భారతదేశానికి సిగ వంటి జమ్ముకశ్మీర్ ఒక శతాబ్దం నుంచి అశాంతితోనే మనుగడ సాగిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచ ముస్లిం రాజ్యాల పాలన, సరళిని కశ్మీర్ చరిత్ర గుర్తు చేస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడ కొత్త సూర్యోదయం అయింది. పరిస్థితులు మారాయి. ఈ వాతావరణంలో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 370 రద్దు తరువాత ముస్లిం నాయకులు, ఆ పార్టీలు ఎన్ని ప్రగల్భాలు పలికినా, వేర్పాటువాదం ఇంకా పెరిగిపోతుందని బెదిరించినా అక్కడ జనం రెచ్చిపోలేదు. ఎన్నికలలో స్వేచ్ఛగా పాల్గొన్నారు. 370ని కేంద్రం పునరుద్ధరించాలని, అప్పుడే ఎన్నికలలో పాల్గొంటామని చెప్పినా, ప్రాంతీయ పార్టీలు మొదట బెదిరించినా ఇప్పుడు ఎన్నికల బరిలో దిగాయి. పాక్ ప్రేరిత ఉగ్రవాదుల భయాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల ద్వారా హిందూ ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించాలని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రకటించడం సంచలనంగా మారింది. కశ్మీర్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమని మనసావాచా నమ్మి ఉద్యమాలు చేసిన పార్టీలు జనసంఘ్, బీజేపీ. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ భద్రత కోసం ప్రాణాలు అర్పించారు. వారి వారసునిగా అమిత్ షా అలాంటి ఆకాంక్షను వెలిబుచ్చడం స్వాగతించదగినది.
‘జమ్ము-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, మిగిలిన కొన్ని రాష్ట్రాలకు కూడా జరుగుతున్నాయి. వాటి గురించి నాకు పట్టింపు లేదు. అక్కడ మన పార్టీయే విజయం సాధిస్తుంది. మీరు మాత్రం జమ్ముకశ్మీర్ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డాలని కోరుతున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన ఒక బీజేపీ నేతను జమ్ముకశ్మీర్ పీఠం మీద ప్రతిష్టిస్తే అది ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తుందో ఒక్కసారి ఊహించండి’ అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. అఖిల భారత కశ్మీరీ సమాజ్ అధ్యక్షురాలు మోతీకౌల్‌ను పార్టీలో చేర్చుకున్న సమయంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. వీటినే అనుకో కుండా ఒక మీడియా, జమ్ము-కశ్మీర్‌కు తొలి హిందూ ముఖ్యమంత్రి కావాలని అమిత్ షా కోరుతున్నారని భాష్యం చెప్పింది.
బీజేపీ అంటే మండిపడుతున్న ఉద్ధవ్‌ఠాక్రే శివసేన వర్గం పత్రిక ‘సామ్నా’ అమిత్ షా ప్రకటనను స్వాగతించింది. ఇక్కడ 68.35 శాతం ముస్లింలు. 28.45 శాతం హిందువులు. ఇంకా సిక్కులు, ఇతర మైనారిటీలు కూడా ఉన్నారు. అలా అని జమ్ము కశ్మీర్ శాశ్వతంగా ముస్లిం ముఖ్యమంత్రి పాలనలోనే ఉండాలని అర్ధం కాదని సామ్నా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సామ్నా ఒక మంచి పని కూడా చేసింది. కశ్మీర్ కంటే జమ్ము భౌగోళికంగా పెద్దది. కానీ అక్కడ నుంచి హిందువుకు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా కుట్ర జరిగిందని ఆ పత్రిక ఆరోపించింది. లోయకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, భౌగోళికంగా పెద్దదైనప్పటికీ జమ్ము ప్రాంతం నుంచి తక్కువ మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం విచిత్రమని కూడా సామ్నా వ్యాఖ్యానించింది. నిజానికి ఆ సరిహద్దు రాష్ట్రంలో ఎప్పుడూ లోయ నుంచి వచ్చిన వారే ముఖ్యమంత్రి కావడానికి ఇదే పెద్ద కారణం. అదే అనేక అనర్థాలకు దారి తీసింది. హిందువు ముఖ్యమంత్రి కాకుండా చేసి, ముస్లింలను సంతోషంగా ఉంచడం కూడా ఇందులో అంతర్భాగ మని మరొక విషయం కూడా బయటపెట్టింది సామ్నా. 1948తో కశ్మీర్ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ యుగం ముగిసిపోయింది. ఆనాటి నుంచి ఒక్క హిందువు కూడా ఆ రాష్ట్ర పాలకుడు కాలేక పోయారు. ముస్లింలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఆలోచనా విధానం ఇంక మారాలని సామ్నా కోరింది. జమ్ము-కశ్మీర్‌కు హిందువు ముఖ్యమంత్రి కావాలన్న తన కలను అమిత్ షా నిజం చేయగలిగితే అది ఆయన జాతికి చేసిన మహోన్నత సేవ అవుతుందని కూడా సామ్నా పేర్కొన్నది. ఏమైనా అమిత్ షా వెలిబుచ్చిన ఆకాంక్ష చర్చకు దారి తీసేదే.
370 అధికరణం తిరిగి తీసుకువస్తామని ప్రత్యక్షంగా, పరోక్షంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్న నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ) అసలు బాధ అదే. ముస్లిం ఆధిపత్యం జమ్ముకశ్మీర్ మీద తగ్గిపోతుందనే. 370 అధికరణం అమలులో ఉన్న సమయంలో జరిగినట్టు ఇప్పుడు జరగాలని లేదు. కాబట్టి హిందూ ముఖ్యమంత్రి రావాలని హిందూ సంఘాలు, కశ్మీర్ పండిత్‌లు, బీజేపీ వంటి సంస్థలు కోరుకోవడం తప్పు కాబోదు. ఇప్పుడు భారత రాజ్యాంగమే అక్కడ సర్వోన్నత శాసనం. దాని ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయి.
ఈ ఎన్నికలు నిశ్చయంగా మిగిలిన చోట్ల, ఇంతకు ముందు జరిగిన ఎన్నికల వంటివి కాదు. జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెడుతున్న ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్నదే 1950ల నుంచి భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీల అభిమతం. అది రద్దయిన తరువాత, ఫలితంగా జరిగిన అంతర్జాతీయ చర్చ తరువాత తొలిసారి ఆ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఇవి బీజేపీ చరిత్రలోనే అత్యంత సవాలు విసిరిన ఎన్నికలుగా మిగులుతాయి. ఇందుకు స్థానిక బీజేపీ శ్రేణులు కూడా మానసికంగా సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలలో బీజేపీ చరిత్ర సృష్టించబోతున్నదని ప్రముఖ నాయకుడు డాక్టర్ నిర్మల్ సింగ్ మీడియాతో అన్నారు.
కశ్మీర్‌లో పరిస్థితులు చాలావరకు శాంతించి నప్పటికీ ఇంకా నాలుగు లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు దేశంలో చెల్లాచెదురుగానే ఉన్నారు. వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని బీజేపీ పని చేస్తున్నది. ఇంతవరకు 1,26,000 వరకు నమోదు చేయించారు కూడా. అసెంబ్లీ ఎన్నికల నాటికి 30,000 కొత్త ఓటర్లను నమోదు చేయించ గలమని మోతీకౌల్ చెప్పారు. హబ్బక్కాదాల్, గండేర్‌బాల్, కుల్గాం, అనంతనాగ్, త్రాల్ (ఇక్కడ సిక్కులు కూడా ఎక్కువే) అమీర్‌కాదాల్, సోపోర్, ఖాన్యార్ నియోజకవర్గాలలో కశ్మీరీ పండిత్‌ల ఓట్లు గణనీయంగా ఉన్నాయి.
జమ్ము-కశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో అంటే సెప్టెంబర్ 18న తొలిదశ, ఇదే నెల 25న రెండోదశ, అక్టోబర్ 1న మూడోదశ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆగస్టు 16వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. కశ్మీర్‌లో 47 సీట్లు, జమ్ములో 43 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే జమ్ము-కశ్మీర్ చరిత్రలో మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మొత్తం 90 స్థానాల్లో 74 జనరల్ కేటగిరికి చెందగా ఏడు స్థానాలు ఎస్సీలకు, ఎనిమిది స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. గడ్డా బ్రాహ్మణులు, కోలి పద్దారీ గిరిజనులు, పహాడీ జాతి వారిని ఎస్టీలుగా కేంద్రం వర్గీకరించింది. ఛామర్ లేదా రా మ్‌దాసియా, బాల్మీకి, ధ్యార్, మహాషా (దోమ్ లేదా మిరాసీ), గర్డీ, జొలాహా, మేఘ్‌వాల్, రత్తల్, వతల్ వర్గాలను ఎస్సీలుగా వర్గీకరించారు. మొత్తం 87లక్షల 9వేల ఓటర్లలో 44 లక్షల 46 వేల మంది పురుషులు కాగా, 42లక్షల 62వేలు మహిళలు. గతంలో ఓటర్ల భాగస్వామ్యం జమ్ము-కశ్మీర్‌లో ఎప్పుడూ తక్కువే. ప్రధాన కారణం ఉగ్రవాదులనుంచి పొంచి ఉన్న భయం. అయితే 2024 ఎన్నికల్లో మొత్తంమీద 58% ఓటింగ్ జరగడం గత 35 సంవత్సరాల్లో ఇదే ప్రథమం. కశ్మీర్ లోయలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో సగటున 51% ఓటింగ్ నమోదైంది. ఇది జమ్ము-కశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది.
ఆసక్తి పెంచుతున్న ఎన్నికలు
370, 35ఎ అధికరణాల రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా వీటిపై ఆసక్తి నెలకొంది. జమ్ము-కశ్మీర్‌లోని వివిధ ప్రాంతీయ పార్టీలు, 370 అధికరణం ఎత్తేసే వరకు ఎన్నికల్లో పోటీచేసే ప్రసక్తే లేదంటూ బీరాలు పలికినా తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయమవుతున్న సంగతి స్పష్టమైన నేపథ్యంలో కిక్కురు మనకుండా ఎన్నికల పక్రియలో పాల్గొంటున్నాయి. ప్రధానంగా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేస్తుండగా, భారతీయ జనతాపార్టీ, పోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లు విడివిడిగా ఎన్నికల బరిలో నిలిచాయి. విచిత్రమేమంటే జమ్ము-కశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించేవరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ప్రసక్తే లేదని గతంలో ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ వైస్-ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు బద్గామ్, గండేర్బాల్ స్థానాలనుంచి పోటీచేస్తున్నారు. గండేర్బాల్ స్థానం నుంచి మూడు తరాలుగా అబ్దుల్లా కుటుంబాలు గెలుస్తూ వస్తున్నాయి. ఈయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా, తాత షేక్ అబ్దుల్లా ఈ స్థానం నుంచి గెలుపొందారు. 2002లో ఒమర్ అబ్దుల్లా ఈ స్థానం నుంచి ఓటమిపాలైనా తిరిగి 2008లో విజయం సాధించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బద్గామ్‌కు సమీపంలోని బీర్వాహ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఆగస్ట్‌లో ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గది ముందుకు కూర్చొని, నాకొక ప్యూన్‌ను నియమించమని విన్నవించుకునే స్థితికి దిగజారలేను. అంతేకాదు ఒక ముఖ్యమంత్రిగా ఫైళ్లపై సంతకాల కోసం కూడా ఎల్.జి. గది ముందు ఒక ముఖ్యమంత్రిగా వేచి ఉండటం నావల్ల కాదు. అందువల్లనే నేను ఈ ఎన్నికల్లో పోటీచేయబోవడం లేదు’’ స్పష్టంగా ప్రకటించిన ఆయన ప్రస్తుతం మనసు మార్చుకొని ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. అయితే రెండు స్థానాల్లో బరిలో నిలవడం తన గెలుపుపై విశ్వాసం లేదనేది స్పష్టం చేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి పోటీ చేసిన ఒమర్‌కు ఓటమే ఎదురైంది. ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లాకు పోటీగా పై రెండు స్థానాల్లో ప్రముఖ మతబోధకుడు సర్జన్ బర్కతీ (38) పోటీలో ఉన్నారు. 2016, జులై 8న బుర్హన్ వానీ ఎన్‌కౌంటర్ తర్వాత దక్షిణ కశ్మీర్‌లో పెద్దఎత్తున నిర్వహించిన నిరసన ప్రదర్శనలకు ఇతను నాయకత్వం వహించాడు. ఇంతకుముందు దక్షిణ కశ్మీర్‌లోని జైనా పొర అసెంబ్లీ స్థానానికి ఈయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ప్రస్తుతం బద్గామ్, గండేర్బాల్ స్థానాలనుంచి పోటీకి దిగాడు.
బీజేపీకి పరీక్ష
370 అధికరణం రద్దు తర్వాత జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఒక పరీక్ష వంటివనే చెప్పాలి. 2014 నాటి స్థాయి పనితీరును ప్రదర్శించాలని పార్టీ కృషి చేస్తోంది. అప్పట్లో పోగ్రసివ్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే 2018లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణం తర్వాత ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ కూటమిని కొనసాగించడానికి ఇష్టపడకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 2014లో జమ్ము ప్రాంతంలో అన్ని సీట్లు గెలుచుకున్న బీజేపీ, ముస్లిం మెజారిటీ కశ్మీర్ లోయలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే ఈసారి కశ్మీర్ లోయలో పహాడీలు, గుజ్జార్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఖాతా తెరవవచ్చునన్న ఆశాభావం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జమ్ము-కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఆర్‌ఎస్‌ఎస్ నేత రామ్ మాధవ్‌ను బీజేపీ ఇన్‌చార్జ్‌గా రంగంలోకి దించడం సమయోచిత నిర్ణయం. 2014లో బీజేపీ-పీడీపీ మధ్య కూటమి ఏర్పాటులో ఆయనది కీలకపాత్ర. అప్పట్లో ఆయన బీజేపీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. అయితే 2020లో ఆయన మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లో బాధ్యతలు స్వీకరించారు. సంస్థలో ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేస్తూ తిరిగి రంగ ప్రవేశం చేయడంతో ఆయన రాజకీయ చాణక్యం బీజేపీకి తప్పక ఉపయోగ పడుతుంది.
అసంతృప్తులే ప్రధాన సమస్య
ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు జమ్ము ప్రాంతంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కశ్మీర్ లోయలో కనీసం పది సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. అయితే జమ్ము-కశ్మీర్ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత బీజేపీ పాతముఖాలను పక్కన పెట్టి, కొత్తవారిని రంగంలోకి దించిన ఫలితంగా చెలరేగిన అసంతృప్తులను సంతృప్తిపరచడం ప్రస్తుతం పార్టీ నాయకత్వం ముందున్న ప్రధాన సమస్య. అయితే 2022లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో జమ్ము ప్రాంతంలో కొత్తగా ఏర్పాటైన ఆరు నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూలత ఉన్నదనేది సత్యం. ఈ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా అంతకుముందు 83 సీట్లున్న జమ్ము-కశ్మీర్‌లో ప్రస్తుతం స్థానాలు 90కి పెరిగాయి. కొత్తగా చేర్చినవాటిల్లో 6 జమ్ములో ఒకటి కశ్మీర్‌లోయలో ఉన్నాయి. ఈ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా జమ్ము, కశ్మీర్ ప్రాంతాల మధ్య అధికార సమతుల్యత ఏర్పడింది. గతంలో కశ్మీర్‌లోయ ఆధిపత్యమే కొనసాగేది. అంతేకాకుండా అసెంబ్లీలో ఐదు స్థానాలకు అభ్యర్థులను నామినేట్ చేసే అధికారం జమ్ము-కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఉంది. ఇద్దరు కశ్మీరీ పండిట్లు, ఒక మహిళ, ఆక్రమిత కశ్మీర్ శరణార్థులనుంచి ఒకరు సహా ఐదుగురు ఈవిధంగా నామినేట్ అవుతారు. వీరికి ఓటింగ్ హక్కును కూడా కల్పించారు.
జమ్ము ప్రాంతంలో బీజేపీ 30-35 సీట్లు సాధించగలిగితే, కశ్మీర్ లోయనుంచి సాధించగలిగే సీట్ల ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలు గుతుంది. ఒకవేళ 20కంటే తక్కువ సీట్లు వస్తే మాత్రం అధికారంలోకి రావడం కష్టం. ఇటీవల హోంమంత్రి అమిత్‌షా జమ్ములో పర్యటన సందర్భంగా ఈసారి జమ్ము-కశ్మీర్‌కు హిందూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ప్రస్తుతం బీజేపీ జమ్ము-కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నప్పటికీ, కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి మాత్రం కశ్మీర్‌లోయలో పార్టీకి పునాది లేకపోవడం వల్ల ఎవరి సహకారం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా పర్యాటక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సామాజిక సంక్షేమం, మహిళలు రైతులకు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వంటి వాగ్దానాలతో ముందుకెళుతోంది. రుషి కాశ్యప్ తీర్థ పునరుద్ధరణ్ పథకం కింద జమ్ముకశ్మీర్‌లో వంద హిందూ దేవాలయాలను పునరుద్ధరిస్తామని కూడా బీజేపీ హామీ ఇస్తోంది. ఇదే సమయంలో శంకరాచార్య, మార్తాండ సూర్య, రఘునాథ్ దేవాలయాలను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేస్తోంది.
సాధ్యంకాని హామీలు
ఎన్నికల బరిలో నిలిచిన ప్రాంతీయ పార్టీలు 370 అధికరణాన్ని తిరిగి అమల్లోకి తీసుకువస్తామని వాగ్దానం చేస్తున్నా ఇది సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ ఇవి అధికారంలోకి వచ్చినా, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చేతుల్లోనే అధికారాలు కేంద్రీకృతమై ఉండటం వల్ల గతంలో మాదిరిగా వ్యవహరించడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. దీంతోపాటు స్థానిక ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నా అంతగా ఫలించే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో కరుడుగట్టిన వేర్పాటువాదులుగా పేరుపడ్డ వారి సంబంధీకులకు పీడీపీ, ఇంజినీర్ రషీద్ నేతృత్వంలోని అవామీ ఇత్తెహాద్ పార్టీలు ఏరికోరి పార్టీ టిక్కెట్లివ్వడం ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకునే పక్రియలో భాగమే. అయితే ప్రస్తుతం పీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే చాలా బలహీనపడిన పీడీపీ 370 అధికరణను పునరుద్ధరించడమన్న అంశం ప్రాతిపదికగా ఎనికల్లో పోటీపడుతోంది. ప్రస్తుతం ఈ పార్టీ ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (ఐ.ఎన్.డి.ఐ.ఎ) కూటమిలో భాగస్వామి. అవామీ ఇత్తెహాద్ 8 లేదా 9 స్థానాలకు పోటీచేసినా వాటిని పూర్తిగా గెలుచుకునే అవకాశాలున్నాయని వస్తున్న వార్తలు నిజమైతే, కశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఆ మేర సీట్లు తగ్గడం ఖాయం. కొంతమంది బలమైన ఇండిపెండెంట్లు కూడా లోయలో రంగంలో ఉండటం వారికి బీజేపీ పరోక్ష మద్దతు కొనసాగించే అవకాశాలుండటం గమనార్హం.
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌తో జతకట్టింది. ఈ కూటమి ఏర్పాటును ఆగస్ట్ 22న ప్రకటించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కూటమిగా పోటీచేశాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.సి. 51 స్థానాల్లో, కాంగ్రెస్ 32 సీట్లకు పోటీచేస్తున్నాయి. ఐదు స్థానాల్లో ఈ రెండు పార్టీలు మైత్రీపూర్వక పోటీలో వుంటాయి. జమ్ము-కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని ప్రధానాంశంగా ఈ కూటమి ఎన్నికల్లో పోటీచేస్తోంది. 370 అధికరణం రద్దు తర్వాత ఎన్‌సీ, పీడీపీలు రాష్ట్రంలో తమ పట్టును నిలబెట్టుకోవడానికి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. పీడీపీ దక్షిణ కశ్మీర్‌లో కొంతమేర ప్రభావం చూపే పరిస్థితి ఉంది. మొత్తంమీద చెప్పాలంటే ఎన్‌సీ బలీయంగా ఉన్నప్పటికీ, వివిధ పార్టీలకు చెందిన గులామ్ హస్సన్ మీర్, అబ్దుల్ గనీ వకీల్, అబ్దుల్ వాహిద్ పద్దార్ వంటి అభ్యర్థులతో పాటు ప్రముఖ నాయకు లైన అన్సారీ, లోనేలు కుప్వారాలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నారు.
బరిలో వేర్పాటువాద నాయకులు
గతంలో వేర్పాటువాదంలో ఉన్న చాలామంది నాయకులు ప్రస్తుతం ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీల్లో చేరడమో లేక ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలోకి దిగడమో జరుగుతోంది. మిర్వాజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఉన్న జమ్ము-కశ్మీర్ పీపుల్స్ పార్టీ నాయకుడు సయ్యద్ సలీమ్ జిలానీ, పోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఈయన 2015లో హురియత్ కాన్ఫరెన్స్‌తో విభేదించి బయటకు వచ్చారు. మాజీ హురియత్ నాయకుడు గులామ్ మహమ్మద్ హుబ్బీ కుమారుడు అడ్వకేట్ జావెద్ హుబ్బీ ప్రస్తుతం షరార్ ఎ షరీఫ్ స్థానం నుంచి రంగంలో ఉన్నారు. ఈయన అవామీ ఇత్తెహాద్ పార్టీ తరపున పోటీచేస్తున్నారు. హురియత్ కార్యనిర్వాహక సభ్యుడిగా పనిచేసిన అగా సయ్యద్ హస్సన్ కుమారుడు అగా ముంతజీర్ మెహదీ (షియా మతబోధకుడు) ప్రస్తుతం పీడీపీ తరపున బద్గామ్ సీటునుంచి పోటీచేస్తున్నారు. పుల్వామా జిల్లాలో సామాజిక కార్యకర్తగా ఉన్న అల్టాఫ్ అహమ్మద్ భట్ రాజ్‌పొర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏఐపీ తరపున రంగంలో ఉన్నారు. ఇతను సయ్యద్ షా జిలానీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న బషీర్ అహ్మద్ భట్ (పీర్ సైఫుల్లాగా ప్రాచుర్యం పొందాడు) సోదరుడు. బషీర్ అహ్మద్ భట్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. జామాతే ఇస్లామీ మద్దతుతో డా।। కరీముల్లా లంగాతే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా రంగంలో ఉన్నాడు. ఇదే సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన గులామ్ ఖాదిర్ లోనే కుమారుడు ఈయన. ప్రస్తుతం జైల్లో ఉన్న జమ్ము అండ్ కశ్మీర్ నేషనలిస్ట్ పీపుల్స్ ఫ్రంట్ నయీమ్ అహ్మద్‌ఖాన్ సోదరుడు మునీర్‌ఖాన్ ఈ ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనతో ఉన్నాడు. ప్రస్తుత తిహార్ జైల్లో ఉన్న మత బోధకుడు సర్జన్ బర్కతీ, ఎన్‌సీ వైస్‌ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాతో పోటీలో ఉన్నారు.
పాకిస్తాన్ కుయుక్తులు
కశ్మీర్‌లో అభివృద్ధి, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల పక్రియ ఎంతమాత్రం ఇష్టంకాని పాకిస్తాన్ ఇక్కడ అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు, ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే గతంలో కశ్మీర్‌లోయకు పరిమితమైన ఉగ్రవాద దాడులను ఇప్పుడు జమ్ములోని కథువా, ఉదంపూర్, దోడా ప్రాంతాలకు మార్చింది. ఇవి పఠాన్‌కోట్ నుంచి జమ్ము మీదుగా శ్రీనగర్‌కు వెళ్లే 44వ జాతీయ రహదారిపై ఉండటం గమనార్హం. 370వ అధికరణం రద్దు వల్ల ప్రధానంగా ఆనందించింది జమ్మువాసులు. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ముఖ్యంగా కశ్మీరీల పెత్తనం నుంచి విముక్తి లభిస్తుందన్న వీరి ఆశలపై ఇటీవలికాలంలో పెరిగిన ఉగ్రదాడులు నీళ్లు చల్లుతున్నాయి.
ఇదిలావుండగా జమ్ము-కశ్మీర్ ఎన్నికల బరిలో నిలిచిన వివిధ పార్టీల నాయకుల అదృష్టం అక్టోబర్ 4న వెల్లడికానుంది. 2018, డిసెంబర్ 18న నాటి రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ జమ్ముకశ్మీర్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత, 2019, ఆగస్ట్ 5న కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఎ అధికరణాలను రద్దుచేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో పర్యాటకం అత్యంత వేగంగా పుంజుకుంది. జమ్ము-కశ్మీర్ ప్రజలు ప్రస్తుతం అభివృద్ధి ఫలాలను అనుభవిస్తు న్నారు. ప్రధానరంగమైన పర్యాటకం ఊపందు కోవడంతో, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేర్పాటువాదుల కుహనా రాజకీయాలకు ప్రజలనుంచి ఎంతమేర మద్దతు లభిస్తుందనేది ఈ ఎన్నికల ఫలితాల్లోనే తేలుతుంది.
నిజానికి 75 ఏళ్లుగా అక్కడ ముస్లిం ముఖ్య మంత్రుల పరిపాలనే సాగింది. ఒకసారి హిందువుకు ఆ అవకాశం ఇవ్వడానికి ఆ సమాజమే ముందుకు రావాలి. దీనితో కొత్తశకం ఆరంభమవుతుంది.
-జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్