వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– భమిడిపాటి గౌరీశంకర్‌

నాకీ జైలు జీవితం హాయిగానే ఉంది. ఎవరైనా… ఎప్పుడైనా… వచ్చి… నన్ను తీసుకు పోతారేమోనని బెంగ… నాకెవరూ లేరు… ఎవరూ మిగలలేదు… నేనొక్కన్నే… కాని… ఎందుకో బెంగ…

నా మాటలు మీకు చిత్రంగా తోచవచ్చు… జైలు జీవితం హాయిగా ఉంది. అనటంలో నా వెర్రితనం మీకు కనిపించవచ్చు…

కాని… ఇలా నేను ఎందుకంటున్నాను… మీకు తెలిస్తే… బహుశా మీరు కూడా నాతో ఏకీభవించ వచ్చు… వించకపోవచ్చు.. అది మీ వ్యక్తిగతం…

నేనోసారి… మా ఊర్లో జరుగుతున్న హరికథకు వెళ్లాను. ఆ కథలో… ఏనుగు కాలును మొసలి పట్టు కోవడం అన్యాయం అనీ… ఏనుగు ధర్మం తప్పని కరిరాజని హరిదాసుగారు చెప్పారు… కనుకనే భగవంతుడు ఏనుగు రక్షణ కోసం ఎటువంటి దుస్తులు ధరించకుండా… ఆదరాబాదరగా పరుగెత్తు కొని వచ్చేసాడని కూడా చెప్పారు….

అప్పుడు నాకనిపించింది. ఏది న్యాయం, ఏది ధర్మం అని. న్యాయం, ధర్మం చాలా చిత్రమైన పదాలుగా నాకు తొలిసారిగా, అదిగో… అప్పుడే అనిపించాయి.

తరువాత తరువాత… వీటి గురించి చాలా ఆలోచించాను…

ఇదిగో…ఇప్పుడు కూడా.ఈ జైలులో కూడా హాయిగా రెస్టు తీసుకుంటూ ఆలోచిస్తున్నాను.

వాల్మీకి పూర్వశ్రయంలో రత్నాకరుడు.దారి దోపిడీలు చేసి, కొండొకచో మర్డర్లు చేసే డబ్బు సంపాదించి సంసారాన్ని పోషించేవాడు….

ఒకనాడు నారదుడు వచ్చి ‘ఛీ.ఛీ. ఇదన్యాయం. నీకు ముక్తి, భక్తి మార్గం చూపుతాను నా మాట వినమన్నాడు’ అలాగే అన్నాడు రత్నాకరుడు.కాని ఎందుకైనా మంచిదని ఇంటికి వెళ్లి భార్యతో మాట్లాడి వస్తానన్నాడు. సరేనన్నాడు నారదుడు….

రత్నాకరుడు తన భార్యకు చెప్పాడు విషయాన్ని. మీ నిర్ణయం అధర్మం. ఏ పనైనా సరే పెళ్లాంబిడ్డలను పెంచి పోషించవలసిందే. ప్రాణాలు నిలుపు కోవలసిందే ఇదే ధర్మం అంది…

ఇక్కడే… రత్నాకరుడికి ఓ సమస్య వచ్చింది. ఏమిటంటే నారదుడు చెప్పింది న్యాయమా? తన భార్య చెప్పింది ధర్మమా? ఎవరి మార్గాన్ని తానెంచు కోవాలి!!

చివరకు న్యాయ మార్గాన్ని ఎంచు కున్నాడు. వాల్మీకిగా మారాడు. అంటే న్యాయం మనిషిలో మార్పును తెస్తుందన్న మాట.

మరి ధర్మం తప్పని ధర్మరాజు న్యాయం గురించి అతనికి తెలియదని అనుకోవచ్చా?న్యాయం తెలిస్తే.. ‘అశ్వత్థామ అతః కుంజరహ’ అని ఎందు కన్నాడు? అంటే తన అవసరార్థం, ధర్మం కోసం న్యాయాన్ని తప్పవచ్చునన్న మాట….

అవినీతి చేస్తే అన్యాయం. శిక్ష ఉంటుంది… అంటుంది న్యాయం….

ఏది చేసైనా సరే సమాజంలో గౌరవంగా బ్రతకడం, తన వారిని బ్రతికించుకోవడం ధర్మ మంటుంది ధర్మం…

మనిషి దేనిని అతిక్రమించాలి? దేనిని ఆశ్రయిం చాలి…!?

ఆకలేసినప్పుడు కుక్కమాంసం కూడా తినవచ్చు.. అది ధర్మమే అన్నారు పండితులు. నిరూపించాడు ఆదిశంకరుడు…

కాని వేదం చదివిన వారు… అది న్యాయం కాదంటారు… మాంసంలో జీవహింస ఉంది. దీనికోసం మరొకరిని మనం ప్రేరేపించడమంటే మనం కూడా జీవహింసను ప్రోత్సహించిన వారమేనంటుంది ధర్మం.

ఈ విధంగా, న్యాయం, ధర్మం మధ్య కనిపించని సన్నటి తె, సున్నితపు పొర ఒకటుంది. దీనిని ఎలా తొలగించగలం?

ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే…

నేను చేసిన పని ధర్మమా?న్యాయమా? అని నా చుట్టూ చాలా మంది చేరి నన్ను ప్రశ్నించి, హింసించి, చివరకు అధర్మమంటూ న్యాయం కోసమని పోలీసులుకు అప్పగించి, ఎవరిమటుకు వారు వారి వారి ధర్మాలను నిర్వహించడం కోసం వెళ్లిపోయారు.

అన్యాయమైన పని నేను చేసాను కనుక అది వారి దృష్టిలో అధర్మం కనుక వారంతా ధర్మం తప్పని, న్యాయమార్గాన్ని నడుస్తున్న వారు కను• నావంటి వారి మధ్యలో ఉంటే వారు కూడా ‘అన్యాయమై పోతారని’ తలచి నన్ను పోలీసులకు అప్పగించారు.

పోలీసులు నన్ను న్యాయస్థానంలో నుంచో బెట్టారు…

నేరం చేసావా? అనడిగారు న్యాయాధీశులు…

చేసానన్నాను… ధైర్యంగానే…

‘ఎందుకు చేసావు…’మళ్లీ అడిగారు.

ఎందుకో నేను చెప్పాను. నేను చెప్పింది పూర్తిగా వినలేదు… రిమాండు కోసం పంపారు…

ఈ దేశంలో న్యాయం ఎంతవేగిరంగా దొరుకు తుందో, ఎలా దొరుకుతుందో తెలిసినవాడిని కనుక నాకు ఈ మొత్తం పక్రియ ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించ•లేదు.

కాని, నా మనసులోని బాధను… నేనందుకు అధర్మంగా.. అన్యాయంగా వర్తించవలసి వచ్చిందో మీకైనా చెప్పుకుంటే కొంచెం తేలికపడతాను.

కనుకనే నా ఈ కథను మీకు చెప్పాలను కుంటున్నాను. నా ఈ కథంతా విని? అర్జీలు పెటో, మానవహక్కులంటో, నా మీద జాలితోనో, జీవకారుణ్యం తోనో దయచేసి నన్ను జైలు నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలు మాత్రం మీరెవ్వరూ చేయకండి.

ఏది ఏమైనా నేను చేసింది నేరమని నాకు, నా అంతరాత్మకు తెలుసు. నేరానికి శిక్ష అనుభవించ వలసిందే అని నమ్ముతాను. ఇటువంటి నమ్మకం నాకు లేకపోయినా జైలు జీవితమంటే నాకసహ్యం అనుకున్నా, న్యాయవ్యవస్థతో ‘దోబూచీ’ ఆడుకోవా లని నేనెంత మాత్రం తలచినా, ఏదో విధంగా బయటనే ఉండేవాడిని…

కనుక మీరెవ్వరూ కూడా నా విడుదల కోసం ప్రయత్నించకండి.కాని… దయచేసి నేను చెప్పేది మాత్రం వినండి.

నేను శ్రీకాకుళం జిల్లాలో ఓ కుగ్రామంలో పుట్టాను. దాదాపు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు అక్కడే ఉన్నాను. జీవితం… గుల్లలో ఇరుకున నత్తలాగా ఉండేది.

నేను, నాన్న, చెల్లి. తల్లి… ఇదీ నా కుటుంబం. మా నాన్న చదువు ‘నిశాని’. కంప్యూటర్లపై ప్రపంచం నడుస్తున్న ఈ రోజులలో మా నాన్న వంటివారు ఏం పనిచేయగలరో మీ వంటి మేధావులు తేలిగ్గానే ఊహించగలరు…

కూలిపని, రిక్షా త్రొక్కడం. ‘మనకు’ సిగ్గు అనేది లేకపోతే నిక్షేపంగా అడుక్కోవటం. కాని, చిత్రం ఏమిటంటే డబ్బు, చదువు లేకపోయినా మా నాన్నకు పరువు, మర్యాద, సిగ్గు, కుటుంబ ప్రతిష్ట వంటి పదాలంటే విపరీతమైన అభిమానం ఉండేది. వాటికోసం రిక్షా తొక్కడం ప్రారంభించాడు.

పగలంతా అందరిని మోసి మోసి అలసి పోయినవాడు. రాత్రవగానే… తనను ఇంకొకరు తనను మోసే అధికారం ఇచ్చేవాడు. బాగా తాగి పడిపోయే వాడు. ఇది తెలిసి నేను నాన్నను రిక్షాలో వేసుకొని వచ్చేవాడిని. ఆ విధంగా రిక్షాతొక్కే వారసత్వం నాకు మా నాన్న పరోక్షంగా అందజేసాడు.

‘వారసత్వానికి’ మించిన సంపద ఏముంది చెప్పండి.?

మా నాన్న నన్ను మాత్రం టెన్త్ ‌వరకు చదివించాడు. నేను కూడా శ్రద్ధగానే చదివాను. కాని ఆర్థిక పరిస్థితులు అంతకన్నా ముందుకు పోవటానికి సరైన సదుపాయాలు అంటే కాలేజీలు వంటివి లేకపోవటం వలన నా చదువు అక్కడితో ఆగిపోయింది.

కాని… రోజులు చూస్తుండగానే మారి పోయాయి. ఆటోలు రిక్షాల స్థానాన్ని ఆక్రమించేసాయి. వేగానికి అలవాటుపడిన ప్రాణులు జనంలో వాహనాల రద్దీలో ముసలి ప్రాణం త్రొక్కే రిక్షాను ఎవరూ ఎక్కేవారు కాదు. ఇందువలన మా కుటుంబ ఆర్థిక వనరులు క్షీణించాయి. ఆకలిని తట్టుకోలేక అమ్మ, చెల్లి మరణించారు.

ఒక రకంగా నాకెంతో సంతోషమనిపించింది. సంతోషం వెనుక ఉన్న విషాదాన్ని మీరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఫర్వాలేదు. కాని వారిద్దరూ అలా వెళ్ల్ళిపోవడం, నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇంతలో…

పదవ తరగతి చదువుకున్న యువకులు కావలంటూ, ఒరిస్సా రాష్ట్రంలో ని ఓ పరిశ్రమ వారు ప్రకటన ఇచ్చారు. అర్హులైన వారికి జీతంతో పాటు ఉచిత వసతి, భోజనం కూడా ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఓ రాయి విసురుదామని అనుకున్నాను… విసిరాను…

ఫలితం కనిపించింది.ఇంటర్వ్యూకు రమ్మన్నారు. కాని డబ్బు? నాకో ఆలోచన వచ్చింది. రిక్షాను అమ్మేసాను.

అన్ని సవ్యంగా జరిగిపోయాయి. నేను, నాన్న ఒరిస్సాలోని ఆ ప్రాంతానికి చేరుకున్నాం. అదేదో పెద్ద ఉద్యోగం కాదు. కూలిపనే. కాని ఇద్దరికి రెండు వేళ్లయినా నోట్లోకి వెళుతున్నాయి. ప్రస్తుతానికి హాయిగానే మా జీవితాలు సాగిపోతున్నాయి.

కాని, కాలం ఇలాగే జరిగిపోతే… నేను ఈ కథ మీకు చెప్పనవసరం లేకపోనూ…

ఆ రాత్రి…

జరగరాని ఘోరం. ప్రకృతి వైపరీత్యం. ఒరిస్సా రాష్ట్రంలోని సగం జిల్లాలను జలమయం చేసింది. జనజీవనం అతలాకుతలమై పోయింది. మనుషులు, జంతువులు అనే తేడా లేదు. తెల్లారేసరికి ఎవరు బతికి ఉన్నారో! ఎవరు బ్రతికిలేరో? తెలియని పరిస్థితి… ప్రతీ కుటుంబం బజారు పాలైంది.

కోటీశ్వరులు… కూటికి లేని వారుగా మారిపోయారు. ప్రకృతి ముందు మనిషి అత్యంత అల్పుడని మరోసారి రుజువయింది. మనిషి ఓడిపోయాడు. చేతులెత్తేసాడు. ప్రకృతి జయించింది. శాంతించింది. కాని… బతికిన మనుషుల బతుకు పోరాటం ఎలా…?

నా పరిస్థితి మరింత దారుణంగా మారింది.

తుపాన్‌కు మేముంటున్న ప్రాంతం మొత్తం సర్వనాశనం అయిపోయింది. మేము పనిచేస్తున్న నిర్మాణంలో ఉన్న పరిశ్రమ తాలూకా గుర్తులు ఏమీ కూడా మిగలలేదు. కనీసం ఒక ఇటుకైనా కనిపించలేదంటే మీరు నమ్మకపోవచ్చు. దీనిని కట్టిన ‘బడాసేట్‌’ ‌వరదలో చనిపోయాడు.

నేను, నాన్న ఉంటున్న ప్రాంతం మొత్తం జలమయపోయింది. చుట్టూ నీరు.అదృష్టం కొద్ది ఎత్తయిన ప్రదేశంలో ఓ పెద్ద మట్టిచెట్టు ఆధారంగా మేం బతికి బయటపడ్డాం…

పగలు ఎండ, రాత్రి గాలి, చలి. ఇవే మాకు బంధువులు, స్నేహితులు.

మరో రోజు గడిచింది. మేమున్న ప్రదేశానికి మరో పదిమంది నీటిలో ఈదుకుంటూ వచ్చారు. దాదాపు డజను మందిమి చేరుకున్నాం. ఒక రోజంతా కష్టసుఖాలు పంచుకున్నాం. కాని ఖాళీ కడుపులు ఎంతకాలం ‘కబుర్లు’ చెప్పుకోనిస్తాయి. మేము అలసిపోయాం.

కనుచూపు మేర అంతా నీరు… నీరు…

అప్పుడప్పుడూ జంతువుల కళేబరాలు మేమున్న ప్రాంతం మీదుగా ప్రవాహానికి కొట్టుకు పోయేవి. వాటిని చూస్తే కనుపు దేవినట్టుగా ఉండేది. రాత్రవుతున్నదంటే.. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే. మబ్బులు ఆకాశంలో తిరగాడుతున్నాయంటే మాకు విపరీతమైన భయంగా ఉండేది.

మరో రోజు గడచిపోయింది..

కడుపులు ఖాళీ అయినా ‘కాల కృత్యాలు’ తీర్చుకోవడం తప్పదు కదా. ఒకపూట.. రెండు పూటలు ఫర్వాలేదు. కాని రెండు రోజులు ఎలా ఆగుతాయి? ఎలా ఆపగలం అన్నీ అక్కడే.

ఇప్పుడు నేనున్న స్థితి ఇందుకు ఎంతమాత్రం భిన్నంగా లేదు. కాని మా అందరి ముఖాలలో అసహ్యం లేదు. ఆకలి, ఎవరైనా ఏమైనా తెచ్చివ్వక పోతారా అనే ఆశ ఉన్నాయి.

ఇంతలో ఆకాశంలో ఏదో చప్పుడు.

హెలీకాప్టర్‌ ఒకటి రివ్వున మా నుంచి ఎగిరిపోయింది. ఏమి జార విడవ కుండానే మరో రోజు గడిచింది. ఆకలి మరింత పెరిగింది. నాన్న పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మరో రోజు కూడా ఆహారం లేకపోతే.. అతను చనిపోవడం గ్యారంటీ. నేను అతని గురించి దాదాపుగా ఆలోచించడం మానేసాననే చెప్పాలి.

కడుపు నిండుగా ఉన్నవాడు-నేను చెప్పిన మాట వింటే… సుమతీ, వేమన శతకాలతో పాటు శ్రవణ కుమారుడి కథ కూడా చెప్పి నీతి, నైతిక సూత్రాలు గురించి చెబుతాడు.

కాని, వాస్తవం కథంత నీతులంత కమ్మగా ఉండదు..

ఇంతలో ఆకాశంలో మళ్లీ చప్పుడు. మేమంతా ఆశగా ఆకాశం వైపు చూసాం. మా అదృష్టం బాగుంది. కొన్ని ఆహార పొట్లాలు, రొట్టెలు జార విడిచారు.

అందరికి అందాయి. మా నాన్న కూడా అందుకున్నాడు. నాకు మాత్రం ఏమి దొరకలేదు.

నేను వారి మీద పడి దోచుకుంటూననుకున్నారు కాబోలు. ఉన్న ఆ కొద్ది ప్రదేశంలోనే ఎవరికి వారుగా నాకు దూరంగా జరిగిపోయారు. చేతిలో కర్రలు కూడా ఉంచుకున్నారు.

చివరకు, మా నాన్న కూడా…

నాకు విపరీతమైన ఆక్రోషం, బాధ కలిగాయి. మేము అందరం అన్నం తింటున్నప్పుడు వీధిలో కుక్కను కొట్టడానికి కర్రను దగ్గర ఉంచుకొనేవారం. ఈ సంఘటన గుర్తుకు వచ్చింది. నాకిప్పుడు.

వారంతా అన్నం, రొట్టెలు తింటున్నారు.

నేను కుక్కలాగ కలియబడతానని కర్రలు కూడా రడీ చేసుకున్నారు. మా నాన్న కూడా…

నా స్థానంలో మీరు ఉండి ఒక్క క్షణం ఆలోచించండి.

ఆ రాత్రి ఆకలితోనే గడచిపోయింది. నాలో విచక్షణా జ్ఞానం పూర్తిగా నశించింది. నేనేమిటో నాకే తెలియని పరిస్థితి. ఏం చేయగలనో. ఏం చేయకూడదో కూడా ఆలోచించే స్థితిలో లేను. నాక్కావలసింది. అర్జంట్‌గా కడుపునిండే మార్గం..

అవకాశం కోసం ఆకాశం వైపు చూస్తున్నాను. రాత్రి సమయం… చీకటి… ఎవరు ఏమిటో తెలియని పరిస్థితి. చలి, ఆకలి, కోపం, తపన.

ఆకాశంలో చప్పుడు వస్తున్నది. ఏదో ఒకటి దొరకక పోదు. ఎలాగైనా సరే సంపాదించాలి. తప్పదు. ఈ పూట నా ఆకలి తీర్చుకోవాలి. ఇప్పటికే నాలుగు రోజులుగా కడుపు ఖాళీగా ఉంది. మరో రోజు గడిస్తే పక్కనున్న ఎవరినైనా సరే, చంపి అతని మాంసం అయినాసరే తినేస్తాను.

ఆకలి నాలో ఆలోచనా జ్ఞానాన్ని పూర్తిగా నశింప జేసింది. ఆ పరిస్థితిలో నేనో ఉన్మాదిని అంతే.

రెక్కల శబ్దం, హెలికాప్టర్‌ ‌దగ్గరవుతున్నది. మా నెత్తిమీద నుంచి ఎగిరింది. దానికి క్రిందనున్న లైట్‌ ‌వెలుగులో మా ఉనికిని గుర్తించి కొన్ని పొట్లాలు, రొట్టెలు విడిచి వెళ్లిపోయింది.మళ్లీ చీకటి.

నా బలాన్ని ఉపయోగించాను. కండబలం చూపాను. నా చేతిలో రెండు పొట్లాలు. ఒక రొట్టె. ఏనుగు ఎక్కినంత ఆనందం కలిగింది.

కాని ఎవరో నా చేతిని గుంజుతున్నాడు. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. నా చేతికి వాడి పీక సరిగ్గా దొరికింది. ఆకలి, ఆవేశంలో నా మెదడు పనిచేయడం మానేసింది. అతని పీకను గట్టిగా పట్టుకున్నాను. నొక్కాను. చేతులు వదిలేశాడు. నేను మాత్రం అతని పీక వదలలేదు. మొదటి చిన్న శబ్దం. ఎవరో పడిపోయి న్నట్టుగా తరువాత నిశ్శబ్దం. తరువాత నేను దూరంగా వెళ్లి, దొరికింది. హాయిగా తిన్నాను.

మానాన్న కోసం ఒకటి రెండుసార్లు పిలిచాను. పలకలేదు. బహుశా ఆకలి వల్ల ఎక్కడో సొమ్మసిల్లి ఉంటాడు. రేపు తన కోసం మరో పొట్లం సంపాదించాలి. నాకు దొరికినదైనా సరే నేను, నాన్న కలసి తినాలి. కడుపు నిండింది. ఆలోచనలలో మార్పు వచ్చింది. అనుబంధం గుర్తుకు వచ్చింది.

ఆ రాత్రి ఆ దుర్గంధపూరిత వాతావరణంలోనే హాయిగా నిద్రపోయాను. కడుపు నిండగానే కంటినిండా నిద్ర కూడా వచ్చింది. మరి …

తెల్లవారింది…..

‘‘నేను ఎవరిని చంపానో- అందరికి తెలిసిపోయింది. నాక్కూడా..

ఇంతలో దూరంగా ఓ చిన్న నాటు పడవలో ఆంధ్రా పోలీసులు అధికారులు వస్తూ కనిపించారు. మేమున్న ప్రదేశానికి వచ్చారు. రాగానే ముక్కులు మూసుకున్నారు.

మా మధ్య ఉన్న శవాన్ని చూశారు. అందరిని అడిగారు. ఎవరు చేసారీ పని అని . మిగిలిన వారంతా నా వైపు చూపారు. నేను కూడా అంగీకరించాను.

నన్ను ఆ పడవలో కూర్చోబెట్టుకున్నారు. మరి కొంతసేపటిలో మరో పడవ వస్తుందని, మీరంతా రావచ్చునని… ఆ ఆహారం తినండి. ఈ మందులు వాడండి అని కొన్ని ఆహార పొట్లాలు, మందులు మిగిలిన వారికి ఇచ్చారు. వారంతా నన్ను అసహ్యంగా చూసారు. నేను తలదించుకున్నాను. పోలీసులతో వెళ్లి పోయాను. ఆ తరువాత నేను మా నాన్నను మరి చూడలేకపోయాను.

వచ్చేవారం కథ..

  నేటి ఉద్యోగి

– గంటి భానుమతి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE