సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి శ్రావణ పూర్ణిమ – 19 ఆగస్ట్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
జన్మాష్టమి హిందువుల పరమోన్నత పర్వదినం. శ్రీకృష్ణభగవానుడు జన్మించిన రోజు. ఆయన గీతాచార్యుడు. ‘యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత/ అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్’ (భారత వంశీయుడవైన ఓ అర్జునా! ధర్మం నశించి, అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను) అంటాడు పరమాత్మ. ఇది అమృతతుల్యమైన తాత్త్వికత. అజరామరమైన మార్గదర్శనం. సృష్ట్యాది నుంచి మానవాళి నడతను వ్యాఖ్యానించే, చింతనా ధోరణిని విశ్లేషించే, ఒక జాతికి తనదైన ధర్మాన్ని రక్షించుకోవలసిన బాధ్యతను బోధించే మహోన్నత గ్రంథం భగవద్గీత అయితే, ఆ గ్రంథ సార్వకాలికతకు ఈ శ్లోకం ఒక మచ్చుతునక. భగవంతుడు అనే దృష్టి, ఆయన చుట్టూ అల్లుకుని ఉండే ఆధ్యాత్మిక చింతన ఎందుకో, అవి సమాజాన్ని రక్షించే శక్తిని ఎలా సంతరించుకున్నాయో కూడా ఇందులో గమనించగలం. అలాంటి జన్మాష్టమికి ఆవిర్భవించింది విశ్వహిందూ పరిషత్. సరిగ్గా భగవానుడు చెప్పిన ధర్మగ్లాని సంభవించిన సమయంలోనే కూడా. పరధర్మం ఎంత భయావహమో ఆ గీత పుట్టిన గడ్డ సైతం విస్మృతికి లోనైన దుర్దశలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జన్మించింది. గొప్ప కర్తవ్యాన్ని పూర్తి చేసింది. అందుకే నిశ్చయంగా అదొక చారిత్రక సందర్భం.
వీహెచ్‌పీ ఆవిర్భావం జన్మాష్టమికి జరగడం సమున్నత స్ఫూర్తి కోసం, లోతైన ధార్మిక స్పృహ కోసమే. మహోన్నత సంస్కృతి, ధర్మాల వారసత్వం కలిగిన ఈ జాతి చరిత్ర గమనంలో ఒక మహా మాయ కింద కప్పబడిన చీకటి బిందువు దగ్గర పరిషత్ ఆవిర్భవించింది. హిందూ దేశ సర్వ వ్యవస్థలను శతాబ్దాల పాటు ధ్వంసించి విదేశీ పాలన అంతమైనా, వాటిని పునఃప్రతిష్ఠించే అవకాశం స్వతంత్ర భారతదేశంలో అధిక సంఖ్యాకులకు దక్కలేదు. చరిత్ర గతిలో కూలిన వేలాది ఆలయాల జీర్ణోద్ధరణ మాట లేదు. అందుకు ప్రభుత్వానికి తీరిక లేకపోతే పోయె! ప్రజలనూ ఆ పనికి దూరంగా ఉంచే పని జరిగింది. సోమనాథ్ ఆలయ జీర్ణోద్ధరణ తరువాత ప్రతిష్ఠకు వెళ్లడానికి రాష్ట్రపతికే అడ్డంకులు ఎదురైతే సామాన్య హిందువు పరిస్థితి ఏమిటి? హిందువులకు పవిత్రం గోవు, శాస్త్రం ప్రకారం ప్రత్యేక సృష్టి గోవు. అలాంటి గోవుకు రక్షణే లేదు. కాలపరీక్షకు నిలిచిన హిందువుల విశ్వాసాలకు అవమానాలు ఎక్కువయ్యాయి. అయినా హిందూ దేవాలయాల ఆస్తులు మాత్రం ప్రభుత్వాలకు పనికి వచ్చాయి.
హిందువులను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చే ప్రక్రియ నానాటికీ బలపడిరది. దానికి సెక్యులరిజం అని ముద్దు పేరు. సెక్యులరిజం అంటే మైనారిటీలకు కంచాలలోను, మెజారిటీలకు ఆకులలోను వడ్డించే విధానంగా మారిపోయింది. భారత రామాయణాలకు అవమానాలు. వేద పఠనం మీద ఆంక్షలు. మత మార్పిడులకు మిషనరీలూ, ముస్లింలూ మధ్య తీవ్ర పోటీ. ఇలాంటి సమయంలో చైతన్యం కలిగిన కొందరు హిందువులు మనకూ హక్కులు ఉన్నాయని దేశానికి చాటాలని అనుకున్నారు. ధర్మానికి జరుగుతున్న అవమానాల పట్ల ప్రేక్షకపాత్ర వహించలేమన్నారు. వారి ఆకాంక్ష మేరకు పరమ పూజనీయ మాధవ సదాశివ గోల్వాల్కర్ వీహెచ్‌పీ స్థాపనకు నడుం కట్టారు. ఇలాంటి ఒక వేదిక లేదా సంస్థ అవసరం ఎంతటిదో ఆ ఆధునిక భారత సర్వోన్నత ద్రష్ట గురూజీ గురి తప్పని రీతిలో గుర్తించారు. చరిత్రలో రుజువైన సత్యమది. స్వామి చిన్మయానంద సరస్వతి, శివశంకర్ ఆప్టే (దాదాసాహెబ్ ఆప్టే), కేఎం మున్షీ, కేశవరామ్ కాశీరామ్ శాస్త్రి, స్వాతంత్య్ర సమరయోధుడు తారాసింగ్, నామ్‌ధారి సిక్కు నేత సద్గురు జగ్జిత్‌సింగ్, దక్షిణాది ప్రముఖుడు చేట్పట్టు పట్టాభిరామన్ రామస్వామి అయ్యర్ వంటి వారితో ఈ సంస్థ ఆరంభమైంది. ఆగస్ట్ 29, 1964న బొంబాయిలోని సాందీపని సాధనాలయ (చిన్మయానంద ఆశ్రమం)లో శ్రీకారం చుట్టుకుంది. వీహెచ్‌పీ ఆశయం ఏమిటో నాడే గురూజీ వెల్లడిరచారు. భారతదేశంలో పుట్టిన అన్ని విశ్వాసాల అనుయాయులు ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. 1966లో అంతర్జాతీయ శాఖ ఏర్పడిరది.
మత మార్పిడుల మీద వీహెచ్‌పీ యుద్ధం చేస్తుంది. బలవంతపు మార్పిడులు లేదా కుట్రతో జరిగే మార్పిడులు ఏవైనా కొన్ని దేశాల ఉనికిని ప్రపంచ పటం నుంచి తుడిచేశాయి. ఆ క్రమంలో ఘోర హింస ఉంది. మూలవాసుల నిర్మూలన ఉంది. సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఉంది. ఏకశిలా వ్యవస్థ నిర్మాణ ఆశయం ఉంది. జాతులను బానిసలుగా మార్చే పశుత్వం ఉంది. స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల బుజ్జగింపు ధోరణి పాకిస్తాన్‌కు జన్మనిచ్చింది. ఈశాన్య భారతంలో వేర్పాటువాద నినాదం వెనుక చర్చ్ ప్రోద్బలం నిజం. ఈ పరిణామాలతో జరిగిన, జరుగుతున్న రక్తపాతం దాచేస్తే దాగని సత్యం. మైనారిటీలు మెజారిటీలనే కాదు, సాటి మైనారిటీలను కూడా మతం మారుస్తున్నారు. పంజాబ్‌లో దిగువ స్థాయి సిక్కులను క్రైస్తవంలోకి మతాంతరీకరణ చేసే ప్రక్రియ యథేచ్ఛగా సాగిపోతోంది. బెంగాల్, పంజాబ్, ఈశాన్య భారతాలలో మత మార్పిడులు, వేర్పాటువాదం వ్యూహాత్మకమే. విద్య పేరుతో, వైద్యం పేరుతో సాగే మతాంతరీకరణలు, విష ప్రచారం తారస్థాయికి చేరాయి. ఇవి కొనసాగకుండా, పునరావృతం కాకుండా ప్రతిఘటించడమే వీహెచ్‌పీ ఆశయం. హిందువులు పవిత్రంగా భావించే ప్రతి వ్యవస్థపైనా ముస్లింలు, క్రైస్తవులు దాడి చేస్తూనే ఉన్నారు. గోవధను ముస్లింలు నిత్యకృత్యంగా మార్చుకున్నారు. దీనిని ఆపాలంటుంది వీహెచ్‌పీ. ఈ కోరిక రాజ్యాంగబద్ధం కూడా. నిజానికి వీహెచ్‌పీ చేసిన చేస్తున్న ప్రతి ఉద్యమం రాజ్యాంగ బద్ధమే. నమ్మేది న్యాయపోరాటాలనే.
ధర్మరక్షణలో జాతీయవాదం పాత్రనీ, ప్రాధాన్యాన్నీ గమనిస్తూ వెళుతున్న సంస్థ వీహెచ్‌పీ. సంస్థ విజయ రహస్యం అదే. నిజమైన భారతీయ తకు అది కొత్త ఆరంభంగా నిలిచింది. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం నిజమైన పునరుజ్జీవనోద్యమం. దానితో హిందువు లలో కొత్త చైతన్యం వచ్చిందన్న మాట సర్వత్రా వినిపిస్తున్నది. ఆ ఉద్యమం వెనుక వీహెచ్‌పీ, సంఘ పరివార్ ఉన్నాయి. రామ మందిర నిర్మాణం అంటే భారతదేశ పునర్నిర్మాణం అన్న వ్యాఖ్య వచ్చిందంటే నిజంగా వీహెచ్‌పీ, సంఘపరివార్ సంస్థల నూరేళ్ల అకుంఠిత దీక్ష, అది సృష్టించిన వాతావరణం కారణం. వీహెచ్‌పీకి అరవై ఏళ్లు నిండాయి. ఇదొక గొప్ప సందర్భం. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిస్వామివారు ఆశీర్వదించినట్టు హిందూ ధర్మరక్షణలో పరిషత్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. మనవంతు కర్తవ్యమూ నిర్వర్తిద్దాం. ధర్మ రక్షణలో ఇంతవరకూ ప్రాణాలు అర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం.