడూ ఆకస్మికమే. మరి సహాయానికి సన్నద్ధత ఏ విధంగా సాధ్యమవుతుంది.

సేవాభారతి ఎన్నో ఏళ్ల నుంచి సేవా కార్యక్ర మాలు చేస్తోంది. కనుక, సహజంగానే ప్రశిక్షణ ప్రత్యేకంగా ఇవ్వనప్పటికీ ఒకరి నుంచి ఇంకొకరికి స్ఫూర్తి కలుగుతుంటుంది. ఈ సంవత్సరం నుంచి సేవాభారతి ఆపద ప్రబంధన్‌ అనే ఒక విభాగాన్ని పెట్టింది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మన సన్నద్ధత ఎలా ఉండాలి, అదేవిధంగా, ఏ పనిచేస్తే మేలు జరుగుతుందనే దానిపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. గత రెండు సంవత్సరాలుగా అఖిల భారత స్థాయిలో ఈ శిక్షణ ఇస్తున్నారు కూడా. మొన్న జులైలో మొదటిసారిగా హెదరాబాద్‌ ‌నెక్లెస్‌ ‌రోడ్‌లో వరద సహాయక సన్నద్ధతకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించారు. అది ట్రైల్‌ ‌రన్‌. ఆర్మీ, రాష్ట్ర స్టేట్‌ ‌పోలీస్‌, ‌ఫైర్‌ ‌సర్వీసెస్‌, ‌జిహెచ్‌ఎం‌సి, రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పిలిచారు. అదే విధంగా ఆర్మీవారు మొదటిసారిగా సేవాభారతిని పిలిచారు. కారణం, సమన్వయం కావచ్చు, గ్రౌండ్‌లో కార్యకర్తలు ఉండడం కావచ్చు, నెట్‌వర్క్ ‌కింది బస్తీలోకి వెళ్లడం కావచ్చు, నగరాలలో ఉన్నందువల్ల ప్రజలకు కనెక్ట్ ‌కావాలి కాబట్టి సేవాభారతి అనే స్వచ్ఛంద సంస్థను పిలిస్తే బాగుంటుందనుకొని సేవాభారతిని కూడా అందులో కలిపారు. స్వయం సేవకులు, సేవాభారతి కార్యకర్తలకు స్వతహాగా సంవేదన ఉంటుంది. ఏదైనా కష్టమొస్తే తీర్చాలనిపి స్తుంది. కాబట్టి ప్రశిక్షణ సెకండరీ.

కార్యకర్తల ఎంపికలో ప్రమాణాలేమిటి?

సేవాభారతి కార్యకర్తలందరు స్వచ్ఛందంగా వస్తున్నవారే. సమాజంలో పాజిటివ్‌ ఎనర్జీ బిల్డప్‌ ‌చేసేలా ఎవరైతే ఉంటారో వాళ్లందరినీ ఒకచోట చేర్చి వాళ్ల విషయ పరిజ్ఞానాన్ని సమన్వయం చేసి ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తుంటాం. మనది స్వచ్ఛంద సంస్థ కాబట్టి ఎవరైనా రావచ్చు, చేరవచ్చు. చాలామందికి సేవ చేయాలనుంటుంది. ఎలాగో తెలియదు. సేవాభారతి ఆ విధంగా ఉపయోగ పడుతుంది.

సేవాభారతి అన్ని వర్గాలకూ సేవలందిస్తుంది. హిందువులు మినహా, ఇతర వర్గాల నుంచి ఏ విధమైన స్పందన ఉంది.

సేవ చేసేటప్పుడు మతమూ, కులమూ అనేది చూడలేము. అసలు వాటి ఆలోచనే లేదు. ఎవ•రికైతే కష్టమొచ్చిందో వాళ్ల కష్టం తీర్చడమే లక్ష్యం. కష్టంలో ఉన్నవాళ్ల కులమతాలు అడగడం మన సంస్కృతిలోనే లేదు. ఇక అవతలి వర్గాల స్పందన బాగుంటుంది. పైగా వారు, ‘మాకు చాలా అపోహలు ఉండేవి, కానీ మీ సేవా కార్యక్రమాలు చూసిన తరువాత అవి నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే అందరినీ సమానం గానే చూస్తారు. ఎవరినీ, ఏ వివరాలు అడగరు. చాలా సంతోషం’ అన్న వ్యాఖ్యలు వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి.

సేవాభారతి కార్యకర్తలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ల ఇళ్లు కూడా మునిగిపోతుంటాయి, ప్రాణాలకు ముప్పు వస్తుంటుంది. అయినా దీక్షతో పని చేస్తుంటారు. దీనికి మూలం, ప్రేరణ ఏమిటి?

 సేవాభారతి కార్యకర్తలంతా ప్రధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో స్ఫూర్తి పొందినవారే. సజ్జన శక్తిని మనం ఎలా జాగరణ చేయాలి, సజ్జన శక్తితో సామాజికంగా మార్పు ఎలా తీసుకురావాలి అన్న కోణం నుంచి సేవాభారతి పనిచేస్తుంది. ఇది నియ మితంగా జరిగే క్రియ. సేవాభారతి కార్యక్రమాలు, ప్రకల్పాలు నియమితంగా ఉంటాయి. నిరంతరం జరిగే సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సేవాభారతి ప్రధాన లక్ష్యం సామాజిక మార్పు. సామాజిక మార్పు తీసుకురావాలంటే ఒకటి రెండు రోజులలో కాదు, నిరంతరం జరిగితేనే సమాజంలో మార్పు వస్తుంది. సేవాభారతి ఆ దిశలో పనిచేస్తోంది.

సేవాభారతితోపాటు కార్పోరేట్‌ ‌సంస్థలు, ఇతర సంస్థలు ముందుకు వస్తుంటాయి. సేవా భారతికి ఆ సంస్థలకి మధ్య ఎట్లాంటి వ్యత్యాసాన్ని చూడవచ్చు.

వ్యత్యాసం అంటే నెట్‌వర్క్, ‌క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్న కారణంగా తక్కువ సమయంలో మనం బాధితులకు సహాయం అందించగలం. దాత ఇచ్చిన ధనం, వస్తువు సరైన వ్యక్తులకు చేరుతుందా లేదా అనేది సవాలు. మిగతా సంస్థలకు సేవాభారతికి ఉన్న తేడా నెట్‌వర్క్, ‌నిబద్ధత కల కార్యకర్తలే. సేవాభారతి సేవ సరైన వ్యక్తులకు అందుతుందినేది అందుకే. దశాబ్దాల పనితీరు కారణంగా సమాజంలో ఏర్పడిన సదభిప్రాయమిది.

బాధితులకు సహాయం, పునరావాసం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం దగ్గర ఆరోగ్యశాఖ, భద్రతదళాలు, వనరులుంటాయి. అయినా ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటాయి. ఎందుకు?

మొత్తం ప్రభుత్వం చేయాలనే అభిప్రాయానికి సమాజం కూడా రాకూడదు. కష్టంలో మిగతా సమాజమంతా సహకరించాలి. సేవాభారతి లక్ష్యం అదే. ప్రభుత్వం కొన్ని రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి విమర్శలు వస్తుంటాయి. ప్రభుత్వం మీద విమర్శలు అంటే బాధిత వ్యక్తికి సహాయం చేరిందా లేదా, సరైన వ్యక్తిని గుర్తించారా లేదా అనేదే. మాదేమో స్వచ్ఛంద సేవ. వారిదేమో ప్రభుత్వ ఉద్యోగం. కనుక వ్యత్యాసం ఉంటుంది.

సేవాభారతి కార్యకలాపాలలో పాల్గొనాలని వస్తురూపేణ కావచ్చు, ఆర్థికరూపేణగానీ తోడ్పాటు చేయాలనే వ్యక్తులు ఏ విధంగా సంప్రదించాలి.

సేవాభారతికి sevabharathi.org అనే వెబ్‌సెట్‌ ఉం‌టుంది. వస్తురూపేణ ఇవ్వాలంటే అది కూడా ఆ వెబ్‌సైట్‌లో ఉంది. ధన రూపంలో సహాయం చేసేవారికి కూడా ఒక లింక్‌ ఉం‌ది. రశీదులు ఇస్తారు. వస్తురూపంలో ఇవ్వాలనుకునే వారికి సేవాభారతి కార్యాలయంలో సంప్రదించి నట్లయితే, వారిద్వారా వస్తువులను సేకరించి సరైన స్థలాలకి, ఖమ్మంలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, వరంగల్‌లో కావచ్చు. అక్కడికి చేర్చే పనిని సేవా భారతి చేస్తోంది.

ఇన్నేళ్ల సేవాభారతి కార్యకలాపాలలో మీరు మరిచిపోలేని అనుభూతులను మాతో పంచుకో గలరా?

 సేవాభారతి కార్యకర్తలు వాళ్ల ఇళ్లకు సొంతంగా నష్టమొచ్చినప్పటికీ ఇబ్బంది పడకుండా సేవకు ముందుకు వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక కార్యకర్త రెండో అంతస్తులో రెండు రోజులు ఉండి, ఆ తరువాత సేవాకార్యంలో పాల్గొన్నాడు. ఇది మానసిక సంసిద్ధతకు సంబంధించినది. అనారోగ్యంతో ఉన్నవారికి కొన్ని అత్యవసరం. మన కార్యకర్తలు ఆ మందులు బాధితులకిస్తారు. బాధితులకు సమయానికి మందులు ఇచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్లు ఎంత కోటీశ్వరులు కావచ్చు, బీదవారు కావచ్చు. సర్వస్వం కోల్పోయిన తరువాత అందరూ సమానమే. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపన్నహస్తం అందించినప్పుడు అది చాలా ఆనందం అనిపిస్తుంది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE