సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి శ్రావణ శుద్ధ పాద్యమి – 05 ఆగస్ట్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఇది క్రైస్తవులు నిర్వహించే విద్యా సంస్థలకీ, ముస్లిం మత పెద్దలకీ కూడా ఒక చక్కని గుణపాఠం. కేరళలోని మువత్తుపుళ అనే చోట నిర్మల కళాశాలలో జరుగుతున్న పరిణామాల గురించి భారతీయులంతా దృష్టి పెట్టవలసి ఉంది. ఆ కళాశాలలో చదువుతున్న ముస్లిం బాలికలు ప్రార్థన (జుమా లేదా నమాజ్‌) చేసుకోవడానికి ఒక ప్రత్యేక స్థలం కావాలని కోరడంతో మొదలయిన వివాదమిది. ఆ కళాశాల సైరో`మలబార్‌ కేథలిక్‌ చర్చ్‌ నిర్వహణలోనిది. శుక్రవారమే కాదు, నిత్యం మధ్యాహ్నం నమాజ్‌ చేయడం తమ సంప్రదాయం కాబట్టి అందుకు ప్రత్యేక స్థలం కావాలని బాలికలు అంటున్నారు. రెండువారాల క్రితం ఒక శుక్రవారం ఆ కళాశాలలో చదివే కొందరు ముస్లిం బాలికలు నమాజ్‌ కోసం తమకు ఒక స్థలం కేటాయించాలని నిరసనకు దిగారు. అలాంటివి సాధ్యపడవని, రెండువందల మీటర్ల దూరంలోనే ఒక మసీదు ఉంది కాబట్టి, అక్కడికి వెళ్లి నమాజ్‌ చేసుకోవచ్చునని కాలేజీ యాజమాన్యం చెప్పేసింది. నమాజ్‌ కోసం వెళ్లే బాలికలకు అటెండెన్స్‌ ఇస్తామని కూడా తెలియచేసింది.

 ఈ రగడను శాంతియుతంగా, వివాదాస్పదం కాకుండానే పరిష్కరించడానికి కళాశాల యాజమాన్యం మొదట ప్రయత్నించిన సంగతి అర్ధమవుతుంది. ఇలాంటి కోరిక కోరుతున్న విద్యార్థి బృందం నాయకులను పిలిచి ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ ఫ్రాన్సిస్‌ కన్నాదన్‌ చర్చించారు. కానీ బాలికలు తమ పట్టు వీడలేదు. నిజానికి ముస్లిం బాలికల డిమాండ్‌ను నిరాకరించినందుకు మొదట కళాశాల యాజమాన్యమే క్షమాపణ చెప్పిందని విద్యార్థి సంఘం చెబుతోంది. తరువాత నుంచి బాలికలు వేచి ఉండే గదిలోనే ముగ్గురు బాలికలు కొద్దికాలంగా నమాజ్‌ కూడా చేస్తున్నారు. దీనినే ఉపాధ్యాయేతర సిబ్బంది ఫిర్యాదు మేరకు ఇటీవల ప్రిన్సిపాల్‌ నిలిపివేయించారు. వివాదం పెద్దది కావడానికి ఇదే కారణం. సీపీఎం కూడా ముస్లింలకు మద్దతుగా ఈ వివాదం వెనుక నిలబడిరదనే అనాలి. ఇటీవలి కాలంలో క్రైస్తవంలో ఒక వర్గం బీజేపీకి దగ్గర కావడం సహించలేని సీపీఎం ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నదని చెప్పినా తొందరపాటు కాదు. ఒక క్రైస్తవ విద్యా సంస్థలో నమాజ్‌ చేసుకుంటామన్నది విద్యార్థినులు డిమాండే అయినా ఆందోళనకు దిగిన విద్యార్థులకు చాలా విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయని ఎస్‌ఎఫ్‌ఐ (సీపీఎం విద్యార్థి విభాగం) జిల్లా కార్యదర్శి అర్జున్‌బాబు ప్రకటించాడు. రాష్ట్రంలోని రెండు ప్రధాన విద్యార్థి విభాగాలు దీనికి మద్దతు ఇవ్వడం, అధికార పార్టీ అండతో ఇలా వ్యవహరించడం బాధాకరమని క్రైస్తవ మిషనరీ విద్యాసంస్థల కన్వీనర్‌ బిషప్‌ ధామస్‌ ఆరోపించడం విశేషం. కేరళలో ప్రధాన విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ మాత్రమే.

 ఇది జరిగిన చాలా రోజులు తరువాత అలాంటి కోరిక సరికాదని ముస్లిం మత పెద్దలు తమ పిల్లలకి హితవు చెప్పారు. తమకు నమాజ్‌ కోసం గది కావాలంటూ ముస్లిం బాలబాలికలు ఏకంగా నిరసన కార్యక్రమానికి దిగడంతో దీనికి ప్రచారం వచ్చింది. అంతదూరం వెళ్లకండి, దీనితో అసహనం పెరుగుతుందని ముస్లిం పెద్దలు పిల్లలకి చెప్పారు. బహుశా రాష్ట్రంలో లేదా దేశంలోనే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావచ్చు. ఇలాంటి ఒక వివాదం తలెత్తడమే దురదృష్టం అన్నాడు, దక్షిణ కేరళ జమీయుతుల్లా ఉలేమా ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ తౌఫీక్‌ మౌల్వీ. నమాజ్‌ అనేది వ్యక్తిగత విషయం, అలాగే కొన్ని వేళలలో మాత్రమే చేయవలసినది. అంతేతప్ప, నమాజ్‌ చేసేందుకు మాకు ఒక స్థలం కావాలంటూ ఇతరులను గట్టిగా కోరడాన్ని ఇస్లాం అంగీకరించదని ధర్మసూత్రం కూడా బోధించాడాయన. ఇంత జరిగాకే మౌల్వీ కలగ చేసుకోని ఈ వివాదంలో పెద్దలు జోక్యం చేసుకోక తప్పదని పిలుపునిచ్చాడు. ఆఖరికి ముస్లిం లీగ్‌ అనుబంధ విద్యార్థి సంఘం కూడా ఇలాంటి కోరికలు కోరేటప్పుడు ముస్లిం విద్యార్థులు కాస్త సంయమనం పాటించాలని హితవు చెప్పింది. ముస్లిం పెద్దలు, ముస్లిం విద్యార్థి సంఘాలు కూడా నమాజ్‌ కోసం స్థలం కోరడం సరికాదని అంటూ ఉంటే, సీపీఎం మాత్రం దానికి మద్దతు ఇచ్చింది. వివాదం తీవ్రమైన తరువాత కళాశాల యాజమాన్యం కూడా కఠిన వైఖరి తీసుకుంది. నమాజ్‌కు ప్రత్యేక స్థలం విషయంలో కాలేజీ విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రిన్సిపాల్‌ చెప్పారు.

సైరో`మలబార్‌ చర్చ్‌, కేథలిక్‌ కాంగ్రెస్‌ ఈ పరిణామం గురించి తీవ్రంగానే స్పందించాయి. ప్రార్ధన కోసం స్థలం కోరడం, ‘ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న మత దాడి’ అనే విమర్శించాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దాడి వెనుక క్రైస్తవ మైనారిటీ సంస్థలను ధ్వంసం చేసే వ్యూహం ఉందని, అయినా ప్రతిఘటిస్తామని చర్చ్‌, కేథలిక్‌ కాంగ్రెస్‌ ప్రజా వ్యవహారాల కమిషన్‌ హెచ్చరించింది. హిందువులు, క్రైస్తవులు నిర్వహించే విద్యా సంస్థలను ఇబ్బందుల పాల్జేయాలని కొన్ని ఉగ్రవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ ఆరోపించారు. ఈ వివాదం మీద సీపీఎం ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చి చెప్పాలని కూడా కోరారు.

క్రైస్తవ విద్యాసంస్థల పట్ల జాలి చూపించడం ఈ సంపాదకీయం ఉద్దేశం కాదు. భారతదేశంలో మైనారిటీ అంటే ముస్లింలే గుర్తు వస్తారు. క్రైస్తవులు వెంటనే గుర్తుకు రారు. బౌద్ధులు, జైనులు, పార్సీలు అసలే గుర్తుకు రారు. పూర్తిగా చర్చ్‌ నడిపే విద్యా సంస్థలో నమాజ్‌ చేసుకోవడానికి చోటు ఇవ్వాలని నిలదీయడం తీవ్రమైన పోకడే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని ఎవరూ అనలేరు కూడా. ఈ వ్యవహారంలో ముస్లిం బాలికల వెనుక వారి పెద్దలు లేరంటే నమ్మడం సాధ్యం కాదు. మైనారిటీ వర్గాలలో పెద్దన్న పాత్రనే పోషిస్తున్న ఇస్లాం వాస్తవ రూపం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం క్రైస్తవానికి ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE