స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్‌ ‌మీద పోరాడుతున్న బెలూచీలు మరొకసారి హఠాత్తుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆ ప్రాంతంలో కొన్ని గంటల పాటు బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ జరిపిన ‘పకడ్బందీ’ దాడులు ఇందుకు కారణం. పాకిస్తాన్‌ ‌ఫెడరల్‌ ‌ప్రభుత్వాన్నే కాదు, ఆసియా ఖండాన్నే ఇవి విస్తుపోయేటట్టు చేశాయి. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ పోరాట స్థాయి పెరిగిందని ఈ దాడులతో వెల్లడైందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

గత కొద్దికాలంలో ఈ ప్రాంతంలో పాకిస్తాన్‌ ‌సైన్యానికీ, బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీకీ, ఉద్యమ కారులకూ నడుమ ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దీనితో హింసాకాండ కూడా పెరిగింది. ఈ దాడులలో కనీసం 38 మంది మరణించారని కొన్ని పత్రికలు ప్రచురిస్తే, 130 వరకు మరణించారని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. అందులో ‘ఎకనమిక్‌ ‌టైమ్స్’ ఒకటి. 130 మంది పాకిస్తాన్‌ ‌సైనికులను బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ చంపిందని ఆ పత్రిక నివేదించింది. అత్యాధునిక ఆయుధాలతో, నిర్దేశించుకున్న లక్ష్యంతో సైనికులు, పౌరుల మీద ఈ దాడులు జరిగాయి. ఈ దాడులు తామే చేశామని బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్టీ (బీఎల్‌ఏ) ‌ప్రకటించు కుంది. సాధారణ పౌరుల మాదిరిగా యూనిఫారమ్‌ ‌లేకుండా వెళుతున్న ‘శత్రు సైనికులను’ మట్టు బెట్టామని ఆ సంస్థ వెల్లడించింది. 35 వాహనాలకు నిప్పు పెట్టింది కూడా. వివిధ వాహనాల నుంచి కొందరిని దింపి కాల్చి చంపారని, 24 గంటలలోనే దాదాపు 70 మందిని కాల్చి చంపారని వారిలో 35 మంది సాధారణ పౌరులు కాగా, 14 మంది భద్రతా సిబ్బందికి చెందినవారని అల్‌ ‌జజీరా నివేదించింది. మృతులలో 21 మంది బీఎల్‌ఏ ‌సభ్యులు కూడా ఉన్నారని ఆ చానల్‌ ‌వెల్లడించింది. బీఎల్‌ఏను పాకిస్తాన్‌తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇంత పకడ్బందీ వ్యూహంతో, కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్‌ను గడగడ లాడించే తీరులో బీఎల్‌ఏ ‌దాడులకు దిగడం ఆ సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి.

పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్‌ ‌ప్రాంతంతో పాటు ఇరాన్‌, అఫ్ఘాన్‌లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచి స్తాన్‌ అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్‌ఏ ‌కోరుతున్నది. నిజానికి 1947లో భారత్‌, ‌పాక్‌ ‌విభజన జరిగిన నాటి నుంచి బెలూచిస్తాన్‌ ‌వేర్పాటువాదంతో తల్లడిల్లుతున్నది. కోటీ యాభయ్‌ ‌లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్‌ ‌ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. పాకిస్తాన్‌ ‌ఫెడరల్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1947 నుంచి ఐదు తిరుగుబాట్లు జరిగాయి. వీటిలో ఆఖరి తిరుగుబాటు 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరు లలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్‌తో ఈ తిరుగుబాటు తలెత్తింది. ఈ అసంతృప్తిని పరిశీలించాలన్న వాస్తవిక దృక్పథం పాకిస్తాన్‌ ‌పాలకులకు ఏనాడూ కలగలేదు. కశ్మీర్‌ ‌వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్‌ ‌పాలకులు బెలూచీ లను అతిదారుణంగా అణచివేస్తున్నారు. దానికి తోడు పంజాబ్‌ ‌ప్రావిన్స్‌కు చెందిన వారు అధికంగా ఉండే రాజకీయ పార్టీలు, సైన్యం కూడా బెలూచిస్తాన్‌ను అణచివేసే పక్రియను అదేపనిగా కొనసాగిస్తున్నాయి. బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది- పాక్‌-‌చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్‌ ‌డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనా ప్రకటిం చింది. బెలూచిస్తాన్‌కు బంగారుబాతు వంటి గ్వదర్‌ ‌డీప్‌ ‌సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. వీటి కోసం పాకిస్తాన్‌లోని మిగిలిన ప్రాంతాల నుంచి కూలీలను రప్పించడం కూడా బెలూచీలకు ఆగ్రహం తెప్పిం చింది. క్వెట్టా దీని రాజధాని.

కాబట్టి ఈ ఆగస్ట్ ‌చివరివారంలో జరిగిన దాడులు బీఎల్‌ఏకి కొత్తకాదు. ఈ ప్రాంతానికీ కొత్త కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా ఇలాంటి దాడులు ఆ సంస్థ చేస్తూనే ఉన్నది. పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెడుతూ తన వశంలోకి దేశాన్ని తీసుకుంటున్న చైనా దేశీయులను కూడా బీఎల్‌ఏ ‌లక్ష్యంగా చేసుకుంటూ ఉంటుంది. తాజా దాడులు ఆగస్ట్ 26‌వ తేదీ రాత్రి ఆరంభించి 27వ తేదీ ఉదయం వరకు బీఎల్‌ఏ ‌సాగించింది. ఇవి పాకిస్తాన్‌ను కుదిపేశాయి. పాకిస్తాన్‌ ‌రాజకీయ, సైనిక వ్యవహారాలను శాసిస్తున్న అత్యధికుల వర్గాన్ని చాలాసార్లు లక్ష్యంగా చేసుకున్నది. అంటే పంజాబ్‌ ‌ప్రావిన్స్‌కు చెందినవారే. ప్రధానంగా బెలుచిస్తాన్‌ ‌ప్రాంతంలో నివసిస్తున్న ఆ వర్గం వారిని తరుచు లక్ష్యంగా చేసుకుంటున్నది బీఎల్‌ఏ. అక్టోబర్‌ 2023‌లో ఆరుగురు పంజాబీ ప్రాంత కూలీలను బెలూచ్‌ ‌తీవ్రవాద సంస్థల సభ్యులు చంపారు. 2015లో బయట నుంచి బెలూచిస్తాన్‌కు వచ్చి కూలి పనులు చేస్తున్న వారిని కూడా లక్ష్యంగా చేసుకు న్నారు. బస్సులో ప్రయాణిస్తున్న పంజాబీలను (పాకి స్తాన్‌లోని) కిందికి దించి సామూహిక హత్యాకాండకు పాల్పడడం కూడా ఇదే మొదటిసారి. 2019లో కూడా బెలూచ్‌ ‌ప్రాంత ఉగ్రవాద సంస్థలు బస్సులను నిలిపివేసి ప్రయాణికుల గుర్తింపు కార్డులు చూసి పంజాబీ వారినీ, సైన్యానికి చెందిన వారినీ 14 మంది కాల్చి చంపారు. ఈ హత్యాకాండ యావత్తు 2012-2013లో హజారా బెలూచ్‌లో మైనారిటి షియా తెగవారిని ఊచకోత కోసిన తీరును గుర్తు చేస్తున్నదన్న వ్యాఖ్యలు వినిపించాయి. లష్కర్‌ ఏ ‌ఝాంగ్వి నాడు షియాల హత్యలకు పాల్పడింది.

తాజా దాడి విస్తృత స్థాయిలోనే జరిగింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్‌ ‌స్టేషన్‌లను కూడా బెలూచ్‌ ఉ‌గ్రవాద సంస్థలు ఎంచుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చివేశాయి. పారా మిలటరీ మీద కూడా బీఎల్‌ఏలోని మాజిద్‌ ‌బ్రిగేడ్‌ ‌దాడి చేసిందని ఆ సంస్థ ప్రకటించుకున్నా పాకిస్తాన్‌ అధికారులు దీనిని ధ్రువీకరించలేదు. పాకిస్తాన్‌తో బెలూచిస్తాన్‌ను కలిపే జాతీయ రహదారిని ఎంచుకుని ఉగ్రవాద సంస్థలు బస్సులు, ట్రక్కులు, ఇతర వాహనాలను తగుల బెట్టారు. బెలూచిస్తాన్‌లోని మూసాఖాలి నుంచి ఈశాన్యంలోని పంజాబ్‌ ‌సరిహద్దు వరకు దాడులు జరిపారు. అలాగే గ్వదర్‌ ‌పోర్టువరకు కూడా దాడులు జరిగాయి. బస్సు నుంచి ప్రయాణికులను దింపేసి కాల్చి వేసిన సంఘటన పంజాబ్‌ ‌ప్రావిన్స్ ‌సరిహద్దుల లోనే జరిగింది.

‘బీఎల్‌ఏకు దాడులు చేసే సామర్ధ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్‌ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్‌లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్‌ ‌రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దికీ అంచనా వేశారు. సాధారణంగా బెలూచిస్తాన్‌ ఉ‌గ్రవాదుల దాడులను పాకిస్తాన్‌ ‌ఫెడరల్‌ ‌ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్బూషణ్‌ ‌జాదవ్‌ ఉదంతం తరువాత, అంటే 2017 నుంచి బెలూచిస్తాన్‌ ‌హింసలో భారత్‌ ‌హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికి జాదవ్‌ ‌పాకిస్తాన్‌ ‌నిర్బంధంలోనే ఉన్నారు. అలాంటి ఆరోపణ తాజాగా పది రోజుల క్రితమే వినిపించింది కూడా. బెలూచి స్తాన్‌లోని పంజ్‌గుర్‌ ‌జిల్లా పోలీస్‌ ‌డిప్యూటి కమిషనర్‌ను ఉగ్రవాదులు హత్య చేశారు. ఈ హత్య వెనుక భారత నిఘా వ్యవస్థ ‘రా’ హస్తం ఉందని, నిధులు అందాయని ఆ ప్రాంత ముఖ్యమంత్రి ఆరోపించారు. కొన్ని గంటలలోనే ఇంత పకడ్బందీగా హత్యాకాండ సాగిదంటే దీని వెనుక ఎవరు ఉన్నారో ఊహించగలమని తాజా దాడుల నేపథ్యంలోనే, బెలూచిస్తాన్‌ అం‌తర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్‌ ‌నక్వీ పేర్కొన్నారు.

బెలూచిస్తాన్‌ ‌వేర్పాటువాదం నుంచి ఇంత తీవ్ర స్థాయిలో దాడులు జరగడం అంటే పాకిస్తాన్‌ ‌సైన్యానికి కొత్త సమస్య మొదలయినట్టే. పశ్చిమ ప్రాంతంలోనే తెహ్రీక్‌ ఎ ‌తాలిబన్‌ ‌పాకిస్తాన్‌ ‌సంస్థ పాక్‌ ‌సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. వీటన్నిటి కారణంగానే, ఇకపై బెలూచ్‌ ‌ప్రాంతం మీద పాకిస్తాన్‌ ‌ప్రభుత్వ అణచివేత ఇంకాస్త పెరుగుతుందని, అరెస్టులు, మనుషులు కనిపించకుండా పోవడం, చట్ట వ్యతిరేక హత్యలు పెగడం చూడవలసి ఉంటుం దని ఆయేషా సిద్దికీ భావిస్తున్నారు. బెలూచిస్తాన్‌ ‌ప్రజానీకం చారిత్రకంగా ఎదుర్కొంటున్న ఇబ్బందు లను, పరిస్థితులను పాకిస్తాన్‌ ‌రాజకీయ, సైనిక వ్యవస్థలు మరింత సమర్థంగా పరిశీలించి ఉండ వలసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

చిరకాలంగా బెలూచిస్తాన్‌ ‌ప్రజల పట్ల పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం దారుణ అణచివేత వైఖరినే అవలంబి స్తున్నది కాదనలేని సత్యం. అక్కడ దారుణ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న మాట కూడా నిజమే. అక్కడ మనుషులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి నివేదికలో పేర్కొన్నారు. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న వాయిస్‌ ఆఫ్‌ ‌బెలూచ్‌ ‌మిసింగ్‌ ‌పర్సన్స్, ‌బెలూచ్‌ ‌యాక్‌జెహెతి కమిటీ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నాయి. బెలూచిస్తాన్‌లో ఎన్నికలు కూడా ప్రహసన ప్రాయం గానే జరుగుతాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపు కుంటూ ఉంటాయి. దీనితో ఆ ప్రాంత ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌ అనుకూల జాతీయ పార్టీలు, అంటే పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ లేదా పాకిస్తాన్‌ ‌ముస్లిం లీగ్‌ (ఎన్‌) ‌వంటి పార్టీల నాయకులే ఎన్నికై, కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. లేదంటే బెలూచిస్తాన్‌ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీలను గెలిపిస్తూ ఉంటారు. దీనితోనే బెలూచిస్తాన్‌ ‌ప్రాంతం లోని వనరులను దోచుకోవడానికి రాజమార్గం ఏర్పడుతోంది. బెలూచిస్తాన్‌లో ఉండే బెలూచీలు, ఫక్తూన్‌ ‌ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను నిర్వహిస్తూ ఉంటుంది.

పాకిస్తాన్‌లో బెలూచిస్తాన్‌ ‌చాలా పెద్ద ప్రాంతం. కానీ జనాభా తక్కువ. దీనితో ఆ ప్రాంత వనరులను ఉపయోగించుకుంటూ, అక్కడి ప్రజలను నిర్లక్ష్యం చేయడం చాలా సులభంగా మారింది. అక్కడ గ్యాస్‌ ‌నిల్వలు, రాగి, బంగారు గనులు ఉన్నాయి. వీటిని యథేచ్ఛగా దోచుకుంటున్నారు. పైగా బెలూచ్‌ ‌పంజాబీలు అధికంగా ఉన్న సైనిక విభాగం అధీనంలో ఉంది. దీనికి తోడు పాకిస్తాన్‌ ‌పాలకులు చైనాను ఆహ్వానించి చైనా పాకిస్తాన్‌ ఆర్థిక నడవా ఏర్పాటుకు అనుమతించడం, గ్వదర్‌ ‌నౌకాశ్రయం వ్యవహారం బెలూచీలలో మరింత ఆగ్రహాన్ని రగిలించాయి. నిజానికి చైనా-పాకిస్తాన్‌ ఆర్థిక నడవా నిర్మాణం పట్ల భారత్‌ ‌తన నిరసనను వ్యక్తం చేసింది. ఇవన్నీ ఆర్థికపరమైన వ్యవహారాలే అయినా అందులో బెలూచిస్తాన్‌కు ఏమీ ప్రయోజనం ఒనగూడదు. బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ గత కొంతకాలంగా చైనా కేంద్రాల మీద దాడులు చేయడం కూడా ఇందుకే. అక్టోబర్‌ 2022‌లో ఇలాంటి దాడే ఒకటి చైనా కేంద్రం మీద జరిగింది. దీనితో చైనా తన రక్షణ కోసం, తన సొంత భద్రతా బలగాలను దింపవలసి ఉంటుందని పాకిస్తాన్‌ ‌సైన్యాన్ని హెచ్చరించింది. అయితే ఇందులో ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన పాకిస్తాన్‌ ‌చైనా ప్రతిపాదనను అంగీకరించ లేదు. ఇందుకే బెలూచిస్తాన్‌లో హింసకు సంబంధించి భారత్‌ ‌మీద పాకిస్తాన్‌ ‌చేసే అన్ని ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.

బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ తాజా దాడులకు మరొక కారణం కూడా ఉంది. అది అక్బర్‌ ‌ఖాన్‌ ‌బుగ్తి 18వ వర్ధంతి. ఇతడు బుగ్తి తెగలో ప్రముఖ నాయకుడు. పర్వేజ్‌ ‌ముషార్రఫ్‌ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలో ఉన్న బుగ్తి మరణించాడు. నిజానికి బుగ్తి మొదట పాకిస్తాన్‌ ‌ఫెడరల్‌ ‌ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వాడే. బెలూచిస్తాన్‌ ‌ప్రావిన్స్‌కు గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. తరువాత బెలూచీలు సాగిస్తున్న సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. అతడు తిరుగుబాటులో చేరిన తరువాత కూడా చాలామంది పాకిస్తాన్‌ ‌రాజకీయ నేతలు సత్సంబంధాలు కొనసాగించారు. జుల్ఫీకర్‌ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తిని హత మార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తిని చంపడం బెలూచిస్తాన్‌ ఉద్యమానికి అమరత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, కార్యకలాపాలను బాగా విస్తరించినది మాత్రం బుగ్తి మరణం తరువాతే.

బెలూచిస్తాన్‌లో ఎప్పుడు హింసాకాండ జరిగినా పాకిస్తాన్‌ ‌ఫెడరల్‌ ‌ప్రభుత్వం స్థానికుల మీద మరింత అణచివేతకు పాల్పడుతున్నది. ఉగ్రవాదులుగా ముద్ర వేసి పౌరులను మాయం చేస్తున్నది. ఈ వైఖరితో బెలూచీలలో మరింత తిరుగుబాటు మనస్త్తత్వం పెరుగుతున్నది. బెలూచిస్తాన్‌ ఉద్యమకారులు భారత్‌ ‌వైపు ఆశగా చూడడం పాత పరిణామమే. వారి ప్రదర్శనలలో భారత్‌ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం కూడా సర్వసాధారణంగా మారింది. పాక్‌ ‌ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్‌కు ఉన్నాయని లండన్‌ ‌కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్‌ ‌విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయ పడడం విశేషం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE