– ఎం. శ్రీధరమూర్తి

భారతదేశ ఉత్తరాంచలాననున్న పర్వతరాజు హిమవంతుని ముద్దుల మనుమనికి దక్షిణాదివారు తొలి పూజలు చేయటం దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వానికి ప్రతీక. హైందవ జనులలోని దైవీభావనలోని అఖండత్వానికీ, హైందవ సంస్కృతిలోని అవిభాజ్యతకూ ఈ దైవం ప్రతీక.

విఘ్న నాయకునిగా, వినాయకునిగా పిలుచుకునే ఈ గజనునుడైన గణపతిని గూర్చిన ఎన్నెన్నో కథలూ, గాథలూ, ఆయా కథాగాధలకు అనేకానేక ఆధారభూతాలైన ఇతివృత్తాలు ` భారతదేశంలో ప్రసిద్ధిలో ఉన్నాయి. గణపతి అసాధారణమైన రూపం అనేక రకాల భావనలకూ, వివరణలకూ ప్రేరకం అవటమేగాక, అచంచలమైన భక్తి, విశ్వాస, సమర్పణాభావాలకు కేంద్రమైంది.

ఋగ్వేద రచయితయైన కవులలోకెల్ల మహాకవిగా పేర్కొనదగిన గణపతి, గజముఖంతో, లంబోదరంతో విలసిల్లే విఘ్నేశ్వరునిగా ప్రశస్తినందిన గణపతి` ఒకరా వేర్వేరా అన్నది ఒక శాశ్వత వివాదంగానే ఉండిపోయింది. ఆ దైవం తొలుదొల్త ద్రావిడుల ‘బాలదైవం’గా ఉద్భవించి, ఆర్యపథాలలో సైతం విశేష గౌరవ పూజనీయ స్థానాన్నక్రమించాడని చెప్పే ‘కథ’ చరిత్రకు అందని అంకం. అలాంటి కథలు అసంఖ్యాకం. పురాణాలు ఈ దైవాన్ని గూర్చి ఎంతగానో స్తుతిస్తాయి. రెండు పురాణాలకు ఆయనే అధినాయకుడు. కడకు అష్ట ఆగమాలు, బ్రాహ్మణాలు, సూత్రాలూ, ధర్మశాస్త్రాలూ సర్వం ఆయనను ప్రస్తుతిస్తాయి. అసంఖ్యాక భారతీయ, విదేశీ పండితులు ఈ దైవతాన్ని అనే దృక్కోణాల నుండి విశ్లేషించి చూశారు. కాని ఆ మహాదేవుడు ఇంకా ‘ఇంకని జల’ వలె ఆసక్తిదాయకములైన ఎన్నెన్నో రహస్యాలను తనలోనే దాచుకొన్నాడు. నిరంతరం వెల్లడిస్తూనే ఉంటాడు.

గణపతిని గురించి అత్యంత ప్రసిద్ధమైన గాధలలో ఇది ఒకటిÑ ‘జగన్మాత’ పార్వతి ` పరివార సందోహాలకు కొదువలేని తల్లి. ఆమె ఒకనాడు అభ్యంగన స్నానమాడగోరి ` స్నానమందిరపు వాకిట నెవరైన కాపు ఉంచాలని అనుకున్నది. ఆమె తన అభ్యంగ స్నాన సమయాన తన శరీరం నుండి వచ్చిన ‘నలుగు’తో ఒక రూపాన్ని చేసింది. ఆ రూపానికి ప్రాణం పోసి వాకిట కాపు ఉంచింది. ఈ కాపున్న వాడు తన విధిని అక్షరశః నిర్వర్తించటంలో ` పరమ శివుడే వచ్చినా అడ్డగించాడు. లోనికి పోనివ్వనన్నాడు. పరమేశ్వరుడు ఆగ్రహోదగ్రుడై ఆతని కుత్తుక నుత్తరించాడు. పాపమా ‘నలుగు’ రూపి శిరం నేలవాలి దొర్లసాగింది. దొర్లి తునాతునకలై పోయింది. ఆసంకల్పితంగానే అయినా తన కుమారుని సంహరించటంతో పరమేశ్వరుడు ఆతనిని పునరుజ్జీవితున్ని చేయవలసి వచ్చింది. కుమారుని శిరస్సుకోసం లోకమంతా గాలించాడు పరమశివుడు. ఎక్కడా సరైన శిరస్సు లభించలేదు. ఒక గజముఖం దొరికితే దానితోనే తృప్తిచెంది, తెచ్చి ఆ కుమారుని మొండేనికి ఆ శిరస్సునంటించి, ప్రాణం పోశాడు. ఆ విధంగా మహాదేవుడైన గజాననుడుద్భవించాడు.

ఒక ‘ఆగమం’ ప్రకారం ` శివపార్వతులిర్వురూ దృష్టి క్రియాశక్తి విషయమై పోటీలు పడి దాంపత్య బాంధవ్యాన్ని కల్పిస్తూ ఒక ఏనుగుల జంటను హిమవత్పర్వత సానువులలో సృష్టించగా`ఆ గజ దంపతులకు జన్మించినవాడీ గజాననుడని ఒక కథ.

గజాననుడు క్రీ.శ.6`8 శతాబ్దాల మధ్యలో ఒక ప్రత్యేక వర్గం వారికి ప్రధాన దైవంగా ఉన్నందు వలన, ఏ సాహితీ, శిలా శాసనాది పత్రాలలోనూ ఆయన గురించి ప్రసక్తి చేయని కారణాన ` ఆయన దక్షిణాపథాన ఉన్న ఆనాటి ఆదిమ జాతులు మాత్రమే పూజించిన ఒక విఘ్నకల్పకుడు, క్రూరుడైన భూతజాతివాడని ` బ్రిటిషు చరిత్రకారులు వాదిస్తారు. వారింకా అంటారు ` ద్రావిడులపై దండయాత్ర చేసిన ఆర్యులు ఆయనకొక ప్రత్యేక స్థానమిచ్చి, తాము వశం చేసుకొన్న ద్రవిడ జాతులవారిని సంతుష్టులను చేయటానికీ, అనునయించటానికీ ` గజానుని పూజించి ఆరాధించారు అని.

మన భారతీయ పండితుల భావన ప్రకారం వినాయకుడు ` కాలగతిన రూప, నామాలలో మార్పు చెందుతూ వచ్చిన హైందవుల మూల దైవతాలలో ఒకడు. వీరి అభిప్రాయం ప్రకారం ఋగ్వేదకాలంలో దేవతలకు తన సర్వజ్ఞత వలన ఆచార్యత్వం వహించిన ఆ దైవమే పురాణాల కాలానికి గజముఖుడిగా, వినాయకునిగా రూపాంతరం చెందాడని.

గణపతి రూపు, ప్రాశస్థ్యం

 గణపతి రూపాన్ని గురించి అనేక సిద్ధాంతాలూ, ప్రతి సిద్ధాంతాలన్నిటి మాటున కొన్ని మౌలిక భావనలు నిగూఢమై ఉన్నాయని పరిశోధక పండితులు విశ్వసిస్తున్నారు. పార్వతి పృథ్వీ మాతకు ప్రతీకం. ఈ పుడమి ‘నలుగు’ మట్టి నుండే ఉద్భవి స్తుంది. అన్నదాత వ్యవసాయదారుడైన శివుడు ఈ పైరుల శీర్షాలకున్న ‘ధాన్యపు కంకు’లను కోసి ఈ ‘మట్టిబిడ్డ’ను ప్రోగు చేస్తాడు. ఈ ధాన్యపురాసులే ` గణపతి ప్రతిబింబితాలని కొందరి అభిప్రాయం.

ఈ విధమైన వివరణలకి మరింత బలం చేకూర్చే అంశం`గణపతి ఆహారధాన్యాల అధిష్టాన దైవం కావటం. ఆయన ప్రసిద్ధమైన, సుపరిచితమైన ‘రూపం’ ఈ భావననే సమర్థిస్తుంది. ఆయన ‘లంబోదరం’ ధాన్యాగారం. ఆయన గజముఖం ` ఈ ధాన్యాగారంపై బోర్లించిన కొలతపాత్ర. వంపు తిరిగిన ఆయన తుండం` అరిగిపోయిన నాగేటి కఱ్ఱునకు ప్రతీకం అని కొందరి వివరణ.

మరికొందరు – జీవితానికి ఆధార భూతములైన పంచభూతములు ` భూమి, నీరు, వాయువు, అగ్ని (శక్తి) ఆకాశం ` వీటిని గణపతి ప్రతిబింబిస్తాడని అంటారు. ఈ పంచభూతములూ ` జీవనానికి ఆధారం కనుక` ఇంకా దైవ స్వరూపాలను సుందర శిల్పాదులలో సృజించి, విగ్రహాదులను ఏర్పరచు కోలేని తొలిదశలలో` మానవులచేత దైవ ప్రతీకలుగా పూజలు అందుకుంటూ ఉండేవి. ఈనాడు కూడా ఆ విధమైన ‘ప్రతీకా భావన’తో చేస్తున్న పద్ధతులు మనకు ‘చక్ర’, ‘కలశ’, ‘లింగ’ రూప పూజా రీతులతో ద్యోతకమౌతాయి.

ఆ విధంగా పండితుల పరిశోధకుల విషయజ్ఞత లకు ఒక సవాల్‌ నిచ్చి నిలిచిన వినాయకుడు ` ప్రకృతి ప్రతీకమైన పార్వతికి పుత్రుడు. స్రష్టకు ప్రతీకమైన పరమేశ్వరుడు ప్రాణం పోసినవాడు. ఈ తీరున వినాయకుడు ` సృజనశక్తి ప్రకృతుల దైవీ సంఘటన పరమ ఫలితమైన జ్ఞానాన్ని ప్రతిబింబి స్తాడు. గణేశుని ఉపనిషత్తులకు అధిష్టాన దైవం ‘సోము’నిగా సైతం పరిగణిస్తారు.

ఇలా` ఆహార ధాన్యాధిష్ఠాన దైవతం నుండి ` పరమ చరమ సర్వ శక్త్యాత్మునివరకూ అనేక విధాల, అనేక స్వరూపాలలో సంభావించే, ఆరాధించే ఈ గణాధిపతి వర్ణ వర్గాది విచక్షణలు లేక హైందవు లందరి చేతా పూజలు అందుకుంటున్నాడు. దేశకాలాలను బట్టి మార్పులు పొందుతూ వస్తున్న ఈ దేవుని స్వరూప, లక్షణాల అగణ్యాలు, అసంఖ్యా కాలు. నేటివరకూ జరిగిన అనేక పరిశోధనల ఫలితంగా వినాయకుడు 53 చతుర్భుజ ప్రతిమలు, 14 షడ్భుజ విగ్రహాలు, 6 అష్టభుజ విగ్రహాలు, 14 దశభుజ, 4 ద్వాదశ భుజ ప్రతిమల రూపంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆయన గురించిన వర్ణనలు 21 నుండి 108 వరకూ ఉన్నాయి. హింసాత్మక ఆరాధనా విధానం వలన గాని తృప్తిచెందని ‘శాక్తగణపతీ’ ఉన్నాడు. బాలబాలికలకు ఆనంద దాయకుడూ, అభిమాన పాత్రుడూ అయిన ‘బాలగణపతీ’ ఉన్నాడు.

పూజా విధానంలో అనేకత్వం

ఈ దేవుని స్వరూప లక్షణాలలోనే కాదు, ఈ దేవుని అర్చించే విధానంలో సైతం అనేక మార్గాలు ఆచరణలో ఉన్నాయి. ఆయన ఒకప్పుడు కుప్పపోసిన శంఖాకారపు ‘గోమయ’ రాశిపై గడ్డికట్ట కిరీటంగా పెట్టిన రూపంలో ‘పిళ్ళెరాయు’నిగా ఆరాధించారు. ఆయన ‘చక్ర’ ‘కలక’ రూపాలలో పూజలు అందు కోవడం కూడా కద్దు. త్రిశూల, అష్టశూల చక్రాలు సైతం ఆయన ప్రతీకాలుగానే ఆరాధిస్తారు. ఏ కార్యారంభానగాని విఘ్నములను తొలగింపవలసి నదిగా ప్రార్థిస్తూ వినాయకుని కొలిచేటప్పుడు ‘కలక’ రూపంతోనే కొలుస్తారు.

గణేశపూజ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు జరుపుతాం. ఆనాడు అందరూ ఆరాధించేది సర్వసాధారణంగా వినాయకుని మట్టి ప్రతిమ. నదీ తీరాలలో, సముద్ర సమీపాలలోనూ నివసించేవారంతా ఆనాడు తైలమంటుకొని అభ్యంగన స్నానంచేసి, స్నానానంతరం ` నదీ తీరపు మృత్తికతోనో, సముద్రతీరపు సైకతముతోనో విఘ్నేశ్వర విగ్రహాన్ని తయారుచేసి, దానికి పూజ లాచరిస్తారు. పూజానంతరం ఆ విగ్రహాన్ని ఆ నీటిలో కలిపివేస్తారు. కొందరు ‘రజిత గణపతి’ విగ్రహాన్ని కొలిచి ఆ రజిత విగ్రహాన్ని ఎవరైనా బ్రాహ్మణునకు దానమివ్వటం కద్దు.

ప్రస్తుతం అందరూ అమలుచేస్తున్న పూజాపద్ధతి : విఘ్నేశ్వరుని మట్టి విగ్రహాన్ని` అలంకారాలు చేసి, మామిడాకు తోరణాదులతో నెలకొల్పిన ‘మంటపం’లో ప్రతిష్ఠించడం ` ఆ పూజా కార్యక్రమార్థం అందరు బంధు జనులనూ ఆహ్వానించి, వారి సమక్షంలో విఘ్నదేవుని పూజించటం, నాటి పండుగ వేడుక ‘విందు వినోదాలతో’ పతాక స్థాయికి చేరుకొంటుంది.

ఈ ధార్మిక కార్యాచరణానికి ఒక జాతీయ సర్వస్థాయిని కల్పించినవాడు స్వర్గీయ లోకమాన్య తిలక్‌. ఈ పండుగ కార్యక్రమం సాధారణంగా వారం, పదిరోజుల వరకూ విస్తరిస్తుంది సామూహికంగా. ఇన్ని రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ` దైవ విగ్రహాన్ని ప్రజలందరూ పాల్గొనటానికీ, వినాయకుని దర్శించటానికీ ఈ సందర్భంగా ఏర్పరచే హరికథలూ ప్రసంగాలూ సంగీత కార్యక్రమాదులను చూడటానికి వీలైన కేంద్ర ప్రదేశంలో నెలకొల్పుతారు. ఈలాంటి ప్రజా బాహుళ్య మంతటినీ పాల్గొనేందుకు వీలు కల్పించే`సామూహిక కార్యక్రమాలు`మన సమాజం వంటి అధికంగా అనేకత్వం నెలకొని ఉన్న సమాజాల లోని సామాజికులను ఏకీకృతం చేయటానికి అత్యంత ఉపయుక్తాలుగా ఉంటాయి.

విదేశాలలో గణపతి

ప్రజా సామాన్యంలో ప్రసిద్ధికి తోడు గణపతి కళాకారులకూ, చిత్రకారు లకూ, శిల్పులకు ఒక అభిమాన విషయమై నాడు. మరీ ముఖ్యంగా శిల్పులు ఈ మహాదేవునికి  స్పష్టమైన రూపాన్ని సంతరించటంలో తమ సర్వ కళా శక్తులనూ ప్రదర్శించారు.

పలంపురి వద్దనున్న ‘బాల గణపతి’ కాంస్య విగ్రహం ఒక అద్వితీయ శిల్పకళాఖండం ఈ విగ్రహం. చోళకళా విధానంతో చతుర్భుజుడై గజాననుడైయున్న ఈ ‘బాలదైవం’ నగ్నంగా నిలిచి ఉంటాడు. చిందరవందరైన జుట్టుతో చేత వెన్నముద్దతో ముద్దు లొలుకు తుంటాడీ ‘బాలగణపతి.’ అఫ్ఘ్ఘానిస్థాన్‌లో మలచిన వినాయక విగ్రహం ద్విభుజుడైన ఖర్వాటుడూ మరుగుజ్జైన విఘ్న  నాయకుని విగ్రహం. ఆయన లంబోదరాన్ని ఒక సర్పం చుట్టి ఉంటుంది. ఈ శిల్పం మగధ శిల్పానికి చెందిన అత్యుత్తమ చాతుర్యాన్ని స్ఫురిస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు. కాబూల్‌లో ప్రతిష్ఠించినట్టు చెప్పే మరొక విగ్రహంలో గుప్తరాజుల నాటి శిల్పకళారీతులు ప్రదర్శితమౌతున్నాయి.

భారతదేశంతోనే ` హంపీ విజయనగరంలోని బ్రహ్మాండమైన విఘ్నేశ్వర విగ్రహం, గోకర్ణంలోని కుర్జు విగ్రహం సుప్రసిద్ధాలు. హోయసల శిల్పులు ‘నాట్యగణపతి’ని రూపొందించడానికి తమ దివ్యశక్తులనూ, సర్వనైపుణ్యాన్ని ధారపోశారు. ఒకచేత దండం ధరించి, వేరొకచేత అభయప్రదానము చేసే యీకుబ్జ ‘నాట్యగణపతి’ లంబోదరంతో రూప, లావణ్యాలతో ‘నటరాజు’తోనే పోటీపడేట్లు కనిపిస్తాడు. శ్రీశైలంలోని మల్లికార్జున దేవాలయ కుడ్యాలపై ఒకచోట గణపతి ‘వేణువు’ నూదుతూ నృత్య స్తపదాలతో నిలచిన శిల్పం ఉంది. అసమాన దైవపు సంగీతాభిమానాన్ని సూచించి అనుపమాన శిల్పఖండమది. మధురైలో సర్వాలంకార శోభితుడైన గణేశుడు తనవలెనే సర్వాలంకృతjైున తన అర్థాంగిని అంక పీఠాన నుంచుకొని ఉంటారు. కర్ణాటకంలోని సంజనగూడులో గణపతి నగ్నంగా మదనారుర స్థితిలో మరొక ఉన్మత్త స్త్రిని అంకసీమ నిడుకొక కూర్చుని ఉన్న విగ్రహం ఉంది. ఈ రెండు విగ్రహాలూ ` తాంత్రిక పూజా విధానానికి చెందినవే.

ఆత్మజ్ఞతకు ప్రతీకం

హిందూ ఆరాధనా విధానాలలోని అనేకానేక దైవతాలనూ ప్రతిబింబించే వివిధ ప్రతిమలూ, విగ్రహాదులూ వివిధములై వింత వింతలైన గాథలూ ఇతివృత్తాలూ వివిధ రహస్యాలూ వీటన్నిటినీ మన మేధా ప్రమాణాలలో అవగాహన చేసుకోవడం, కొలబద్దలతో విలువ కట్టడం అసాధ్యమైన కార్యం. కానీ ‘అద్భుత’ములైన ఈ ప్రతి ఒక్క సృష్టి వెనుక ఒక అలౌకికమూ లోకాతీతమూ అయిన రహస్యం, మహాత్మ్యం ఇమిడి ఉంటాయి. ఆత్మ, దైవం అన్నవి ఉన్నా లేకున్నా శాస్త్రీయ మేధ అవగాహనకూ విశ్లేషణాశక్తికీ అందని స్థాయిలో నిరంతరమైన ఒక అన్వేషణాయత్నం అనాదికాలం నుంచి నిత్యం జరుగుతూనే ఉంది. అదే నిరంతరాన్వేషణ గణపతి రూప రహస్యాన్ని కనుగొనడానికి సైతం సాగుతూనే ఉంది.

– జాగృతి, 15.9.1969

About Author

By editor

Twitter
YOUTUBE